పాలకుల బాధ్యత
- Pratap Ch
- 7 days ago
- 3 min read
#PalakulaBadhyatha, #పాలకులబాధ్యత, #ChPratap, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Palakula Badhyatha - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 27/09/2025
పాలకుల బాధ్యత - తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
పన్నెండు గ్రామాల కూటమికి అధినేత నరసింహులు. అతడు అపరిమితమైన భోగాలతో జీవితాన్ని గడిపేవాడు. ప్రజల పాలకుడిగా వ్యవహరించాల్సింది పోయి, తన సుఖాలకే అంకితమయ్యాడు. ప్రజల పరిపాలనను తన పరిపాలన సహాయకుల చేతిలో పెట్టి, తాను మాత్రం తన మందిరంలో విందులు, వినోదాలతో, విలాసాలతో కాలం గడిపేవాడు. అతనితో పాటు అతని పరిపాలనా సహాయక సిబ్బంది కూడా విందులు, వినోదాలు, భోగభాగ్యాలను అనుభవించదంలో అనుక్షణం మునిగితేలేవారు.
ఆ పన్నెండు గ్రామాల నుండి వచ్చిన ఆదాయం మొత్తం తన ఆనందాలకే ఖర్చు చేయడంతో, ఆదాయానికి, ఖర్చుకు మధ్య పెద్ద అంతరం ఏర్పడింది. ఈ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి, ప్రజలపై అపరిమితంగా పన్నులు పెంచాడు. అంతేకాక, ప్రతి గ్రామం నుండి కొంతమంది ప్రజలు ఉచితంగా తన పొలాల్లో పనిచేయాలనే కొత్త నిబంధనను కూడా విధించాడు.
ఆ ఏడు తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. ప్రజలకు ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. అయినా నరసింహులు పన్నులను తగ్గించలేదు. పన్నులు కట్టలేని వారిపై తన భద్రతా సిబ్బందిని పంపి, శిక్షలు వేయించడం, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. భద్రతా సిబ్బంది కూడా అధినేత ఇచ్చిన స్వేచ్చను విపరీతంగా దుర్వినియోగం చేయడం మొదలు పెట్టారు.
అర్ధరాత్రిళ్ళు ప్రజల ఇళ్ళపై పడడం, అందినకాడికి దోచుకోవడం మొదలెట్టారు. ఈ విధంగా నరసింహులు పాలనలో ఈ పన్నెండు గ్రామాల కూటమి లోని ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ప్రత్యక్ష నరకం అనుభవంచసాగారు.
ఒక గ్రామంలో ఒక రైతు తన ఆస్తిని కాపాడుకోవడానికి భద్రతా సిబ్బందికి ఎదురు తిరిగాడు. ఇంటిని, పొలాన్ని ప్రభుత్వానికి అప్పగించడానికి ఒప్పుకోకుండా, అధినేతను దయ లేనివాడని తీవ్ర పదజాలంతో దూషించాడు. భద్రతా సిబ్బంది అతడిని బంధించి నరసింహులు ముందు హాజరుపరిచారు. రైతు మాటలు విన్న నరసింహులు కోపంతో రగిలిపోయి, ఆ రైతుకు 14 రోజులు ఆహారం, నీరు లేకుండా ఉంచి శిక్షించాలని ఆజ్ఞాపించాడు. శిక్ష అమలు చేసే ముందు, అతడి చివరి కోరిక ఏమిటని అడిగాడు.
మరణానికి కూడా భయపడని ఆ రైతు, “అధినేతా, ఈ కరువులో కూడా మీరు మాపై ఏమాత్రం కనికరం చూపడం లేదు. నా లాంటి పేదలు పన్నులు కట్టలేక నిస్సహాయంగా ఉన్నారు. కొందరు తమ ఆస్తులు అమ్ముకుని వలసపోతున్నారు, మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పాలకుడి ప్రధాన కర్తవ్యం ప్రజలను ఆకలి నుండి రక్షించడం.
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ప్రజల శ్రేయస్సును చూడటమే పాలకుడి నిజమైన నిబద్ధత. కాబట్టి నా చివరి కోరిక ఏమిటంటే, నన్ను ఇలా శిక్షించే బదులు, ఈ కరువు కాలంలోనైనా పన్నులు మాఫీ చేసి, ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించండి” అని వేడుకున్నాడు.
ఆ మాటలకు మరింత ఆగ్రహం చెందిన నరసింహులు, “ఓయ్, కేవలం ఒక సాధారణ రైతువి, అధినేతను అవమానిస్తూ మాట్లాడుతున్నావు. నీ మాటలు నిరూపించకపోతే, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఇదే శిక్షతో బాధపెడతాను!” అని అరిచాడు.
రైతు నిర్భయంగా, “నా మాటల నిజం మీ గూఢచారులను అడిగి తెలుసుకోండి” అని బదులిచ్చాడు.
రైతు ధైర్యానికి ఆశ్చర్యపోయిన నరసింహులు, వెంటనే తన మందిరానికి వెళ్లి గూఢచారులను పిలిపించి వివరాలు కనుక్కున్నాడు. రైతు చెప్పిన విషయాలన్నీ నిజమేనని తెలిసి, గ్రామాల్లో కరువు కారణంగా ప్రజలు ఎంత కష్టపడుతున్నారో అతడికి అర్థమైంది.
“నా తల్లిదండ్రులు నాకు అప్పగించిన ప్రజల బాధ్యతను నేను నిర్లక్ష్యం చేశాను. నా స్వంత సుఖాల కోసమే జీవిస్తున్నాను. ప్రజలు నరకం అనుభవిస్తుంటే, నేను స్వర్గం అనుభవించడం నా బాధ్యతారాహిత్యానికి నిదర్శనం, ” అని పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే ఆ రైతుకు విధించిన శిక్షను రద్దు చేసి, అతడికి కొంత ధనం ఇచ్చి గౌరవంగా పంపించివేశాడు.
ఆ రోజు నుండి ప్రజల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి సమస్యను స్వయంగా పరిశీలించి పరిష్కరించడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే ఆ పన్నెండు గ్రామాల కూటమి సుభిక్షంగా వర్ధిల్లింది.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

నేను Ch. ప్రతాప్. వృత్తిరీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా ముంబయిలో పని చేస్తున్నాను. అయితే నా నిజమైన ఆసక్తి, ప్రాణం సాహిత్యానికే అంకితం..
తెలుగు పుస్తకాల సుగంధం నా జీవనంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా దినచర్యలో భాగమై, రచన నా అంతరంగపు స్వరం అయ్యింది. ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక ధృక్పథం, ప్రజాసేవ పట్ల నాలో కలిగిన మమకారం నా ప్రతి రచనలో ప్రతిఫలిస్తుంది.
ఇప్పటివరకు నేను రాసిన రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు పలు దిన, వార, మాస పత్రికలలో, డిజిటల్ వేదికలలో వెలువడి పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాలకు, ఆలోచనలకు ప్రతిబింబమే కాక, పాఠకునితో ఒక సంభాషణ.
నాకు సాహిత్యం హాబీ కాదు, అది నా జీవితయానం. కొత్త ఆలోచనలను అన్వేషిస్తూ, తెలుగు సాహిత్య సముద్రంలో నిరంతరం మునిగిపోతూ ఉండటం నా ఆనందం. రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతికే ప్రయత్నం నాకెప్పుడూ ఆగదు.
Comments