సొంతింటి కల
- Mohana Krishna Tata
- Sep 25
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #SonthintiKala, #సొంతింటికల, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Sonthinti Kala - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 25/09/2025
సొంతింటి కల - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండీ! మీకో మంచి కాఫీ తేనా..? టిఫిన్ ఏం చెయ్యమంటారు? మీకు ఇష్టమైన పూరీ చెయ్యనా?" అంటూ ప్రేమగా అడిగింది కావ్య.
"ఏమిటో శ్రీమతిగారు ఈరోజు నామీద ప్రేమ ఒలకబోస్తున్నారే. పొంగి పొర్లిపోతోంది..కాస్త చూసుకో"
"చూపిస్తేనేమో..ఎక్కువ అంటారు..లేకపోతే, పెళ్ళానికి ప్రేమలేదు అంటారు..ఏం చెయ్యను?"
"ఎండాకాలంలో మంచు కురిస్తే, ఎవరికైనా అనుమానం రాదా చెప్పు మరి"
"ఈ వెటకారానికేమి తక్కువ లేదు"
"ఇంతకీ ఏమిటో చెప్పు?"
"కోపం రాకూడదు మరి..అసలే మీకు కోపం చాలా ఎక్కువ..అదే నా భయం.."
"ముందు చెప్పు.."
"ఏమీ లేదండి..ఎంతకాలం ఈ అద్దె ఇంట్లో ఉంటాం చెప్పండి..? సొంతిల్లు ఉంటే ఆ దర్జా, గౌరవం వేరుకదా"
"మంచి ఇల్లు మన బడ్జెట్ లో రావాలంటే..లక్షలు కావాలి. దానికి తోడు, సౌకర్యాలు అని చెప్పి ఇంకొన్ని లక్షలు రుద్దుతారు"
"తక్కువలో ఇల్లు ఆల్రెడీ చూసేసానండి...టీవీలో మాయ రోజు చెబుతోంది"
"ఎవరు ఆ మాయ? ఏ మాయ చేసింది నీ మీద...నమ్మకే"
"ఏమిటండి ఆ మాటలు...టీవీ పెడతాను మీరే చూడండి.." అంటూ టీవీ పెట్టింది కావ్య.
"నిజంగా మాయ బాగా చెబుతోంది...చాలా బాగుంది"
"ఏం బాగుంది..?"
"అదే..అదే..ఆమె చెప్పేదే.."
"చూసారా...మాయను చూస్తే, మీరు కూడా ఒప్పుకున్నారు..పాతిక లక్షలే ఇల్లు"
"పాతికకు ఇళ్లంటే ఎలా నమ్మేది చెప్పు?"
"ఆ అమ్మాయి ఎంత చెబితే అంతే.. కాదనగలమా? ఇలాంటి అమ్మాయి అబద్దం ఆడుతుందా? నిజమే అయి ఉంటుంది" అంది కావ్య.
"అసలే చిన్న జీతగాడిని.. డబ్బులు వేస్ట్ అయితే తట్టుకోలేను.. కొంచం ఆలోచించవే"
"మీరు ఎన్ని చెప్పినా వినేదే లేదు. పాతిక లక్షలకే ఇల్లు ఎవరిస్తారు చెప్పండి? ఇంకా పది రోజుల్లోనే ఆఫర్ క్లోజ్ చేసేస్తారంట.. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయట.. త్వరగా మాయకు కాల్ చెయ్యండి"
"నా మాట వినవే"
"మీరు ఒప్పుకోకపోతే, విషం తాగేస్తా.."
"విషం కూడా కల్తీ వస్తున్నాయి కదా.. నీమీద ఎఫెక్ట్ ఉండదు"
"అయితే చెరువులో దూకేస్తా" అంది కావ్య.
"నువ్వు చెరువులో దూకి, పాపం అందులో ఉన్న ప్రాణులను ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పు. మాయకు కాల్ చేస్తాలే.. తప్పుతుందా.."
ఆఫీస్ లంచ్ బ్రేక్ లో...
"హలో.. మాయగారా?"
"హా.. చెప్పండి సర్. .ఏ ఫ్లాట్ కావాలి?" అంటూ ఒక హస్కీ వాయిస్.
"మీ వాయిస్ చాలా బాగుంది.. మీరు ఏది చెబితే అదే"
"అయితే కార్నర్ ఫ్లాట్ తీసుకోండి.. సూపర్ గా ఉంటుంది. ముందు మీరు మోడల్ ఫ్లాట్ చూడండి.. తర్వాత మిగిలిన డీటెయిల్స్ చెబుతాను"
"అలాగే.."
"చెప్పడం మరచాను.. ముందు ఒక యాభై వేలు విజిటింగ్ ఫీ కట్టండి.. ఇల్లు తీసుకున్నాక, టోటల్ లో మైనస్ చేస్తాము"
"అలాగా..? మళ్ళీఫోన్ చేస్తాను" అంటూ ఫోన్ పెట్టేసాడు.
"కావ్యా..! మాయ పెద్ద మాయే చేసిందే.. ముందు యాభైవేలు కట్టాలంట. అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలి"
"పండగ బోనస్ వచ్చిందిగా.. అది కట్టేయండి.."
"ఆ డబ్బులతో నేను రెండు డ్రాయర్లు, రెండు బనియన్లు, రెండు జతలు కొనుక్కోవాలి.. అసలే నాలుగు సంవత్సరాల నుంచి నాకు బట్టలే లేవు. ఉన్న రెండు డ్రాయర్లు, సైడ్ ఏ సైడ్ బి వేసుకుని మేనేజ్ చేస్తున్నా.."
"మీరు ఆఫీస్ మేనేజర్ కాదుగా.. మీకు ఇప్పుడు కొత్త బట్టలు ఎందుకు? నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నాకు మాత్రం పట్టుచీర, నగలు మానడానికి లేదు"
"అలాగే లే.. ఏం చేస్తాం"
"కట్టేయండి.. ఎలాగో మనం ఇల్లు కొంటాముగా.."
"ఏమోనే.. కొంచం ఆలోచించవే.. నన్ను ఇబ్బంది పెట్టకే.. అయినా నా లాంటి వాళ్ళకి కూడా లోన్స్ ఇవ్వడం ఆ బ్యాంక్స్ చేస్తున్న పెద్ద తప్పు.. లేకపోతె ఎందుకు నాకీ తిప్పలు"
"మంచిదే కదండీ.. మా ఫ్యామిలీ లో అందరికి సొంత ఇల్లు ఉంది.. మనకు తప్ప.. మనకి చాలా అవమానం"
"అలాగేలే.. కట్టేస్తాను.."
"హలో మాయగారు.. డబ్బులు కట్టేసాను.. నెక్స్ట్ ఏమిటి?"
"చాలా సంతోషం. మీరు ఆల్మోస్ట్ మీ సొంతింటి కలకు దగ్గరలోనే ఉన్నారు. రేపు మిమల్ని ఫ్రీగా సైట్ విజిట్ కి తీసుకుని వెళ్తాము"
"అలాగే.."
సైట్ విజిట్ కి రెడీ అయి.. ఫ్రీ కార్ లో కూర్చొని ఎంతో మురుసిపోయాడు. కావ్యని రమ్మంటే, ఎందుకో భయపడింది పాపం.
"ఇప్పుడు మనం సైట్ చూస్తాము.. పదండి" అన్నాడు ఏజెంట్.
"ఎక్కడయ్యా.. ఇప్పటికి పాతిక కిలోమీటర్లు వచ్చాము.. ఇదేదో అడవిలాగ ఉందే.."
"కరెక్ట్ గా గెస్ చేసారు.. పొల్యూషన్ ఫ్రీ ఏరియా ఇది"
"పొల్యూషన్ ఫ్రీ ఏ కాదు.. మనషులు కూడా ఎవరూ ఉండరు ఇక్కడ"
"ఇదే మన మోడల్ ఫ్లాట్.."
"కట్టిన ఫ్లాట్స్ ఏవి..?"
"ఇంకా కట్టాలి.. అన్ని బుక్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం"
"ఇదేమి లొకేషన్ రా బాబు.. పక్కన శవాలు కాలుతున్న పొగ. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుని.. సిటీలోకి రోజూ వెళ్ళడానికి, రావడానికి డబ్బు, టైం చాలా వేస్ట్ అవుతుంది. శ్మశానం మాత్రమే దగ్గరగా ఉంది"
"ఇంత తక్కువలో ఇల్లు కావాలంటే తప్పదు సర్"
"ఈ ఫ్లాట్ ఏంటి ఇంత చిన్నదిగా ఉంది. మొత్తం చూస్తే, మా ఇంటి హాల్ అంత లేదు"
"పాతిక లక్షలకి అంతేగా సర్ మరి.. దీనిని కూడా ఫ్లాట్ అనే అంటారు"
"బాత్రూం లో ఒక మనిషి కూడా పట్టడు. నిల్చొని నీళ్ళు పోసుకుంటే, నీళ్లన్నీ గోడమీద, బకెట్ లోనే పడిపోతాయి.."
"వాటర్ సేవ్ కదండీ"
"హాల్ లో టీవీ చూడాలంటే, దగ్గరగా కూర్చోవాలి.. అంత చిన్నగా ఉంది హాల్.."
"ఇది మినీ హాల్.. అన్నీ గోడకే. ఫర్నిచర్ ఖర్చు ఉండదు. బంధువులు కూడా పెద్దగా రారు. మీకు అంతా మిగులే.."
"మీరు బాగా గోకేస్తున్నారు కదా.. ఇంకేంటి మాకు మిగిలేది"
"ఒసేయ్..! ఇల్లు వీడియో తీసి పెడతాను కొంచం చూడు.."
'ఏమిటి మా ఆయన పిలుపు మారింది.. జాగ్రత్త పడాలి' అనుకుంది కావ్య.
ఇంటి వీడియో చూసి కావ్య భయపడింది. మొదటనుంచి ఆయన వద్దని అంటున్నా వినలేదు.. నేనే ఒప్పించాను. ఇప్పుడు నా పని అవుట్. సైట్ విజిట్ కి వెళ్ళకపోవడమే మంచిదైంది.
"ఏమండీ! ఆ ఇల్లు మనకి సరిపోదు.. వద్దని చెప్పేయండి.."
"ఇప్పుడు అలా చెబితే.. సగం మైనస్ చేసి బ్యాలన్స్ ఇస్తారుట.. నాకు చాలా నష్టం వస్తుంది"
"ఏం చేస్తాం చెప్పండి! మా నాన్నకు ఒంట్లో బాగోలేదు.. నేను ఊరు వెళ్తున్నా. ఆ వచ్చిన డబ్బులు తీసుకుని ఇంట్లో వండుకుని, కొంచం కూల్ అవ్వండి.. నాలుగు రోజుల్లో వచ్చేస్తా" అంటూ ఫోన్ పెట్టేసింది కావ్య.
"హలోనాన్నా..! ఎలా ఉన్నారు?" అని ఫోన్ లో అడిగింది కావ్య.
"నాకేమి సూపర్ గా ఉన్నాను"
"మీకు ఒంట్లో బాగోలేదు. నేను మిమల్ని చూడడానికి వస్తున్నా అంతే..! మా ఆయనకి కూడా ఇలానే చెప్పండి"
"ఏమైంది..? మళ్ళీ ఏదో తేడా చేసావా?"
"ఇంట్లో ఉంటే, ఆయన కోపానికి నేను అవుట్.. అందుకే అక్కడికి వస్తున్నా నాన్నా.." అంది కావ్య
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments