పది తెలుగు కవితలు
- Rallabandi Sangam Naidu

- 2 hours ago
- 7 min read

Padi Telugu kavithalu - Telugu Inspirational Poems | Rallabandi Sangam Naidu
పది తెలుగు కవితలు - తెలుగు ప్రేరణాత్మక కవితలు | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 26/08/2026
తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగ, పల్లె జీవనం, పాడిపంటలు, ప్రజల సుఖసంతోషాలను ప్రతిబింబించే కవిత ఇది. బతుకమ్మతో ముడిపడిన ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ భవిష్యత్తుపై ఆశలు ఈ కవితలో వ్యక్తమవుతాయి.
బతుకమ్మ బతుకమ్మ
============
బతుకమ్మ బతుకమ్మ
ఉయ్యాలో
బంగరు బతుకమ్మ
ఉయ్యాలో
మా ఊరు వచ్చింది
ఉయ్యాలో
మా పేరు నిలిపింది
ఉయ్యాలో
తాతల కాలం నుండీ
ఉయ్యాలో
తంగేడు పూలతో
ఉయ్యాలో
తనివితీరా ఉయ్యాలో
ఆ బతుకమ్మను
కొలిచేము ఉయ్యాలో
కోరిన కోర్కెలు ఉయ్యాలో
కొంగు బంగారమయ్యే
ఉయ్యాలో
పిల్లాపాపలు ఉయ్యాలో
పెద్దలు చిన్నలు ఉయ్యాలో
అలమoదలు ఉయ్యాలో
గోసంపద ఉయ్యాలో
మరి సంబురాలు సంబరాలు
జరుపుకునే ఉయ్యాలో
సరదాలు సందళ్ళు ఉయ్యాలో
మా లోగిల్లలోనికి ఉయ్యాలో
బతుకమ్మ తెచ్చును ఉయ్యాలో
పాడిపంటలు ఉయ్యాలో
పసిడి పంటలాయే ఉయ్యాలో
తెలంగాణ బతుకులు ఉయ్యాలో
పల్లె పట్టణ ప్రజలు ఉయ్యాలో
బంగరు బతుకమ్మతో ఉయ్యాలో
ముడిపడే ఉయ్యాలో
తెలంగాణ తలరాత ఉయ్యాలో
నుదిటి గీత ఉయ్యాలో
బతుకమ్మ దిద్దెను ఉయ్యాలో
భావి తెలంగాణ ఉయ్యాలో
బంగరు బతుకమ్మతో
బంగారమవ్వాలి ఉయ్యాలో
సింగారమవ్వాలి ఉయ్యాలో
ప్రజలంతా ఉయ్యాలో
సుఖ సంతోషాలతో ఉయ్యాలో
వర్ధిల్లాలి ఉయ్యాలో
బడుగు బలహీనుల
కడుపులు ఉయ్యాలో
చల్లంగా ఉండాలి ఉయ్యాలో
మట్టివాసన ఉయ్యాలో
మధురమవ్వాలి ఉయ్యాలో
ఆకాశంనుండి ఉయ్యాలో
పాలధార కురవాలి ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగరు బతుకమ్మ ఉయ్యాలో
ఆశ్వీజ బతుకమ్మ ఉయ్యాలో
అవనిలో బతుకమ్మ ఉయ్యాలో
తండ్రి ప్రేమ, త్యాగం, పిల్లల ఎదుగుదల కోసం ఆయన చేసే కృషి, కుటుంబంలో తండ్రి స్థానం వంటి భావాలను హృద్యంగా వ్యక్తపరిచే కవిత. తండ్రిని పిల్లల జీవితానికి మార్గదర్శి, ఆత్మవిశ్వాసం, ఆధారం మరియు ప్రత్యక్ష దైవంగా చూసే భావన ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది.
నాన్న..... నాన్న.....
================
నాన్న.. నాన్న
ఓ మంచి నాన్న
త్యాగలెన్నో చేసిన నాన్న
నీ చేతితో నడక నేర్పావు
నీ కళ్ళతో ప్రంపంచాన్ని చూపావు
నీ కౌగిలి మాకు దేవాలయ లోగిలి
నీ తనువు మా ఉన్నతికి సోపానం
నీవు నింగిలో సూరుడవి
నేలపై నడిచే నక్షత్రనవు,
ప్రత్యక్ష దైవానవి
నాన్న అన్న నీ పిలుపు
ముక్కోటి దేవతల తలపు
నీ నెత్తురు మా జీవితచమురు
మా హృదయ ద్వారపు దేవుడువు
మా కష్టాలకు నీ కంటిలో చెమ్మ
మా సంతోషమే నీ పంచ భక్ష్య పరమాన్నలు
మా ఆనందం నీకుచిరాయువు
మా ఎదుగుదలే నీకు ప్రాణం
మా సుఖమే నీకు ఊపిరి
మా వికాసమే నీకు విశ్వం
మా ఆశే నీకు పంచప్రాణాలు
చీకుచింత లేని మా ప్రయాణం నీ వరం
నువ్వే మా ఆశ, శ్వాష, ఘోష, భాష
నీ నడక మా నడత
నీ నమ్మకం మా జీవితం
నువ్వు మా సర్వం, స్వరం
నువ్వే మా ఆత్మవిశ్వాసం
నువ్వే మా అమ్మకు చిరునామా
నువ్వే లేని ఈ నేల సూర్యుడు లేని ఆకాశం
నీ చింత మాకు శాపం
విలువలకు ప్రతిరూపం
సంస్కారమూర్తివి
గ్రంధానివి, సుగంధానివి
మా పాఠశాలకు ప్రధాన పంతులవి
మా బతుకు బాటవి
మా ప్రఖ్యాతివి, విఖ్యాతివి
నీ నరాన పొంగు రక్తం
మా అభివ్యక్తం
నీ తనువు మా ఆణువణువూ
బ్రహ్మ బొమ్మకు ప్రాణం పోసిన దేవదేవుడువు
ఆది దేవుడువు, జీవుడువు
అనాది ప్రపంచానవు
మా బతుకు పుస్తకంలో ప్రతీ అక్షరం నీవు
మా హాసపు ధ(ద )రహాసనివి
మా శక్తీవి, యుక్తివి నువ్వు
మా తటాక ప్రతిబింబం నువ్వు
నువ్వే నువ్వు నీ లాంటి మనిషి
ఈ జగతిన లేడు
నాన్న.... నాన్న....
నీ చల్లని చూపే
కోటి వరాల మోపు
నాన్న.... నాన్న...
నీ బిడ్డలం మన్నించు, క్షమించు, దీవించు, ఊగించు, పాలించు, లాలించు, ఆడించు, పాడించు, గెలిపించు, నవ్వించు,కవ్వించు,
మరు జన్మనీయు
నీ సేవలో తరిస్తాం, మురుస్తాం.
ఆనందపు జల్లు కురుపిస్తాం.
తండ్రి ప్రేమను మరింత రూపకాలతో, ఆధ్యాత్మిక భావనలతో వ్యక్తపరిచే కవిత. కుటుంబానికి తండ్రి ఇచ్చే అనురాగం, నమ్మకం, మార్గదర్శకత్వం మరియు ఆయన పట్ల పిల్లలకు ఉండే కృతజ్ఞత ఈ కవితలో ప్రధాన భావాలుగా కనిపిస్తాయి.
నాన్న..... ఓ నాన్న
============
నాన్న.... నాన్న
నీఉనికే వెన్న
నీ మనసే పెన్న
అమ్మనే అమృతాన్ని
చిలికే నవనీతం నీవు
లాలనకు పాలనవు
మాట కరుకు
మంచి పంచు
రక్తంతో నింపు
నవ గ్రహాలనే పిల్లలను
నీ చుట్టూ తిప్పుకునే
నింగిన సూరీడువు
ఆకర్షణకు ఆయువుపట్టు
అనురాగమే ఆయువు
గుణాలు కలగలుపు
జాబిలమ్మకు నెలవు
శీలమునకు ఇరువు
కనిపించే దీపానికి
కనపించని చమురువు
ఒత్తువు, వెలుగువు, జిలుగువు, పులుగువు
నిండు పున్నానికి వెలుగువు, వెన్నెలువు
మనిషి మనసుకు కన్నువు
హృదయానివి, హృదయస్పందను
నిజామానిపించే అబద్దానవు
అబద్దమనిపించే నిజానవు
జగతిన నమ్మకానవు
నమ్మకానికి అమ్మతనానవు
అమ్మ తనానికి నాన్నతనానవు
నాన్న... ఓ నాన్న
స్ట్రష్టికి ఓంకారం నీవు
స్థితికి పతివి నీవు
లయకు శిలాశాసనానవు
గతివి నీవు శృతివి నీవు
ఈ నా అకృతి నీవు
నీ ఋణం జన్మజన్మల వరం
ఈ సృష్టి ఉన్నంత వరుకు
నిన్ను మరువం
అదిదేవా అనుగ్రహించు
కరుణించు మమ్మేలు
కరుణ వర్షం కురుపించు
కనికరించు
మమ్ము వరించు
స్వామి
రక్షించు రక్షించు
సదా తోడుండు
పల్లెటూరి ఆప్యాయత, అనురాగం, పచ్చని పంట పొలాలు, పల్లె యాస, ఉమ్మడి కుటుంబాలు మరియు మానవ సంబంధాల సౌందర్యాన్ని గుర్తుచేసే కవిత. స్వచ్ఛమైన పల్లె జీవన విధానం, పరస్పర సహకారం మరియు ఆత్మీయత ఇందులో ప్రతిఫలిస్తాయి.
SEO Keywords:పల్లెటూరు కవిత, పల్లె జీవితం కవిత, గ్రామీణ జీవితం తెలుగు కవిత, పల్లె జ్ఞాపకాలు, తెలుగు పల్లె కవిత
మా పల్లెటూరు
==========
ఆప్యాయత
అనురాగాల
కలబోత
మా పల్లెటూరు
కన్నతల్లి తీరు
అమ్మస్పర్శ సౌరు
అమలిన జీవనవిధానం
సంసృతి సంప్రదాయాల
కూడలి
చెమటనీరుల ఏరు
పల్లె యాస భలే జోరు
పచ్చ పచ్చని పైర్లు
గల గల జల ప్రవాహాలు
పిల్లల హుషారు
కన్నె వాళ్ళ కేరింతలు
కావాల్సిన వాళ్ళ కొగిలింతలు
కల్లాకపటం లేని బోలా తనం
మోసం, అమర్యాద కనం మనం
నోరారా వరసులతో పిలుపులు
కడుపునిండా తిండి
కంటినిండా నిద్ర
చేయారా పని
కాలుష్యం చొరబడని
పల్లె ముఖం
పడుచు నుదుటి తిలకం
మసకబారని మా"నవ"సంబంధాలు
కమ్మ కమ్మని కబుర్లు
ఉల్లాసంతో కూడిన ఊసులు
ఉమ్మడి కుటుంబాలు
విలువలతో కూడిన విద్యలు
చేయి చేయి కలయిక
పరస్పర సహకారం
నది ప్రవాహాన్ని భాష, తల్లి ప్రేమ, ప్రకృతి, అనురాగం మరియు జీవన శ్వాస వంటి అనేక భావాలతో అనుసంధానించే కవిత. నదిలోని హొయలు, తరంగాలు, చినుకులు మరియు ప్రవాహాన్ని మానవ అనుభూతులతో పోల్చుతూ కవిత సాగుతుంది.
నదీ ప్రవాహం
============
నదీ ప్రవాహం
ఓ అందమైన భాష
నదీ హొయలు
మధురమైన భాష
నదీ తొణుకులు
అమరమైన భాష
నదీ బెణుకులు
అందమైన భాష
నదీ చెణుకులు
కమ్మనైనా భాష
నదీ తుంఫర్లు
అమ్మభాష
నదీ తరంగాలు
ఆలి భాష
నదీ నురుగులు
పరువం భాష
నదీ..... నా తల్లి
ననుగన్న అమ్మ
మురుపెంగ అమ్మ చేతి ముద్ద
అమ్మ నుదుటి ముద్దు
ప్రియరాలి చెక్కిలి చుంబనం
నదీపై పిల్ల తెమ్మర
కన్నతల్లి స్పర్శ
నదీ ఓంపులు
ప్రియురాలి సోంపులు
కొండపై నుండి దూకు నదీ
నింగిలోకి ఆశల పల్లకి
కన్నె వలల తొలకరి
వయసు గిలిగింత
మనసు పులకింత
కన్నె కౌగిలి మొహం
అలవికాని ఆనందం
మధురం
మధురాతి మధురం
నదీ చినుకులు
మధుర గుళికులు
ఏకంగా
నదీ ప్రవాహం
మౌన మూగ మధుర భాష
బతుకు శ్వాస
ఒక ఊరిలోని ప్రకృతి, మనుషులు, పక్షులు, చెట్లు, పెద్దలు, పిల్లలు, దేవాలయం, పాఠశాల, పంటలు, మట్టి వాసన మరియు మానవ సంబంధాలను ఆప్యాయంగా చిత్రించే కవిత. స్వగ్రామంపై ప్రేమను, పల్లె జ్ఞాపకాలను ఈ కవిత ప్రతిబింబిస్తుంది.
మా ఊరు
========
మా ఊరు
మా మంచి ఊరు
ఏరున్న ఊరు
మాంచి జోరున్న ఊరు
మంచి సంగతులెన్నో చెప్పు
మా మంచి ఊరు
గువ్వ ఉన్న ఊరు
పువ్వు ఉన్న ఊరు
తాత బోసినోటి నవ్వున్న ఊరు
పక్షి ఉన్న ఊరు, చెట్టున్న ఊరు
పక్షిలా స్వేచ్చగా తిరిగే ఊరు
బాట ఉన్న ఊరు
కాలిబాట ఉన్న ఊరు
పెద్దలున్న ఊరు
సుద్దులున్న ఊరు
జనమున్న ఊరు
భోజనమున్న ఊరు
జ్ఞామున్న ఊరు
అజ్ఞానమున్న ఊరు
కంకులున్న ఊరు
ఎంకులున్న ఊరు
శంకలున్న ఊరు
వంకలున్న ఊరు
దేవుడున్న ఊరు
దెయ్యాలున్న ఊరు
మా అమ్మ తీరు
మా మంచి ఊరు
పసిపాపలున్న ఊరు
పండుటాకులున్న ఊరు
పొగరున్న ఊరు
వగరున్న ఊరు
గాలి ఉన్న ఊరు
నీరున్న ఊరు
నిప్పున్న ఊరు
నింగి ఉన్న ఊరు
నింగిన జాబిలున్న ఊరు
నేల ఉన్న ఊరు
నేల తీరున్న ఊరు
మట్టి ఉన్న ఊరు
మట్టి వాసనున్న ఊరు
చెమటున్న ఊరు
చెమట కమ్మ"ధన"మున్నఊరు
చెరువున్నఊరు
చెరువు పరువున్న ఊరు
'కర్మా' గారమున్న ఊరు
మనసున్న ఊరు
మంచి మనసున్న ఊరు
చుట్టాలున్న ఊరు
చట్టాలున్న ఊరు
అమ్మ ఉన్న ఊరు
అమ్మమ్మలున్న ఊరు
గుడి ఉన్న ఊరు
బడి గోపురుమున్నఊరు
భయమున్నఊరు
అభయమున్న ఊరు
ఆట ఉన్న ఊరు
పాట ఉన్న ఊరు
ఆట పాటల
మేలి'కళ'యకున్నఊరు
చిందేయు ఊరు
పొందైన ఊరు
పసందైన ఊరు
గో'విందు'డు ఉన్న ఊరు
ప్రజలున్న ఊరు
భజనులున్న ఊరు
ఊరు ఊరు మా మంచి ఊరు
తీరు తీరు మా పాప తీరు
మా అమ్మే మా పాప
మా పాపే మా ఊరు
మా ఊరు మా ఊరు
మా మంచి ఊరు
అతిగా మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల వ్యక్తిగత జీవితం, పిల్లలు, కుటుంబాలు మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను ప్రశ్నించే కవిత. చరవాణి వినియోగంపై ఆలోచింపజేస్తూ, దానికి పరిమితి అవసరమనే భావాన్ని వ్యక్తపరుస్తుంది.
చరవాణికి దూరంగా ఉందాం
=================
చదువు కుందాం
చరవాణికి దూరంగా ఉందాం
చెరవాణి చెడువాణి
ప్రాణాలతో చెలగాటల వాణి
మంచికి చెడుగుడు వాణి
పేరులో సరస్వతి
తీరులో నసరస్వతి
బాలలకు పురుషులుకు
వోణి ఈ వాణి
కళ్ళకు గంతలు
కళలకి చిల్లు
ఈ శాడిస్ట్ వాణి
నిద్రుండదు సుఖముండదు
సర్వం స్వాహ చేస్తుంది
మన పద్దును, పొద్దును
కోళ్లగొడుతుంది
ఈ వాణి వాయు వేణి
భావతరంగ పూబోణి
హృదయంతర్వాణి
నేటి ప్రపంచపు రాణి
విఫణిలో కాసులు పంట
పండిస్తున్న మాగాణి
మాయలో ఇంద్రాణి
వీడియో గేముల పేరుతో
కుటుంబాల్లో హహకారాలు
అర్తనాధాలు, ఆక్రనందనలు,
పెడబొబ్బలు, రోదనలు
మిగుల్చితున్న శ్రీవాణి
ప్రపంచాన్ని కళ్ళ కు కడుతున్న
నట కౌశలవాణి
అర్ధ నగ్న దృశ్యాలు
నింగి నీలి చిత్రాలు
న(నె)ట్టింట్లోఉంచిన
ఇనుప గజ్జల తల్లి
జ్యేష్టా దేవికి తల్లి
లక్ష్మీ దేవికి చెల్లి
"వల"పుకారుల చెలి
పుకారుల మెలి, ఉలి
దీనిలో నిండా మునిగినోళ్ల ఉరి
మేధడే ఈ చెలి బరి
మేధస్సు తింటున్న నిచ్చెలి
అక్రమ మార్గాల కౌగిలి
చీకటి రాజ్యాన జాబిలి
పిడికిటి సంసారాన్ని
సంస్కారాన్ని సమాజ వాకిట
ఉంచిన చిన్నది
ఎన్నో చీకటి కోణాల కన్నది
విఫణి పనుల పెన్నిధి
రవి కిరణం దూరని చోట
దూరే కాంతి పుంజం
చీకటి దొరల కాంతి కి"రణం"
"చే"రవాణి, చెర వాణితో
నిత్యం రణం రణం
సమాజానికి ఇది మానని
వ్రణం వ్రణం వ్రణం
మేలుకోకుంటే నాగరికత
సంస్కృతి మానవ మనుగడ
మ"రణం" మ"రణం" మ"రణం"
తథ్యం, తథ్యం, తథ్యం
మా "రణం" చెడు వాణితో
చెర వాణితో, చరవాణితో......
తెలుగు నేల, తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతి, కవులు, మహాత్ములు, జ్ఞానం, విజ్ఞానం, మమతానురాగాలు మరియు సామాజిక అభివృద్ధి వంటి భావాలను ప్రతిబింబించే కవిత. తెలుగు నేలపై ప్రేమ, గర్వం మరియు సమైక్యతను వ్యక్తపరిచే రచనగా ఇది నిలుస్తుంది.
తెలుగు నేల మనది
=============
తెలుగు నేల మనది
వెలుగు నేల మనది
దేవతలకు లేనిది
దేవుళ్లకు లేనిది
మమతానురాగాల పెన్నిధి
ప్రేమ ఆప్యాయతల సన్నిధి
తెలుగు నేల మనది
వెలుగు నేల మనది
ఈ నేల అందరిదీ
మనందరిదీ
గొప్ప కవులు పుట్టిన నేల
మహాత్ములు నడిచిన నేల
మహానుభావులు నడయాడిన నేల
చైతన్యం విరిసిన నేల
జ్ఞానం ప్రసరించిన నేల
విజ్ఞానం వెల్లువైన నేల
వీరత్వం కురిసిన నేల
తెలుగు నేల
వెలుగు నేల
అభ్యుదయం నేల
అభివృద్ధి నేల
అరమరికలు లేని నేల
కులం లేని నేల
మతం లేని నేల
కులమత గొడవలు లేని నేల
త్యాగధనుల నేల
పుణ్య పురుషుల నేల
పురాణ పురుషుల నేల
తేనె వాగుల నేల
అమృతం కురిసిన నేల
ఆయురారోగ్యాల నేల
అష్టైశ్వర్యాల నేల
సిరిసంపదల నేల
సుఖశాంతుల నేల
సంతోషాలు ఉప్పొంగు నేల
తనివి తీరని నేల
తన్మయత్వపు నేల
తరువుల నేల
తులలేని తరుణుల నేల
తనువు పులకించు నేల
నే(మే)ను పరవశించు నేల
పుడమి నాట్యం చేయు నేల
గగనం గానం చేయు నేల
ప్రపంచపు కన్ను ఈ నేల
విశ్వానికి మిన్ను ఈ నేల
విశ్వ విజ్ఞాన కేంద్రం ఈ నేల
కలిమికి ఈ నేల
చెలిమికి ఈ నేల
ఆఁహాఁ అనిపించే నేల
ఓహో అనిపించే నేల
అన్నదమ్ముల నేల
అక్కాచెల్లుల నేల
మమతల కోవెల
మల్లెల మాల
ఈ నేల ఈ నేల
తెలుగు నేల
వెలుగు నేల
వెలుగు జీలుగుల
పాల కడలి తరంగాల నేల
సెల్‌ఫోన్ మనిషి జీవితంలో పెరిగిన ప్రాధాన్యత, దాని అతివినియోగం వల్ల మానవ సంబంధాలు మరియు వ్యక్తిగత జీవితంపై పడే ప్రభావాలను వ్యంగ్యాత్మకంగా, ఆలోచింపజేసే విధంగా వ్యక్తపరిచే కవిత. ఆధునిక సాంకేతికతతో మనిషి సంబంధాన్ని ఈ కవిత ప్రశ్నిస్తుంది.
సెల్లు సెల్లు సెల్లు
===============
సెల్లు సెల్లు సెల్లు
మాటల హరివిల్లు
పన్నీరు జల్లు
హృదయం కోళ్లగొట్టు
అందాల తాకట్టు
ఆనందాల తేనెపట్టు
భావ తరంగాల గట్టు
సెల్లు మాటల కనికట్టు
మాటల కోటల పెసరట్టు
ప్రతీ ఇంటిలో ఉండేట్టు
ప్రతీ మదిని దోచేట్టు
ప్రతీ మనిషి సెల్లుకు
బానిస ఒట్టు
స్వర్గానికి తలపించు
కాని నరకానికి నకల్లు
అతిగా వాడితే మెదడు కుళ్ళు
సెల్లుతో సొల్లు గల గల
సెల్లుతో సొంగ కళ కళ
సెల్లుతో మానవ సంబంధాలు వేల వేల
సెల్లుతో మానవ సంబంధాలు వెల వెల
వాడుకోవాలి ఏదో వేళ వేళ
సెల్లుదే ఈనాటి ఈ నేల
సెల్లు లేని నేల కల కల
బయటికి సెల్లు సొల్లు కళ కళ
వాస్తవానికి సెల్లు సొల్లు వేల వేల
వాస్తవానికి సెల్లు సొల్లు వెల వెల
సెల్లు చావు వాకిళ్ళు
దుఃఖానికి నె (న)ట్టిల్లు
సెల్లు పుట్టించు రణరంగం
మారణహోమం
మా"నవ"జీవితాన
గందరగోళం గందరగోళం
సెల్లు పనితనం
సెల్లుకు ప్రపంచం దాసోహం
చీకటి రాజ్యానికి సెల్లు ప్రాణం
వ్యక్తిగత జీవితానికి సెల్లు జైలు
ఆత్మీయత అనురాగాలు కట్
సంసారాలు డక్కౌట్
సెల్లుదే జీవిత వికెట్
సెల్లు అడు క్రికెట్
ఖర్చు మాత్రం సెంచురీలు
సెల్లు దగ్గర అంపైర్లు అవుట్
సెల్లు గుండె గు"బిల్లు"
సెల్లు పర్సకు చిల్లు
సెల్లు మన్మధుని చెరుకు విల్లు
ఇక కుటుంబ విలువలు నిల్లో నిల్లు
ఆలుమగలుమధ్య సెల్లుమంట
వాళ్ళ భవిష్యత్తు తంటాయేతంట
సెల్లు పిన్నలు పెద్దల పాలిటీ బంధువు
సర్వ మానవాళి శత్రువు
సెల్లు గోల మానవ జీవితపు ప్రహేళ
సెల్లు సెల్లు సెల్లు
మానవ జీవితం నిల్లు నిల్లు
మానవ బతుకు నీళ్లు నములు
సెల్లులో హాయ్ హాయ్ లు
సెల్లు కు చెప్పాలి బాయ్ బాయ్ లు
అపుడే జీవితం హాయి హాయి లు
సెల్లుకుండాలి పరిమితలు
నాడే జీవితపు పరిమళాలు అపరిమితాలు
చరవాణి ద్వారా ఏర్పడే సంభాషణలు, స్నేహాలు, ప్రేమ, వినోదం మరియు భావ వ్యక్తీకరణ వంటి సానుకూల అంశాలను కవితాత్మకంగా వ్యక్తపరిచే రచన. ఆధునిక జీవనంలో చరవాణి ఒక మాధ్యమంగా ఎలా మారిందో వివిధ భావాలతో ఈ కవిత ప్రస్తావిస్తుంది.
చరవాణి మధుర వాణి
===================
చరవాణి సుస్థిర వాణి
మాటల మధుర వాణి
మృదుమధుర వాణి
విశ్వవాణి వినోదాల బోణి
తరుణల విరుబోణి
పురుషులు పూబోణి
అమ్మాయిలకు వోణి
రవికందని చోటు చరవాణి
రసమయం
సరస మయం
చెరుకు గడ
తేనె పట్టు
ఆటపట్టు
హృదయాలు
కొల్ల గొట్టు
ఏడుపులు పోగొట్టు
మమతలు పెంచు
స్నేహగీతాలు పంచు
విరుద్ద భావాలు తుంచు
జీవితపు సవ్వడి
శృంగార కిలాడీ
గల గల మాటలాడి
ప్రేమికుమధ్య పెంచును వేడి
ఇందులో చర్చలు వేడి వాడి
ఊహాలకంద"నది"
ఊరించే లేడీ
ఊరికే లేడీ(ఢీ)
చర వాణి చర వాణి
మనసు స్థిరవాణి
మధుర వాణి మధుర వాణి
సంగీత కీరవాణి
సాహిత్య వేణి
చర వాణి మధుర వాణి
ఈ పది తెలుగు కవితలు పది విభిన్నమైన భావ ప్రపంచాలను మన ముందుకు తీసుకువస్తాయి. బతుకమ్మ పండుగ, నాన్న ప్రేమ, పల్లెటూరి ఆప్యాయత, నదీ ప్రవాహం, స్వగ్రామ జ్ఞాపకాలు, తెలుగు నేలపై అభిమానం, చరవాణి ప్రభావం వంటి అనేక అంశాలు ఈ కవితల్లో ప్రతిఫలిస్తాయి.
తెలుగు కవిత్వాన్ని ప్రేమించే ప్రతి పాఠకుడికి ఈ కవితలు ఏదో ఒక అనుభూతిని, జ్ఞాపకాన్ని లేదా ఆలోచనను తప్పక మిగులుస్తాయి. మీకు నచ్చిన కవితను చదివి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా పంచుకోండి.
***

-రాళ్లబండి సంగం నాయుడు




Comments