top of page
Original.png

జీవితానికి వెలుగునిచ్చే 10 తెలుగు కవితలు


జీవిత విలువలు స్నేహం విద్య భక్తి మానవత్వాన్ని ప్రతిబింబించే 10 తెలుగు కవితల సమాహారం

Bala Geyalu - Amma Cheppina Suchanalu| Gadwala Somanna 

జీవితానికి వెలుగునిచ్చే 10 తెలుగు కవితలు | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 03/09/2026


 అవ్వ చెప్పిన అక్షర సత్యాలు 

------------------------------

అతి కోపం ప్రమాదము 

హరించును ఆనందము 

నియంత్రణ లేకపోతే 

పాడుచేయు ఆరోగ్యము 


అందరితో శత్రుత్వము 

కాదు కాదు క్షేమకరము 

దెబ్బదీయు బంధాలు 

బాధ పడును కుటుంబాలు 


ఉంటేనే సర్దుబాటు 

అన్నిటికి అనుకూలము 

లేకపోతే మాత్రము 

అభివృద్ధికి ఆటంకము 


మనసే కేంద్ర బిందువు 

అదుపు చేస్తే లాభము 

క్షేమం కోరితే బంధువు 

లేకుంటేనే నష్టము 


దైవ ప్రేమ ఉన్నతం 

-----------------------------

ఎట్టి పరిస్థితుల్లో 

దైవ కృప వీడిపోదు 

నమ్ముకున్న భక్తుల్లో 

ఆనందం తరిగిపోదు 


దైవ కార్యం శాశ్వతము 

అస్థిరంగా ఉండదు 

వారి ప్రేమ అనంతము 

మంచులా కరిగిపోదు 


దైవాన్ని విశ్వసిస్తే 

అనుదినము వెంబడిస్తే 

అమితంగా దీవెనలు 

వర్ణశోభితం బ్రతుకులు 


నష్టపోయిన దొరుకును 

తొలి కన్న రెట్టింపగును 

ఇది భక్త జనుల సాక్ష్యము 

అక్షరాల వాస్తవము 


చిరునవ్వుల పువ్వులు 

-----------------------------

చిరునవ్వులు ముఖంలో

సిరిమల్లెలు వనంలో 

ఉంటేనే మనోహరము

ఖరీదైన మణిహారము 


నిండు చంద్రబింబంలా 

దండలోని దారంలా 

దరహాసం లాభకరము 

భగవంతుని మహా వరము 


నవ్వులు లేని వదనాలు 

శిధిలమైన భవనాలు 

అమావాస్య రాత్రులను 

నిజముగా తలపించును 


నవ్వుకొనుము హాయిగా 

ఆరోగ్యం పెరగగా 

ఖర్చు మాత్రం లేనిది 

సృష్టిలోనే ఘనమైనది 


అన్నయ్య అమృత వాక్కులు 

-----------------------------

పొలంలోని పైరులా 

ప్రవహించే యేరులా 

పదిమందికి సాయంగా 

ఉండాలోయ్! స్ఫూర్తిగా 


చెరువులోని నీరులా 

తరువుకున్న వేరులా 

ఉండాలోయ్! స్ఫూర్తిగా

లోకమే మెచ్చేలా 


ముస్తాబైన తేరులా 

మధురమైన తేనెలా 

అందరికీ ఉపయోగము 

కావాలోయ్! జీవితము 


వెన్నెల్లో వెలుగులా 

అందమైన తెలుగులా 

దేశ కీర్తి తేవాలి 

గొప్పగా బ్రతకాలి 



మంచిదేగా!! 

-----------------------------

జ్ఞానాన్ని దీపంగా 

బలమైన ఆయుధంగా 

మనమే మార్చుకోవాలి 

మెడలోని హారంగా 


గురువులను గౌరవంగా 

కన్నోళ్లను ఉన్నతంగా 

భువిలో చూసుకోవాలి 

ఇల ఆరాధించాలి 


వ్యతిరేక యోచనలను 

తుచ్ఛమైన కార్యాలను 

ఆరంభాన ఆపాలి 

శుద్ధి చేసుకోవాలి 


చదువుతో సంస్కారము 

నేర్చుకోవాలి మంచిగా 

పదిమందికి సహకారము 

అందించుట మేలేగా 


అక్షరాలు స్నేహితులు 

-----------------------------

దివ్వెలాంటి అక్షరాలు 

వెలిగించును జీవితాలు 

తొలగించును అజ్ఞానము 

అందించును విజ్ఞానము 


అమూల్యమైన రతనాలు 

అక్షరాలు విత్తనాలు 

పండించును బ్రతుకు పంట 

సుఖసంతోషాలు ఇంట 


అక్షరాలు పసిడి మూట 

నేర్చుకున్న అవే కోట 

ఆహ్లాదమిచ్చే తోట 

నిత్య జీవజలపు ఊట 


మార్చునోయి తలరాతలు 

ఉజ్వల భవితకు బాటలు 

ఎదిగేందుకు నిచ్చెనలు 

అండ నిలిచే స్నేహితులు 


అనుభవ పాఠాలు 

-------------------------

అనుభవంతో పాఠము 

చదువుతో సంస్కారము 

నేర్చుకున్న వారు ఎవరు!

జీవితాన ఓడిపోరు 


దేవునితో సహవాసము 

మంచితో సంబంధము 

కల్గియున్న వారు ఎవరు!

నాశనమే కారు కారు 


పెద్దలపై గౌరవము 

ఎనలేని భక్తిభావము

కల్గియున్న వారు ఎవరు!

అజ్ఞానానికి గురికారు 


తల్లిదండ్రుల త్యాగము 

వారిలోని ప్రేమ గుణము 

గుర్తించిన వారు ఎవరు!

వారి ఋణం ఉంచుకోరు 


సహజ గుణం పోవుట కష్టం 

-----------------------------

విషాన్ని వడపోసినా 

ఎంత శుద్ధి చేసినా 

అమృతంగా మారదు 

సహజ గుణం వీడదు 


పాలు పోసి పెంచినా 

మేడలోన పెట్టినా 

కాటేయక మానదు 

సహజ గుణం వీడదు


క్షమాగుణం చూపినా 

ప్రేమ వాన కురిసినా 

దుష్టులు మారిపోరు 

వారి గుణం వదలరు 


అట్టి వారి స్నేహము 

తెచ్చిపెట్టు నష్టము 

ఉండాలోయ్! దూరము 

జాగ్రత్త అవసరము 


ఇదే కదా ఉన్నతము 

-----------------------------

యథార్థమైన ప్రవర్తన 

ఖచ్చితమైన పరివర్తన 

భగవంతునికి బహు ఇష్టము 

దొరుకుతుంది దైవ దీవెన 

 

అభాగ్యుల బ్రతుకుల్లో 

ఆనందం నింపడము 

అదే కదా గొప్పతనము 

ఆదర్శం చూపడము 


పదిమంది హృదయాల్లో 

స్థానం సంపాదించడము

మనసును నియంత్రించడము 

అదేకదా విజయోత్సవము 


ఆపదలో సాయపడడము 

మానవత్వం చాటడము 

ఇదే కదా మహోన్నతము 

పెద్దలను గౌరవించడము 


నిజమైన స్నేహం 

-----------------------------

నిజమైన స్నేహానికి 

ఉండవోయ్! భేదాలు

మరువదు ఏనాటికి 

చేసినట్టి మేలులు 


స్వచ్ఛమైన స్నేహము 

మేలిమి బంగారము 

ఏ కల్తీ ఉండదు 

ఏ ఘోరం చేయదు 


పసివారి నవ్వులా 

సిరిమల్లె పువ్వులా 

చిన్ననాటి స్నేహము 

కాంతులీను దీపము 


సాటిలేనిది స్నేహము 

అసమానం త్యాగము 

దేవుని బహుమానము 

ప్రేమకు ప్రతిరూపము 




Gadwala Somanna

-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page