పశ్చాతాపం
- Kondeti Prakash

- Oct 11
- 3 min read
#Paschattapam, #పశ్చాతాపం, #KondetiPrakash, #కొండేటిప్రకాష్, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Paschattapam - New Telugu Story Written By Kondeti Prakash
Published In manatelugukathalu.com On 11/10/2025
పశ్చాతాపం - తెలుగు కథ
రచన: కొండేటి ప్రకాష్
రామవరం అనే గ్రామంలో దొండయ్య–బీరమ్మ దంపతులు నివసించేవారు. వీరికి చెన్నయ్య, కున్నయ్య, మాగమ్మ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. దొండయ్య–బీరమ్మలది నిరుపేద కుటుంబం. దొండయ్య ప్రతి రోజూ అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి, పక్క ఊరి బొగ్గులబట్టి జగ్గయ్యకు అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునే వాడు.
ఈ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు నివసించేవి. వీళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. దొండయ్యకు తన తాతలు, తండ్రి సంపాదించిన భూమి లేకపోవడంతో, ఇలా కట్టెలు కొట్టే వృత్తిని కొనసాగించేవాడు.
దొండయ్య పిల్లలు ఎదుగుతున్న కొద్దీ, కుటుంబ పోషణకు తను సంపాదించే డబ్బు సరిపోక చాలా ఇబ్బందులు పడుతుండేవాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత దొండయ్య భార్య బీరమ్మకు ఒక ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన భర్తకు చెబుతూ —“అయ్యా! ఎన్ని రోజులు గొడ్డలితో చెట్లు నరికి, వాటిని సైకిల్ మీద పెట్టుకుని పక్క ఊరి బొగ్గులబట్టి జగ్గయ్యకు అమ్ముకుంటావు? అలా సంపాదించిన డబ్బు మనకు సరిపోవడం లేదు. నీవు పట్టణం వెళ్ళి పెట్రోల్‌తో చెట్లను కోసే యంత్రం కొనుక్కురా. ఆ యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు నరికి, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు,” అంది.
దొండయ్య తన భార్య చెప్పిన ప్రకారం పట్టణం వెళ్ళి, చెట్లు కోసే యంత్రాన్ని కొంత డబ్బు వెచ్చించి ఇంటికి తెచ్చాడు. మరుసటి రోజు ఉదయం అడవికి ఆ యంత్రాన్ని తీసుకెళ్ళి చెట్లు కోయడం ప్రారంభించాడు. సాయంత్రానికి బండెడు కట్టెలు సిద్ధం అయ్యాయి. వాటిని చూసి దొండయ్య సంతోషంతో పొంగిపోయాడు.
“రాత్రయింది” అనుకుని ఆ కట్టెలను అక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి చేరిన దొండయ్య — “ఈ రోజు యంత్రం సహాయంతో బండెడు కట్టెలు కొట్టగలిగాను!” అని ఆనందంగా భార్యకు చెప్పాడు.
అయితే వెంటనే ఆలోచనలో పడిపోయి, “అవి అంత కట్టెలు పక్క ఊరికి ఎలా తీసుకెళ్ళి అమ్మాలి? మన దగ్గర ఉన్నది ఒక్క సైకిల్ మాత్రమే,” అన్నాడు.
ఆ మాట విన్న భార్య బీరమ్మ —“బొగ్గులబట్టి జగ్గయ్య దగ్గర కొంత అప్పు తీసుకుని, రెండు ఎద్దులు, ఎద్దుల బండి కొనుక్కోండి,” అంది.
దొండయ్య జగ్గయ్య దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని, పక్క ఊరి సంతలో రెండు ఎద్దులు, ఒక ఎద్దుల బండి కొనుక్కొచ్చాడు. తరువాత రోజు అడవికి వెళ్లి ఆ కట్టెలను బండిలో పెట్టుకొని, జగ్గయ్య దగ్గర అమ్మాడు. దొండయ్య జీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ చూడనింత డబ్బు ఆ రోజు చేతికి వచ్చింది.
కొద్ది రోజుల్లోనే జగ్గయ్య దగ్గర తీసుకున్న అప్పు తీర్చేశాడు. ఇలా నెల రోజులు గడవకముందే దొండయ్య ఇంట్లో చాలామొత్తం డబ్బు కనిపించింది. దొండయ్య కుటుంబం “మూడు పువ్వులు, ఆరు కాయలు” మాదిరిగా సాగుతుండేది.
కానీ చూస్తూచూస్తుండగానే ఊరడవిలో చెట్లు తగ్గిపోయాయి. దొండయ్యకు మాత్రం సంపాదన మీద ఆశ ఇంకా ఎక్కువైంది. రోజు వెళ్ళినట్లే ఆ రోజు కూడా ఎద్దుల బండి కట్టుకొని, చెట్లు నరికే యంత్రాన్ని తీసుకుని అడవికి వెళ్ళాడు.
చెట్లను సాయంత్రం వరకు కోస్తూనే ఉన్నాడు. అలా కోస్తుండగా ఒక పెద్ద చెట్టు కొమ్మ ఒక్కసారిగా వచ్చి దొండయ్య మీద పడింది. ఆ కొమ్మ తగిలి దొండయ్య నడుముబొక్క విరిగి, తీవ్రమైన గాయాలు అయ్యాయి. పైకి లేవలేకపోయాడు. అక్కడే పడుకుని, “అమ్మా! అయ్యో! ఎవరైనా కాపాడండి!” అని అరిచాడు.
చీకటి పడుతున్న కొద్దీ ఎవ్వరూ అక్కడ కనిపించలేదు. భయం పట్టేసింది. “ఈ రోజు నేనేమో చనిపోతానేమో! క్రూరమృగాలు వచ్చి నన్ను తినేస్తాయేమో!” అనుకుంటూ ఏడవసాగాడు.సమయం గడుస్తున్న కొద్దీ చీకటి పెరుగుతూనే ఉంది.
అప్పుడే దొండయ్యకు ఎవరో దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది.“నీవెవరు?” అని అడుగుతూ, తనను రక్షించమని వేడుకున్నాడు.
మానవ రూపంలో ఉన్న ఒక అడవి మనిషి అతడి దగ్గరికి వచ్చాడు.దొండయ్య ఎంత బ్రతిమిలాడినా, ఆ అడవి మనిషి అతని మనవి తిరస్కరించాడు.సహాయం చేయడానికి ఒప్పుకోలేదు.
దొండయ్య అన్నాడు —“ఇన్ని రోజులు కొంత డబ్బు సంపాదించుకున్నాను. అందులో నీకు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను!”
ఆ మాట విన్న అడవి మనిషి —“డబ్బు వద్దు. కానీ నేను చెప్పిన పని చేస్తేనే నిన్ను రక్షిస్తాను,” అన్నాడు.
దొండయ్య వెంటనే, “ఏ పని అయినా చేస్తాను!” అని ఒప్పుకున్నాడు.
అడవి మనిషి అన్నాడు —“నీవు ఇకపై అడవిలో చెట్లు నరకడం ఆపివేయాలి.”
దొండయ్య అబ్బురపడి —“నా బతుకుదెరువు అదే కదా! చెట్లు నరకకుండా నా కుటుంబాన్ని ఎలా పోషించాలి?” అని అడిగాడు.
అడవి మనిషి చిరునవ్వుతో —“నేను ఒక చెట్టును చూపిస్తాను. ఆ చెట్టు కింద రాలే పండ్లను ఏరుకుని అమ్ము. అలాగే, ఇన్ని సంవత్సరాలుగా నీవు ఎన్ని చెట్లు నరికావో, వాటి స్థానంలో ఈ చెట్లను నాటి పెంచు,” అన్నాడు.
ప్రాణాలు కోల్పోవడం కంటే జీవించడం మేలని భావించిన దొండయ్య ఆ మాటను ఒప్పుకున్నాడు.
కొద్ది రోజులలో దొండయ్య గాయాలు తగ్గిపోయి మంచిగా అయ్యాడు. తరువాత అడవికి వెళ్లి, అడవి మనిషి చెప్పినట్లు చెట్టు పండ్లు ఏరుకుని పక్క ఊర్లలో అమ్మి డబ్బు సంపాదించేవాడు. అలాగే తాను నరికిన చోట్ల కొత్త మొక్కలు నాటడం మొదలుపెట్టాడు.
కొన్ని నెలల్లో ఆ మొక్కలు పెద్ద చెట్లుగా పెరిగి, పండ్లతో నిండిపోయాయి.ఆ పండ్లను దొండయ్య–బీరమ్మ ఇద్దరూ ప్రతి రోజు ఏరుకుని అమ్మి మంచి డబ్బులు సంపాదించి జీవించేవారు. తాను చేసిన తప్పును తెలుసుకున్న దొండయ్య దానిని ఒప్పుకుని, ప్రకృతి పట్ల కృతజ్ఞతతో సంతోషంగా జీవించాడు.
***
కొండేటి ప్రకాష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/prakashk

పేరు: కొండేటి ప్రకాష్
జిల్లా: నల్లగొండ
తెలంగాణ




Comments