top of page
Original.png

ఉండాలోయ్! మనమంతా

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

Undaloy Manamantha - New Telugu Poems Written By Gadwala Somanna Published in manatelugukathalu.com on 02/03/2026

ఉండాలోయ్! మనమంతా - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఉండాలోయ్! మనమంతా

----------------------------

మల్లెతీగకు పందిరిలా

పూలదండకు దారంలా

ఉండాలోయ్! పేదోళ్లకు

ఆశ్రయాన్ని కోరినోళ్లకు


వెలుగు పంచే దీపంలా

ప్రాణం నిలిపే తరువులా

ఉండాలోయ్! లోకంలో

తొలి స్థానము అన్నిటిలో


కడువు నింపే రైతులా

సరిహద్దు సైనికునిలా

ఉండాలోయ్! తెగువతో

మదినిండా ధైర్యంతో


ఉదయించే సూర్యునిలా

సుతిమెత్తని వెన్నెల్లా

ఉండాలోయ్! మాటలా

గుబాళించే తోటలా








బామ్మ మాటల ముత్యాలు

------------------------------

అనుభవాల లాంతారులో

జ్ఞాపకాల పల్లకిలో

నెమరువేసుకుందామా!!

బ్రతుకులు దిద్దుకుందామా!


అనురాగాల వెలుతురులో

తల్లిదండ్రుల జాడలో

అన్నీ సాధిద్దామా!

మహనీయుల మైత్రిలో


విజ్ఞానపు వీధుల్లో

వినోదాల బాటల్లో

గొప్పగా ఎదుగుదామా!

ఆదర్శం చాటుదామా!


కష్టించే తత్వంతో

ప్రేమించే మనసుతో

సహకారమందిద్దామా!

మంచి పనులే చేద్దామా!









ఉపయోగమవ్వాలి!

---------------------------

నింగిలో స్వేచ్ఛగా

బ్రతుకంతా హాయిగా

విహరించే పక్షులై

ఉండాలోయ్! తృప్తిగా


ఇంటిలోని పాపలా

మింటిలోని చుక్కలా

ఎదగాలోయ్! గొప్పగా

యేరు యొద్ద మొక్కలా


పొలంలోని పంటలా

చెరువులోని కలువలా

ఉపయోగమవ్వాలి!

చెలమలోని నీరులా


కలంలోని సిరాలా

వనంలోని పూవులా

ఉపయోగమవ్వాలి!

చెట్టు మీద ఫలంలా








పుస్తకాలు మంచి మిత్రులు

----------------------------

పుస్తకాల మెట్లపై

జీవితంలో ఎదగాలి

విజ్ఞానపు నేత్రంతో

ప్రపంచాన్ని చూడాలి


పుస్తకమే కావాలి

మళ్ళీ హస్త భూషణము

చరవాణికి కాసేవు

విరామమే ఇవ్వాలి


పుస్తకాల తోటలో

అక్షరాల కోటలో

అనుదినము గడపాలి

ఆనందమే పొండాలి


పుస్తకాలే స్నేహితులు

బ్రతుకున శ్రేయోభిలాషులు

చూడాలోయ్! ప్రేమగా

చదవాలోయ్! ఇష్టంగా









విజ్ఞానము విలువైనది

------------------------------

విజ్ఞానము పెంచుకుంటే

అరుదెంచును వసంతాలు

అజ్ఞానము దులుపుకుంటే

బాగుపడును జీవితాలు


విజ్ఞానపు వెలుగులో

వినోదాల ఓడలో

పయనిస్తే బ్రతుకులగును

వికసించిన కుసుమాలు


విలువైనది విజ్ఞానము

ఎక్కించును అందలము

ఘన కార్యాలతో

తెచ్చిపెట్టు గౌరవము


జ్ఞానానికి సాటిలేదు

సంపాదించాలి ఇహమున

లేకుంటే విలువలేదు

గుర్తించుకో మనసున

==========================














Akshara Animuthyalu - New Telugu Poems Written By Gadwala Somanna Published in manatelugukathalu.com on 24/02/2026

అక్షర ఆణిముత్యాలు - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అక్షర ఆణిముత్యాలు

------------------------------

పుస్తకాల కాంతిలో

పెంచుకో విజ్ఞానము

అద్భుతమైన మెదడులో

నింపుకో కడు వికాసము


అక్షరాల నింగిలో

మెరియాలి తారకలా

సంతస సాగరంలో

ఎగరాలి కెరటంలా


అనురాగాల వాడలో

అనుబంధాల కోటలో

కలసిమెలసి ఉందామా!

అన్యోన్యత తోటలో


పాటలోని పల్లవిలా

మాటలోని మధురంలా

మనుషులంతా ఒక్కటై

మూటలోని పసిడిలా









వృక్ష పరిరక్షణ మన బాధ్యత

--------------------------------

చెట్టు విలువ తెలుసుకో

పెంచడమే నేర్చుకో

భవిష్యత్తు కాలంలో

మేలులెన్నో బ్రతుకులో


ఆయుష్షుకు ఆధారము

అనారోగ్యమే దూరము

కాపాడితే వృక్షాలు

బాగుపడును జీవితాలు


శ్రేయోభిలాషులు చెట్లు

దేశాభివృద్ధికి మెట్లు

ప్రతి ఒక్కరూ పెంచితే

తోప్పునోయ్! పెను అగచాట్లు


వృక్షాల సంరక్షణ

చేయాలోయ్! చేయాలోయ్!

లేదంటే అవుతుందోయ్!

భవిత అంధకారము









అక్షర సుభాషితాలు

----------------------------

చెడు నడవడి గలవాడు

అపకారం చేయువాడు

దూరముంటే బహు మేలు

లేదంటే కడు కీడు


ప్రేమను వృద్ధి చేస్తే

ముందడుగు వేసేస్తే

ప్రపంచమే ప్రేమయము

తలపించును ఇల స్వర్గము


బుద్ధిహీనుని మాటలు

ఉపయోగకరం కాదు

నీటి మీద రాతలే

ఉండవసలు మేలులే


జాగ్రత్త మూర్ఖులతో

వితండ వాదులతో

సహవాసమే కోరితే

పెను ప్రమాదం వారితో









చిట్టి చిట్టి పిల్లలు

----------------------------

పిల్లలకు సంస్కారము

పెద్దల యెడల గౌరవము

నేర్పించాలి బ్రతుకులో

నాటాలోయ్! మనసులో


విలువైన క్రమశిక్షణ

బాలల్లో రావాలి

అనుదినము సంరక్షణ

తప్పకుండా చేయాలి


నింపాలోయ్! వారిలో

దేశభక్తి అమితంగా

తరమాలోయ్! నెలకున్న

పిరికితనం దూరంగా


చిన్నారులు ముత్యాలు

ఖరీదైన వజ్రాలు

వారుంటే ఇల స్వర్గము

అంతులేని ఆనందము











చిరునవ్వులు విరిసిన సిరిపువ్వులు

-------------------------------------

వదనంలో చిరునవ్వులు

విరబూసిన సిరిపువ్వులు

దేదీప్యామానంగా

వెలుగులీనే దివ్వెలు


ముఖంలోన దరహాసము

తలపించును మధుమాసము

ఇల పున్నమి రాత్రుల్లో

నిండు చంద్రుని ప్రతిబింబము

పలకరించు చిరునవ్వుతో

కనిపించు ప్రేమతో

ప్రతిరోజూ పర్వదినము

బలపడును అనుబంధము


చిరునవ్వు ఖర్చు లేనిది

మనిషిలోనే గొప్పది

పంచుతుంది ఆరోగ్యము

పెంచుతుంది ఆనందము


అతిచిన్నది జీవితము

జీవించుము నవ్వుతూ

పదిమందికి పంచుము

మిగులుతుంది జ్ఞాపకము


మందహాసమే అందము

లేక మొగం వికారము

కురిపించుము నవ్వులే

ఆయుస్సుకు ఆధారము

==================================






















Divyaushadam Chirunavvu - New Telugu Poems Written By Gadwala Somanna Published in manatelugukathalu.com on 22/02/2026

దివ్యౌషధం చిరునవ్వు - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న

దివ్యౌషధం చిరునవ్వు

---------------------------------------------------

చిరునవ్వుల కోటలోన

ఆ చక్కని తోటలోన

జీవించు నిరంతరము

పొందుకొనుము ఆరోగ్యము


పదిమందిని నవ్విస్తూ

మందహాసము గావిస్తూ

జీవితాన్ని ఆస్వాదించు

ఖేదాన్ని తరిమేస్తూ


నవ్వడం బహుమానము

నవ్వించడం ఘన కార్యము

తెలుసుకో ఈ సత్యము

పాటించు అనునిత్యము


నవ్వులేని వదనాలు

ప్రేమలేని హృదయాలు

కొరగానివి చూడగా

పిల్లలు లేని సదనాలు












యధార్ధము

-----------------------------------------

ఎంత స్వాహా చేసినా

సమస్తమూ పొందినా

మనిషి ఆశకు మితిలేదు

జయించడం చేత కాదు


ఎంత సంపాదించినా

తృప్తి గనుక కొరబడితే

జీవితమే అయోమయము

ప్రణాళిక లేకుంటే


విలువైనది జీవితమే

చేసుకోకు ఇల వ్యర్థము

శాశ్వతం స్నేహమే

నిలుపుకో నిరంతరము


జీవితానికి అర్ధము

కాసింత పరమార్థము

ఉండాలి నిశ్చయంగా

బ్రతకాలి నిర్భయంగా










ఉంటేనే మేలులు

-------------------------

చేతిలోని డబ్బులు

నోటిలోని మాటలు

వాడితే పొదుపుగా

బాగుండును బ్రతుకులు


మనసులోని మమతలు

పవిత్రమైన తలపులు

ఉంటేనే ఘనతలు

బ్రతుకులోన విలువలు


ఇంటిలోన పిల్లలు

తోటలోన మల్లెలు

ఉంటేనే సొగసులు

మొగంలోన నగవులు


కొలనులోన కలువలు

నింగిలోన చుక్కలు

ఉపయోగం చాలా

పుడమిలోన మొక్కలు











జాగ్రత్త!అవసరం

------------------------------------------

వదులుకోకు ఎప్పుడు

వచ్చిన అవకాశము

చేజారితే మాత్రము

బ్రతుకులోన నష్టము


నమ్ముకో కష్టాన్ని

వంచాలి కాయాన్ని

ఖచ్చితమే ఫలితము

అక్షరాల సత్యము


తరిమికొట్టు గర్వాన్ని

వెంబడించు వినయాన్ని

బ్రతుకిక సుఖమయము

గైకుంటే విజయాన్ని


కఠినమైన వాక్కులు

బాధపెట్టు మనసులు

జాగ్రత్త నోటితో

తుచ్ఛమైన వాటితో













తెలుగు భాష-గుండెల్లో శ్వాస

-----------------------------------------

తెలుగు భాష గొప్పదనము

తల్లి భాష చక్కదనము

కలమెత్తి, గళమెత్తి ఇల

చాటుటే శోభస్కరము


తెలుగు భాష తీయదనము

పదాల్లో నిండుదనము

కల్గియున్న భాషరా

తెలుగు గుండె శ్వాసరా


పువ్వుల్లా మెత్తదనము

నవ్వుల్లా చురుకుదనము

పరికింప పద బంధము

అత్యంత మనోహరము


భాషల్లో బహు ఘనము

ప్రపంచానికి విదితము

తెలుగు కడు తేజోమయము

పుట్టించును ఉత్తేజము

================================










Kutumbame Pramukhyam - New Telugu Poems Written By Gadwala Somanna Published in manatelugukathalu.com on 18/02/2026

కుటుంబమే ప్రాముఖ్యం - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కుటుంబమే ప్రాముఖ్యం

---------------------------------------------------

కలసుంటే మనోహరము

ఒలుకుతుంది అనురాగము

అదే కదా కుటుంబము

ఐక్యతకది ప్రతిభింబము


మనస్పర్థలు నశిస్తే

ప్రేమపూలు వికసిస్తే

ఉదయించును సంబరము

తాకుతుంది అంబరము


విలువైనది కుటుంబము

అత్యంత ప్రాముఖ్యము

ఇవ్వాలి ప్రాధాన్యత

నెరవేర్చాలి బాధ్యత


బాగుంటే కుటుంబాలు

బాగుపడును జీవితాలు

అగును భూతల స్వర్గము

అక్షరాలది సత్యము















చెడు వ్యసనాలు!!

------------------------------------------

నూరేళ్ళ జీవితాల్ని

కబళించు చెడు వ్యసనాలు

కూల్చునోయ్! కుటుంబాల్ని

చేయునోయ్! పలు ముక్కలు


కడు జాగ్రత్త! వాటితో

ఉండాలోయ్! నేర్పుతో

కొనసాగాలి ఓర్పుతో

ఇక కొంగ్రొత్త మార్పుతో


చెడు వ్యసనాలు యమపాశము

తీస్తాయోయ్! ప్రాణాలు

బాధనొందు కుటుంబాలు

చెల్లాచెదరగు పిల్లలు


మానాలి చెడు వ్యసనాలు

దిద్దుకోవాలి బ్రతుకులు

విజయమొంద వాటిపై

దృఢమవ్వాలి మనసులు










తల్లిదండ్రులు ఘనులు

--------------------------------------------

కన్నవారి సేవలో

మెండుగా దీవెనలు

వారు చూపు ప్రేమలో

హర్షించును మనసులు


కన్పించే వేల్పులు

కని పెంచే దేవతలు

తల్లిదండ్రులు మహిలో

కొలవాలోయ్! మదిలో


ఇవ్వాలి జగతిలో

వారికి తొలి స్థానము

మనో మందిరంలో

పూజించాలి నిత్యము


కన్నవారికి కష్టము

ఇంటిలోన నష్టము

ఎన్నడూ తేరాదు

మూర్ఖంగా పోరాదు










మామయ్య మంచి మాటలు

-----------------------------

చీకట్లు తరిమేసే

జ్యోతిలాగ జీవించు

మనసులను కదిలించే

మాటలాగ ఉదయించు


కనురెప్పలా కాపాడే

భగవంతుని సేవించు

అనిశంబు ప్రేమించే

కన్నోళ్లను గౌరవించు


నీ శ్రేయస్సు ఆశించే

నీ ప్రగతికి సహకరించే

స్నేహితులను గుర్తించు

ఆపదలో ఆశ్రయించు


జ్ఞానాన్ని అందించే

సన్మార్గం చూపించే

గురువులను అనుసరించు

హితోక్తులు ఆచరించు










నిజమే కదూ!

----------------------------

నింగిలోని వేగు చుక్క

చీకట్లు తరుముతుంది

పుడమిపై చిన్ని మొక్క

పచ్చదనం పంచుతుంది


ఇంటిలో పెంపుడు కుక్క

రక్షణ కల్పిస్తుంది

కాసింత గంధపు చెక్క

తావులు వెదజల్లుతుంది


అమూల్యమైనది చెలిమి

జీవితాల్లో బహు బలిమి

కల్గియుంటే క్షేమము

అదే తరిగిపోని కలిమి


దాహాన్ని తీర్చుతుంది

కాపాడితే చెరువు

ఆయుస్సును పెంచుతుంది

సంరక్షిస్తే తరువు

========================================











Samayaspurthi Goppadi - New Telugu Poems Written By Gadwala Somanna Published in manatelugukathalu.com on 15/02/2026

సమయస్ఫూర్తి గొప్పది - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


సమయస్ఫూర్తి గొప్పది

--------------------------------------------------

ఉండాలి సమయస్ఫూర్తి

అదే తెచ్చిపెట్టు కీర్తి

మంచి మంచి అలవాట్లపై

పెంచుకోవాలి అనురక్తి


తెచ్చుకొమ్ము మంచి పేరు

నిలుపుకొమ్ము ఇంటి పేరు

ఈ సభ్య సమాజంలో

నిలిచిపొమ్ము హృదయంలో


ప్రాముఖ్యం ఆరోగ్యము

జీవితాన ఆనందము

అవి రెండూ కోల్పోతే

ఎంత ఉన్నా వ్యర్థము


సుగుణాలే భూషణము

లేక బ్రతుకు వికారము

పెంచుకుంటే మంచిది

దక్కుతుంది గౌరవము















కల్గియుంటే!

--------------------------------------------------

హెచ్చితే అహంకారము

వస్తుంది అవమానము

కల్గియుంటే వినయము

దక్కురుంది గౌరవము


విలువైనది వివేకము

విజ్ఞానమే ఐశ్వర్యము

కల్గియుంటే క్షేమము

జీవితమే సుఖమయము


బహు గొప్పది ఔదార్యము

అమూల్యము కారుణ్యము

జీవితాల్లో అవసరము

కల్గియుంటే లాభము


దరహాసము బహుమానము

లేదు లేదు కొలమానము

కల్గియుంటే మేలు మేలు

అదే కదా పదివేలు

మామయ్య మాటలు

---------------------------------------------------

అనుకున్నది సాధిస్తే

ఆనందము అపారమే

అహాన్ని వదిలేస్తే

అందరూ ఆత్మీయులే


నాలుకను నియంత్రిస్తే

దాసోహం లోకమే

కష్టాన్ని అధిగమిస్తే

సుఖమయం జీవితమే


ఎదుటివారి మనసులే

మాటలతో నొప్పిస్తే

బ్రతకంతా గాయాలే

సమసిపోవును బంధాలే


అందరితో ప్రేమగా

పరిమళించే పూవుగా

ఉండాలోయ్! నవ్వుతూ

సఖ్యతతో హాయిగా









చేత వెన్న ముద్ద

---------------------------------------------------

వెన్నెల్లో చల్లదనము

వెన్నముద్ద మెత్తదనము

అసమానం జగతిలో

కన్నవారి త్యాగగుణము


తెలుగుభాష తీయదనము

పద పదము చక్కదనము

గలమెత్తి పాడాలోయ్!

మాతృభాష గొప్పదనము


వెన్నముద్ద రీతిలో

మిన్న కదా పసి పిల్లలు

సన్నజాజి అందాలు

పవిత్రమే హృదయాలు


వెన్నముద్ద చేతిలో

పెట్టుకుంటే నోటిలో

కరిగిపోవు మృదువుగా

ఎంచక్కా నిముషంలో


బలే బలే వెన్నముద్ద

ఇష్టమైన వెన్నముద్ద

చిన్నారుల మాదిరిగా

ఉండు చేత వెన్న ముద్ద


వెన్నను గనుక కరిగిస్తే

చక్కని నెయ్యి వస్తుంది

దాన్ని కల్పి భుజిస్తే

శక్తి ఎంతో ఇస్తుంది





















దైవమే భక్తుల కొంగుబంగారం

---------------------------------------------------

దైవానికి హేయములు

అబద్దమాడు పెదవులు

సత్యమాడు నాలుకలు

అమితంగా ప్రియములు


స్వచ్ఛమైన హృదయాలు

విప్పారిన కుసుమాలు

భగవంతునికి నిలయము

అవుతుంది ఆలయము


క్రమమైన జీవితాలు

ఘన స్ఫూర్తిదాయకాలు

ఆదర్శం పంచుతాయి

ఆహ్లాదం పెంచుతాయి


దేవుని దివ్య సన్నిధి

భక్తులకదే పెన్నిధి

నమ్మకం ఆధారము

మోక్షానికి సోపానము

==========================================










Diddubatu Anivaryamu - New Telugu Poems Written By Gadwala Somanna Published in manatelugukathalu.com on 10/02/2026

దిద్దుబాటు అనివార్యము - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న

దిద్దుబాటు అనివార్యము

--------------------------------------------------

ఏదో ఒక లోపము

అందరిలో ఉంటుంది

వారిలోని సుగుణము

చూస్తేనే మంచిది


అందాల గులాబీకి

ఒళ్ళంతా ముల్లులే

ఈ సత్యం గ్రహిస్తే

విలువైన పాఠమేలే!


లోపాలు సహజమే

అది మానవ నైజమే

ఇక సరిచేసుకుంటే

ఎంతైనా లాభమే


పుట్టుకతో ఎవ్వరు

గొప్పవారు కారులే

రాణిస్తే మాత్రమే

అవుతారు విజేతలే











విలువైనవి అక్షరాలు

--------------------------------------------------

పెంచుకో విజ్ఞానము

త్రుంచుకో అజ్ఞానము

జీవితమిక సఫలము

రాగ సుధా భరితము


అక్షరమే దీపము

పరికింప అద్భుతము

మార్చునోయ్! జీవితము

సృష్టించును నాకము


నమ్ముకో అక్షరాన్ని

ఆశ్రయించు జ్ఞానాన్ని

అపారమే మేలులు

బాగుపడును బ్రతుకులు


అక్షరాల కోటలో

దివ్యమైన వెలుగులో

నేర్చుకుంటే గనుక

మోదమే బ్రతుకులో











మాస్టారు మాటలు

--------------------------------------------------

తృప్తిలేని జీవితము

తలపించును నరకము

ఎంత ఉన్నా శూన్యము

అక్షరాలది సత్యము


కోపంలో నిర్ణయము

ఇస్తుంది దుష్పలితము

శాంతంగా యోచిస్తే

దొరుకునోయ్! పరిష్కారము


జీవితము అతిచిన్నది

మలచుకో ఉన్నతంగా

మన చేతుల్లో ఉన్నది

చేసుకో అద్భుతంగా


గడిచిపోతే సమయము

కఠినమైతే హృదయము

పొంచి ఉండు ప్రమాదము

గుర్తించుకో అనిశము





















సుభాషిత రత్నాలు

--------------------------------------------------

అందరితో సఖ్యత

జీవితాన సభ్యత

ఉండాలోయ్! నేస్తము

ఇల కనీస బాధ్యత


హృదయంలో ధ్యానము

చేయాలోయ్! సతతము

దొరుకుతుంది శాంతము

పెంచుతుంది జ్ఞానము


విలువైనది స్నేహము

ఖరీదైన వజ్రము

చేయరాదు మనసా!

ఏమాత్రం ద్రోహము


వదనంలో నవ్వులు

విరబూసిన పువ్వులు

తెచ్చిపెట్టు అందము

పెనువేయును బంధము





















భవిత ఇక బంగారము

--------------------------------------------------

మార్చుకో ప్రవర్తన

తెచ్చుకో పరివర్తన

ఎవ్వరినీ చులకన

చేయరాదు హేళన


విశ్వాసమే వంతెన

ఇస్తుంది సాంత్వన

గెలుపుకు ఆధారము

అవుతుందోయ్! సాధన


పనికిమాలిన వాదన

ఇల వృధా ప్రేలాపన

మానుకుంటే మంచిది

హేయమైన భావన


జీవితాన బద్ధకము

కలుగజేయు నష్టము

వదిలిపెడితే వెంటనే

భవిత ఇక బంగారము

                                      

-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page