top of page
Original.png

యోగిపుంగవులు – ప్రకృతి యొడిలో


యోగిపుంగవులు మరియు ప్రకృతి యొడిలో కవితల భావాలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక భారతదేశం, ప్రకృతి సౌందర్యం, పచ్చని వాతావరణం

Yogi Pungavulu - Prakruthi Yodilo - Telugu Poem | T. V. L. Gayathri 

యోగిపుంగవులు – ప్రకృతి యొడిలో తెలుగు కవిత | T. V. L. గాయత్రి

Published in manatelugukathalu.com on 18/08/2026


టి. వి. యెల్. గాయత్రి రచించిన ‘యోగిపుంగవులు’, ‘ప్రకృతి యొడిలో’ కవితలు మనిషి ఆధ్యాత్మిక జీవనం నుంచి ప్రకృతి పరిరక్షణ వరకు విస్తరించిన విలువలను ప్రతిబింబిస్తాయి. ‘యోగిపుంగవులు’లో భారతదేశంలో పుట్టిన యోగులు, మునులు, సాధువుల ఆధ్యాత్మిక సేవ, ధర్మనిష్ఠ, సమాజ శ్రేయస్సు గురించి కవయిత్రి వివరిస్తే, ‘ప్రకృతి యొడిలో’ కవితలో పచ్చని వసుధ, స్వచ్ఛమైన నదులు, జీవరాశులు, కాలుష్యరహిత వాతావరణం ద్వారా ప్రకృతి పరిరక్షణ ప్రాధాన్యాన్ని చాటారు.


యోగిపుంగవులు.

(ఇష్టపది )

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

*******


ఆచార్యులై ధరణి కాత్మజ్ఞానంబొసగు 

యోగి పుంగవులెందరో పుట్టినారిచట.


జపతపంబులు సల్పి శాంతితో చరియించి 

సంఘసేవను జేసి సజ్జనులు సాగిరట 


వాయువును బంధించి వాసనల విడనాడి 

ముక్తసంగులు మునులు మోక్షంబు నొందిరట.


పరమాత్మ నామంబు పల్కుచును నిష్ఠతో 

ధర్మమును నిలబెట్టి ధన్యులై మెల్గిరట.


భరతదేశపు ఖ్యాతి వర్థిల్ల వలెనంచు 

 కైవల్య దాయకులు గ్రంథములు వ్రాసిరట.


దురితాత్ములై జనులు దోషములు సల్పగా 

సాధువులు చనుదెంచి జాతికై నిల్చిరట.


ఘనయోగి వర్యులకు కైమోడ్చి మ్రొక్కుకొన 

జాతియందున శాంతి సౌఖ్యములు విలసిల్లు.


 పరులకై తపియించి ప్రగతికై తపియించి 

కలిసి జీవింపగా కల్గుసౌభాగ్యములు.//


ప్రకృతి యొడిలో 

(వచన కవిత )

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

******


ప్రకృతి యొడిలో పుడమి వర్థిల్లు చుండగా!

జీవరాశికి సుంత శ్రేయమ్ము కలుగుగా!


పచ్చపచ్చగ  వసుధ పరిఢవిలు చుండగా!

కమనీయముగ పృథ్వి కనువిందు చేయగా!


నదులలో జలంబులు స్వచ్ఛమై పారగా 

సముద్రపు జీవములు సయ్యాట లాడగా 


పశుపక్ష్యాదులు కూడి పర్వులను తీయగా!

వనదేవతలు మురిసి పరవశమునొందగా!


వాయు కాలుష్యంబు భస్మమై పోవగా!

పర్వతంబుల ఠీవి ప్రాభవం బొప్పగా!


ప్రజలెల్ల చైతన్య పరులగుచు బ్రతుకగా!

ధరణికై సతతంబు పాటుబడు చుండగా!


సంపదలు పొర్లగా శాంతిసౌఖ్యములతో 

ప్రగతి బాటలో జాతి పయనించు దివ్యముగ.


పర్యావరణముకై పట్టుదలగా  జనులు 

కష్టపడిన చాలు కల్గు సౌభాగ్యములు.//



===================================

జగన్నాథ స్వామి నందిఘోష రథయాత్రలో లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతున్న దివ్య దృశ్యం

Rathayathra - Telugu Poem | T. V. L. Gayathri 

రథయాత్ర తెలుగు కవిత | T. V. L. గాయత్రి

Published in manatelugukathalu.com on 25/07/2026


రథయాత్ర.

(రుబాయిలు )

*******************


అదిగదిగో జగన్నాథ స్వామి వచ్చె పాలకుడై 

వదిలించగ పాపములను ప్రభువు వచ్చె పాలకుడై.

దుష్టజనుల సంహరించి సాదువులను రక్షింపగ

ప్రతిన బూని పంకజాక్షు డిలకు వచ్చె పాలకుడై.//


పరమాత్మకు నుత్సవములు జరుగుచుండె వేడుకగా 

కరుణానిధి భక్తులకై కదులుచుండె వేడుకగా 

ముచ్చటగా తేరుపైన నూరేగుచు స్వామి నేడు 

జనులకెల్ల దర్శనంబు నొసగు చుండె వేడుకగా.//


సముద్రమై జనవాహిని యగుపించెను చూడరండి!

భక్తజనుల మానసములు పులకించెను చూడరండి!

మూలమూర్తులకు సేవలు చేయుచున్న కింకరతతి 

జగన్నాథ యంచు నిలచి నినదించెను చూడరండి!//


నందిఘోష రథముపైన నాయకుడై వెలిగె శౌరి 

రత్నభూషణముల తోడ శ్రీముఖుడై వెలిగె శౌరి.

పట్టువస్త్రములు ధరించి జగన్నాథు డిలనేలుచు 

తోబుట్టువులతో కూడి శుభకరుడై వెలిగె శౌరి.//


స్వామి నామములను పలికి యజియించుట భాగ్యమయ్య!

హృదయములో నిల్పి సతము జపియించుట భాగ్యమయ్య!

సజ్జనాత్ము లగుచు జనులు సంఘసేవ చేయుచుండి 

పరమ పథము చేరుటకై తపియించుట భాగ్యమయ్య!//


===================================

మంచిగుణములు






Manchi Gunamulu - Telugu Poem | T. V. L. Gayathri 

మంచిగుణములు తెలుగు కవిత | T. V. L. గాయత్రి

Published in manatelugukathalu.com on 16/07/2026


వ్యక్తిత్వ వికాసానికి మంచి గుణాలు ఎంత అవసరమో, భవిష్యత్ తరాలకు ప్రకృతి సంరక్షణ కూడా అంతే అవసరం. "మంచిగుణములు" మరియు "వనములను పెంచుమా!" అనే ఈ రెండు పద్యాలు వ్యక్తిగత విలువలతో పాటు సామాజిక బాధ్యతను కూడా మనకు గుర్తు చేస్తాయి.


మంచిగుణములు.

(ఇష్టపది )

*********


మానవత్వము చూపి మనిషిగా జీవించి 

కానిపనులను వీడి కరుణతో మెల్గవలె.


చెడుతలంపులనెల్ల శీఘ్రమే విడనాడి 

కడదాక నిష్ఠతో కాలమును గడుపవలె.


సత్యమును ధర్మమును జగతికే బోధించి 

నిత్యసంతోషివై నీతితో నిల్వవలె.


మంచి చెడులే మదిని మథనంబు గావింప 

మంచినే గెలిపించి మహిని నీ వేలవలె.


పరుల శ్రేయస్సుకై పరితపించుచు నుండి 

చిరయశంబును పొంది జేతవై వెల్లవలె.


గురువుగా ఛాత్రులకు గొప్ప విద్యలు నేర్పి 

సరియైన రీతిలో జాగృతము చేయవలె.


చైతన్యమును బెంచు జ్ఞానివై నడయాడి 

జాతికెన లేనట్టి శాంతి కల్గించవలె.


హరియంచు భజియించి నర్థమును గ్రహియించి 

పరమాత్మకై దివ్య పథములో సాగవలె.//

మొక్కలను నాటితే పుడమి సంతోషించు

వనములను పెంచుమా!


(ఇష్టపది )

రచన :టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

*********



మొక్కలను నాటితే పుడమి సంతోషించు.

చక్కగా కనుపించి సంపదలు సృష్టించు.


ప్రాణవాయువు నొసగి ప్రకృతినే రక్షించు.

వానలను కురిపించు వరదలు నివారించు.


జీవతతి కెనలేని చేవనే కలిగించు.

భావితరమును నిల్పి భాగ్యములు పొలయించు.


తేజస్సుతో నిలిచి తెరవునే చూపించు.

ఓజస్సునే పెంచు నోషధుల నందించు.


వనములను పెంచుచూ వర్థిల్లు చుండుమా!

ఘనతరంబుగ నీవు కలిమినే పొందుమా!//


=======================================

సద్ధర్మ దీపికలు






Saddharma Deepikalu - Telugu Poem | T. V. L. Gayathri 

సద్ధర్మ దీపికలు తెలుగు కవిత | T. V. L. గాయత్రి

Published in manatelugukathalu.com on 29/04/2026

పుస్తకాలు మనిషి జీవితాన్ని మారుస్తాయి —అవి కేవలం అక్షరాల సమాహారం కాదు, జీవన మార్గదర్శకాలు.

“సద్ధర్మ దీపికలు” అనే ఈ కవిత జ్ఞానం, పాండిత్యం, గురుత్వం మరియు పుస్తకాల గొప్పతనాన్ని అందంగా ఆవిష్కరిస్తుంది.


సద్ధర్మ దీపికలు.

( ఇష్టపది )


పుస్తకము చేపట్టి పొందుగా చదువుకో!

చైతన్యమును పొంది శాస్త్రాలు నేర్చుకో!


పలువిధంబులుగ నీ పాండిత్య రోచిస్సు 

దేదీప్య మానమై దిశలందు వెలుగొందు.


గ్రంథపఠనంబుతో జ్ఞానివై చరియించు!

బుద్దిమంతుడవయ్యి బోధించు విషయాలు!


గురువుగా ఛాత్రులకు గొప్పవిషయాలనే 

విశదీకరింప నీ విద్వత్తు భాసించు!


కలిమి లేముల యందు కష్టసుఖముల యందు 

పూజనీయంబయిన పుస్తకము మిత్రుడగు.


పెద్దలిడు సంపదిది పుణ్యాల పెన్నిధిగ 

గ్రంథముల పూజించి కైమోడ్చి మ్రొక్కవలె.


విశ్వవ్యాప్తంబుగ విద్వత్తు కలవారు 

గౌరవంబును పొంది ఖ్యాతితో నిల్చెదరు.


విలువైన గ్రంథములు పృథ్విలో విలసిల్లు 

జ్ఞానభాండారములు సద్ధర్మ దీపికలు.//

===============================





సంఘమిత్రులం 

(వచన కవిత )

*******


పరుల కుపకారంబును చేయు మంచి బుద్ధి.

నిరతమంతః కరణములో విడదీయలేని శుద్ధి.


ఉన్నదానిలో కొంతైనా దాన ధర్మాలకు వినియోగం.

చిన్నా పెద్దలను గౌరవించుకోవటమే మంచి గుణం.


మనసులో తృప్తి  కోసం మనం చేద్దాములే సాధనం.

కనిపించిన వారితో కలుపుగోలుగా మాట్లాడు నైజం.


నవ్వుతూ సమస్యలనధిగ మించటమే  విజయం 

బువ్వనితరులతో పంచుకొని తినటమే  పరమార్థం.


కష్ట సుఖాలలో సుంతైనా స్టిత ప్రజ్ఞత మన కవసరం.

నష్టపోయిన వారిపై సానుభూతి చూపటం కనీస ధర్మం.


నిందారోపణలు మానేసి సంఘమిత్రుల మవుతాం!

హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నతమైన విద్యల నభ్యసిద్దాం!


అవసరానికి ఆదుకొనే శక్తి ఉంటే  అధికుల మవుతాం!

నవయుగానికి మనమే సారథులమై కాలాన్ని నడిపేద్దాం!


దేశమంటే నువ్వూ నేనూ కాదోయి!అచ్చంగా మనమే!

ఆశావహ ధృక్పథంతో అడుగులేస్తూ హాయిగా జీవిద్దాం!/


================================

ఉగాది పర్వము









Ugadi Parvamu - Telugu Poem | T. V. L. Gayathri 

ఉగాది పర్వము తెలుగు కవిత | T. V. L. గాయత్రి

Published in manatelugukathalu.com on 22/03/2026


ఉగాది పర్వము.

(బాలపంచపదులు )

********

వచ్చెను  పృథ్విపై ఉగాది పర్వము 

ముచ్చట తీరగ స్వాగతించెదము.

భక్తిగ పూజలు చేసి మ్రొక్కెదము.

త్యక్త మోహితులమై చరించెదము.

నూతన వర్షము శుభమిడు జయా!//


కామక్రోధములను జయించెదము.

ప్రేమతోడ నెల్లరను గాంచెదము.

సాధుసంతులను గౌరవించెదము.

 మా దేశ శాంతికై పాటు పడెదము.

నూతన వర్షము శుభమిడు జయా!//


అరిషడ్వర్గములు నిర్మూలింతుము.

ఆరు రుచుల ద్రవ్య సమ్మేళనము.

 ఆరగింపగ నారోగ్య దాయకము.

ధీరత్వముతో ముందుకే సాగెదము.

నూతన వర్షము శుభమిడు జయా!//


ఇష్టదేవతారాధనము పుణ్యము.

కష్టనష్టముల కోర్చుకొనెదము.

జాతి సమైక్యతకై తపించెదము.

నీతి మంతులమై నిలబడెదము.

నూతన వర్షము శుభమిడు జయా!/


-------------------------------------------------------------------------------------

భద్రాచలం








Bhadrachalam - Telugu Poem | భద్రాచలం తెలుగు కవిత | T. V. L. Gayathri |T. V. L. గాయత్రి

Published in manatelugukathalu.com on 14/03/2026


భద్రాచలం.

(బాలపంచపదులు )

రచన : టి. వి. యెల్. గాయత్రి.

*********

పరమపవిత్రమౌ పుణ్యక్షేత్రము.

తరింప చేయు గోదావరీ తీరము.

భద్రగిరిపై వెలసిన దైవము.

భద్రాచల మను పేరు ప్రసిద్ధము.

గాంచినచో ముక్తి తధ్యము విజయా!


భక్తరామదాసుడు నిర్మించినాడు.

శక్తి కొలదిగ కష్ట పడినాడు.

పాలకులచే శిక్షను పొందినాడు.

నీలమేఘశ్యాముడినే నమ్మినాడు.

తుదకు సత్కీర్తిని పొందె విజయా!


శ్రీరాముని సేవలో తరించినాడు.

ఆ రామునికోరి తపియించినాడు.

తోరపు బుద్ధితో చరియించినాడు.

సారసమతిగా ఖ్యాతి పొందినాడు.

కంచెర్ల గోపన్న పుణ్యుడు విజయా!//


శ్రీరామ శ్రీరామ యనుచు పిల్చిన.

ఆ రాముని మదిలో నిల్పి తల్చిన.

తారక రాముని భక్తితో కొల్చిన.

వేరొక దైవము లేడని నిల్చిన.

వైకుంఠ పథము దక్కును విజయా!//

మహి






మహిళలు.

(బాలపంచపదులు )

రచన : టి. వి. యెల్. గాయత్రి. 

&&&&&&&&&&&&&&&&


ఈ లోకమందున యవమానములు 

బోలెడంత కసితో చీత్కారములు 

మహిలో నూహించని ప్రమాదములు 

మహిళల జీవనంలో భాగములు.

అయినా భయపడరులే విజయ!//


చిరునవ్వుతో నడిచే తరుణులు.

నిరతము నిష్ఠతోడ శోధనలు.

ధైర్యంతో నిలబడు శక్తియుక్తులు.

గర్వంతో నిల్పును కీర్తి ప్రతిష్ఠలు.

దిశలను గెలుస్తారులే విజయ!//


ఆత్మవిశ్వాసమే వారి ఆయుధము.

ఆత్మనివేదనమే వారి త్యాగము.

సహనానికి వారే మారు రూపము.

గృహమున తిరుగుచుండు దైవము.

పూజింపగా పుణ్యము వచ్చు విజయ!//


బాసటగా నిల్చి బంధము నిల్పుకో!

దోషంబు లెంచక ప్రేమగా చూసుకో!

తరుణుల సామర్ధ్యమును తల్చుకో!

పురుషుడా!ఇప్పటికైనా మేలుకో!

తోడు నీడగా చరించుము విజయ!//

==================================


Manasu Maya - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published in manatelugukathalu.com on 14/03/2026

మనసు - మాయ తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి

మనసు - మా













మనసు - మాయ 

(తేటగీతి మాలిక )

---------------------------------------

మనుజు లెవ్వరెఱుంగరే మనసు మాయ 

చిత్రమైనట్టి గతిలోన చెలగుచుండు 

కల్లు త్రావిన కపివోలె గంతులేయు 

మదిని బంధింప నతికష్టమౌను కదర!


సాధనంబున మనసును చక్క చేసి 

కామ లోభాది గుణముల గట్టివేసి 

సహన వర్తనంబును నేర్పి ఘడియ ఘడియ 

కాచుకొనుచుండ మనిషికి కల్గు సుఖము.


 సాధు సంతుల త్రోవలో సాగుమనుచు 

బోధ చేయుచు మనసుకు బుద్ధిగరపి 

సంఘ సేవకై యురికొల్పి సఖ్యత మెయి 

జాతి మేలుకై నడచిన శాంతి పొలయు.//

కలము - గ్రంథములు













కలము - గ్రంథములు 

(తేటగీతి మాలిక )

---------------------------------------

కలము గొప్పది పదునైన కత్తికంటె 

కలము పట్టిన వానికి కలుగు కీర్తి 

కలము చూపును జగతికి వెలుగు దారి 

కవులు జాతిని నడపించు ఘనులు సుమ్మి.


కత్తి రక్తమున్ జిందించి క్రౌర్య గతిని 

ప్రాణముల్ తీసి పెంచును వైరమకట!

శాంతిసౌఖ్యముల్ నిల్పగ సంఘమందు 

కవులు ద్రష్టలై రచయింత్రు గ్రంథములను.


జ్ఞాన మెంతయో కలిగించు గ్రంథరాశి 

జాతి కెనలేని చైతన్య సంపదిడును 

సంస్కృతీ వైభవంబుతో భవ్యమైన

ప్రగతి బడయుచు దేశంబు పరుగుపెట్టు.


శాశ్వతంతంబుగ నిల్చెడి జ్ఞాన నిధిని 

కాచుకొనుచుండ దక్కును గౌరవమ్ము 

భావితరముకు నందింప చేవ నిపుడు 

సత్య నిష్ఠతో జనులెల్ల సాగవలయు.//

============================

మంచి దారి








Manchi Dari - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published in manatelugukathalu.com on 23/02/2026

మంచి దారి తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి


మంచిదారి.

(తేటగీతి పద్యములు )

*********


చలికి వణికిన జనులకు సాంత్వనీయ 

వచ్చె ధరణిపై శిశిరమ్ము బంధువగుచు.

పసుపు వర్ణంపు శోభతో పరిఢవిల్లు 

పత్రములతోడ వృక్షముల్ పలుకరించె./


ప్రాత వర్షము వీడ్కోలు పలుకుచుండ 

నాకులన్ రాల్చి వృక్షము లందముగను 

క్రొత్త చివురులు వేయగా సత్తువ మెయి 

తలల నూపుచు నున్నవీ ధరణి పైన./


మాఘఫాల్గుణ మను రెండు మాసములను 

పుణ్య మంచు తలంచుచు పుడమి పైన 

దేవదేవుని సేవలన్ తెల్లవార్లు 

జనులు బారులు తీరుచు సల్పుచుంద్రు./


హరిహరాదుల దేవాలయంబులందు

నిత్యమొక యుత్సవంబుల నెఱపుచుండి 

భక్త జనులెల్ల కూర్మితో వరలు చుంద్రు.

భారతీయుల యాధ్యాత్మ వైభవమిది./


మాసమేదైన కానిండు మంచిదారి 

యందు మరలుటే జనులకు నవసరమ్ము.

ఋతువు లెల్లను తిరుగునీ లోక మందు.

సత్వ గుణముతో సాగుటే జనహితంబు.//


ధర్మగతి








ధర్మగతి.

(తేటగీతి పద్యములు )

*********

ధర్మగతిలోన మనుజులు తరలి నపుడు 

దైవ మా సాధు తతిపైన దయను జూపు 

శాంతి కాముకులైన సజ్జనులు కూడి 

భవ్య మైనట్టి ప్రగతిని బడయ గలరు.


నాది నాదను స్వార్థము నష్టములను 

తెచ్చి పెట్టును ప్రజలకు వచ్చు వెతలు 

కలసి మెల్గుచు జనులెల్ల కదలి నపుడు 

సకల సంపదలొనగూడు జాతి కెపుడు.


కామలోభాది గుణములు కలత పెంచు 

మదపు భూతము త్రోయును మాయలోన 

మమత పంచుచు మనుజులు మసలినంత 

శాంతి సౌఖ్యము వర్థిల్లు సంఘమందు.//



=========================


Rama













Rama Rama - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published in manatelugukathalu.com on 12/02/2026

రామ రామ తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి

రామ రామ

(రుబాయిలు)

*******


వెరపు బాపి భక్త తతికి శాంతి యొసగు దైవ మితడు

దరికి చేర్చి కాచుకొనుచు సౌఖ్య మొసగు దైవ మితడు

మదిని నిల్పి తల్చుకొన్న  దీనాళికి తోడుగచని

పరమమిత్రుడగుచు వచ్చి శక్తి  నొసగు దైవ మితడు.//


పుట్టినాడు కోసలమున వీరుడైన రాఘవుండు.

మెట్టినాడు మిథిలాపురి శూరుడైన రాఘవుండు.

పెండ్లి యాడి సీతమ్మను కాననముకు వెడలినాడు.

కొట్టినాడు రక్కసుడిని ధీరుడైన రాఘవుండు.//


రామ రామ యంచు పిలువ రక్ష నిడెడి దాశరథిని.

కామితంబులెల్ల తీర్చి  కలిమి నిడెడి దాశరథిని.

ధర్మనియతి కల్గినట్టి నాయకుడౌ మావేల్పుని

నీమముగా కొల్చుకొందు జ్ఞాన మిడెడి దాశరథిని.//

===========================


కృ













కృష్ణ కృష్ణ

( రుబాయిలు)

*********

చెలిమి చేయు  చిన్నవాడ!చింత తీర్చ రావె కన్న!

కలువకనుల స్వామి వీవె!కోర్కె తీర్చ రావె కన్న!

నీవె దిక్కు వంచు నమ్మి యున్న మమ్ము చూడ లేవ!

పలుకు లందు తేనె చిల్కి బెంగ తీర్చ రావె కన్న!//


ఇంత గొడవ చేయుచుండి దాటిపోవు చిన్నికృష్ణ

ముంతలోని వెన్నదోచి  పారిపోవు చిన్నికృష్ణ

కల్లలాడి మోసపుచ్చిగంతులేసి కులుకువాడ!

చెంత చేరి యలుక తీర్చి నవ్వి పోవు చిన్నకృష్ణ!


నందగోపకిశోరుడా!నాటకములు చాలునయ్య!

అందమైన కొంటెగాడ!బూటకములు చాలునయ్య!

నిన్ను నమ్మి యుంటిమయ్య!తొల్గచేయి  మాయనెల్ల

అందరివాడవే కదా!నీ వేషములు చాలునయ్య!/

================================


బ్రహ్మ కమలం







Brahma Kamalam - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published in manatelugukathalu.com on 07/02/2026

బ్రహ్మ కమలం తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి


బ్రహ్మ కమలం

(వచనకవిత)

********************

పరమాత్మకు బహు ప్రీతికరం.

పరిమళభరితమైన పుష్పం.

వర్షంబున కొకమారే దర్శనం.

వర్ష ఋతువులో వికసితం.

హిమగిరిసీమకు శోభస్కరం.

కమనీయమైనదా శ్వేతవర్ణం.

బ్రహ్మ కమల మతిసుందరం.

అపురూపమౌ ఔషధీ తత్వం.

తాపసులకే కల్గు తన్మయత్వం.

గృహమున విరిసిన యదృష్టం.

రజనీ సమయపు రాజ్ఞిత్వం.

తేజోవంతమైనదా దివ్యత్వం.

తిలకించుట శుభదాయకం.

పులకితమౌను హృదయం.

భక్తజనులకిదియె భాగ్యప్రదం.

ముక్తి నొసగు పూజా కుసుమం.

పరమేశుని కర్పిస్తూ ప్రార్థిద్దాం!

నిరతమా వేల్పు సేవలో తరిద్దాం!

========================

waiting for Lod krishna








మాధవా!నీ కోసం!...

(వచనకవిత)

**************************

నీ చుట్టూ అల్లుకొనే నా ప్రేమ లతలను గమనించలేవా!

నీ చెలి హృదయంలో చెలరేగే అలజడిని కనిపెట్టలేవా!


దిలాసగా చరించే జడ పదార్థానివని అర్థమయింది.

వలపు తెలియని మందమతి వని నిరూపితమయింది.


 హృదయాన్ని పిండేసే నిర్లక్ష్యాన్ని భరించలేకపోతున్నా!

నిదుర రాక రాత్రిళ్ళు నిన్ను తిట్టుకుంటూ గడిపేస్తున్నా!


ఉత్తరమన్నా వ్రాస్తావని ఊహిస్తూ ఎదురు చూస్తున్నా!

చిత్తుగా ఓడిపోయిన భావనతో చివికి చితికి పోతున్నా!


నీకేదో మందు పెట్టి ఉంటారా మధురలోని సఖీమణులు.

లేకపోతే నా దరికి రావటానికి నీ కెందుకీ కుంటిసాకులు.


కనలేవా! కనులలో బాష్పధార కాలువలై పొంగుతోంది.

వినలేవా నా వేదన? నీ మీద విరహంతో జ్వలిస్తోంది.


మాధవా!మా పల్లెకు నువ్వెందుకొచ్చావో చెబుతావా!

బాధలలో మమ్మల్ని ముంచేసి పట్టణాన్నేలుతున్నావా?


నీ జాలమేదో తెలియదురా! నిన్నెఱుగలేని దాననురా!

నీ జవాబు కోసం వెఱ్ఱి దానిలా ఎదురు చూస్తున్నానురా!


చాలులే యనంతా! నా మది లోనుండి శాశ్వతంగా వెళ్లిపోరా!

కాలుతున్న గాయాలతో నేనిక్కడ కుమిలి క్రుంగిపోతానురా! //


====================================


తరించటానికి మార్గం














Tarinchadaniki Margam - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published in manatelugukathalu.com on 03/02/2026

తరించటానికి మార్గం తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి


తరించటానికి మార్గం

(వచన కవిత)

************


యవ్వనంలో ఏదో సాధించాలని యడుగులువేశా!

కవ్వించే పసివయసున పరుగులు పెడుతూ  నే గడిపేశా!

అసలీ జీవితమంటే తెలియక బడిలో చదివేశా!

కోరికలతో సరియైన లక్ష్యాన్ని నే వదిలేశా!


వివాహమనే చట్రంలో కూరుకొనిపోయానని ఏడ్చేశా!

అహరహమీ సంసారం కోసం ఆక్రోశిస్తూ నడిచేశా!


వ్యధాభరిత  జీవనమంటూ కుటుంబ సభ్యుల్ని సాధించేశా!

బాధాతప్త హృదయంతో నేను మంచి చెడ్డల్ని విస్మరించేశా!


జ్వలించే సమయంలో నా చేతికి దొరికిందొక పుస్తకరాజం.

విలువైన విషయాలను బోధించే యా పరమాత్మ గీతాసారం.


అంతులేని కథ యంటూ అసంతృప్తితో నున్న నన్నోదార్చింది.

చింతలన్నీ వదిలేయమని కర్తవ్యమేమిటో నాకు సూచించింది.


తృప్తిని సాధించుటే దివ్యత్వానికి మార్గమని చెప్పుకొచ్చింది.

ఆప్తజనుల కింత యానాందాన్ని కలుగ చేయమని తెలిపింది.


బాధ్యతల నుండి పారిపోవటం తప్పంటూ హెచ్చరించింది.

సాధ్యమయినంత వరకు సత్కర్మలను చేస్తూ ఉండమంది.


ఫలితానికై చూస్తుంటే పలు విధాల కష్టాలెదురవుతాయంది.

తలుచుకుంటూ ఉంటే దైవం నాకు తోడుగా కదలి వస్తాడంది.


సంతోషంతో నా హృదయం జ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది.

అంతా మరచిపోయి నేను తరించటానికి దోహదం చేస్తోంది.//


ఎప్పుడొస్తావు








ఎప్పుడొస్తావు?

రచన: టి. వి. యెల్. గాయత్రి

***********

యమునానదితో,  ఇసుక తిన్నెలతో ముచ్చటిస్తూ 

కమనీయమైన ప్రకృతి ప్రణయ ఝరిలో తడుస్తోంది.


పరుగులు పెడుతూ నీకోసం వచ్చేశానీ సందెవేళలో!

చిరునవ్వుతో నాకోసం ఎదురు చూస్తుంటావనుకున్నా!


ఏదీ? ఎక్కడా? నీ జాడ? కంగారు పుట్టింది నా మదిలోన.

ఏదో తెలియని భయం నన్నావరిస్తుంటే నిలిచిపోయా!


మెల్లగా సాగే యమునమ్మ విషయమేమిటంటూ యడిగింది.

చల్లని గాలి తెమ్మెరలు సఖుడేడంటూ నన్ను ప్రశ్నిస్తున్నాయి.


బిక్కమొగమేసుకొని బీదరాలిగా చుక్కల వంక చూస్తున్నా!

చక్కనైన నీ మోము చందమామలా ఉంటుందనుకున్నా!


తరువులన్నీ  తలల నూపుతూ స్వాగతం చెబుతున్నాయి.

విరహంతో నేనేమో నీ మీద బెంగపడుతూ కూర్చున్నా!


ప్రణయమంటే తెలిసిన ప్రకృతి స్నేహంతో నన్నోదారుస్తోంది.

కనులనీరు నింపుకొని కటిక చీకటిలో కరిగి మరిగి పోతున్నా!


ఎప్పుడొస్తావో స్వామీ! ఈ దీనురాలిపై దయచూపిస్తావా కృష్ణా!

చెప్పుమా  కేశవా!ఇప్పటికైనా చిన్నదానిపై నీకింత కినుకెందుకో

=====================================

భరతదేశపు మహిళ








Bharatha Desapu Mahilalam - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 30/01/2026

భరతదేశపు మహిళలం - తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి


భరతదేశపు మహిళలం.

(కవిత)

*********

భరతదేశపు మహిళలం పసిడి నెంతో ప్రేమిస్తుంటాం!

పరమ ప్రీతిగా మేము బంగారాన్ని కొని తెచ్చుకుంటాం!


పిల్ల పాపలకు నగలు పెట్టి పెట్టి మురిసి పోతుంటాం!

తల్లి దండ్రుల వద్ద తగని మారాములు చేస్తుంటాం!


పూర్వకాలము నుండి భోగాలననుభవించిన వాళ్ళం!

గర్వంగా మా నగలు చూపిస్తూ కనులు త్రిప్పుకోనివ్వం!


విలువ చూచి లెక్కవేస్తే  పృథ్వినే కొనగల సామర్థ్యం!

కళకళ లాడుతూ ధరణిపై తిరిగే కనకమహాలక్ష్ములం!


బంగారానికి మాకు ఏర్పడింది బహుకాలపు చుట్టరికం!

సింగారాలు చేసుకుంటూ  సమయాన్ని మరచిపోతాం!


కష్ట మెప్పుడైనా వస్తే మా కలిమిని ధారపోసి నిలబడతాం!

ఇష్టమైన వారికోసం తృణప్రాయంగా త్యాగాలు చేసేస్తాం!


కాలంతో పోటీ పడుతూ మేము కలిమిని వృద్ధి చేస్తాం!

మేలిమి బంగారంలాంటి గుణంతో 

మేదినినేలేస్తాం!//
















ఆత్మవిశ్వాసంతో..

(కవిత)


**********

కట్టు బానిస తనంతో మనసు కలవరపడుతుంటే.

చుట్టు ప్రక్కలవారు నిరంతరమవహేళన చేస్తుంటే.


మన మాన ప్రాణాలకు తగని ముప్పు వాటిల్లుతుంటే.

కనీవినీ ఎరుగని కరవు మన జీవితాల్ని కబళిస్తుంటే.


మనోనిబ్బరం కోల్పోయి ప్రతి క్షణం నరకాన్ని చూస్తుంటే.

అనుకోని యనర్థమేదో  తెలియని యాపదలో నెట్టేస్తుంటే.


  తడబడుతుంటే మన జీవన పయనమెలా సాగుతుంది?

కడకు గమ్యమేదో తెలియక  నిర్వేదమలముకుంటుంది.


విధిచేతిలో మనమంతా పగటి వేషగాళ్ళమయిపోతే.

అధికారం ఎక్కడుంది?  మన చైతన్యం నశించిపోతే.


బ్రతుకుపై నాశతో  సతతము జీవించాలనుకోవోయి!

ప్రతికూల వాతావరణంలో కూడా పయనించాలోయి!


జీవితమొక వైకుంఠపాళి యనే సత్యాన్ని తెలుసుకో!

ఆ విధి నెదిరించి ఆత్మ విశ్వాసంతో నీవు మసలుకో!


నీ చేతికి చక్కని నిచ్చెన లందలేదని యాక్రోశ పడకు!

నీ చేవకు పరీక్ష యని కఠిన శ్రమతో పరిష్కారాన్ని వెదకు!

 

 నీ విశ్వాసమునే యాలంబనగా నేర్చుకోవోయి పాఠాలు!

జీవితంలో గమ్యాన్ని చేరటానికి శక్తి యుక్తులే సోపనాలు

===============================















Maa Gopaludu - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 27/01/2026

మా గోపాలుడు - తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి


మా గోపాలుడు.

(రుబాయిలు)

************************


కన్నవారి కష్టాలను తీర్చెనమ్మ గోపాలుడు.

వెన్నదొంగ చీరలెన్నొ దోచెనమ్మ గోపాలుడు

అందమైన చిన్నవాడు వచ్చినాడు ధరణి లోన

పున్నెమిచ్చి భక్తతతిని కాచెనమ్మ గోపాలుడు.//


చదువులేని వారి కెపుడు శక్తినొసగు గోపాలుడు.

మదిని నిల్పు మౌని తతికి ముక్తి నొసగు గోపాలుడు.

నమ్మి కొల్చు యాదవులకు నాయకుండు వెనుక ముందు 

కదలు చుండి ప్రేమతోడ ధైర్యమొసగు గోపాలుడు.


వేణుగానలోలుడంట! ప్రేమచూపు గోపాలుడు.

ప్రాణమిచ్చు మిత్రుడంట!దారి చూపు గోపాలుడు.

పర్వతంబు నెత్తినాడు పల్లెజనుల బ్రోచినాడు.

దీనులార్తిబాపు నంట!మహిమ చూపు గోపాలుడు.//















చివరికో కవిత.

************************


విన్నపమనుకుంటావా! వేడికోలని మన్నిస్తావా దొరా!

చిన్నదాననంటూ నీ సేవకు రావొద్దంటావా దేవరా!


నా మదిలో నీ మురళీనాదం నయగారాలొలికించింది.

ఏమైందో తెలియదు కానీ నా కున్న జ్ఞాన మెగిరి పోయింది.


మాటాడగ రాలేదేమి? నా మనసు తెలియదా స్వామీ!

దాటవేస్తావెందుకు? దయలేని వాడవయిపోయావేమి? 


రాయబారమంపుదామంటే రాచిలుకలు రాలేదురా!

నీ యెడ బాటును సైపలేక నిరాశలో క్రుంగిపోయానురా!


జాము రాతిరైనా నిదురపోక సమయాన్ని గడుపుతున్నా!

ప్రేమనంతా రంగరించి ప్రియతమా! కవిత నీకు వ్రాస్తున్నా!


వలపుల దొరవని నీ సాన్నిథ్యంలో పరవశించి పోవాలని.

కలువ కన్నుల రాయుడా!నీ కరముల వేణువు నవ్వాలని.


నీ మృదు పద మంజీరాలలో నే చిరు మువ్వనై మ్రోగాలని.

నీ మమతాను రాగాలలో సతము నే మునక లేయాలని.


ఎన్నెన్నో కోర్కెలు కృష్ణా! ఏవేవో ఊసులు మాధవా! వ్రాస్తూ.

మున్నెన్నడు చెప్పని ముచ్చట్ల నిప్పుడే యక్షరబద్ధం చేస్తూ.


చివరికో కవితను చెలికాడా! నీకు వ్రాసి పంపుతున్నానోయి!

కవితాత్మకంగా లేకున్నా నా కవిత నొకసారి చదువుకోవోయి!//



Ajantha Ellora Guhalu - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 22/01/2026

అజంతా ఎల్లోరా గుహలు - తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి









అజంతా ఎల్లోరా గుహలు.

(వచన కవిత)

******************************

అచ్చోట నున్నవి యజంతా ఎల్లోరా గుహలు.

అచ్చెరు వొందుచు కాంచుచుందురు జనులు.


భారతీయ శిల్పకళకు వందనమిడెను ప్రపంచము.

తీరుగా మలచిన శిల్పకళా సౌందర్య మద్భుతము.


గుహలలో మలచిన గొప్ప కళా ఖండములనేకము.

బహుముఖ ప్రజ్ఞాశాలుల ప్రావీణ్యమే మనోజ్ణము.


పలు చిత్రములు సామాజిక స్థితిగతులను చూపించినవి.

విలువగు విషయములను లోకమునకు బోధించినవి.


నాటి పాలకుల వైభవమునకు చిహ్నములై మిగిలినవి.

నేటి వరకు జీవముతో కళకళ లాడుచు నిలిచినవి


వైదిక, బౌద్ధ, జైన మత సామరస్యతనిట తెల్పినవి.

పదిలముగా కాపాడమని మనలను ప్రార్థించినవి.


పూర్వ శిల్పుల నైపుణ్యమును పుడమికి చాటినవి.

గర్వముగా భరతమాత ఖ్యాతిని నిలబెట్టినవి.


 మన సీమ ప్రాభవమును మరచి పోరాదని కోరినవి.

ఘనమైన సంస్కృతిని భావి తరముల కందించునివి.









సీమ బిడ్డలము.

(ఇష్టపది)

******************************


సైకిళ్ల నెక్కుతూ సరదాగ పోతాము!

చీకటి పడేదాక చిందులేస్తుంటాము!


ఆ చెరువు గట్టులో నాటాడు తుంటాము!

తోచదను మాటల్ని తొలగించి వేస్తాము!


తోడు నీడగ మేము దోబూచు లాడుచూ 

వేడుకల మునుగుతూ వీథులను చుడతాము!


ఆకలని యనములే!అలసటే రాదులే!

కేకలేస్తే జనులు కిలకిలా నవ్వెదము!


మా కన్నవాళ్ళతో మంచిగా మెల్గెదము!

ఈ కాలముకు మేము హీరోల మవుతాము!


చదువుకొంటూ మేము చక్కగా పెరిగెదము!

ముదముగా పూనుకొని భువిని గెలిచేస్తాము!


మురిపాలు ముచ్చట్లు మూట కడుతుంటాము!

చిరునవ్వులను పంచి చెలిమి చేస్తుంటాము!


చిన్న వాళ్ళము కాము!చిరుత పులులము మేము!

మన్ను ఋణమును దీర్చు మా సీమ బిడ్డలము!//












Kanuma Panduga - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 16/01/2026

కనుమ పండుగ - తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి


కనుమ పండుగ.

ప్రక్రియ: తేటగీతి పద్యములు.

**************************


కనుమ పండుగ దినమున ఘనము గాను 

పసుల పూజించి రైతులు వరలినంత 

గాలి పటముల నెగరేసి కలసి మెలసి 

జనులు తాముత్సవంబులన్ జరుపుచుంద్రు.//


భారతీయపు పర్వముల్ వైభవముగ

సంప్రదాయపు రీతిలో సాగుచుండు.

జాతి నైక్యము చేయుచు శాంతి నిలుపు

పర్వదినములు విజ్ఞాన ఫలము లొసగు.//

**********************

Sankranthi Panduga - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 14/01/2026

సంక్రాంతి పండుగ - తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి


సంక్రాంతి పండుగ.

ప్రక్రియ: ఆటవెలది పద్యములు.

****************************

ఉత్తరాయణమున నుదయంపు వర్ణాలు

చక్కగా తరుణులు సందడించ

కుర్రకారు లెగయ కోడి పందాలతో

పర్వదినము ధరకు వచ్చె నాహ!//


హాలికుల గృహముల కందించ సంపదల్

కలికి లక్ష్మి చేరె గాదెలందు.

చిక్కుడాకులందు చేర్చి పొంగళ్ళను

జనులు పర్వదినము జరుపుచుండ్రి.//


 తాళమేయుచుండి తరలెడి హరిదాస

భజన లెల్లవినుచు భక్తి మీర

భిక్ష వేయ వచ్చి వీథిలో ముదితలు

తలను వంచి హరిని తలచిరంత.//


సంతసంబు తోడ సంక్రాంతి దినమున 

బంధు జనుల కూడి బలిమితోడ

విందు భోజనములు వేడ్కగా కుడుచుచూ

దానములను జేసి ధన్యులైరి.//


**********************

Bhogi Panduga - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 13/01/2026

భోగి పండుగ - తెలుగు కవిత

రచన: T. V. L. గాయత్రి









భోగి పండుగ

**********************************


భోగిపండుగ యన భోగముల్ కురిపించు

సకల జీవ తతికి సౌఖ్యమిడును.

రోగములను బాపి లోకుల రక్షించు

భానుమూర్తి భువికి భాతి నొసగు.//


 ముగ్గులను మహిళలు ముచ్చటగా తీర్చి

గొబ్బియలను బెట్టి కులుకుచుండ

భానుడా దరి గని బయలుపై నిలువగా

విరిసిన సుమబాల వెక్కిరించె.//


పుణ్య మనుచు జనులు భోగి మంటలు వేసి

పెద్ద గొప్ప యనెడి భేదములను

కాల్చివేసి ముదముగా చరియించగ

దేవతాళి యొసగె దీవెనలను.//

**********************



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:

నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page