నీ దంతా నాటకం!..
- T. V. L. Gayathri
- 5 days ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #నీదంతానాటకం, #ఆకొత్తలోకం

గాయత్రి గారి కవితలు పార్ట్ 37
Needantha Natakam - Gayathri Gari Kavithalu Part 37 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 28/09/2025
నీ దంతా నాటకం - గాయత్రి గారి కవితలు పార్ట్ 37 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
నీ దంతా నాటకం! ...
(వచన కవిత).
**********************************
అంతా నువ్వే చేశావు మాధవా! నీ ఆగడము
సుంతైనా తగ్గదేమి? చోరగుణంబు నీకేలా? తెల్పుము!
వింతగ నున్నది నీదు వర్తనము మధుసూదనా!
ఇంతుల నీవిధి నేడిపించెదవు నీకిది న్యాయమా!
పొంతన లేని మాటలతో మమ్ముల మోసగించెదవు!
చింతలను దీర్పు వాడవని చేరితిమి నీదరికి!
గంతులు వేయుచు వెళ్లెదవు చాలును నీ నటన నీ
దంతయు నాటకం బనుచు నెరింగితిమి చూడుము!
చెంతకు రాకు రాకు! కొట్టెద మింక పొమ్ము పొమ్ము!
ఇంతింత కన్నులతో నిట్టుల గాంచిన లాభమేమి?
సంతలోన పాలను, వెన్నల నమ్ము వారమే! మా వెన్న
ముంతలను పగుల గొట్టుట కెంత ధైర్యము? నీ పైన
పంతమును చూపుటయు చేతకాని వారమయ్య బాలకా!
అంతము నాదియు లేని వాడవట! అబద్ధము! నీ యొక్క
భ్రాంతిలో మున్గెనీ లోకము! ఔరా! కన్నయ్యా!
సంతసమును కలిగించు కార్యములు సల్పుము గోపకిశోరా! //
************************************

ఆ కొత్త లోకం.
(వచన కవిత)
************************************
మానవత్వపు జాడ మహిలోన కనరాక
నానా లోకములలో నవతరంబు వెదకింది.
అక్కడేదో గ్రహము నగుపించె ననుచు నా
చుక్కలను వెదుకుచూ శోధనలు గావించి
ఘనులు శాస్త్రజ్ఞులు కథలు చెబుతుంటారు
మనసుకు హాయిగా మరో ప్రపంచముందంటారు.
ఆ కొత్త లోకంలో అందరూ బంధువులట
వేకువనే కనులును విప్పినిదుర లేస్తారట!
ముంగిటిలో ముగ్గులను ముదిత లెల్ల వేస్తారట
సంగతులను చెప్పుకొంటూ చావిట్లో కూర్చుంటారట!
పిల్లలంతా బడులకు వెళ్లి వస్తుంటారట!
చల్లనైన సమీరాలు సర్రుమని వీస్తాయట!
బావులలో నీళ్లన్నీ బహు తీయగా ఉంటాయట!
జీవరాసులన్నీ స్నేహంగా మెలుగుతాయట!
కల్మషమనే మాట కలనైనా వినబడదట!
కల్మితోప్రజలెల్ల కలిసి మెలిసి యుంటారట!
పాలకులే లేరంట!పని చేసే వాళ్ళేనట!
స్త్రీలకా లోకంలో చెప్పలేని గౌరవమట!
ఆ కొత్త లోకానికందరమూ వెళ్లిపోదాం!
చీకట్లను వదిలేసి క్షేమాన్ని పొందుదాం!
భావి తరాన్నపుడు పదిలంగా పెంచుకొందాం!
జీవితపు కోవెలలో చిరు దివ్వెలు వెలిగిద్దాం!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments