top of page
Original.png

నీతి పద్యాలు

ఆవకాయ పద్యాలు, ఆవకాయ కవితలు, రుబాయిలు, అద్దంకి లక్ష్మి, తెలుగు కవితలు, తెలుగు పద్యాలు, ఆంధ్ర ఆవకాయ, తెలుగు ఆహార సంస్కృతి, ఉగాది వంటలు, ఊరగాయలు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ తెలుగు వంటలు, Mana Telugu Kathalu

గురువు, తల్లిదండ్రులు, మానవత్వం, సత్యధర్మాల విలువలను నేర్పే తెలుగు నీతి పద్యాల సంకలనం
గురువు, తల్లిదండ్రులు, మానవత్వం, సత్యధర్మాల విలువలను నేర్పే తెలుగు నీతి పద్యాల సంకలనం

Neethi Padyalu - Telugu Poem |Addanki Lakshmi

నీతి పద్యాలు - తెలుగు కవిత | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 16/07/2026


బాల్యంలో నేర్చుకున్న విలువలే జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. గురువును గౌరవించడం, అబద్ధం చెప్పకపోవడం, అందరితో ప్రేమగా మెలగడం, మానవత్వాన్ని అలవర్చుకోవడం, సత్యధర్మాలను పాటించడం వంటి గొప్ప జీవన పాఠాలను "నీతి పద్యాలు – ఆట వెలది పద్యాలు" చిన్నారులకు సులభంగా అర్థమయ్యే పద్యాల ద్వారా అందిస్తున్నాయి.


ఆట వెలది పద్యాలు


1

బడియు గుడియు నొకటె బాగుగా చదువుకో

 జ్ఞానమిచ్చు గురువు జ్ఞానధనుడు

 గురువు దైవ మనుచు గొలుచుము నిత్యము

గురువు మాట వినుము గురుతుగాను


2

కల్ల లాడబోకు గలుగును నష్టము

 నిన్ను నమ్మరెవరు నిజముగాను

 మోసబుద్ధి వలదు యాశలు ఎక్కువై 

 చిలిపితనము వలదు చేటు గలుగు


3

స్వచ్ఛ వాక్కుబలుకు సకలజనులు మెచ్చ

 పరుల హింసవలదు పాపభీతి

 తల్లిదండ్రులన్న దైవ స్వరూపులు

  ప్రేమ మీర బలుకు ప్రియము తోడ


4

మతము లేని యున్న మానవత్వ మెకటె

 బీద జనుల నెపుడు నాదు కొనుము 

సాటి మనిషి యెడల సానుభూతిని జూపు

 ప్రేమ తోడ మెలగు ప్రీతి నిచ్చు


5

ఆత్మ శుద్ధి వలన యానంద మందేను

 దయను జాలి చూపు దీనజనుల 

సత్య ధర్మములన సత్కవచము లేర

 నియమ నిష్ట తోడ నీవు బ్రతుకు


====================================

Kotha Avakaya - Telugu Poem |Addanki Lakshmi

కొత్త ఆవకాయ - తెలుగు కవిత | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 01/07/2026


తెలుగు ఇంటి వంటల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆవకాయ కేవలం ఒక ఊరగాయ మాత్రమే కాదు... అది తెలుగు వారి రుచి, సంప్రదాయం, కుటుంబ అనుబంధాలకు ప్రతీక. అద్దంకి లక్ష్మి రచించిన ఈ ఆటవెలది పద్యాలు మరియు రుబాయిలు, కొత్త ఆవకాయ తయారీ నుండి దాని అపూర్వ రుచి వరకు ప్రతి అంశాన్ని చక్కని పదప్రయోగాలతో ఆవిష్కరిస్తాయి. తెలుగు భాష మాధుర్యాన్ని, ఆంధ్ర వంటల విశిష్టతను ఆస్వాదించాలనుకునే ప్రతి పాఠకుడికి ఈ కవితా సంకలనం ఆనందాన్ని పంచుతుంది.


అంశం: కొత్త ఆవకాయ

ప్రక్రియ: ఆట వెలది పద్యాలు 


1

పుల్లకాయ కొరకు పల్లెను గాలించె

నుప్పు కార మేసి యూరబెట్టు 

నువ్వు నూనె దెచ్చి నవ్వుతూ  గలిపెగ

 నావకాయ బెట్టె నాంధ్ర వనిత


2

ఆవకాయ జూడ యానంద ముప్పొంగ

నోటిలోన జలము యూరుచుండె

పిల్ల పెద్దలంత ప్రేమగా దినుచును

కొసరి వేయ మనుచు కోరుచుండె


3

చల్ది యన్న మందు చక్కగా పెరుగుతో

తినుచు పెరిగినారు దిగులు లేక

యావకాయ తిన్న నారోగ్యమిచ్చును

తెలివి తేటలందు తేజరిల్లు


4

విందు భోజనమున విధిగాను వడ్డించు

నావు నెయ్యి కలిపె యసలు రుచియె

అతిథి సంత సించి యాశీర్వదించెగా

యూర గాయ లందు పేరు గాంచె


ప్రక్రియ: రుబాయిలు 


1

ఆవకాయ పెట్టగాను మనసంతో ఉత్సాహము

పుల్లకాయ ఏరి తేవ తను వెంతో ఉత్సాహము

ఆవపొడిని కారమునూ ఉప్పు వేసి జేర్చవలెను

నువ్వు నూనె పోసి కలుప పని యెంతో ఉత్సాహము


2

పప్పు నేతి అన్న మందు భుజియించిరి ఆవకాయ

విందు జేయ స్నేహితులకు రుచిమరిగిరి ఆవకాయ

 తెలుగువారి ఇంటిలోన ఊరకాయ ప్రసిద్ధమూ

 మరల మరల వేయమనచు తినమరిగిరి ఆవకాయ


=================================









Tyagadhanudu Nanna - Telugu Poem |Addanki Lakshmi

త్యాగధనుడు నాన్న - తెలుగు కవిత | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 26/06/2026

త్యాగధనుడు నాన్న


నన్నుచూసి చిరునగవులు చిందించిరి మానాన్నా

నా జన్మకు మూలముగా గర్వించిరి మానాన్నా 


తొలిఅడుగులు వేయించీ బ్రతుకుబాట నడిపించిరి

నీడలాగ వెన్నంటీ మురిపించిరి మా నాన్నా 


భుజాలపై నన్నుమోసి నేను జాబిల్లితొ ఆడించిరి 

అనురాగపు మమతలన్ని పండించిరి మా నాన్నా 


చిట్టిచిట్టి  కథలుచెబుతు చిత్రంగా నవ్వించిరి

జోలపాడి నిదురపుచ్చి మరపించిరి మా నాన్నా


పదములనూ పలికిస్తూ అక్షరములు నేర్పించిరి

తొలి గురువుగ పాఠములను బోధించిరి మా నాన్నా


రేయిపగలు వెన్నంటీ వెన్నలాంటి మనసుఉంది

బ్రతుకుబాట భయమన్నది తొలగించిరి మా నాన్నా


నన్నుచూసి గర్వపడుచు ఉన్నతికీ ముచ్చటపడె

కలలన్నీ పండెననుచు దీవించిరి మా నాన్నా


నాన్నే నాకు దైవము


సీస పద్యం


విద్యను నేర్పించు వినయము బోధించు

బ్రతుకు బాటను చూపు భవిత నేర్పు


అడుగులు వేయించు నాత్మ విశ్వాసంబు

కొండంత ధైర్యము  కోరి నిలచు


బ్రతుకు బాధ్యతగా బరువులు మోయుచు

నిత్య శ్రామికుడుగా నిలచె నిలను


ఇంటిలో నభయము యిలలోన దైవము

ప్రియముగా భాషించు ప్రేమ గాను


ఆట వెలది


అవని యందు నాన్న యాదర్శప్రాయుడు

వెన్న వంటి మనసు కన్న ప్రేమ

జన్నమిచ్చి నాకు జగతిని జూపించు

కంటి వెలుగు నాకు ఘనుడు నాన్న


2


మమత రాగములను మదిలోన నింపుచు

బాధలన్ని దీర్చి నాద రించు

తల్లిదండ్రు లన్న దైవ స్వరూపులు 

పితృ ఋణము దీర్చు ప్రేమ మీర


============================






Paryavaranam - Telugu Poem |Addanki Lakshmi

పర్యావరణం - తెలుగు కవిత | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 08/06/2026


అద్దంకి లక్ష్మి రచించిన గేయం "పర్యావరణం" పిల్లలకు సులభంగా అర్థమయ్యే పదాలతో పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించే చక్కని గేయం. చెట్లు నాటడం, పరిశుభ్రత పాటించడం, నీటిని కాపాడుకోవడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి విలువలను ఈ గేయం ద్వారా పిల్లలకు చేరవేస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి సందర్భాల్లో పాఠశాలల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శించడానికి ఇది ఎంతో అనువైన రచన.


రాము రాజు రారండి 

రమణి రమ్య చేరండి

పిల్లలందరూ రారండి 

ప్రకృతిని కాపాడదాం రా రండి


పంచభూతాలు మనకు దేవతలు 

ప్రకృతికి అవి సోపానాలు 

గాలి నీరు నేల జీవనాధారాలు

బ్రతుకు బాటకు సౌకర్యాలు


మొక్కలు తెచ్చి నాటుకుందాము

వాడవాడలా పెంచుకుందాము

ఎల్లవేళ నీటిని పోస్తూ బ్రతికించుకుందాము

స్వచ్ఛమైన గాలినే పీల్చుకుందాము


ప్లాస్టిక్ వినియోగము మానివేద్దాము 

చెత్తను చక్కగా ఏరివేద్దాము 

పరిసరాలు స్వచ్ఛంగా ఉంచుకుందాము 

ఆరోగ్యము మహాభాగ్యం అందాము


జీవ నదులన్నీ కాపాడుకుందాము

చెట్లు నరకుటను మానుకుందాము

భవన నిర్మాణాలు తగ్గించుకుందాము

సమతుల్యాన్ని పాటిద్దాము 


గురువుగారిని పూజిద్దాము 

నీతి నియమాలను ఆచరిద్దాము 

శ్రద్ధగా పాఠాలు చదువుకుందాము

భారత జాతీయ కీర్తి పతాకము ఎగరవేద్దాము


===============================





Karmika Dinotsavam - Telugu Poem |Addanki Lakshmi

కార్మిక దినోత్సవం - తెలుగు కవిత | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 02/05/2026


శీర్షిక కార్మిక దినోత్సవం

ఆటవెలది పద్యాలు


1

పల్లె వదిలి వారు పిల్ల పాపల తోడ

పట్న వాస మొచ్చె పనుల కొరకు

వలస కూలిలు గను బాధల బ్రతుకులు

కష్ట పడుచు దినము కాలె కడుపు


2

రోడ్డు మీద నిదుర రోజు కూలీలకు 

బ్రతుకు భారముగను పగలు రేయి

చెత్త  కుండి వద్ద చేరిరి పిల్లలు

చదువు సంధ్యలకును  శక్తి లేక 


ఆక  లాక లనుచు యలమటించేరుగా

పాలు పండ్లు లేక పస్తు లుండ

ఆర్థ నాదములకు నాదు కొననెవరు

నంటు రోగ మెచ్చె కంట నీరు 


4

రోజు కూలి చేసి రూకలు చేకొని

యున్న దానిలోనె వోర్పు తోడ

మాయ మర్మ మెరుగ మనుగడ  సాగించె

నిస్సహాయులు గద నిజము గాను


5

అలుపు సొలుపు పడక కలుపు మొక్కలు తీసి 

హలము చేత బట్టి పొలము దున్నె

ఆశలన్ని కూలె నతివృష్టి వానలు

అన్నదాత నెవరు నాదు కొనరు


6

మాతృదేశ సేవ మహిలోన ధర్మము 

 పణము గాను పెట్టె ప్రాణములను 

 వీర సైనికులన ధీరులై పోరాడు 

 భరత మాత మనది భాగ్యసీమ


7

కవిత లెన్ని రాసి కార్మికు లగచాట్లు 

చట్టములను జేసె చక్కగాను 

కార్మిక దినమొచ్చె కంట నీరు తుడువ

ధర్మ మెచట గలదు ధరణి లోన


8

కనుల ముందు గాంచు కార్మిక శ్రామిక 

వెలుగు రేఖ లేని వింత బ్రతుకు 

భవిత బాగు చేసి భద్రతను కల్పించ

దేశనాయ కులకు దీక్ష బూను.


====================================








Pusthakanm - Jnana Nidhi - Telugu Poem |Addanki Lakshmi

పుస్తకం - జ్ఞాన నిధి - తెలుగు కవిత | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 23/04/2026

1

మంచి తోడు మనకు మంచి పుస్తకములు

 జ్ఞాన మొసగు నటుల జ్ఞాన నిధులు

 వివిధ రంగ మందు విషయాలు నందించు

 లోక జ్ఞాన మంత యాకళింపు

 

2

హస్తభూషణమ్ము నాత్మీయ స్నేహమ్ము 

మార్గదర్శి మనకు మంచి జేయ 

మనిషి మనసులోన  మానవత్వము పెంచె

పుస్తకమ్ము మనకు నాస్తిగాదె


3

అండదండ తాను యాత్మబల మిచ్చును

గౌరవమ్ము దెచ్చి యాదరించు

పరిచయమును జేయు ప్రపంచ విషయాలు  

పదునుపెట్టు మెదడు బాగుగాను


4

పుస్తకమును చదువ పుణ్యచరితలన్ని

తెలుసు కొనగ వచ్చు తీరుగాను

పొత్తమొకటి నున్న విత్తమౌను మనకు

వరము యిదియె గాదె భవిత జూడ


=======================






Pasuramu - New Telugu Poem Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 24/01/2026

పాశురము - తెలుగు కవిత

రచన: అద్దంకి లక్ష్మి 

పాశురము 1


మార్గశిర మాసమిది మంగళ శుభ దినములు

వేకువ జాములోన వేడుకతో యమునకు


సర్వాభరణములతో సఖులార రారండి

గొల్లపల్లె వాడలో గోపికలంత కూడి


చెలులార మనమంత చేయుదము స్నానాలు

యశోద ముద్దు బిడ్డ యదుకుల నందనుడూ


పవిత్ర పాశురములు పరవశించి వినెదము

శ్రీమన్నారాయణా శ్రీ పాదములే శరణు

===========================














పాశురము 2

=======================

మార్గళి వ్రతము చేసిన మహావిష్ణు సన్నిధి

చిన్ని కృష్ణుడే గదా శ్రీరంగనాథుడూ


కోటి కోర్కెలు తీర్చు కోనేటి రాయుడూ

నందకిషోరుడేగా నవనీతచోరుడూ


మధుసూదనుకృపతో మనోభిష్టాలు సిద్ధించు

చక్కెర పొంగలితో చక్కగ నైవేద్యము


పవిత్ర పాశురములు పరవశించి వినెదము

శ్రీమన్నారాయణా శ్రీ పాదములే శరణు

========================














పాశురము 3

=======================

మార్గశిర వ్రతముచే మనకు సాయుజ్యము

సనాతన ధర్మములు సన్మార్గపు నెలవులు


సఖులార  రా రండి సఖ్యముగా యమునకు

గోవింద గోవింద గోపాలు కొలిచెదను


అలంకరణ మోజులో అసలే పడవద్దు

దిద్దకుము కాటుకను దినము కొకసారైన


పూలమాల లన్నియు పూజకే అంకితము

పాలు ఫలము నేయి తిన్న ఫలితము లేని వ్రతము


నియమ నిబంధన లన్ని నిష్టగా పాటించు

ముక్తి మార్గము పట్టి భక్తితో జీవించు


బ్రాహ్మణుల పూజించి ఆర్తితో కొలుచుకుని

బీదా బిక్కీ సేవలో భేదాలు చూపకు


దయ సానుభూతితో దానధర్మాలు చేసి

పరుల నొప్పించకూ పాపకర్మలు చెయకు


శ్రీకృష్ణ పరమాత్మ చింత దీర్చు

శ్రీమన్నారాయణుని శ్రీ పాదములె శరణు


***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


అద్దంకి లక్ష్మి
అద్దంకి లక్ష్మి

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

👍

Like
bottom of page