తెలంగాణ తేజోమూర్తి దాశరథి
- Gorrepati Sreenu

- 2 hours ago
- 5 min read
దాశరథి, దాశరథి కృష్ణమాచార్యులు, తెలంగాణ తేజోమూర్తి, తెలంగాణ ఉద్యమం, ఉద్యమ కవి, ప్రజాకవి, తెలుగు కవులు, తెలుగు సాహిత్యం, అగ్నిధార, సినీ గేయ రచయిత, తెలంగాణ చరిత్ర

Telangana Tejomurthi Dasarathi - Telugu Poem |Gorrepati Sreenu
తెలంగాణ తేజోమూర్తి దాశరథి - తెలుగు కవిత | గొర్రెపాటి శ్రీను
Published in manatelugukathalu.com on 23/07/2026
తెలంగాణ సాహిత్య చరిత్రలో ఉద్యమ స్ఫూర్తికి చిరునామాగా నిలిచిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అనే అమర నినాదంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్షరాల్లో ఆవిష్కరించిన ఆయన, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలాన్ని ఆయుధంగా మార్చారు. విప్లవ కవిగా, ప్రజాకవిగా, సినీ గేయ రచయితగా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన దాశరథి జీవిత విశేషాలను ఈ వ్యాసం పరిచయం చేస్తుంది.
1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించిన సుప్రసిద్ధ కవి, తెలంగాణ తేజోమూర్తి దాశరథి!
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అంటూ నినదించి తెలంగాణ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఉద్యమ కవి!
నిజాం దురాగతాలను ఎండగడుతూవిప్లవ శంఖాన్ని కవిత్వ రూపంలో ద్వనింపజేసిన ధీశాలి!
తనను, సహచర ఉద్యమకారులను బంధించిన నిజాముల నిరంకుశత్వాన్ని ఖండిస్తూ జైలు గోడల పై బొగ్గుతో తిరుగుబాటు కవిత్వాలు లిఖించిఅక్షర రూపానికి స్వరాలు చేర్చిన ప్రజాకవి!
"అగ్నిధార"ల కవితా నిప్పులు కురిపించిన పోరాట యోధుడు దాశరథి!
అవమానం, అవహేళనలు లెక్కలేనన్ని ఎదురైనా
ప్రజల శ్రేయస్సే శ్వాసగా..
ప్రజల జాగృతే ధ్యేయంగా..
తోడై నిలిచిన జనవాహిని లో
తాను ఒకడై నిలిచి
ఊరూరా స్ఫూర్తిని రగిలించే ఉపన్యాసాలతో
ఉర్రూతలూగించిన చైతన్యశీలి!
దాశరథి కలం రాసిన కవిత్వం ..
స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రజల ఘన చరిత్ర!
దాశరథి అక్షరాలు వెలిగించిన
దివ్యజ్యోతుల కాంతులు
తెలంగాణ ప్రజల హృదయాలలో
చిరస్థాయిగా ప్రకాశిస్తూనే ఉంటాయి!
సినీ వినీలాకాశంలో దృవతార గా నిలిచిన
గీత రచయిత దాశరథి !
====================================

Suswarala Koyilamma Ma Janakamma - Telugu Poem |Gorrepati Sreenu
సుస్వరాల కోయిలమ్మ మా జానకమ్మ! - తెలుగు కవిత | గొర్రెపాటి శ్రీను
Published in manatelugukathalu.com on 12/07/2026
భారతీయ సంగీత చరిత్రలో తన మధుర గానంతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి గారికి అంకితంగా రచయిత గొర్రెపాటి శ్రీను రచించిన ఈ కవిత ఒక భావపూర్వక నివాళి. ప్రేమ, భక్తి, జానపదం, శాస్త్రీయ సంగీతం... ఏ భావాన్నైనా తన గానామృతంతో చిరస్మరణీయంగా మలిచిన జానకమ్మ గాన మాధుర్యాన్ని ఈ కవిత హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది.
అమృతాన్ని గొంతులో నింపుకుని
అసంఖ్యాక గీతాలకు జీవం పోసిన
సుస్వరాల కోయిలమ్మ మా జానకమ్మ!
పదిహేడు పైగా భాషల్లో
తన గళ మాధుర్యాన్ని పంచి,
సంగీతాభిమానుల హృదయాలలో
చిరస్థాయిగా నిలిచిన గాయనీమణి మా జానకమ్మ!
"పగలే వెన్నెల... జగమే ఊయల..." అంటూ
మనసులను మైమరపింపజేసినా
"నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో..
తిరుమల శిఖరాలు దిగివచ్చునో.." అంటూ
భక్తిరసాన్ని హృదయాల్లో నింపినా
"ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది.." అంటూ
అనుబంధాల మాధుర్యాన్ని గుర్తుచేసినా
ప్రేమగీతమైనా
విషాదగీతమైనా
జానపదమైనా
భక్తిగానమైనా
శాస్త్రీయ మాధుర్యమైనా..
ఏ భావాన్నైనా తన గాన గమకాల సోయగం తో
శ్రోతల హృదయాలను అలరించిన సంగీత సరస్వతి మా జానకమ్మ!
ఉషాకిరణ్ వారి "మౌనపోరాటం" చిత్రానికి
సంగీత దర్శకత్వం వహించి
తన బహుముఖ ప్రజ్ఞను చాటిన అపూర్వ సంగీత విదూషి మా జానకమ్మ!
చిలిపితనం..కమ్మదనం..ఆత్మీయత..ఆనందం..
భక్తి.. ప్రేమ.. అనురాగం.. విరహం..
ఎన్నో భావాలను సాహిత్యానికి తగిన భావవ్యక్తీకరణతో తనదైన శైలిలో పలికించి,
ప్రతి పాటకు ప్రాణం పోసిన సుస్వరాల కోయిలమ్మ మా జానకమ్మ!
ఓటమి వేళల్లో స్ఫూర్తినిచ్చే చైతన్యం ఆమె స్వరం..
జ్ఞాపకాల చిరునామాగా నిలిచే మాధుర్యం ఆమె గానం..
అలసిన హృదయాలకు ఆత్మీయతను పంచే అమృతధార ఆమె గళం...
భారతీయులంతా అభిమానించే ..సుస్వరాల కోయిలమ్మ మా జానకమ్మ !
========================================

Bharathadesa Arthika Samskaranala Pithamahudu Mana P. V. - Telugu Poem |Gorrepati Sreenu
భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు మన పీ.వి! - తెలుగు కవిత | గొర్రెపాటి శ్రీను
Published in manatelugukathalu.com on 06/07/2026
భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశను చూపిన మహానేత, బహుభాషా కోవిదుడు, సాహిత్యాభిమాని, మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు గారి సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. రాజకీయ దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం, ఆర్థిక సంస్కరణలు, సాహిత్య పట్ల ఆయనకున్న అభిరుచిని స్మరించుకుంటూ రచించిన ఈ కవిత ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపుతుంది.
ఆర్థిక సంక్షోభంతో దేశం అల్లకల్లోల స్థితిలో ఉన్నప్పుడు
భారతదేశానికి తొమ్మిదో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి
ప్రగతిపథాన దేశాన్ని నడిపిన నాయకుడు,మహానేత మన పీ.వి!
1921 జూన్ 28 లక్నేపల్లి, నర్సంపేట లో జన్మించి
తెలంగాణ మాగాణంలో మెరిన వజ్రం మన పీ.వి!
పరిపాలనా సామర్థ్యంతో భారతదేశ ఆర్థికవ్యవస్థను
నవ్యపథాన నడుపుతూ
ఆర్థికసంస్కరణలకు ఆధ్యుడిగా
నిలిచిన మేధావి మన పీ.వి!
తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో
"గొల్ల రామవ్వ" వంటి కథలు వ్రాసిన పండితుడు !
పలుభాషలపై ప్రావీణ్యం కలిగి
విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన "వేయిపడగలు"పుస్తకాన్ని
"సహస్రఫణ్" పేరుతో హిందీ అనువాదం చేసి
కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న బహుభాషాకోవిదుడు
సాహిత్యసృజనకారుడు మన పీ.వి!
లోక్‌సభకు..
రెండుసార్లు హనుమకొండ స్థానం నుండి
మరో రెండుసార్లు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి
ఐదోసారి నంద్యాల నియోజకవర్గం నుండి
ఎం.పి గా ఎన్నికై దేశసేవలో నిమగ్నమైన సిసలైల భరతమాత ముద్దుబిడ్డ మన పీ.వి.!
దృఢ సంకల్పం, సాహసోపేత ఆర్థిక సంస్కరణలతో..
దేశ అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు,దార్శనికుడు
"భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు" గా కీర్తి నందుకుంటున్న
మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి (జూన్ 28) సందర్భంగా
వారికి ఘన నివాళులు.!
- గొర్రెపాటి శ్రీను ,హైదరాబాద్ .
======================================

National Doctor's Day Wishes - Telugu Poem |Gorrepati Sreenu
జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు! - తెలుగు కవిత | గొర్రెపాటి శ్రీను
Published in manatelugukathalu.com on 01/07/2026
"వైద్యో నారాయణో హరిః" అనే భారతీయ సంస్కృతి సందేశాన్ని ప్రతిబింబిస్తూ, సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమ జీవితాలను అంకితం చేసిన వైద్యుల సేవలను కొనియాడే హృద్యమైన కవిత ఇది. గొర్రెపాటి శ్రీను రచించిన ఈ కవితలో వైద్యుల త్యాగం, మానవత్వం, కరోనా కాలంలో వారు అందించిన అపూర్వ సేవలు, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్రను హృదయానికి హత్తుకునేలా వివరించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ చదవదగిన కృతజ్ఞతా నివాళి.
"వైద్యో నారాయణో హరిః" అంటూ
వైద్యులను గౌరవించే
గొప్ప సంస్కృతి సనాతన భారతావనిది!
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటూ,
సమాజానికి తమ అమూల్యమైన సేవలను అందిస్తున్న
వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము!
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో
ప్రజలు అసంఖ్యాకంగా ప్రాణాలు పోగొట్టుకుంటుంటే..
తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి,
రోగుల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించిన
వైద్యుల సేవలు చిరస్మరణీయమైనవి!
వారి త్యాగం, అంకితభావం, మానవత్వం
సమాజానికి ఆదర్శప్రాయమైనవి!
రోగి బాధను అర్థం చేసుకుని,
వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స సకాలంలో అందించి
మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే మహోన్నత వ్యక్తిత్వం వైద్యులది !
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే,
వైద్యులు పునర్జన్మను ప్రసాదించే దైవ స్వరూపులు !
చికిత్స చేయడమే కాకుండా,
వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు సూచిస్తూ
ప్రజలలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే బాధ్యతను కూడా
వైద్యులు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు !
వైద్యుల సేవలు నిజంగా అమూల్యమైనవి, అసామాన్యమైనవి.
సమాజం వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవంతో స్మరించుకుంటుంది !
ఆరోగ్య సమాజాన్ని కాంక్షించే వారి ఔన్నత్యం సదా ప్రశంసనీయం!
=====================================

Jeevithamante - Telugu Poem |Gorrepati Sreenu
జీవితమంటే.. - తెలుగు కవిత | గొర్రెపాటి శ్రీను
Published in manatelugukathalu.com on 08/03/2026
నడిచే దారిలో ముళ్లుంటాయి
దారిలో పూలూ ఉంటాయి!
నడిచే దారంతా అద్భుతంగా ఉండదు
అలాగని అస్తవ్యస్తంగా కూడా ఉండదు !
అయినా సాగుతూనే ఉంటుంది కదా జీవితపయనం!
అవమానాలు,అవహేళనలు..
పొగడ్తల పన్నీటి జల్లులు,ప్రశంసల పరవశాల కలయికే జీవితం !
పడడం లేవడం సహజం!
పడ్డామని కృంగిపోకుండా ఉండాలి
లేవగానే విర్రవీగకుండా ఉండాలి !
జీవితమంటే ఓటమి,గెలుపుల సంగమం!
ఫలితమేదైనా ఆగని నీ పయనం,అలుపెరగని నీ ప్రయత్నమే విజయరహస్యం !
అందుకునే గుర్తింపులే గెలుపుల ఆనవాళ్ళ జయపతాకాలు !
రచన : గొర్రెపాటి శ్రీను ,హైదరాబాద్
==============================

Neti Mahila - New Telugu Poem Written By - Gorrepati Sreenu
Published in manatelugukathalu.com on 08/03/2026
నేటి మహిళ - తెలుగు కవిత
రచన: గొర్రెపాటి శ్రీను
ఆత్మీయతను పంచే అమ్మగా
అనురాగానికి మారుపేరైన సహోదరిగా
పుట్టింటి పేరుప్రఖ్యాతులు ఇనుమడింప జేసే తనయగా
అత్తింటి ఔన్నత్యాన్ని రెట్టింపు చేసే కోడలిగా
బాధ్యతలేన్నో మోస్తున్నా
విరామమెరుగక కుటుంబ అభ్యున్నతికై కృషిచేసే ఇల్లాలిగా
మానవత్వానికి ప్రతిరూపమైన స్నేహితురాలిగా
నవ్య తరాలకు అమ్మమ్మగా,నాయనమ్మగా
ఆఫీస్ లో ఉద్యోగినిగా
సమోన్నత స్థానాన్ని అందుకుని
శ్రమకి సంకేతంగా నిలుస్తూ
తాను పోషిస్తున్న పాత్రేదైనా
తన వ్యక్తిత్వాన్ని అత్యుత్తమంగా తీర్దిదిద్దుకుంటూ
సమాజంలో గుర్తింపు,గౌరవాన్ని పొందుతున్నారు నేటి మహిళలు !
తాము నడయాడే చోటేదైనా
చిరునవ్వుల రాగాలు పూయిస్తూ
సంతోషానికి చిరునామా గా ఉంటూ
అసంఖ్యాక విజయాలు అలవోకగా సాధిస్తున్నారు నేటి మహిళలు !
విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా,
విద్యాధికారుణులుగా సమసమాజ నిర్మాతలుగా ప్రేరణ తామవుతున్నారు !
కలెక్టర్స్ గా,మంత్రులుగా,ముఖ్యమంత్రులుగా,
స్పీకర్స్ గా,దేశాధినేతలు గా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు !
కల్పనా చావ్లా,సునీతా విలియమ్స్ అంతరిక్షం లో సైతం అడుగుపెట్టారు !
నేటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు !
"జయహో మహిళ" అంటూ మనమంతా కీర్తించే లా
చేపట్టిన పనిలో నైపుణ్యం గా ఉంటూ విశేషంగా నిలుస్తున్నారు !
===========================================

Neti Pellilla theeruthennulu - New Telugu Poem Written By - Gorrepati Sreenu
Published in manatelugukathalu.com on 26/02/2026
నేటి పెళ్లిళ్ల తీరుతెన్నులు - తెలుగు కవిత
రచన: గొర్రెపాటి శ్రీను
హంగు ఆర్భాటాలే మిన్నగా జరుగుతున్నాయి నేటి వివాహాలు!
పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ ల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు!
ఊరూ వాడా అనే బేధం లేకుండా తెలిసిన వాళ్ళనంతా పిలుచుకుని
తమ దర్పాన్ని అంతు లేకుండా ప్రదర్శిస్తున్నారు!
ఇక భోజనాలలో దేశవిదేశాల ఫుడ్స్ ని సైతం పరిచయం చేస్తూ 'ఔరా' అనిపిస్తున్నారు!
కళ్యాణ మండపాన్ని సినిమా సెట్టింగ్స్ ని తలదన్నేలా తీర్చిదిద్దుతూ అథిదులని ఆకట్టుకుంటున్నారు!
కోట్లలో ఖర్చు చేస్తూ
కొన్ని సందర్భాలలో అప్పుల ఊబిలో కూరుకుపోతూ అవస్థల పాలవుతూ
అయినా నిర్భయంగా కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు!
వేదమంత్రాలు వినిపించని డిజే హోరులో ఘనమైన పెళ్లిళ్లు చేస్తున్నారు !
చివరాఖరికి
దేశవిదేశాలలో ఉన్నతోద్యోగాలు చేస్తున్న
పెండ్లి కొడుకు,పెండ్లి కూతురు
ఒకరి మనసు లో ఒకరికి చోటుందో లేదో తెలుసుకునే
తీరికే లేనంత బిజీ షెడ్యూల్స్ లో పెళ్లిళ్లు జరిగేస్తున్నాయి!
***
గొర్రెపాటి శ్రీను గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .
తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు
ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.
చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)
వెలువరించిన పుస్తకాలు:
"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),
"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),
"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).
ప్రస్తుత నివాసం: హైదరాబాద్.




Comments