top of page

ప్రస్థానం

#AlluSairam, #అల్లుసాయిరాం, #Prasthanam, #ప్రస్థానం, #TeluguHeartTouchingStories

ree

Prasthanam - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 28/09/2025

ప్రస్థానం - తెలుగు కథ

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఆంధ్రా - ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతం. సమయం పదకొండు అవుతున్నా కొండల మధ్యన సూర్యుడు మబ్బులతో దాగుడుమూతలు ఆడుకుంటున్నట్లుగా ఉంది వాతావరణం. ఒక కారు, జెసిబి ఊరిలోకి వచ్చి, ఒక యింటి ముందు ఆగాయి. 


కారులో నుంచి వాసు దిగి, తనతో పాటు వచ్చిన మధ్యవర్తితో “సార్! ఆ 200 గజాల స్థలం మనది. మూడు ఫ్లోర్స్ బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. అపార్ట్మెంట్స్ కడుతున్నాం. అంతా బాగుంది కానీ, మధ్యలో ఆ పూరిల్లు అడ్డంగా ఉంది. అది తీసేస్తే, మనకి రోడ్డు వరకు ఎంట్రన్స్ దొరుకుతుంది. అందుకే ఆయనకి చాలాసార్లు అడిగి, ఆ పూరిల్లు పడగొట్టి, మనం కడుతున్న గ్రౌండ్ ఫ్లోర్లో అంతే గది కట్టించి ఆయనకి యిస్తామన్న ఒప్పుకోవట్లేదు సార్!” అని అంటే, మధ్యవర్తి నవ్వుతూ “అంటే మీ బిల్డింగ్ కాపలాకి వాచ్మేన్ లాగా కింద గదిలో ఉంచుతారా!” అని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. 


వాసు తాలుకా స్థలంలో ఉన్న చెట్లు, మొక్కలని జెసిబి వాళ్లు లెవెల్ చేస్తున్నారు. స్కూల్లో నుంచి అది చూసిన యమున పరుగెత్తుకుంటూ వెళ్ళి, ఆలిసిపోతూ “వీరయ్య తాతా! రావిచెట్టు కింద కూర్చుని ఎటి చేస్తున్నావు. అవతల నీ యిల్లు పడగొట్టడానికీ జెసిబి వచ్చింది!” అని చెప్తే, వీరయ్య కంగారుగా పరుగెత్తలేక, గభాగభా నడుస్తున్నాడు. 

యమున పక్కన వస్తుంది. ఆతృతగా వస్తున్న వీరయ్యని వాసు చూపిస్తూ “అదిగోండి సార్! ఆతృతగా వస్తున్నాడు. ఆ ముసలోడే అడ్డుపడుతున్నాడు. పేరు వీరయ్య!” అని అన్నాడు. 


వీరయ్య జెసిబి వాళ్లని, కారు దగ్గర నిల్చున్న వాసు, మధ్యవర్తిని కోపంగా చూసుకుంటూ, తిన్నగా తన పూరింట్లోకి వెళ్లి, మంచం బయటికి తీసుకొచ్చి వేసుకుని కూర్చున్నాడు. 


మధ్యవర్తి చిరాకుగా “ఓ పెద్దాయన! ఆ పక్కన జెసిబి తో పని జరుగుతుంటే, కిందన కూర్చుంటావేంటీ?” అని అడిగాడు. 


“అసలే చిన్న పూరిల్లు బాబు యిది! మీరు ఆ పక్కన పని చేస్తూ చేస్తూ, ఆ జెసిబి తొండంతో యిలా అంటే, ఎగిరిపోతుంది! నేను ఉంటే, ఈ యింటికి ధైర్యంగా, మీకు జాగ్రత్తగా ఉంటాది!” అని అన్నాడు. 


వాసు కోపంగా “పెద్దాయన! నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఈ యిల్లు పడగొట్టి, మీ స్ధలం, మా స్ధలం కలిపి పెద్ద యిల్లు కడతాం. నీకు అందులో మంచి పాలరాతి గది యిస్తామని చెప్పానా!” అని అంటే, వీరయ్య పౌరుషంగా “నాయనా! ఆ పాలు వద్దు. ఆ రాళ్ళు వద్దు. ఈ మట్టి యిల్లు చాలు. నువ్వు కట్టే ఇంద్రభవనంకి అడ్డంగా ఈ పూరిల్లు ఉంటుందని, అడుగుతున్నావు కానీ, నా మీదేమి జాలిపడి కాదు కదా!” అని అన్నాడు. 


మధ్యవర్తి కోపంతో "ఏంటి! ఈ చిల్లర పంచాయతీలు!" అని అంటూ "ఓ పెద్దాయన! ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు.. అమెరికాలో ఉంటున్న నీ ఇద్దరు కొడుకులు, కూతుర్లు అందరూ ఒప్పుకున్నారు. పడగొట్టమన్నారు.. కావాలంటే, ఫోన్ చేస్తాం. నువ్వే మాట్లాడు! వాసు మూర్తిగారికి ఫోన్ చెయ్యి!"అని అంటే, వాసు “సార్! మనకి మధ్యాహ్నం పన్నెండు అవుతుందంటే, అమెరికాలో అర్ధరాత్రి. పడుకుని ఉండి ఉంటారు!” అని ఆలోచిస్తూ అన్నాడు. 


“ఆయన లేచేవరకు చూడాలంటే, మనకి రాత్రి అయిపోతుంది. పర్వాలేదులే చెయ్యి !” అని ఎలాగైనా పని తెగొట్టేయాలని ఉద్దేశంతో అన్నాడు మధ్యవర్తి. 


వాసు అమెరికాలో మూర్తికి ఫోన్ చేశాడు. అమెరికా నుంచి నిద్రమత్తులో ఫోన్లో మూర్తి "హలో!" అని అంటే, "హలో సార్! పడుకున్నారా! యిక్కడ మీ నాన్నగారితో మాట్లాడండి!" అని అంటే "మీ బిల్డింగ్ లో రూం యిస్తామన్న ఒప్పుకోవట్లేదా! ఎప్పుడు ఆ పాడుబడ్డ పూరిల్లు పట్టుకుని వేలాడతాడు.. !" అని అంటే, వాసు "అదే సార్! మీరు కొంచెం చెప్పండి!" అని అంటే, "సరే ఫోన్ యివ్వండి!" అని అంటే, “సరే సార్!” అని వాసు పెద్దాయనకి యివ్వడానికి వెళ్తూ "పెద్దాయన! మీ పిల్లలతో మాట్లాడండి! లైన్లో ఉన్నారు!" అని అన్నాడు. 


వీరయ్య ఫోన్ తీసుకోకుండా “ఎవరు పిల్లలు! ఎవరికి పిల్లలు..! అయ్య అక్కర్లేదు, అమ్మ అక్కర్లేదు.. వాళ్ళు వస్తారని చూసి చూసి నా ముసలిది సచ్చింది.. ఆ పిల్లలా! కనీసం చూడడానికి, తల కొరివి పెట్టడానికి రాని ఆ పిల్లలా! ఆనాడే సచ్చిపోయారు! ఈ ఇంటి మీద ఎవుడికి హక్కు లేదు.. ఎవుడొచ్చి చెప్పినా నేను ఈ యిల్లు ఇవ్వను!” అనేసరికి వాసు, మధ్యవర్తి కంగుతిన్నారు. 


వాసు తన ఫోన్ చూస్తే, మూర్తి ఫోన్ లైన్లో ఉన్నారు. కొండ మబ్బుల చాటు ఉన్న సూర్యుడు సైతం ఒక్కసారి బయటికి వచ్చేసరికి, ఎండ జిగ్గున ఎక్కింది. మూర్తికి నిద్ర మత్తు వదిలేసింది. తన తమ్ముడికి, చెల్లెల్లకి, కుటుంబమందరికి కాన్ఫరెన్స్ కలిపేశారు. 


వాసు ఉద్వేగంగా “పెద్దాయన! అలా అంటావు కానీ, ఆ యిల్లు నీ తర్వాత నీ పిల్లలకి యివ్వవేటి?” అని అడిగితే “బాబు! నువ్వు చెప్పిన ఆ పిల్లలు నేను, నా ముసలిది చెమటలెక్కిపోయి సంపాదించిన పొలాలు, ఆస్తులన్ని, నా ముసలిది ఉన్నప్పుడే అమ్మేశారు. దాదాపు పదేహేనేళ్ళు అవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. 


ఈ పూరిల్లు ఎందుకు పనికిరాదని వదిలేశారు. కానీ, నువ్వు ఎక్కడినుంచో వచ్చి, వెనుక ఆ జాగా కొనడం, పెద్ద యిల్లు కట్టడానికి చూడడం, దానికి ఈ పూరిల్లు అడ్డుగా ఉండడం వల్ల, మళ్ళీ మా పిల్లలు అని మాటలు వినపడుతున్నాయి!” అని చెప్తుంటే, వాసుకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. 


వీరయ్య మెల్లగా వాసు దగ్గరికి వచ్చి “బాబు! నీ కష్టం నాకు అర్ధమైంది. యిల్లు యిప్పుడు కాకపోతే, సంవత్సరం తర్వాత అయినా నువ్వు కట్టుకోగలవు నాయనా! కానీ, నాకు ఈ యిల్లు తొంబైయేళ్ల నుంచి ఉంది. నేను, నా తోబుట్టువులు అందరూ యిక్కడే పుట్టారు. మా అయ్య యిక్కడే పోయాడు. అమ్మ యిక్కడ పోయింది. నా ముసలిది యిక్కడే పోయింది. నేను యిక్కడే పోతాను నాయనా! కొన్ని రోజులు ఆగు! ఎక్కువ రోజులు నేనేం బతకలేను. బతకను! నాకు ఎవరు తలకొరివి పెడతారో ఏటో! నా తర్వాత నువ్వు ఎవుడని అడగక్కర్లేదు. నేను ఈ జాగా నీకు యిచ్చేస్తున్నాను!” అని ఏడుస్తూ చెప్తుంటే, అందరూ గుండెలు బరువెక్కాయి. 


మధ్యవర్తి “అది కాదు పెద్దాయన!” అని ఏదో చెప్పబోతుండగా, వాసు కన్నీళ్ళతో నిండిపోయిన కళ్లతో మధ్యవర్తిని ఆపుతూ "సార్! ఇప్పుడొద్దండీ.. మనం యిక్కడ నుంచి వెళ్లిపోదాం!" అని అక్కడ నుంచి కారులో ఎక్కి బయలుదేరారు. ఫోన్ అప్పుడు కట్ చేశాడు..


 మధ్యవర్తి ఆశ్చర్యంగా "ఏంటి యింతవరకు ఫోన్ కట్ చెయ్యలేదా! వాళ్ళు మొత్తం విని ఉంటారుగా!" అని అంటే, వాసు కోపంగా "బాగా వినాలనే చెయ్యలేదు. ఆ పెద్దాయన ఏడుస్తూ చెప్తుంటే, నాకే కళ్లలో నీళ్లుతిరిగాయి. ఆ పెద్దాయన పడుతున్న క్షోభ, ఆయన పిల్లలమనుకుంటున్న వారికి తెలియాలి. అందుకే ఫోన్ కట్ చెయ్యలేదు. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, వాళ్ళు అందరూ కాన్ఫరెన్స్ లో పెట్టుకుని విన్నట్లున్నారు. రికార్డింగ్ చేసుకుని మళ్లీ మళ్లీ వినమనండి. అప్పుడు బుధ్ధి వస్తుందేమో! " అని అన్నాడు. 

కొన్ని రోజుల తర్వాత, ఆ పూరిల్లు ముందు నాలుగు కార్లు ఆగాయి. కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్లు అందరూ తెల్లవారుజామున వచ్చారు. ఎవరు ఈ విదేశీయులని, ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు! పశ్చాతాపంతో కూడిన బాధ వల్ల వచ్చిన భయంతో పెద్దకొడుకు పూరింటి తలుపు గొళ్ళెం కొట్టాడు. 


వీరయ్య పడుకుని లేవలేదు. “సరే!” అని బయట అరుగుమీద కొంతమంది, రాళ్ల మీద కొంతమంది, కారు లోపల కొంతమంది కూర్చున్నారు. 


టైం ఆరు అవుతుంది. ఎప్పుడూ వీరయ్యకి టీ తెచ్చే యమున ఆ ఇంటి దగ్గర అంతమందిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్తుంటే, "పాప! తాత పడుకున్నాడు.. ఆగు!" అని అంటే "తాత ఎప్పుడూ పొద్దుఎక్కినంతవరకు పడుకోడు. తనకి నిద్ర పట్టదు!” అని లోపలికి వెళ్ళి "తాత.. తాత!" అని లేపుతుంటే, లేవట్లేదు. జ్వరం అని చూస్తే, ఏం లేదు. ఒళ్ళంతా చల్లగా ఉంది. యమునకి భయమేసి, బయటికి వస్తూ "అమ్మా! తాత!" అని అంటూ పరుగెత్తింది. 


గుండెల్లో రాయిపడినట్లు అందరూ ఏడుస్తూ లోపలికి వెళ్లారు. పెద్దకొడుకు కాళ్ళు వణుకుతూ కదలడం లేదు. అందరూ ఒకేసారి చిన్న పూరింట్లోకి వెళ్ళేసరికి ఆ పాత తలుపుల గొళ్ళెం ఊడిపోయి ఎగిరి, పెద్దకొడుకు చేతిలో పడింది. వణుకు ఆగిపోయింది. 

పెద్దకొడుకు కన్నీళ్ళతో ఆ తలుపుగొళ్ళెం చూస్తూ "నువ్వు అన్నింటికీ సాక్షివి! ఆయన బాధని చూశావు. నాయనా మనసులో బాధ తెలిసిన తర్వాత, ఆయనని ఎదురుగా చూసే ధైర్యం లేక నేను ఆగిపోయాను అనుకున్నాను. కానీ నువ్వు, ఆయన దగ్గరికి నేను వెళ్లి, మరింత బాధ పెట్టడం యిష్టం లేక, నన్ను తలుపు దగ్గరే ఆపేశావు. ఇప్పుడు ఆయనే పోయాక, నీకింకా ఏం పని ఉండదని వచ్చేశావు! నీకున్న విశ్వాసం కొడుకుగా నాకు లేకుండాపోయింది!" అని కిందపడి ఏడుస్తున్నాడు. 


వీరయ్య చివరి మాటలు మళ్ళీ మళ్ళీ తలుచుకుని కొడుకులు, కూతుర్లు, అందరూ పశ్చాతాపంతో ఏడుస్తున్నారు. ఊరిలో జనాలు “వీరయ్యకి యింత పెద్దకుటుంబం ఉందా అని కొందరు, “అసలు వీళ్ళు వీరయ్య చనిపోతాడని తెలిసి వచ్చారా, వచ్చాక వీరయ్య చనిపోయాడా” అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. 


ఊరిపెద్దలు వారితో “జరగాల్సిన తంతు జరిపించండి!” అని చెప్తే, వీరయ్య దహన సంస్కారాలు చేస్తున్నారు. 


అక్కడికి వాసు, మధ్యవర్తి వచ్చారు. పెద్దకొడుకు ఏడుస్తూ వారితో "మీకు చాలా థ్యాంక్స్ ఆండీ! మా నాయన చివరి మాటలు వినిపించారు. ఆ మాటలు విని ఉండకపోతే, మా అమ్మ చావుకి మేం రానట్లే, నాయనా చావుకి జరిగి ఉండేదేమో! మా నాయన ఆ పూరిల్లు కోసమని ఎందుకంత పట్టుబట్టేవాడో, నాకిప్పుడు అర్ధమైంది. ఆ పూరిల్లు నాకు కావాలనిపిస్తోంది.. 


మేం ఆ ఇంట్లోనే పుట్టాం. చూస్తూ చూస్తూ పడగొట్టుకులేం! ముందు, మేం బాగానే ఉండేవాళ్లం. మరి మాలో ఎప్పుడు మార్పులు వచ్చాయో తెలియదు కానీ, పూర్తిగా మారిపోయి ఈ స్ధితికి వచ్చాం! మీరు ఏమి అనుకోకపోతే, విశాఖపట్నం సిటీలో బిజినెస్ కోసం మేం కొన్న 200 గజాల స్థలం మీకు యిస్తాం. మాకు మీ స్ధలం యిచ్చేయండీ ప్లీజ్!" అని చేతులు జోడించి అడిగాడు. 


వాసు "సార్! ఆ విషయాలు తర్వాత మాట్లాడుదాం. మీ నాయన దహన సంస్కారాలైనా ప్రశాంతంగా చెయ్యండి. ఆ పూరిల్లు నేను పడగొట్టట్లేదు!" అని చెప్పాడు. 


పెద్దకొడుకు గుండెలు బాదుకుంటూ “ఇంకెక్కడ ప్రశాంతం! కనీసం క్షమించండి అమ్మానాన్న అని అడగడానికి కూడా అవకాశం యివ్వకుండా, జీవితాంతం శిక్ష వేసేసి కాలిపోతున్నాడు మా నాయన!” అని నేలమీద పడి, శవం వైపు చూస్తూ ఏడుస్తుంటే, వాసు ఓదార్చుతున్నాడు.


***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


 


 



Comments


bottom of page