top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 10

Updated: 2 days ago

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesInTelugu

ree

Case No. 37B - Part 10 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 23/10/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. శరత్ కూడా విజయవాడకు వస్తాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. 


కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక, తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్ తో సహా గీచి, శరత్ కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్లిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. పారిపోతున్న దుండగుల కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్. 



ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 10 చదవండి.. 


ఉదయం నిద్రలేస్తూనే ఏదో హడావుడి వాతావరణం గమనించింది కార్తీక. "ఏమైందని" దగ్గరలో ఉన్న సహాయకుడిని అడిగింది. 


"ఇవాళ పనివారు ఎవరూ రారని కబురు వచ్చింది మేడం. విషయం ఏమిటో కనుక్కోవాలని సర్ వెళ్ళేరు" అన్నాడతను. 


"విషయం ఏమైందో తెలిసిందా?" రోజు కంటే ఆలస్యంగా నిద్రలేచింది తను. ఎందుకో అలారం కొట్టినా, ఆపేసి మరీ నిద్రపోయింది. త్వరగా మెలకువ రాలేదు. కాలకృత్యాలు తీర్చుకుని, తయారై బయటకు వచ్చేసరికి ఈ హడావుడి కనిపించింది. 


"మన దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం అంతా పొద్దున్న నిద్రలేచేసరికి స్పృహ తప్పి ఉన్నారట మేడం. అందరిని ఆసుపత్రిలో చేర్చారట. అంతవరకే తెలుసు మేడం" అన్నాడు సహాయకుడు. 


ఇంతలో ప్రొఫెసర్, ఆయనతో పాటు వెళ్లిన మరో ఇద్దరూ వస్తూ కనిపించారు. గబగబా ఎదురెళ్లి వారిని కలిసింది కార్తీక. 


"ఏమైంది సర్, ఏమిటి విషయం?" ఆత్రుత అణచుకోలేక అడిగింది. 


"మన దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం రాత్రి మామూలు గానే ఉన్నారటమ్మా.. ఉదయం ఎంతకీ ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోతే, పక్కింటి వారు తలుపులు నెట్టి చూసేసరికి అందరూ స్పృహ తప్పి ఉన్నారట. ఇజాక్, భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి, తండ్రి, తమ్ముడు సీమోను మొత్తం ఏడుగురు. 


మొదట ఏవో ఉపచారాలు చేశారు. ఇంకా స్పృహ రాకపోతే దగ్గరలోని ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మన పనివారిలో కొందరు వారికి సహాయంగా వెళ్లారు. 


మిగతావారందరూ విచారంగా ఉన్నారు. ఒక కుటుంబం మొత్తం ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడంతో ఊరంతా ఆశ్చర్యపడి ఉంది. మేము వెళ్తే తెలిసిన విషయం అది. అక్కడి నుంచి ఎవరైనా వస్తే కానీ మిగతా వివరాలు తెలియవు. " సహాయకుడు తీసుకువచ్చిన టీ అందుకుంటూ చెప్పేరాయన. 


"ఈరోజు తవ్వకాలు లేవు. పనివారందరికి సెలవు ప్రకటించినట్లు" చెప్పారు ప్రొఫెసర్. 


కార్తీక ఆలోచిస్తూ టీ అందుకుంది. హఠాత్తుగా శరత్ గుర్తుకు వచ్చాడామెకు. ఎందుకో ఈ విషయం శరత్ కు చెప్పాలనిపించింది. వెంటనే టీ తాగి, ప్రొఫెసర్ కి చెప్పి, ఫోన్ తీసుకుని బయటకు వచ్చింది. శరత్ కు ఫోన్ చేసింది. 


"హాయ్ కార్తీక శుభోదయం"


"శుభోదయం శరత్ గారు"


"ఏమిటి విషయం? ఇంత ఉదయాన్నే నేను జ్ఞాపకం వచ్చాను?" అడిగాడు శరత్. 


"ఈరోజుకి వాకింగ్ అయిపోయిందా?" అడిగింది కార్తీక. 


"అయ్యింది. పేపర్ చూస్తున్నాను. ఇంతకీ విషయం ఏమిటో చెప్పలేదు. " అన్నాడు శరత్. 


"మీ పేపర్ న్యూస్ మించిన వార్త ఇస్తాను. బహుశా ఇది మీకు అవసరమౌతుందో లేదో తెలీదు. " అంది కార్తీక. 


"అయ్యో.. విషయం చెప్పండి కార్తీక.. సస్పెన్స్ భలే క్రియేట్ చేస్తున్నారే.." నవ్వాడు శరత్. 


"నేను నిన్ననే బొర్రా వచ్చాను. ఇవాళ మాకు సెలవు వచ్చింది. ఉదయాన్నే ఒక సంఘటన జరిగింది. " అంటూ జరిగిందంతా చెప్పింది కార్తీక. 


వింటూనే తుళ్ళిపడ్డాడు శరత్. "ఒక్క నిమిషం కార్తీక.. మరొక్కసారి వారి పేర్లు చెప్పండి.." అన్నాడు


"అందరి పేర్లు తెలీదు. మా పనివాడు ఇజాక్, వాడి తమ్ముడు సీమోను పేర్లు మాత్రమే సర్ చెప్పారు. ఎందుకు?" కుతూహలంగా అడిగింది కార్తీక. 


"ఓహ్. గాడ్.. కార్తీక.. నా అనుమానం నిజమైతే వారందరూ చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరేం కంగారుపడవద్దు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దు. నేను మా బాస్ కి చెప్పి, ఇప్పుడే బయలుదేరుతాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్యూ కార్తీక. " అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. 


వెంటనే కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి, విషయం చెప్పి, "తన అనుమానం నిజమైతే, తాను విచారించిన హోటల్ బాయ్ పేరు సీమోను అని, ఇప్పుడు స్పృహ తప్పిన వాని తమ్ముడు కూడా సీమోను అని, అందుచేత ఆ ఇంటివారంతా బహుశా నిషేధిత మత్తు పదార్థం వినియోగించి ఉంటారని, అందుకే స్పృహ తప్పిపోయారని" చెప్పాడు. "వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తానని, శరత్ ను అరుకు వెళ్లి పరిస్థితి గమనించి రమ్మని" చెప్పేరు కామేశ్వరరావు. 


*****

శరత్ బొర్రా బయలుదేరి వెళ్ళాడు. నేరుగా కార్తీక దగ్గరకు వెళ్ళాడు. ప్రొఫెసర్ కూడా అక్కడే ఉన్నారు. ఇజాక్ వాళ్ళది బొర్రాకు చేరువలో ఉన్న ఒక చిన్న గూడెం. ఆ ఊరు కూడా బొర్రా పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఊరంతా విషాదంగా ఉంది. ఎక్కడా, ఎవరూ వంట కూడా చేస్తున్నట్లు లేదు. అందరూ ఇళ్ళ ముందున్న అరుగులపై కూర్చుని ఉన్నారు. ప్రొఫెసర్ గారు తన వాళ్ళతో చెప్పి, అనంతగిరి నుంచి సరుకులను, కొద్దిమంది మనుషులను తెప్పించి, ఊరందరికి కూడా వంట చేయిస్తున్నారు. వాళ్ళకి ఏమి జరగదని, ధైర్యంగా ఉండమని చెప్పి వచ్చారు. ఇంతలో వంట అయ్యిందని సహాయకుడు వచ్చి చెప్పాడు. అందరిని రమ్మని ఆకుల్లో వేడి వేడి సాంబారు అన్నం వడ్డించారు. 


మొదటగా పిల్లలు వచ్చారు. మనసులో విషాదం ఉన్నా, కడుపులో కాలే ఆకలి కుదురుగా ఉండనివ్వదు. పిల్లలను చూసి, గర్భిణులు, బాలెంత స్త్రీలు, వృద్ధులు వచ్చారు. వారి తర్వాత స్త్రీలు, పురుషులు కూడా వచ్చి, వరుసలో నిలిచి భోజనం అందుకుని ఆకలి తీర్చుకున్నారు. వండిన వారు, ప్రొఫెసర్ గారు, సహాయకులు, కార్తీక, శరత్ అందరూ భోజనాలు చేశారు. 


ఇక్కడి నుండి ఆసుపత్రికి కొందరు బయలుదేరి వెళ్లారు. ముందు వెళ్లినవారు తిరిగివచ్చారు. వచ్చిన వారిని ముందు భోజనం చేయమన్నారు ప్రొఫెసర్ గారు. వారు భోజనం చేసి వచ్చాక, అక్కడి పరిస్థితి కనుక్కున్నారు. "ఇంకా ఎవరికి స్పృహ రాలేదని, అందరూ అపస్మారకంగానే ఉన్నారని, కొత్త డాక్టర్లు వచ్చారని, చూస్తున్నారని" అందరికి చెప్పారు వాళ్ళు. 


ప్రొఫెసర్ గారికి చెప్పి, ఇజాక్ ఇల్లు సోదా చెయ్యడానికి ఆ గ్రామ పెద్ద అనుమతి తీసుకున్నాడు శరత్. ప్రొఫెసర్ గారు శరత్ ను పోలీస్ గా గ్రామపెద్దకు పరిచయం చేశాడు. అప్పటికే ఒకటి రెండుసార్లు ఆ ప్రాంతంలో శరత్ ని చూసి ఉండటంతో గ్రామపెద్ద అభ్యంతరం చెప్పలేదు. శరత్ తో పాటు కార్తీక కూడా ఇజాక్ ఇంటికి బయలుదేరింది. ఇజాక్ ఇల్లు అందరి ఇళ్ళలాగే ఒక గుడిసె. అందులోనే ఏడుగురు ఉంటున్నారంటే ఆశ్చర్యం వేసింది కార్తీకకు. వంట చేసిన గిన్నెలు ఓ పక్క ఉన్నాయి. వంట పొయ్యి ఇంటి బయట ఉంది. వంట దినుసుల కోసం వెతికాడు శరత్. బియ్యం, మిరపకాయలు, ఉల్లిపాయలు, నూనె వాటి పక్కనే ఉప్పు, కారం పేకెట్లు ఉన్నాయి. ఉప్పు తీసుకుని పరిశీలించాడు. తన అనుమానం నిజమే అయ్యింది. సీమోను తనని మోసం చేసాడు. ఒక్కటే పేకెట్ తీసాను అని చెప్పాడు. ఆ పేకెట్ మాత్రమే తనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకోటి కనిపించింది. జాగ్రత్తగా అక్కడ ఉన్న పెట్టెలు వెతికాడు. ఒక పెట్టెలో చిన్న చిన్న పొట్లాలు రెండు దొరికాయి. అంతే మరి లేవు. బహుశా వెళ్లే తొందరలో వాళ్ళు మర్చిపోతే సీమోను ఇంటికి తెచ్చి ఉంటాడు. లేదా వాళ్ళు చాపరాయి దగ్గర ఉన్నప్పుడు దొంగతనం చేసి ఉండొచ్చు. అదే ఇప్పుడు కొంపముంచింది. బహుశా ఇజాక్ భార్య లేదా తల్లి వంట చేసే సమయంలో ఉప్పుకు బదులు దీనిని వాడినట్లున్నారు. మోతాదు మించేసరికి అందరూ స్పృహ తప్పారు. విషయం అర్ధమయ్యింది శరత్ కి. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి, తన వేలిముద్రలు పడకుండా తుడిచేసి, బయటకు వచ్చాడు శరత్. అర్ధం కానట్లు చూస్తున్న కార్తీకకు, ఇంతకు ముందు నేరపరిశోధనకు అరుకు వచ్చినట్లు, సీమోనును హోటల్ దగ్గర కలిసినట్లు, జరిగిన విషయం అంతా చెప్పాడు. 


కార్తీక విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తాను ఎంతటి ప్రమాదం నుంచి బయటపడిందో తలచుకొని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంది. ప్రొఫెసర్ గారిని కలిసి, తాను చూసిన విషయాలు వివరించాడు శరత్. అధికారుల ద్వారా అన్ని విషయాలు తెలిసేవరకు, తాను పరిశోధించిన విషయం గోప్యంగా ఉంచమని కోరాడు. మత్తు పదార్థాలు ఎలా యువతను నిర్వీర్యం చేస్తున్నాయో సోదాహరణంగా వివరించారు ప్రొఫెసర్ గారు. వాటికి బానిసైన వారి పరిస్థితి, తిరిగి మామూలు వ్యక్తులుగా మార్చడానికి ఎంత కష్టం అవుతుందో, వారి వలన దేశానికి ఎంత ప్రమాదమో ఉత్సాహంగా వివరిస్తున్నారు. 


శరత్ కామేశ్వరరావు గారికి విషయం తెలియజేయాల్సి ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ గారి ఉపన్యాసం కొనసాగుతోంది. మధ్యలో లేచి వెళ్లడం సభ్యత కాదు. అందరూ ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు శరత్ కి. ఇంతలో ఆపద్భాంధవునిలా కామేశ్వరరావు గారే ఫోన్ చేశారు. ప్రొఫెసర్ గారికి చెప్పి, బయటకు వచ్చాడు శరత్. "హోటల్ లో విచారించిన సీమోనే ఇక్కడ పనివాడి తమ్ముడని, ఆ పేకెట్ లో పదార్ధాన్ని ఉప్పుగా భావించి ఇంటివారు వంటకాల్లో వాడటంతో అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారని, అక్కడ ఇంకా చాలా పొట్లాలున్నాయని చెప్పి, ఈ అమాయక గిరిజనుల మీదకు కేస్ రాకుండా చూడమని" అర్ధించాడు శరత్. "మాదకద్రవ్యాల నిరోధక శాఖ వారితో మాట్లాడతా"నని చెప్పాడు కామేశ్వరరావు. 


ఈలోగా ఆసుపత్రికి తోడుగా వెళ్లిన వారు వచ్చేసారు. వారు తెచ్చిన సమాచారానికి అందరూ కాస్త ఆందోళనకు గురయ్యారు. పెద్దవాళ్ళు ఐదుగురూ ప్రమాదం నుంచి బయటపడ్డారని, అందరికి వాంతులు చేయించి, కడుపు శుభ్రం చేసారని, సెలైన్ పెట్టారని, అందరూ ఇంకా మగత లోనే ఉన్నారని, రేపటికి అందరూ స్పృహ లోకి వస్తారని చెప్పారు. విన్న అందరూ సంతోషించారు. కానీ పిల్లలు మాత్రం యింకా ప్రమాదస్థితిని దాటలేదని, వారి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పడంతో అందరూ కాస్త బాధపడ్డారు. ప్రొఫెసర్ గారు అందర్నీ వారి వారి పనుల్లోకి వెళ్ళమన్నారు. శరత్ కూడా ప్రొఫెసర్ గారికి, కార్తీకకు చెప్పి బయలుదేరాడు. 


ఈ గొడవ సర్దుమణిగి, అందరూ కుదురుకునే వరకు వారం రోజుల పాటు తవ్వకాలను ఆపేస్తున్నట్లు ప్రకటించారు ప్రొఫెసర్ గారు. అందరూ తమతమ సామాన్లు సర్దుకుని బస్ స్టాండ్ వైపు బయలుదేరారు. కార్తీకను ప్రొఫెసర్ గారు తన కార్ లో రమ్మని ఆహ్వానించారు. ప్రొఫెసర్ గారి కారు అరుకు నుండి బయలుదేరుతూ ఉండగా, విజిలెన్స్, ఎక్సయిజ్, పోలీస్ జీపులు ఊళ్లోకి వచ్చాయి. ఏదైనా అవసరం ఉంటుందేమో అని ప్రొఫెసర్ గారు "కాసేపు ఆగి వెళదాం" అన్నారు కార్తీకతో. 


పోలీసులు ఇజాక్ ఇల్లు ఎక్కడో కనుక్కుని అటు వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి, సోదాలు నిర్వహించారు. అక్కడ దొరికిన మాదకద్రవ్యాల పొట్లాలు తీసుకున్నారు. రాత్రి తినగా మిగిలిన ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. జీపులు వచ్చిన అలికిడికి మళ్ళీ గ్రామ ప్రజలందరూ పనులు మాని గుమిగూడారు. బయట గుమిగూడిన ప్రజలతో రాత్రి జరిగిన సంఘటన గురించి పోలీసులు విచారించారు. 


"రాత్రి మామూలుగానే వంట చేసుకున్నారని, అందరూ ఇక్కడే తిన్నారని, గిన్నెలు శుభ్రం చేసి, మిగిలిన వంట లోపల పెట్టేసి అందరూ నిద్రపోయారని, ఉదయం ఎంతకీ లేవకపోతే ఒకరిద్దరు వెళ్లి చూసి, తట్టి లేపారని, ఇంట్లో ఎవరూ లేవకపోతే అప్పుడు అందరికి చెప్పారని" చెప్పారు. మరికొంతసేపు ఒక్కొక్కరినీ విచారించి, ప్రొఫెసర్ గారి దగ్గరకు వచ్చారు పోలీసులు. 

 

"ఇజాక్ మీ దగ్గరేనా పనిచేస్తున్నాడు?"


"అవును సార్"


"ఇజాక్ ఎలాంటివాడు?"


"మంచివాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తాటికల్లు, ఈతకల్లు, మడ్డికల్లు తాగడం అలవాటు. ఇజాక్ కూడా అంతే. అది కూడా పని వేళలు అయ్యాకే తాగుతారు. " చెప్పాడు ప్రొఫెసర్. 


"ఇజాక్ తండ్రి, తమ్ముడు సీమోను గురించి ఏం తెలుసు?" అడిగాడు పోలీస్. 


"తెలియదండి. వాడి తమ్ముడు సీమోను ఒక హోటల్ లో బాయ్ గా చేస్తున్నాడని మాత్రం తెలుసు" చెప్పాడు ప్రొఫెసర్. 


"ఏ హోటల్? ఎక్కడ ఉంది?" ప్రశ్నించాడు పోలీస్. 


"నాకు తెలియదండి" ప్రొఫెసర్ చెప్పారు. 


"సరే మీరు వెళ్ళండి" అని ప్రొఫెసర్ కారును పంపేశారు పోలీసులు. ఊళ్ళో ఉన్న మిగతావారికి ప్రశ్నించడానికి వెళ్లారు. 


ప్రొఫెసర్, కార్తీక విశాఖపట్నం వచ్చేవరకు ఏమి మాట్లాడుకోలేదు. ప్రొఫెసర్ తన తవ్వకాలలో పరిశోధన ఎంతవరకు వచ్చిందో బేరీజు వేసుకుంటూ, పైల్స్ చూసుకోగా, కార్తీక ఆరోజు విశేషాలను డైరీ లో రాసిపెట్టుకుంది. 


========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

Comments


bottom of page