top of page

గాలి బుడగలు

#GaliBudagalu, #గాలిబుడగలు, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Gali Budagalu - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 26/09/2025

గాలి బుడగలు - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

 

 

“అన్నయ్యా, తిరుపతి వెళ్తున్నావుటగా.. నాకు ఒక కల్యాణ లడ్డు తీసుకుని రా” అన్నాడు రామకృష్ణ ఫోన్ చేసి.


"పెద్ద లడ్డు గురించి గ్యారంటీ ఇవ్వలేను, కాని చిన్న లడ్డు తీసుకుని రాగలను," అన్నాడు సుమంత్ తన తోడల్లుడు తో.


"తమ్ముడి కోసం ఒక పెద్ద లడ్డు తీసుకుని రాలేవా అన్నయ్యా?" అన్నాడు.


"చూడు రామకృష్ణ, నీతో ఇప్పటికి యాభై మంది తమ్ముళ్లు అయ్యారు. పెద్ద లడ్డు ఒక్కొకటి రెండు వందల రూపాయలు. అంటే పదివేలు ఖర్చు.


ఏదో సీనియర్ సిటిజెన్ కోటాలో ఫ్రీగా టికెట్లు దొరికాయి అనుకుని బయలుదేరాం. కాని హోటల్ ఖర్చు, ట్రైన్ ఖర్చులు చూసుకుంటే ఇరవై వేలు దాటుతున్నాయి," అన్నాడు సుమంత్.


"పోనీ, నువ్వు మీ ఆవిడా కూడా రావచ్చుగా! ఇంట్లో వుండి కోడలిని విసిగించడం ఎందుకు?" అన్నాడు.


"నేను ప్రయాణాలు చెయ్యలేను అన్నయ్య. నాకు ఇల్లే కైలాసం," అన్నాడు రామకృష్ణ.


"సరేలే, నీకోసం పెద్ద లడ్డు తీసుకుని వస్తాను. నీకు ఇచ్చాను అని ఎవ్వరికి చెప్పకు మరి," అన్నాడు సుమంత్.


నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ట్రాఫిక్ తప్పించుకోవడానికి నాలుగు గంటలకే బయలుదేరారు సుమంత్, మానస దంపతులు.


"నాలుగు రోజుల ప్రయాణానికి ఇన్ని పెట్టెలు ఎందుకు మానసా? వద్దన్నా స్నానాలు, అవి చెయ్యాలి. నాలుగు బట్టలు ఎక్కువ వుంటే నష్టం లేదంటావు, కానీ ఇప్పుడు ఈ పెట్టెలు ఎవరు మోస్తారు?" అన్నాడు.


"దర్శనం టికెట్లు ఖర్చు లేదు కదా. కూలీని పెట్టండి. ప్రయాణం అన్నతరువాత డబ్బు ఖర్చుకి వెనకాడకూడదు," అంది మానస.


"మా నాలుగు పెట్టెలు చూసిన కూలి నాలుగు వందలు అవుతుంది, ట్రయిన్‌లో ఎక్కిస్తాను," అన్నాడు.


"ఎందుకు? నువ్వు కూడా ఎస్కేలేటర్‌లోనే గా తీసుకుని వచ్చేది. రెండు వందలు ఇస్తాను," అన్నాడు సుమంత్.


"తొమ్మిదో ప్లాట్‌ఫారమ్ మీద ట్రైన్ ఉంది. ఇంకా అయిదు నిమిషాలలో బయలుదేరిపోతుంది. ఇస్తే నాలుగువందలు ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం," అన్నాడు కూలి.


"ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే సరే, పదా సామాను పట్టుకుని రా," అంది మానస.


కూలి వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. "పరిగెత్తండి, సామాను పట్టుకుని కనిపించకుండా పోతాడేమో" అంటూ అరుస్తోంది. 


“వెధవ గొడవ, పరిగెత్తుకుని వెళ్ళడానికి నేను ఏమైనా పీటీ ఉషనా”, అని జనాన్ని తప్పించుకుంటో కూలి వెనుక నడుస్తున్నాడు వేగంగా.

మొత్తానికి సామాను మా భోగిలో పెట్టి, "అమ్మగారు ఏరి సార్, ట్రైన్ కదిలేడట్లు ఉంది," అన్నాడు కూలి.


"అవును, తను నా వెనుక రాలేదా" అనుకుంటూ కిందకి దిగి చేతులు ఎత్తి అటుఇటు ఊపుతో జనంలోకి మానస కోసం చూస్తున్నాడు.


మొత్తానికి రొప్పుకుంటో భర్త దగ్గరికి వచ్చి, "బాబోయ్, నడవలేకపోయాను," అంటున్న భార్యతో “ముందు ట్రైన్ ఎక్కు. నీ విన్యాసాలు తరువాత చెప్పచ్చు" అంటూ భార్యని కంపార్ట్మెంట్‌లోకి తోసి, తను కూడా ఎక్కి కూర్చున్నాడు.


"సార్, మా అమ్మగారు పై బెర్త్‌లోకి ఎక్కలేరు; మీ లోయర్ బెర్త్ మాకు ఇవ్వగలరా?" అంటూ ఎవరో వచ్చి సుమంత్‌ని అడిగారు.


"చూడండి, మమ్మల్ని చూస్తే పై బెర్త్ వరకు వెళ్ళగలమని ఎలా అనుకున్నారు? లోయర్ బెర్త్ దొరికినప్పుడే ప్రయాణం పెట్టుకోవాలి. అంతే తప్పా. టీసీ కంటే ముందే వచ్చి 'మీ లోయర్ బెర్త్ ఇస్తారా?' అని అడుక్కోవటం ఏమిటి?" అన్నాడు విసుగ్గా.


"ఎందుకండి అంత కోపం? మీకు అప్పర్ బెర్త్ దొరికినప్పుడు తెలుస్తుంది బాధ” అంటు వెళ్లిపోయాడు.


తిరుపతి ఉదయం ఆరు గంటలకు చేరుకుని క్యాబ్‌లో హోటల్‌కి వెళ్లి రిజర్వేషన్ డీటెయిల్స్ చెప్పాడు సుమంత్.


"ఆలా కూర్చోండి, చెకిన్ 11 గంటలకు," అంది — ముసి ముసి నవ్వులు నవ్వుతో.


"అదేమిటి? ఆరింటికి వచ్చిన వాళ్ళం 11 గంటల వరకు వెయిట్ చేయటం ఏమిటి? ఆ టైమ్‌కు మేము కొండమీద ఉండాలి," అన్నాడు సుమంత్ — ఇంగ్లీష్‌లో.


"సార్, మీరు ఏ భాషలో మాట్లాడినా మా జవాబు ఒక్కటే. మీరు ఆన్లైన్‌లో బుక్ చేసింది డిస్కౌంట్ కోసం. అందులో క్లియర్‌గా ఉంటుంది — చెకిన్ 11 గంటలకు," అంది రిసెప్షనిస్ట్.


"మీరు వుండండి, నేను మాట్లాడుతాను. ఇంట్లో పొట్లాడినట్టు అన్నిచోట్లా కుదరదు" అంటూ మానస, సుమంత్‌ని పక్కకు పంపి తను వెళ్ళి మాట్లాడింది.


"మా అమ్మాయి లాంటి దానివి, ఏదో మాకు తెలియక ఆన్లైన్‌ బుక్ చేసుకున్నాము. మా వయసు చూడు, 11 గంటల వరకు ఇలా కూర్చొని ఉండగలమా? సీనియర్ సిటిజెన్ కోటాలో దర్శనం టికెట్లు వచ్చాయి; 12 గంటలకు వెళ్ళాలి. ఎలాగో అలా గది అలాట్‌ చేయి, తల్లి," అన్నారు.


"మాకు మాత్రం మిమ్మల్ని యిబ్బంది పెట్టడం సరదా కాదు        కదా? ఒక పదినిమిషాలు వుండండి, రూమ్ ఖాళీ అవుతుంది. ముందు మీకు ఇస్తాను. సార్, నా మీద కోపం చేస్తారేమిటి?" అన్నారు.


"ఆయన మాటలు పట్టించుకోకు, తల్లి. త్వరగా అలాట్‌ చేయి," అని చెప్పి వచ్చి సుమంత్ దగ్గరికి వెళ్లి “అడిగే విధంగా అడిగితే వారు ఇస్తారు — పదినిమిషాలలో గది ఇస్తారు," అని గర్వంగా చెప్పారు.


"నన్ను వెధవని చేసి, నువ్వు సాధించావు అంతేగా. పైన కొండమీద కూడా నువ్వే మాట్లాడు," అన్నాడు ఉక్రోషంగా.


అన్నటుగా రూమ్ అలాట్ చేసింది. రూమ్‌లోకి నాలుగు సూట్‌కేసులు దింపిన రూమ్ బాయ్ నవ్వుతూ నుంచున్నాడు


"అర్ధం అయ్యింది — నవ్వకు" అంటూ యాభై రూపాయల నోట్ తీసి అతని చేతిలో పెట్టి తలుపు మూసి బాత్రూమ్‌లోకి పరిగెత్తాడు సుమంత్.


"పాపం, ఇందుకోసమా చిందులు తొరికింది?" అని నవ్వుకుంది మానస.


మూడు గంటలకు దర్శనం కోసం గేట్ తెరిచారు. అప్పటివరకు వృద్ధులమని అనుకునేవాళ్లు పరుగులు తీయడం మొదలుపెట్టారు, "దర్శనం తమకే ముందు" అనుకుంటూ. తోపుడు లేకపోయినా "నడవాలి! నడవాలి!" అన్న సేవాదళ్ వారి గొడవ తప్పలేదు.

 

"నువ్వు పొట్టిగా వున్నావు. నా ముందు నుంచో. లేకపోతే వెంకటేశ్వర స్వామి కనిపించడు" అని భార్య మానసను  ముందు పెట్టాడు.


"నడవండి, సార్" అని తోసి సుమంత్ దంపతులను క్యూ నుంచి బయటకు పంపించారు. 


"ఏమండి, వెంకటేశ్వర స్వామిని నేను చూడలేదండి. మొన్న టీవీలో చెప్పారు — ముందుగా జయవిజయులకి దణ్ణం పెట్టుకుని తరువాత స్వామిని చూడాలి అని. సరే అని, జయవిజయులను చూసేలోపే బయటకు వచ్చేశాను. "మీరైనా, స్వామిని చూశారా?" అని మానస విచారంగా అడిగింది.


"చూడు, ఇది తిరుమల — సావధానంగా అన్నీ చూసుకుంటో నడిస్తే అంతే. నేను టీవీ చూడను కాబట్టి, వెంకటేశ్వర స్వామిని చూసి, తోసేయబోతున్న సేవాదళ్ కి దణ్ణం పెట్టి బయటకు వచ్చాను. అయినా ప్రతీ నాలుగు నెలలకు ఏదో మొక్కుతో తప్పకుండా వస్తున్నాం; ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ముందు నుంచి స్వామి వంక చూద్దువుగాని. పద విమాన వెంకటేశ్వర స్వామిని చూసి వెళ్దాం అన్నాడు సుమంత్.


హుండీలో డబ్బులు వేసి బయటకు వస్తోవుంటే పులిహోర ప్రసాదం యిస్తే తీసుకుని పక్కన నుంచున్నారు.  


"ఆమ్మో, కళ్ళు మంట” అంటున్న భర్తని చూసి — “అయ్యో రామ! ప్రసాదం కళ్ళకి అద్దుకుని తినమంటే కళ్ళకి ఆనిచ్చి తింటారా, ఏ పని సరిగ్గా చెయ్యడం రాదు, అలా వెళ్ళి ట్యాప్ దగ్గర కళ్ళు కడుక్కుని రండి” అంది మానస.


“మీరు యిలా కూర్చొని వుండండి నేను వెళ్లి లడ్డులు తీసుకుని వస్తాను” అంది. 


“సరే మొత్తం పది పెద్ద లడ్డులు, 10 చిన్న లడ్డులు తీసుకో” అన్నాడు కళ్ళు మూసుకుని. 

అరగంట తరువాత వచ్చిన భార్యతో “లడ్డులు అడిగినన్ని యిచ్చారా” అన్నాడు. 


“యిస్తున్నారు కాని  తీసుకోలేదు, మూడు పెద్ద లడ్డులు రెండు చిన్న లడ్డులు తీసుకుని వచ్చాను” అంది.  


“అదేంటి మనవాళ్ళు పెద్ద లడ్డులు అడిగారుగా” అన్నాడు. 


“వాళ్ళు అడుగుతారు మీరు ఒప్పుకుంటారు. ఒక పెద్ద లడ్డు మా చెల్లెలు మొగుడు ఆడిగాడు. మీరు తప్పకుండా తెస్తాను అన్నారు కాబట్టి వాళ్ళకి యిద్దాం, మిగిలిన వాళ్ళకి ముక్కలు చేసి పొట్లాలు కట్టి యిద్దాం” అంది మానస.


“సరేలే మాట వస్తే నీదే బాధ్యత” అన్నాడు సుమంత్.  


మొత్తానికి కంచి దర్శనం అయిన తరువాత పట్టు చీరలు, పంచెలు కొనుక్కుని హైదరాబాద్ మర్నాడు ఉదయం చేరుకున్నారు. 


“అబ్బా.. మీ చెల్లెలు మొగుడు రామకృష్ణ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు, మనం తనకి లడ్డులు తీసుకుని రాకుండా వస్తామేమో అని. ఈ రోజు వెళ్ళి ప్రసాదం యిచ్చేసి వద్దాం” అంటూ తలుపు తీసుకుని లోపలికి వచ్చి కూర్చున్నాడు.


‘మళ్ళీ ఫోన్, చంపేస్తున్నాడు’ అనుకుంటూ ఫోన్ తీసుకున్నాడు. అది తన సుపుత్రుడి నుంచి. 


“హలో ఏమిటి యింత ఉదయమే ఫోన్ చేసావు” అన్నాడు సుమంత్.  


“మీకు రామకృష్ణ బాబాయ్ నుంచి ఫోన్ వస్తోవుంటే ఎందుకు తీయ్యడం లేదు, బాబాయ్ ఈరోజు తెల్లవారి జామున హార్ట్ ఎటాక్ వచ్చి  చనిపోయాడుట, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే మీరు ఫోన్ తీయ్యలేదు. ఎక్కడికి వెళ్లారు” అన్నాడు.


“అయ్యో అదేంటి రా.. మూడు రోజుల క్రితం బాగానే వున్నాడు. తిరుపతి లడ్డులు తెమ్మన్నాడు” అన్నాడు సుమంత్. 


“మీరు తిరుపతి ఎప్పుడు వెళ్లారు నాకు కూడా చెప్పకుండా, సరే ముందు క్యాబ్ మాట్లాడుకుని బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, నేను కూడా ఫ్లైట్ కి వస్తాను, మీరు ఆవేశపడకండి జాగ్రత్త” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు చెన్నై లో వున్న సుమంత్ వాళ్ళ అబ్బాయి.


“ఎవ్వరు ఫోన్..” అంటూ వచ్చిన మానసకి “వివరాలు తరువాత క్యాబ్ లో చెప్తా, ముందు మీ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పదా త్వరగా” అన్నాడు.


“మీకు లేచిందే లేడి ప్రయాణం, లడ్డు కూడా తీసుకుని వెళదాం” అంది విషయం తెలియక. “లడ్డు అంటూ బ్యాగ్ ముట్టుకోకు. నా హ్యాండ్ బ్యాగ్ లో వుంది  పదా” అని బయటకు వెళ్ళి కారులో కూర్చున్నాడు. తాళం వేసి కారులో కూర్చుంటూ మానస అడిగింది “ఏమైంది అండి మా వాళ్ళు బాగానే వున్నారుగా” అని.


“మీ చెల్లెలు భర్త రామకృష్ణకి తెల్లారి హార్ట్ ఎటాక్ వచ్చిందిట, కొద్దిగా సీరియస్ గా వుంది, తగ్గుతుంది లే” అన్నాడు.


అప్పుడే ఏడుపు మొదలుపెట్టింది మానస. డ్రైవర్ వెనక్కి చూసి “ఎవ్వరికైనా ఆరోగ్యం బాగుండలేదా సార్” అని ఆడిగాడు.


రామకృష్ణ యింటి ముందు షామియానా చూసే సరికి మానసకి అర్ధం అయ్యింది. కారు దిగి లోపలికి పరిగెత్తింది చెల్లెలు దగ్గరికి.


రామకృష్ణ కొడుకు శరత్ సుమంత్ ని చూసి కన్నీళ్లతో చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు.


హల్ మధ్యలో ఐస్ బాక్స్ లో వున్న రామకృష్ణని చూడగానే సుమంత్ కి కళ్ళలో నీళ్లు ఉబికి వచ్చాయి. 


“అన్నయ్యా! నా కోసం కళ్యాణం లడ్డు తీసుకుని రా” అన్న మనిషి తనకేమి పట్టనట్టు పడుకుని వున్నాడు.  


ఇంతలో ఒకరు “అంకుల్.. టిఫిన్ తినటానికి రండి” అని పిలవటంతో బయటకు వచ్చాడు. అక్కడ వరండాలో కొందరు టిఫిన్ తింటో, కొందరు టీ తాగుతో మనం ఈ ప్రపంచంలో శాశ్వతం అన్నట్టుగా వున్నారు.


వచ్చి షామియానా లో కూర్చొని జరుగుతున్న రామకృష్ణ శాశ్వత వీడుకొలు పనులు చూస్తో కళ్ళు తుడుచుకుంటూ  ‘మనిషి బతికి వున్నంతవరకు నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుని డబ్బు వెనుక పరుగులు తీసి చివరికి నేల మీద యిలా  శవం అయ్యి పడుంటారు. దీనికోసం తలో నాటకం వేసి చివరికి ఈ నాటకంతో ముగింపు పలుకుతారు’ అనుకున్నాడు.


వెనుక నుంచి భుజం మీద చెయ్యి వేసి “డాడీ. మీరు యిక్కడ ఎందుకు కూర్చున్నారు.. లోపలికి వెళ్ళి కూర్చోండి.  చివరిలో పిలుస్తాను” అంటున్న కొడుకు సాయిరాం ని చూసి “నువ్వు వచ్చి ఎంత సేపు అయ్యింది” అన్నాడు సుమంత్.


“బాబాయి ని చూసావా, ఎన్నో కబుర్లు చెప్పినవాడు యిప్పుడు పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా పడుకున్నాడు” అన్నాడు కొడుకుతో.


తండ్రి పక్కన కూర్చొని తండ్రి చెయ్యిని తన చేతిలోకి తీసుకుని, “హాస్పిటల్ పాలు కాకుండా వెళ్ళిపోయాడు బాబాయ్, ఒక విధంగా అదృష్టవంతుడు” అన్నాడు సాయిరాం. 


తన చేతిని పట్టుకునివున్న కొడుకు చెయ్యి వణుకుతో ఉండటం చూసి, “ఏమిటి ఆలోచిస్తున్నావు,  ఈ పుట్టటం, పోవడం అనేది రంగులరాట్నం లాంటిది. ఎక్కేవాళ్ళు ఎక్కుతోవుంటారు, దిగే వాళ్ళు దిగుతో వుంటారు. ఈ జనం అంతా గాలి బుడగలు లాంటివాళ్ళే, ఎగిరినంత వరకు ఎగిరి  చివరికి గాలిలో కలిసి పోవడం తప్పదు.

వున్నన్నాళ్ళు ఎవ్వరికీ హాని చెయ్యకుండా వుండి వెళ్ళిపోయినవాడు పుణ్యం చేసుకున్నట్టే.


నువ్వు కూడా జీవితం లో సెటిల్ అయ్యావు, మా గురించి బెంగపెట్టుకోకు. సమయం వచ్చినప్పుడు ధైర్యంగా వుండి  నీ కర్తవ్యం పూర్తి చెయ్యి. నలుగురికి సహాయపడుతూ అందరితో కలుపుగోరుతనంతో వుండు. పాత నీరు పోయి కొత్త నీరు రాకమానదు” అన్నాడు సుమంత్.


“యిప్పుడు ఎందుకు డాడీ ఈ మాటలు, ముందు కొద్దిగా మంచినీళ్లు తీసుకోండి” అన్నాడు సాయిరాం.


“ఒక్కసారి నన్ను బాబాయ్ పడుకున్న చోటకి తీసుకుని వెళ్ళు” అని కొడుకు చెయ్యి పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ రామకృష్ణ మృతదేహం దగ్గరికి వెళ్లి తన చేతి సంచిలోనుంచి తిరుపతి లడ్డు ముక్క విరిచి శాస్త్రి గారిని అడిగి రామకృష్ణ నోట్లో పెట్టి “యిదిగో నువ్వు అడిగిన లడ్డు తీసుకుని వచ్చాను”, అని మెల్లగా కొడుకు చెయ్యి పట్టుకొని ఇంటిలోపలికి నడిచాడు సుమంత్.


గాలి బుడగలు లాంటి మనుషులు గాలి వున్నంతవరకు  ఎగరగలం అని తెలుసుకుని నలుగురి మేలు కోరుకుంటూ జీవితానికి అర్ధం కొత్త తరానికి తెలియచేయాలి.


సమాప్తం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree












Comments


bottom of page