top of page
Original.png

గోడగూచి

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #తెలుగుభక్తికథలు, #Godaguchi, #గోడగూచి

ree

Godaguchi - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 29/10/2025 

గోడగూచి - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


'మాతా చ పార్వతీదేవీ - పితాదేవో మహేశ్వరః.


బాంధవాః శివ భక్తశ్చ - స్వదేశో భువన త్రయమ్'


జీవులు అందరికీ అమ్మ పార్వతీదేవి అయితే, తండ్రి పరమేశ్వరుడు, శివునికి నిజమైన భక్తులు అయినవారు బంధువులు అయితే, ముల్లోకాలు కూడా మన దేశమనే భావన కలిగివుండాలి అని శంకర భగవత్పాదులు చెప్పారు.


అటువంటి భావనలు ఉంటే సులభంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన వద్ద ఏమి తెలియని పసిపాపలాగే ఉండాలి. తల్లిదండ్రుల పైన పసిపిల్లలు ఎంతటి ప్రేమను కలిగివుంటారో, వారిని వదిలి ఉండలేకపోతారో అలాంటి భావనలు భగవంతునిపై కలిగివుండాలి.


తనకు తినమని అమ్మనాన్నలు ఇచ్చిందే వాళ్లకు పెడతానని, వాళ్లు కూడా తినాలని మారాం చేసే పసిపిల్లల వలె ఉంటే గనుక, జగత్తుకే తల్లిదండ్రులు అయినా, అంతటివారు ఆ ప్రేమకు పొంగిపోయి తాము దిగివస్తారు. అనుగ్రహించి, చివరకు తమలోకి తీసుకుని మోక్షాన్ని కూడా ఇస్తారు. అందుకు సాక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటే, ఎందరో భక్తుల చరిత్రలు అందుకు ఉదాహరణలు!


శివ భక్తులైన నాయనార్లలో ఎంతోమంది అలా స్వామి అనుగ్రహం పొందినవారే! ఇంకా ఎందరో శివభక్తులు ఉన్నారు. కొందరు ముసలితనంలో ముక్తిని పొందితే, కొందరు మధ్యవయస్సులో, మరికొందరు పసి వయస్సులోనే ఈ లోకం పోకడలు తెలిసి, సంసారం అనే సాగరం ఈదులాడకుండానే ముక్తిని పొందారు. వారి పూర్వజన్మ సుకృతం! ఆ భోళా శంకరుని అనుగ్రహం!


అటువంటి వారిలో చాలా పసిపిల్లలా ఉన్నప్పుడే, శివుని వద్ద అలాగే మారాం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొంది, ముక్తిని పొందిన ఒక పసిపాప కథనే ఈ గోడగూచి.


పూర్వం శివదేవుడు అనే ఒక గృహస్తు ఉండేవాడు. అతడు మహా శివభక్తుడు. తమ ఊళ్లోని శివాలయంలో అర్చకుడు అతడు. ఆయన రోజూ శివాలయానికి బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసిన తరువాత ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని ప్రతిరోజూ ఎంతో భక్తితో అర్చించేవాడు.


అలా గడిచిపోతుండగా ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లకతప్పని పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగని ఆలోచించాడు.


చివరికి తన కూతురిని దగ్గరికి పిలిచాడు.


“అమ్మా గోడగూచీ! నేనూ, అమ్మ ఊరికి వెళ్తున్నాం! మేము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు తల్లీ!


అలాగే ఇంకో ముఖ్యమైన పని నీకు అప్పజెప్పి వెళ్తాను! జాగ్రత్తగా చేయాలి! అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా! ప్రతిరోజూ నేను శివుడికి పాలు ఇచ్చి వస్తాను కదా! ఇప్పుడు ఆ పని ఎలాగని ఆలోచించాను. శివుడికి రోజూ పాలు ఆరగింపు చేయకపోతే ఎలా? అందుకని ఆ పని నువ్వు చేయాలి! నీకు అప్పజెప్పి వెళ్తాను. రోజూ జాగ్రత్తగా స్వామికి పాలు ఇవ్వాలి నువ్వు. ఆటలు అంటూ ఎటూ వెళ్ళకు తల్లీ!


జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి ఈ పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని సావాసకత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటిపట్టునే వుండి చెప్పిన పని చేయమ్మా! మరచిపోవు కదూ! మా బంగారం కదూ!” అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు.


"అలాగే నాన్నగారూ! తప్పకుండా చేస్తాను. మీరు పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేయండి!' అంది.


అలా ప్రతిరోజూ గుడికి వెళ్లి, పాలు సమర్పించే పని కూతురు గోడగూచికి అప్పగించాడు శివదేవుడు. తర్వాత శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు.


మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా స్నానాదులు ముగించుకొని, మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి, సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.


గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచింది. రెండు చేతులెత్తి స్వామికి భక్తిగా మొక్కింది.


తర్వాత పాల వైపు చేతులు చూపిస్తూ......


“శివయ్యా! ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను! ఆరగించవయ్యా!” అని శివుడికేసి చూస్తూ చెప్పింది.


శివుడు మాట్లాడలేదు. పాలు తాగలేదు.


'ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు? నేను ఇలాగే చూస్తుంటే తాగడం ఎలా అని తాగడం లేదో!' అని అనుకుంది మనసులో.


వెంటనే కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలోకి తొంగి చూసింది. గిన్నెలో ఉన్న పాలు అలాగే ఉన్నాయి. ఆ గిన్నె వైపు విచిత్రంగా చూసింది.


"అయ్యో! శివయ్యా! పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. నీకు తాగటానికి ఏమిటి ఇబ్బంది? ప్రతిరోజూ నాన్నగారు తెచ్చి ఇస్తారు కదా నీకు! అలాగే తీసుకుని వచ్చాను. కానీ కొంచెం కూడా తాగలేదు నువ్వు. ఎందుకు? అన్ని పాలు అలాగే ఉన్నాయి. నేను తెచ్చిన తాగవా! తాగు తాగు!" అంటూ శివుడికేసి చూసి ఆదేశించినట్లుగా అంది.


ఊహు! శివుడు తాగలేదు. మాట్లాడలేదు.


ఆ చిన్నపిల్లకు చింత మొదలైంది. రకరకాలైన ఆలోచనలు వచ్చాయి.


'అమ్మానాన్నలు చెప్పి వెళ్ళారు. నాన్న చెప్పినట్లు నేను చేసాను. ఎలా పాలు తీసుకుని శివునికి ఇవ్వమని నాన్న చెప్పారో అలాగే తీసుకుని వచ్చానే! మరి లోపం


ఎక్కడ జరిగిందో! శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు? పోనీ తనకి ఒంట్లో ఏమైనా బాధగా ఉందేమో!' అనుకుని మళ్లీ అడిగింది ఆయన్ని.


"ఏమైంది శివయ్యా? నీకేమైనా ఒంట్లో బాగులేదా? అయినా పాలు మంచివే కదా! అవి తాగితే అన్నీ బాధలు తగ్గుతాయి. అమ్మ చెబుతుంది ఎప్పుడూ! నేను అందుకే అమ్మ ఇవ్వగానే తాగుతాను. నువ్వు కూడా పాలు తాగు! అన్నీ తగ్గిపోతాయి! సరేనా! మంచివాడివి కదా! తాగు త్వరగా!" అంది గోడగూచి మళ్లీ.


అయినా పాలు తాగలేదు సరికదా, ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు.


దాంతో గోడగూచికి భయం పట్టుకుంది.


'శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా! నాన్న నియమాన్ని ఖచ్చితంగా పాటించమని మరీ మరీ చెప్పి వెళ్ళారు. ఇప్పుడు చూస్తే శివుడు పాలు త్రాగడం లేదు!' అనుకుని


శివుడి వైపు దీనంగా చూస్తూ...


"పాలు ఎందుకు తాగడంలేదు? తాగవయ్యా! ఓ లింగమూర్తి!" ప్రాధేయపడింది.


అయినా మాట్లాడకపోయేసరికి...


"పాలు సరిగ్గా కాచలేదా! రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? పొద్దెక్కిందనా లేక పొగ వాసన వస్తుందా? నీళ్లు కలిపానని అనుకుంటున్నావా? ఒకవేళ ఆవుపాలు కావేమో అని అనుకుంటున్నావా?


పోనీ ఆకలిగా లేదా? రోజూ పాలేనని మొగం మొత్తిందా? లేదంటే కుంచెడు పాలు లేవని అనుకుంటున్నావా? నేనేమైనా వీటి మీద మనస్సు పెట్టుకున్నానని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు అనుకునేది తప్పు! నేను నీళ్లు కలపకుండా మంచి ఆవుపాలు చక్కగా కాచి, నాన్న చెప్పినట్లే చేసి, తీసుకుని వచ్చాను.


నాన్న ఇస్తే రోజూ చక్కగా త్రాగుతున్నావు కదా! ఇప్పుడు ఎందుకు త్రాగడం లేదు? ఓహ్! ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ చిన్నపిల్ల పాలు తెస్తే నేను తాగాలా? అని కోపమా? ఎందుకు అలా కోపం? చిన్నపిల్లలను అయితే ఏమిటి! నాన్న చెప్పినట్లే తీసుకుని వచ్చాను కదా! తాగవయ్యా!" అంటూ నిలదీయటం మొదలెట్టింది.


అయినా పాలు తాగలేదు శివుడు.


“పరమశివా! పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదంటే, పోనీ అదైనా నోరు తెరచి చెప్పాలి కదా! ఏం మాట్లాడవు!


చెప్పలేదు పోని నీకు ఆకలిగా లేకపోతే ఒక్క గుటక అన్నా తాగు! నేను తృప్తి చెందుతాను! నాన్నకు శివుడికి ఆకలిగా లేదని చెప్పాడని చెబుతాను" అంటూ ఆ పసిపిల్ల పరమశివుడిని బ్రతిమాలుతూనే ఉంది.


"నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానాన్నలు నన్ను కొడతారు! అలా కొట్టిస్తావా? అలా కొట్టిస్తే నీకు సంతోషమా? నామీద ప్రేమతోనైనా త్రాగవా?


నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా నన్ను సాధిస్తున్నావు! పోనీ ఇవి ఈ పాలు కాకుండా ఇంకా ఏమైనా కావాలా? అవైనా అడుగు! నిమిషంలో తీసుకొస్తా! కానీ పాలు తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి! మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతర అప్పుడు నిన్ను పంపిస్తాగా! మా నాయన కదూ! మా శివయ్య కదూ! తాగవయ్యా!" అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది. ఏడుస్తోంది.


ఆ పరమేశ్వరుడు చిన్నపాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ వున్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకుండా ఎలా ఉంటాడు? అయినా పరిక్షిస్తూ వున్నాడు ఆ పాపను.


గోడగూచి కిందపడి ఏడుస్తూ గిలగిలా కొట్టుకోసాగింది.


'ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా వున్నాడు? నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు. కొడతారు!' అని అంటూ ఏడవసాగింది.


స్వామి వైపు చూస్తూ...


"నువ్వు ఈ పాలు తాగలేదంటే, నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు, కోపంతో నన్ను చంపేస్తారు.


నాన్నగారు పదేపదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం! అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు!" అని తలను శివలింగానికేసి బాదుకుంది ఏడుస్తూ.


ఆ సర్వేశ్వరుడు, భక్త వత్సలుడు ఒక్క క్షణం ఆగకుండా ఆ పాపను పట్టుకొని ఆపాడు తలకు దెబ్బ తగలకుండా. ఆ వెంటనే చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. పాలగిన్నెను తీసుకొని అందులోని పాలు మొత్తం తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది.


"హమ్మయ్య! త్రాగావా! ఇంత ఏడిపించావు! అమ్మానాన్న వచ్చేవరకూ రోజూ నేను పాలు తెస్తాను! ఇలాగే చక్కగా త్రాగాలి. నన్ను ఏడిపించకుండా తాగాలి! సరేనా!" అంది.


ఆయన సరేనని చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించాడు.


శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడనీ, పిలిస్తే పలుకుతాడనీ, పెట్టినవన్నీ ప్రేమగా పెడితే తింటాడనీ, మన మాటలు వింటాడనీ అనుకుని ఆనందించింది ఆ పసి పాప.


తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయింది, పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం, ఆయన త్రాగడం జరుగుతోంది. అది శివుడికి కూడా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు త్రాగడం జరిగి పోతున్నాయి.


ఒకరోజు ఊరెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలోనే గోడగూచి పాలను శివుడికి అరగింపు పెట్టి, తిరిగి ఇంటికి వెళ్తూ ఉంది.


అమ్మానాన్నలు రావడం చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో ఆమె తండ్రి శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూసాడు. పాత్రలో పాలు లేవు.


"ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుంచి వస్తున్నావు?" అని సందేహంగా అడిగాడు కూతురును.


పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు.


"శివుడు పాలు త్రాగడమేంటి? నువ్వు ఏదో అబద్దం చెప్పుతున్నావు. శివుడి పేరు చెప్పి పాలు నువ్వే త్రాగేశావా? నిజం చెప్పు! శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ! మన నియమాన్ని పాడుచేశావు కదా!" అంటూ ఆగ్రహంతో కూతురును తిట్టాడు.


పాప ఎంతచెప్పినా తన మాటలు నమ్మని శివదేవుడు మరునాడు కూతురు వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజూలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది.


"లింగమూర్తి అరగించవయ్యా!" అని పిలిచింది. స్వామి పలకలేదు.


"అయ్యో! నిన్నటివరకూ బాగానే త్రాగావు కదా! మళ్లీ ఏమైంది? నాన్న నా మాటలు నమ్మడం లేదు. రోజూలాగే వచ్చి పాలు త్రాగవయ్యా!" అని మళ్లీ.


అయినా శివుడు రాలేదు. త్రాగలేదు.


అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది.


"ఓసి! రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? కనీసం చూడను కూడా లేదు? కన్నతండ్రినే అబద్దపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే? ఎంత శివ ద్రోహం చేసావే? శివుడికి తెచ్చిన పాలను నీపొట్టలో పోసుకున్నావా? ఉండు! నీ పని చెప్పుతా ఎంత నాటకం ఆడావే? నిన్ను వూరికే వదిలి పెట్టను. నీ పొట్ట చీలుస్తా!" అంటూ వెర్రి కోపంతో కూతురి పైకి ఉరికాడు ఆ తండ్రి.


ఆ పసిపాప భయంతో వణకిపోయింది. ఎటు వెళ్లాలో తేలిక గట్టిగా ఏడుస్తూ...


"హా! లింగ! హా! లింగ!" అంటూ ఆ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఏడుస్తూ.


"ఇదిగో నేనున్నాను! భయపడకు!" అత్యంత దయతో మహాలింగ మూర్తి ఆ పసిపాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది.


వెర్రి కోపంతో కూతురు వెంట పడుతున్న ఆ శివదేవునికి పాప దాక్కోవడానికి వెళ్ళింది ఎక్కడ అనేది గ్రహింపుకు రానేలేదు. కోపంగా తండ్రి వెంటపడుతూ కూతురు వెంట్రుకలను చిక్కించుకున్నాడు.


"ఎక్కడికి పారిపోతావే?" అంటూ ఇవతలకి లాగబోయాడు. అప్పటికే ఆ పసి గోడగూచి శివుడిలో ఐక్యమైపోయింది.


ఆ దివ్యలింగం లోనికి వెళ్లి, ఆ పాప మాయమైపోయింది. కొద్దిసేపటికి శివదేవునికి జరిగిన విషయం అర్థం అయ్యింది.


ఎంతో నిశ్చలమైనది ఆ పసిపాప భక్తి! ఆ అమాయకత్వం శివుడికి ఇష్టమైనది అందుకే భక్తుడే అయినా తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చి, తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ భక్తవశంకరుడు. భక్తికి ఈశ్వరుడు వశం అవుతాడని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది!


కార్తీక సోమవారం గోడగూచి కథలో గోడగూచితో పాటుగా, ఆ కథలోకి మన మనసు ప్రవేశిస్తే, ఆ పరమేశ్వరుని దర్శనం, సాన్నిహిత్యం మనకూ లభిస్తుంది!


నమః శివాయ!


పార్వతీపతయే హర హర మహాదేవ!


������శ్రీకృష్ణార్పణమస్తు����������




ree

-సుధావిశ్వం





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page