top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 11

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesInTelugu

ree

Case No. 37B - Part 11 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 29/10/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. 


కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక, తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్ తో సహా గీచి, శరత్ కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్లిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. పారిపోతున్న దుండగుల కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్. ప్రొఫెసర్ శ్యాం సుందర్ దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం మత్తుమందు ప్రభావం వల్ల హాస్పిటల్ లో చేరుతారు. 



ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 11 చదవండి.. 


శరత్ విశాఖపట్నం చేరగానే, అడిస్ కార్యాలయానికి వెళ్ళాడు. కామేశ్వరరావు గారిని అడిగి, పోలీస్, ఎక్సయిజ్, నార్కోటిక్ వారికి ఇచ్చిన వివరాలు తెలుసుకున్నాడు. విశ్వవిద్యాలయం హాస్టల్ లో పది మంది కుర్రాళ్లను అరెస్ట్ చేసారని, వారిని చికిత్స కోసం కె.జి.హెచ్ కు తరలించారని. వారి దగ్గర ఉన్న మత్తుపదార్ధాలు స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్నాడు. ఒరిస్సా యువకుని దగ్గర వివరాలు సేకరించడానికి బయలుదేరాడు శరత్. 


కె.జి.హెచ్ లో ఒరిస్సా యువకుని గదిలోకి వైద్యుని అనుమతి తీసుకొని వెళ్ళాడు శరత్. ఆ యువకునికి మెలకువ వచ్చిందని తెలిసింది. అప్పటికే అక్కడ పోలీసులు వచ్చి ఉన్నారు. ఆ యువకుని పేరు బిష్ణుగా తెలిసింది. పోలీసులను పలకరించి, తాను కూడా అక్కడ కూర్చున్నాడు శరత్. తనతో పాటు ఉన్న ఇద్దరు బినోయ్, జీతూ అని, తమ స్వస్థలం ఒరిస్సాలో రాయగడా అని తెలియజేశాడు. పోలీసుల విచారణ మాదకద్రవ్యాల దిశగా కొనసాగుతుండడంతో శరత్ మౌనం వహించాడు. విశాఖపట్నంలో వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామా చెప్పాడు. వెంటనే రెండు బృందాలు వారు ఉంటున్న ఇంటివైపు, ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, లాడ్జిలలోను బినోయ్, జీతూలను వెతకడానికి వెళ్లాయి. వాళ్లకు కావలసిన వివరాలు తీసుకున్నాక పోలీసులు వెళ్లిపోయారు.


"ఇప్పుడు చెప్పు బిష్ణు… నేను పోలీసుల్లా నువ్వు చెప్పింది వినేసి వెళ్లిపోను. నీకు నా సంగతి తెలుసు. మీ ముగ్గురు అరుకు వెళ్ళినపుడు మీతో ఒక అమ్మాయిని తీసుకువెళ్లారు. ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? అరుకులో మీరేం చేశారు?" గట్టిగా నిలదీసాడు శరత్.


ఇంతవరకు పోలీసుల దృష్టి ఆ విషయం మీదకు వెళ్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్న బిష్ణు ఒక్కసారిగా తెల్లబోయాడు. బిష్ణు మొహంలో మారుతున్న రంగులను గమనించాడు శరత్. ఆదుర్దా పడటాన్ని గుర్తించాడు. 


"ఇది… ఇది… మీకెలా తెలుసు?" నోరు తడి ఆరిపోతుండగా మాటలు కూడదీసుకుంటూ అడిగాడు బిష్ణు.


"నాకు అన్నీ తెలుసు. నీ చేత చెప్పించాలన్నదే నా ఉద్దేశ్యం." అన్నాడు శరత్.


"నాకు… నాకు… ఏం తెలీదు. నాకేం తెలీదు" అన్నాడు బిష్ణు మొండిగా.


"మాదకద్రవ్యాలు తీసుకుని అమ్మాయిలతో అసహ్యంగా ప్రవర్తించడం తెలుసు... పగలు రాత్రి తేడాలేకుండా పశువుల్లా ప్రవర్తించడం తెలుసు… అవసరం తీరిపోతే అమ్మాయిలను వాళ్ళ ఖర్మానికి వదిలేయడం తెలుసు…" గట్టిగా బిష్ణు చెంపలు వాయించాడు శరత్


"నిజం చెప్పకపోతే చంపేస్తా వెధవా… చక్కగా చదువుకోవాల్సిన వయసులో మత్తులో మునగడమే కాకుండా మరి కొంతమందికి కూడా ఆ అలవాటు చేస్తారా? థూ… మీవి ఓ బతుకులేనా?" అన్నాడు శరత్ ఆవేశంగా.


మరోసారి పిడికిలి ఎత్తబోతున్న శరత్ కు దండం పెట్టి "చెప్తాను సర్, కొట్టకండి" అన్నాడు బిష్ణు.


బిష్ణు నోటివెంట వాస్తవాల జడివాన కురవసాగింది. శరత్ జేబులోని మినీ టేప్ రికార్డర్ తన పని నిశ్శబ్దంగా చేసుకుపోతోంది. 

*******


హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి కంగారు పడ్డారు సత్యనారాయణ, విశాలాక్షి. విషయం వివరించి చెప్పింది కార్తీక. ఇజాక్ కుటుంబానికి కలిగిన కష్టం గురించి బాధపడ్డారు వారిద్దరూ. కార్తీక భోజనం చేసి మంచంపై వాలింది. ఇంటికి వచ్చిన కార్తీకకు ఒక వారం ఖాళీ అనేసరికి ఏం చేయాలో తోచలేదు. పగలంతా ఏర్పడిన చికాకు పరిస్థితులు, అనుకోని ప్రయాణం కాస్త మనసుని ఇబ్బంది పెట్టాయి. ఇజాక్ గురించి తలచుకోగానే ఆలోచనల గొలుసు పరుగెత్తింది. వాళ్ళింట్లో మత్తుపదార్ధాలు దొరకడం, అంతకు ముందు అవి సేవించిన యువకులు, వాళ్ళు తనని కిడ్నాప్ చేయడం, తప్పించుకుని బొగ్గు బండిలో విజయవాడ రావడం, ఆసుపత్రిలో చేరడం, అక్కడ నుండి దుర్గ గుడికి వెళ్లడం, తిరిగి వచ్చినపుడు శరత్ ని కలవడం, శరత్ తనగురించే వెతుకుతూ ఉండటం…అన్నీ ఒక్కొక్క ఫ్రేమ్ గా కళ్ల ముందు కదలాడాయి. నిద్రపట్టక లేచి కూర్చుంది.


శరత్ గురించి తలచుకోగానే మంచి స్నేహితుడు, పట్టుదల గల వ్యక్తి, చేపట్టిన పని పూర్తిచేయగలిగిన కార్యశీలిగా అనిపించాడు. కార్తీక నిద్రపోతోందని భావించి గదిలోకి వచ్చి చూసిన విశాలాక్షికి మంచంపై కూర్చుని ఆలోచిస్తున్న కూతురు కనిపించింది.


"ఏమిటి ఆలోచిస్తున్నావమ్మా?" అడిగింది విశాలాక్షి కూతురి పక్కనే కూర్చుంటూ.


"ఇజాక్ కుటుంబం గురించి ఆలోచిస్తే, నా కిడ్నాప్, తప్పించుకోవడం అన్నీ గుర్తొచ్చాయమ్మా…" అంది కార్తీక.


"చెప్పకు తల్లీ! భయం వేస్తోంది ఆ రోజులను తలచుకుంటే. ఏ దేముడో కరుణించి, నీకు తప్పించుకునే అవకాశం కల్పించాడు. లేకపోతే ఏమైపోయేదానివో" భయంగా చెప్పింది విశాలాక్షి.


"సర్లే వదిలేయమ్మా. ఇప్పుడు ఏ విషయం మాట్లాడదామని వచ్చావు?" అంది కార్తీక తల్లి వడిలో తలపెట్టుకుని పడుకుంటూ…


"రాత్రి వంటలోకి ఏం చేయను? వారం రోజులు తీరిక దొరికింది కాబట్టి నాకు వచ్చిన అన్ని వంటలు చేసి పెడతాను. నువ్వు కాదనకుండా తినాల్సిందే." ఆప్యాయంగా చెప్పింది విశాలాక్షి. 


"అమ్మా! ఉదయం ఒకసారి మా ప్రొఫెసర్ గారు అందరికి భోజనాలు పెట్టేసారు. మళ్ళీ ఇంటికి రాగానే తిన్నాను. ఇప్పుడు రాత్రి మరోసారి తినాలా… వద్దమ్మా…" గారాలు పోయింది కార్తీక.


"సర్లే రాత్రికి అన్నం వండను. తేలిగ్గా ఉండే ఫలహారం చేస్తాను. నువ్వు మొహం కడుక్కుని రా. మీ నాన్నగారు ఎదురుచూస్తున్నారు." అంది విశాలాక్షి.


"నాన్నగారు ఎదురుచూస్తున్నారా? ఎందుకబ్బా… ఇదిగో క్షణంలో వస్తున్నా… పద." అని ముఖం కడుక్కుని బయటకు వచ్చింది కార్తీక. డైనింగ్ టేబుల్ దగ్గర కూనిరాగాలు తీస్తూ సత్యనారాయణ కనిపించారు.


"నాకోసం ఎదురుచూస్తున్నారంది అమ్మ" అడిగింది కార్తీక.


"నీకోసమే ఎదురుచూస్తున్నానమ్మా… అయితే మాట్లాడటానికి కాదులే… జున్ను కలిసి తిందామని" అన్నారు సత్యనారాయణ నవ్వుతూ…


సాభిప్రాయంగా భర్త వైపు చూసింది విశాలాక్షి. ఇద్దరి ముందు చిన్న గిన్నెలతో జున్ను తెచ్చి పెట్టింది. తాను కూడా ఒక చిన్న గిన్నెతో జున్ను తెచ్చుకుని కార్తీక పక్కన కూర్చుంది.


"కార్తీక! నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. నీ అభిప్రాయం చెప్పు. చదువు అయిపోయింది. ఉద్యోగం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు?" అన్నారు సత్యనారాయణ.


"ఓహ్ అదా ఈ జున్ను సమావేశం." అంది కార్తీక నవ్వేస్తూ.


"నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా?" అడిగింది విశాలాక్షి.


అలా అడగగానే శరత్ మదిలో మెదిలాడు కార్తీకకు. ఆ ఆలోచనను పక్కన పెట్టి "ఎవరూ లేరమ్మా" అంది కార్తీక.


"సరే అయితే ఇవాళే పెళ్లి సంబంధాల బ్యూరో వాళ్ళకి నీ వివరాలు ఇస్తాను. అలాగే తెలిసిన వాళ్లకు కూడా నీ గురించి చెప్తాను." అన్నారు సత్యనారాయణ.


జున్ను తినడం పూర్తి చేసి లేచారు ముగ్గురూ.


చదరంగం బోర్డు, పావులు పట్టుకుని మామిడిచెట్టు కిందకి వచ్చారు తండ్రి, కూతురు. 


ఇంతలో గేటు తీసుకుని వస్తున్న వ్యక్తిపై ఇద్దరి చూపు పడింది. తండ్రి కూతురు ముఖాలు చూసుకున్నారు. వచ్చింది శరత్.


తన వైపు ప్రశ్నర్థకంగా చూడటం గమనించిన శరత్, "మధ్యాహ్నమే కలుసుకున్నాం, మళ్ళీ ఇంతలో వచ్చానని ఆలోచిస్తున్నారా? లేదా రాకూడని సమయంలో వచ్చానా?" అన్నాడు. 


"అదేం లేదం"టూ రమ్మని ఆహ్వానించింది కార్తీక. 


"కార్తీక గారూ… మీరు చెప్పిన సంఘటనలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి." అన్నాడు శరత్ ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా…


"ఏ సంఘటన? ఏం అనుమానాలు?" అడిగింది కార్తీక.


ఈలోగా మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది విశాలాక్షి.


"ముందు మంచినీళ్లు తాగి, అప్పుడు సావధానంగా చెప్పండి" అంది కార్తీక.


వెంటనే గ్లాసుడు నీళ్లు తాగి, కొద్దిగా మొహంపై చిలకరించుకుని, జేబులో నుండి రుమాలు తీసి తుడుచుకుని "హమ్మయ్య" అన్నాడు స్వగతంగా.


శరత్ తీరు చూసిన విశాలాక్షికి ఏదో స్ఫురించి, లోపలికి వెళ్లి, ఒక చిన్న గిన్నెతో జున్ను, మరికొన్ని కారపు వస్తువులు తెచ్చి శరత్ ముందు పెట్టింది విశాలాక్షి. 


"ధన్యవాదాలండీ. ఉదయం తిన్న ఆ సాంబారు మెతుకులే… గుక్కెడు మంచి నీళ్లు కూడా గొంతులో పొయ్యలేదు" అంటూ అందుకున్నాడు శరత్. జున్ను కాస్త తిని "అద్భుతం అండీ" అన్నాడు.


కార్తీక శరత్ నే ఆశ్చర్యం గా చూస్తోంది. తాను ఎరిగిన శరత్ కాదితడు. ఏదో ఆదుర్దాగా, అలిసిపోయిన వాడిలా ఉన్నాడు. విశాలాక్షి పెట్టినవి తిని, మరో గ్లాసు మంచినీళ్లు తాగి తెప్పరిల్లాడు. "చాలా చాలా థాంక్సండీ" అన్నాడు నవ్వుతూ.


"ఇప్పుడు చెప్పండి శరత్ గారూ.. వస్తూనే ఏదో అడిగారు" అంది కార్తీక.


క్షణం ఆలోచించాడు. "మీరు కిడ్నాప్ అవడానికి ముందు, తవ్వకాల్లో ఉన్నప్పుడు, ఒక అమ్మాయి, అబ్బాయి పర్యాటకుల హద్దు దాటి వచ్చేసారు అన్నారు కదా?" అన్నాడు శరత్.


"అవును, ఆ అబ్బాయి కాస్త మత్తులో ఉన్నట్లున్నాడు. అమ్మాయిని ఏదో అల్లరి పెట్టబోతే ఆ అమ్మాయి తప్పించుకుని మా వైపు వచ్చింది. ఇటు రాకూడదని ఇద్దర్నీ హెచ్చరించాను. ఆ అమ్మాయి అబ్బాయిని తీసుకుని వెళ్లబోయింది. వెళ్తూ వెళ్తూ ఇంకో ఇద్దరు అబ్బాయిలను పిలిచాడు ఈ అబ్బాయి. వాళ్లిద్దరూ నన్ను చూసి ఒరియా భాషలో వెకిలిగా మాట్లాడుతూ వెళ్లిపోయారు." అంది కార్తీక.


"అప్పుడు ఏదైనా సంఘటన మీ దృష్టికి వచ్చిందా?" 


"లేదు, నేను కూలీలతో రాళ్లు మోయించుకుని బొర్రా గుహల పైభాగానికి చేరుకున్నాను. అక్కడ వీళ్ళు కారు దగ్గర ఉన్నారు." చెప్పింది కార్తీక.


"మీరు ఈ సంఘటన గురించి ప్రొఫెసర్ గారికి చెప్పేరా?" అడిగాడు శరత్.


"లేదు, చిన్న విషయమే కదా అని తేలిగ్గా తీసుకున్నాను." అంది కార్తీక.


"ఇంకేమైనా జ్ఞాపకం వస్తాయేమో ఆలోచించండి. ఒక్కోసారి కళ్ళు చూసిన విషయాన్ని, మెదడు గ్రహించినా, లోపలి పొరలలోకి నెట్టేస్తుంది. అందుచేత మళ్ళీ ఆలోచించండి. నేను రేపు ఉదయం ఫోన్ చేస్తాను." అన్నాడు శరత్. ముగ్గురి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్లిపోయాడు. 


కార్తీకకు ఆశ్చర్యం కలిగింది. ఆలోచనలో పడింది. ఇది అయ్యే పని కాదనుకుని, తండ్రితో చదరంగం మొదలుపెట్టింది. విశాలాక్షి వీరి ఆట చూస్తూ కూర్చుంది.


****

రాత్రి తేలిగ్గా భోజనం కానిచ్చింది కార్తీక. తన గదిలోకి తిరిగి వచ్చాక గూట్లో పెద్దనామాత్యుడు రచించిన స్వారోచిష మనుసంభవం అనే 'మనుచరిత్ర' కనిపించింది. అసంకల్పితంగా చేతిలోకి తీసుకుని చేతికి వచ్చిన పుటను తిప్పింది. బ్రహ్మమిత్రుడు అనే ఆయుర్వేద గురువు శిష్యులకు ఆయుర్వేదమును బోధిస్తున్నాడు. నలనాభుడు అనే గంధర్వుని కొడుకు ఇందీవరాక్షుడు అనేవాడు తన పరిచయం చేసుకున్నాడు. తనకు కూడా ఆయుర్వేదాన్ని నేర్పమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మమిత్రుడు 


నటవిట గాయక గణికా

కుటిల వచశ్శీధు రసము గ్రోలెడు చెవికిన్

గటువీ శాస్త్రము వలది

చ్చట నిను చదివించకున్న జరగదె మాకున్


అని తూలనాడుతాడు. 


"నువ్వు గంధర్వుడవే కావచ్చు, నటులతో, విటులతో, గాయకులతో, వారకాంతలతో సమయం గడుపుతూ, వారితో వ్యర్ధ సంభాషణలు చేస్తూ, ఆనందిస్తూ కాలక్షేపం చేసే మీ చెవులకు ఈ ఆయుర్వేదం కఠినంగా ఉంటుంది. నీకు విద్య నేర్పను. నీకు చదువు నేర్పకపోతే మాకు వచ్చిన కొరత ఏమి లేదు" అని బ్రహ్మమిత్రుడు ‘ఇందీవరాక్షునికి విద్య నేర్పను పొమ్మ’న్నాడు. 


విద్యను నేర్చుకోవాలనుకునే విద్యార్థికి క్రమశిక్షణ, నైతిక వర్తన, శ్రద్ధ చాలా ముఖ్యం. నిత్యం విలాసాలలో మునిగితేలే గంధర్వులకు ఆయుర్వేదంలాంటి అతి జాగరూకతతో నేర్చుకుని, పూర్తిగా అభ్యసించి, తిరిగి వైద్యం చేసి ప్రజలను రోగ విముక్తులను చేయగలిగిన ఓపిక, స్థిరం ఉండవని బ్రహ్మమిత్రుని నమ్మకం. అందుకే తిరస్కరించాడు. గురువు ఎలాంటి శిష్యులను చేర్చుకోగోరుతాడు? శిష్యుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? అనే విషయాలు పెద్దన అన్యాపదేశంగా వివరించారు.


"విద్య నేర్పమని అడిగితే అంత గర్వం చూపిస్తాడు ఈ బ్రాహ్మణుడు. ఇక్కడ విద్య నేర్చుకుంటున్న వారందరూ నాకంటే అధికులా ఏమిటి?" అని ఆలోచించి, ఇందీవరాక్షుడు మాయారూపం ధరించి విద్యార్థులలో కలిసిపోయి, రాత్రి పగలు విశ్రాంతి లేకుండా శ్రమించి, ఆయుర్వేదాన్ని పూర్తిగా నేర్చుకుంటాడు. అప్పుడు నిజరూపం ధరించి "విద్య నేర్పనన్న నీ దగ్గరే ఆయుర్వేదాన్ని నేర్చుకున్నాను" అని హేళన చేసాడు. 


కోపించిన ముని "మోసం చేసి, మాయా రూపంలో విద్య నేర్చుకున్నందున రాక్షసుడవు కమ్మని" ఇందీవరాక్షుని శపిస్తాడు. 


చదువుతూ నిద్రపోయిన కార్తీకకు నిద్రలో ఏవో అస్పష్టమైన కలలు. ఆ కలల్లో అరుకు, బొర్రా గుహలు, ప్రొఫెసర్, కారు దగ్గర నిలబడిన యువకులు అందరూ కనిపించారు. శరత్ మాత్రం కలలోకి రాలేదు.


========================================================================

                                                       ఇంకా వుంది..


కేస్ నెం 37 బి - పార్ట్ 12 త్వరలో..

========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

2 Comments



@nagamanjarig1315

• 5 hours ago

ధన్యవాదాలండీ

Like

@nagarajubhallamudi2297

• 2 hours ago

కథ ..కథా పఠనం రెండూ బాగున్నాయి. నాగ మంజరి గారికి అభినందనలు.భళ్లమూడి నాగరాజు ,రాయగడ

Like
bottom of page