top of page

ప్రేమ తీరాలు - పార్ట్ 12

Updated: 7 days ago

#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

ree

Prema Theeralu - Part 12 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 23/10/2025

ప్రేమ తీరాలు - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఇంజినీరింగ్‌ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు. వారికి కపర్ధి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు. కాలక్రమేణా లలిత–కరుణాకర్ మధ్య దూరం వస్తుంది.ఫణి అనారోగ్యానికి గురవుతాడు; బ్రెయిన్ ట్యూమర్‌గా తేలుతుంది. ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి, ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత.బాబును తీసుకుని లలిత ఇంటినుండి వెళ్ళిపోతుంది.

ఇక ప్రేమతీరాలు పార్ట్ 12 చదవండి.


పిల్లవాడు  వచ్చిన అలికిడి  కూడా లేదు     ఏం చేస్తున్నారు  మెల్లిగా తలుపు తోసి లోపలకు వచ్చింది సావిత్రమ్మ.  ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది  ఎక్కడ పిల్లవాడి  అలికిడి వినిపించడంలేదు. “ బాబు కపర్ధి   ఎక్కడున్నావు ,” పిలిచింది.  చప్పుడు లేదు  ఎదురుగా టీపాయ్ మీద పేపరు రెపరెపలాడుతుంటే తీసి చూసింది.


“ పిన్ని …  నేను ఏ తప్పు చెయ్యలేదు  కావాలనే ఇదంతా  నాటకం ఆడుతున్నారు, ఏనాడైనా  నిజం తెలుస్తుంది అప్పుడు  నా గురించి  మీరు బాధపడతారు, నేను బాబును తీసుకుని  ఎవరికి తెలియనంత  దూరం వెళుతున్నాను, ఆయనకు  ఇంట్లో ఉన్న సామాను అప్పచెప్పండి  నాది కాని వస్తువులు నేను తీసుకపోవడంలేదు ఉంటా,”   పీడాపోయింది. నాకెందుకొచ్చిన  గోల ఇది   తప్పు చేసినవాళ్ళెప్పుడు  నిజం చెబుతారా అనుకుంటూ  ఇంటికి తాళంపెట్టి   ఫణికి ఫోన్ చేసి  తొందరలో నీ సామాను తీసుకవెళ్ళమని చెప్పింది.


“బావా …  బాధపడుతున్నావా? నువ్వెందుకు బాధపడాలి మగవాడివి నీకేం తక్కువ

నిన్ను చూసుకోవడానికి  నేను లేను , పోనిలే బావా మనిద్దరి జీవితాలు తారుమారైపోయాయి  ఆ దేవుడే ఇలా చేసాడేమో, కనీసం ఇప్పుడన్నా  మనిద్దరం కలిసేలా చేసాడు చూడు   మన బంధం  గట్టిది  అందుకే  ఒకే గూటిలోకి చేరాము,”  ఫణిని ఓదారుస్తూ  లాలనగా   అతని తలనిమురుతూ అంది.


“లలిత  అలా  చేసిందంటావా సరిత?   నాకు ఇప్పటికి నమ్మకం కలగడంలేదు  ఆరోజు ఆవేశంలో   తనను  తిట్టానే కానీ  ఇప్పుడాలోచిస్తుంటే   నేను తప్పుచేసానేమో  అనిపిస్తుంది, పాపం ఎక్కడుందో  బాబుతోని  ఏం కష్టాలుపడుతుందో  నా అనే వాళ్ళే లేరు తనకు,”   బాధతో  గొంతు మూగబోయింది.



ree

“బావా  నీ తప్పేంలేదు ఇందులో  ఏ మగాడికైనా  భార్య మరో వ్యక్తితో  ఉందంటే  చూస్తూ చూస్తూ  ఆమెతోనే కాపురం చెయ్యాలనుకోడు, నువ్వు మంచివాడిని కనుక  తనను వదిలేసి వచ్చావు  ఇంకొకరైతే   చంపిపాతరపెట్టేవాళ్ళు,  లలితలాంటి వాళ్ళకు నువ్వు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు నువ్వెందుకు బావా  బాధపడుతూ నీ జీవితాన్ని పాడుచేసుకుంటావు,  నువ్వెలాగు నాకు అన్యాయం చేసావు  కనీసం ఇప్పుడన్నా  నా జీవితానికి  న్యాయం చెయ్యలేవు, నాకు ఎవరున్నారు నువ్వుకాకపోతే   ఈ జీవితం నీ చేతుల్లో  పెడుతున్నాను  బావా,” ఆర్తిగా ఫణిని కౌగిలించుకుంటూ  అంది సరిత.

అనుకోని  ఈ సంఘటనకు  కోపోద్రిక్తుడయ్యి  సరితను దూరంగా నెట్టివేస్తూ.


“సరిత…   నువ్వు  చేస్తున్న  పని తప్పు.  నేను నా లలితను తప్ప మరో స్త్రీ కి నా జీవితంలో   అవకాశంలేదు.  నువ్వు అనవసరంగా ఆశపడకు. నేను కొంచెం కుదురుకోగానే నాదారిన నేను వెళ్ళిపోతాను.  ఏమన్నావు.. నేను నిన్ను మోసంచేసానా? నీతో ఎప్పుడైనా చెప్పానా నేను  నిన్ను పెళ్ళి చేసుకుంటానని.. పెద్దవాళ్లు  అనుకోగానే అయిపోతుందా..  మనుసులు కలవని  మనువు ఒక  జీవితమేనా.. నాకెప్పుడూ నిన్ను చేసుకోవాలన్న ఆశనే లేదు.  నా మనసుకు దగ్గరైన  మనిషి లలిత. తను  తప్పు చేసి ఉండవచ్చు  కానీ  నేనంటే  తనకు  పంచప్రాణాలు. అలాంటిది ఇంత తప్పు చేసిందంటే నా మనసు ఇప్పటికి ఒప్పుకోవడం లేదు.  నాకు  తను తప్పా ఇంకో  లోకం లేదు,” శూన్యంలోకి చూస్తూ చెప్పాడు. 


సరిత అహం దెబ్బతిన్న పులిలా  పంజా విప్పింది. అలాగా  అన్ని వీడియోలో చూపెట్టినా నీకు  దానీ మీద  రవ్వంత ద్వేషం కలగడంలేదు. దాని దగ్గర ఏ మహత్తుందో గానీ బావను గట్టిగా  తన  ప్రేమలో మునిగితేలేలా చేసింది. ఇంకా ఏదైనా ఉపాయము చేసి నిన్ను నా వాడిగా చేసుకోకపోతే నా పేరు సరితనే కాదు అనుకుంది మనసులో.


“ సారీ   బావా  నీ మనసు కష్టపెట్టాను.


ఇంకెప్పుడు ఈ మాటెత్తనుగానీ  నువ్వు ఎక్కడకు వెళ్లిపోవద్దు  అలా వెళ్ళనని  నాకు  మాటివ్వు బావా ,” చేతిని జాపి అడిగింది.


“ సరేలే  నేనెక్కడికి  వెళ్ళను ,” అన్నాడు కానీ చేతిలో చెయ్యివెయ్యలేకపోయాడు.


లలిత బాబును తీసుకుని సరాసరి రైల్వేస్టేషన్ కు వెళ్ళేసరికి  “ విశాఖపట్నం రైలు అరగంటలో వస్తుంది,”  అనే అనౌన్స్ వినిపించింది  వెంటనే టికెట్ కొని లోపలకు వెళ్ళేసరికి రైలు  వచ్చింది గబగబాఎక్కి కూర్చున్నారు తల్లి కొడుకులు  ఎవరైనా చూస్తారేమోనన్న ఆదుర్దాతో.  నా స్నేహితురాలు రమ అక్కడే ఉండేది  ఇప్పుడుందో  ఎటైనా  వెళ్లారో దిగాక ఫోన్ చెయ్యాలి . 


నేను ఎక్కడికి వెళుతున్నాను  రేపటినుండి  నేను నా కొడుకు ఎలా బ్రతుకు వెళ్ళదియ్యాలో  అర్థంకానీ పరిస్థితి. పోని అన్నయ్య దగ్గరకు వెళదామనుకుంటే  ఛీ ఛీ  నా జీవితాన్ని ఇలా చేసింది వదిన కాదు. ఇంకా అలాంటివాళ్ళ దగ్గరకు వెళితే బట్టకాల్చి మీద వేసేరకాలు ఇంకా ఏమేమి అభాండాలు వేస్తారు సరిత తను కలిసి.  దిక్కులేని వాడికి ఆ దేవుడే  ఏదో ఒక దారి చూపుతాడు   అనుకుంటూ   తన దగ్గరున్న డబ్బులతో  కొడుకు ఆకలంటుంటే  ఇద్దరికి  తినడానికి అన్నం ఆర్డర్ చేసింది.  అలసిన మనసుకు కాస్త ఎంగిలిపడగానే  మగతగా నిద్రపట్టేసింది కొడుకును దగ్గరగా పడుకోబెట్టుకుని  ప్రశాంతంగా నిద్రబోయింది లలిత. 


“ఏమండి ఇది విన్నారా మీ చెల్లెలు ఎంతపని చేసిందో !  ఫణి మీ చెల్లెలికి విడాకులిస్తున్నాడట  తెలుసా,   మీ చెల్లెలు తక్కువదా ఓ సంతకం పడేసి  కొడుకును తీసుకుని  పోయిందట  ఉన్నాడుగా తన రంకు మొగుడు,”మూతివిరుస్తూ వ్యంగంగా అన్నది.


“రాధ … ఏం మాట్లాడుతున్నావు నోటికి  ఎంతొస్తే అదే  మాట్లాడుతావా నీది నోరా లేకా ఇంకేమన్నానా,  మా చెల్లి గురించి ఇంకొక మాటన్నావా నా భార్యవని కూడా చూడను,”

మండిపడుతూ  చెప్పాడు.


“ఏం   చేస్తారు  పీక  పిసికి   చంపుతారా  ఆ చెప్పండి? ఉన్నమాటంటే  ఉలుకెక్కువంటారు, పిల్లి పాలు తాగుతూ కళ్ళుమూసుకుంటుందట తననెవరు  చూడటంలేదనుకుని. అలాగుంది మీ వరస, ఊరు ఊరంతా కోడై  కూస్తున్నా  మీ చెవికెక్కడం లేదు. మీరేం  అన్నయ్య  తనకు , అదే  ఇంకొకరైతే  భార్యమీద  కాదు  పెత్తనం చెయ్యడం అలాంటి  పాడుపని  చేసిన  దాన్నీ  పీక పిసికి  చంపేసేవాడు.


అవున్లే.. ఎంతైనా  గారాల చెల్లెలు కదా,” హేళన ధ్వనించే స్వరంతో అంది. 


కరుణాకర్ కు తల తిరిగిపోతుంది . రాధ  చెప్పేది నిజమా..  నా చెల్లెలు  ఇలాంటి  పని చెయ్యదు.  ఇది  ఎవరో  గిట్టని వాళ్ళు  పని  గట్టుకుని  తన మీద  బురదచల్లారు. ఇది    నా ప్రాణం పోయినా నేను  నమ్మను. ఇప్పుడే వెళ్ళి  ఆ ఫణిని అడుగుతాను. ఒకరంటే ఒకరికి ఎంతో  ఇష్టం. ఒక్క క్షణం కూడా  విడిచి ఉండలేని  వాళ్ళు. అలాంటిది  విడిపోవడమా! లేదు. నేను నమ్మలేను..  మౌనంగా రోదిస్తూ చెప్పులేసుకుని  బయలుదేరాడు .


'అబ్బో చెల్లెలు కోసం బయలుదేరాడు. అక్కడుంటేగా నీ ముద్దుల చెల్లెలు.. వెళ్ళండి.  నేను చెబితే నమ్మలేదు.  ఆ సావిత్రమ్మ  చెబితే  నమ్మకపోతే ఏం చేస్తారు'  వెర్రి నవ్వు నవ్వుతూ అనుకుంది మనసులో.


లలిత ఇంటికి తాళం వేసి ఉండడంతో సావిత్రమ్మ ఇంటి తలుపుతట్టాడు. తలుపు తీసిన సావిత్రమ్మ ఎదురుగా నిలుచున్న కరుణాకర్ ను చూసి, “రా నాయన  మీ చెల్లెలు  ఎంతో మంచిదని  ఇల్లు కిరాయికిచ్చి  నా కూతురులాగా  చూసుకున్నాను,  ఎంతపని చేసిందో చూసావా.  చక్కగా  కాపురం చేసుకోకుండా  ఇదేం బుద్దో నాకర్థం కాలేదు,” అడుగకుండానే విషయమంతా చెప్పింది సావిత్రమ్మ.


అన్ని వింటున్న కరుణాకర్ కు తల తిరిగిపోయింది . నా చెల్లికి  ఇలా చేసే కర్మేంటి  ఆ కిరణ్ ఎవరు..  అతనికి  నా చెల్లికి  ఎలా  పరిచయం.


“ఆంటీ … ఆ కిరణ్ ఎవరు..  అతనికి మా చెల్లికి  ఎలా పరిచయం..  ఇంతకు.. ఫణి ఎక్కడున్నాడు కనిపించడం లేదు,” అంతు చిక్కని ప్రశ్నలు బుర్ర తినేస్తుంటే అడిగాడు.


“అయ్యో  నీకు తెలియదా … అతను  మీ ఫణి  పని చేసే  కంపెనీ మేనేజరట,

ఫణి   ఆపరేషన్  అప్పుడు  ఇరవైలక్షలిచ్చి  దగ్గరుండి  చేయించాడట. హాస్పిటల్ లోనే  మీ చెల్లి అతను  ఒకటే ఇకఇకలు పకపకలు..   ఒకళ్ళమీద ఒకరు పడిపోవడం  వేరే వాళ్ళు చూసి వీళ్ళ  భాగోతమంతా  వీడియో తీసారట. అది ఆ ఫణికి  చూపెడితే  అగ్గిమీద గుగ్గిలం  అయి విడాకులవరకు  వెళ్ళాడు. పాపం  వాళ్ళ మరదలట..  ఫణిని ఓదారుస్తూ  తీసువెళ్ళింది,” సాగదీస్తూ చెప్పింది సావిత్రమ్మ.


తప్పంతా  లలితదే అంటుంటే ఏం మాట్లాడాలో అర్థంకాక  మౌనంగా లేచి  వెళ్ళిపోయాడు కరుణాకర్.   ఫణి  మరదలంటే  రాధ  చెబుతుంది ఆమెనేనా..  అంటే   రాధ  ఆమె కలిసి నాటకమాడుతు లేరు కదా! అడగాలి రాధను..  అనుకుంటూ బేల ముఖం వేసుకుని ఇంట్లో అడుగుపెడుతున్న భర్తను చూసి .


“వచ్చారా … మీ చెల్లెలు చేసిన నిర్వాకం  తెలిసిందా? నేను చెబితే నమ్మకం కలగలేదు ఇప్పుడేమంటారు,”  వంకర నవ్వు నవ్వింది.


“మా చెల్లెలు ఇలా  చేస్తుందనుకోలేదు  రాధ  … నేను  తలెత్తుకోలేకపోతున్నాను, పోనీ ఆ ఫణి  కనపడతాడేమో  నన్ను క్షమించమని అడుగుదామనుకున్నాను, కానీ ఎక్కడున్నాడో

తెలియలేదు, ఆమె ఎవరో  సరితనట ఆమెతో వెళ్ళాడని విన్నాను ఎక్కడున్నారో ఆమె ఎవరో నాకు తెలియదు,”  అడిగాడు. రాధ మనసులో మాట బయటకు   రావాలంటే  నేను రాధవైపు మాట్లాడాలి  అప్పుడు గానీ నిజమేంటో  తెలుసుకోగలను. 


“ఏమండి మీరు చెప్పేది నిజమా ! ఫణికి  సారీ  చెబుతారా? అంటే  మీ చెల్లెలు తప్పుచేసిందని  మీరు  నమ్ముతున్నట్టే కదా,”  భర్తను అనుమానంగా చూస్తూ అడిగింది.


“ రాధ… నిన్నర్థం చేసుకోలేదు.  నువ్వు కావాలని చెప్పావనుకున్నాను.  ఆ సావిత్రమ్మ చెప్పిన తరువాత నిజమేంటో తెలిసింది.  ఏమిటో  వాళ్ళిద్దరు  ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కదా సంతోషంగా  ఉంటారనుకున్నాను.  ఆ కిరణ్  ఎప్పటినుండి  పరిచయమున్నాడో..  నాకు ముందే  తెలిసుంటే ఈ పెళ్ళి జరగనిచ్చేవాడిని  కాదు. పాపం ఆ ఫణి వాళ్ళ  మరదలిని  చేసుకున్నా సుఖపడేవాడేమో,” రాధను తెరిపారా చూస్తూ అడిగాడు.  భర్త  అలా  మాట్లాడేసరికి రాధ ముఖంలో రంగులు మారడం చూసాడు.


“ఏమండి..  మీరంటున్నది నిజమేనా..  నాకు ఇంకా నమ్మబుద్ధికావడంలేదు. ఆ ఫణి ఎక్కడున్నాడో  చెబితే మీరు వస్తారా  చెప్పండి,” అడిగింది ఆత్రుతగా.


“అవును రాధ… చేసిన పాపం చేబితే పోతుందంటారు. తను  నాచెల్లెలని చెప్పడానికి కూడా నాకు నోరు రావడంలేదు. తను చేసిన పాపానికి  నేనూ   బాధ్యుడినే.  ఈ పెళ్ళి జరుగనియ్యకుండా ఉండింటే ఎంతబాగుండేది,” బాధపడుతూ చెప్పాడు .


“అయితే  మీకు ఫణి  ఎక్కడున్నాడో  చెబుతాను పదండి. అయితే  మీరు నాకో మాటిస్తారా?

ఎలాగు  వాళ్ళిద్దరు విడిపోయారు,  మా స్నేహితురాలు  సరితకు అదేనండి  ఫణి  మరదలు..  ఫణితో పెళ్ళి జరిపిద్దాము సరేనా,” అడిగింది.  భర్త మొత్తం తన వైపు  ఉండేసరికి ఆనందం తట్టుకోలేకపోతుంది. 


“అలాగా..   సరితంటే   మీ స్నేహితురాలేనా..    నేను ఇంకెవరో అనుకున్నాను, పద  మనం ఫణిని ఒప్పించి  ఈ పెళ్ళి జరిపిద్దాము,”  


కారులో ఇద్దరు బయలుదేరారు. కారు నడుపుతున్నాడు కానీ  రాధ సరితల మధ్య జరుగుతున్నది  తెలియాలంటే  ఎలా? ఎవరు సహాయం చెయ్యగలరు..  పోనీ ఫణిని అడిగితే.. 


వీళ్ళకు తెలియకుండా ఫణితో మాట్లాడాలి.  ఆ సరిత   ఆ వీడియోలో  ఎక్కడ తీసింది..  అంత బహిరంగంగా ఎలా తియ్యగలిగింది..  కిరణ్ లలిత అంత పబ్లిగ్గా  ఎందుకు ప్రవర్తిస్తారు..


ఇదంతా చూస్తుంటే కావాలని  లలితను ఇరికించడానికి  ఏదో టెక్నిక్ ఉపయోగించారు. అవును ఇప్పుడున్న టెక్నాలజీ  తిమ్మిని బమ్మి  బమ్మిని తిమ్మి చెయ్యగలదు. అదే  వీళ్ళు చేసింది.


“ఏమాలోచిస్తున్నారు  ఫణిని ఎలా ఒప్పించాలనా,” మౌనంగా ఉన్న భర్తను అడిగింది.


“ఆ ఆ అదే  అదే.  ఫణి ఒప్పుకున్నా   మీ సరిత ఒప్పుకుంటుందా? ఒకవేళ మనం ఫణిని 

ఒప్పించాక  నాకిష్టంలేదు ఫణిని చేసుకోవడం అంటుందాని ఆలోచిస్తున్నా,” అన్నాడు.


ఫక్కున నవ్వింది రాధ. అయ్యో మీరెంత అమాయకులండి..  సరితకు  వాళ్ళ బావంటే

పంచప్రాణాలు.  అందుకేగా   ఈ నాటకమంతా ఆడింది,” అంటూ నాలుక కరుచుకుని “కాదు కాదు.  అందుకేగా మనం  వెళుతున్నది..  తను కాదన్నా మనం ఒప్పించాలి,”  తడబడుతూ అంది  కరుణాకర్ ను చూస్తూ .


“ఓహో  అలాగా..  సరే అయితే.  ఇంకేం..  నేననుకున్నది  జరుగుతుందన్నమాట,” ఓరగా రాధవైపు చూస్తూ అన్నాడు.


“ ఏమిటండి మీరనుకున్నది,” వణుకుతున్న స్వరంతో అడిగింది.


“అబ్బే ఏం లేదు రాధ … ఫణిని ఎంత  ఈజీగా ఒప్పించగలనో ఇప్పుడర్ధమైంది,” కారు దిగుతూ చెప్పాడు . రాధ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా.. అనుకుంది మనసులో. 


“సరిత… ఏయ్ సరిత  ఎక్కుడున్నావే,” సంతోషం పట్టలేక  పరుగున వెళ్ళి సరితను వాటేసుకుంది.


“ఏమిటే  ఈ ఆనందం  ఏమన్నా విశేషమా  నీకు ,” నవ్వుతూ అడిగింది సరిత.


“ పిచ్చి మొహమా  విశేషం నాకు కాదు నీకు … అదిగో మావారు ఫణితో మాట్లాడుతున్నారు

నీ గురించే,” తనకు తన భర్తకు జరిగిన విషయమంతా చెప్పి  స్నేహితురాలి బుగ్గను గట్టిగా కొరికింది ప్రేమతో. కెవ్వున కేకవేసింది  సరిత.


“రాధా నువ్వు చెప్పేది నిజమా.  అంటే మా ఇద్దరికి  పెళ్ళి జరుగబోతుందా..  ఎంత శుభవార్త చెప్పావే.  ఉండు..  ఇప్పుడే  స్వీటు పెడతాను నీ నోటిలో,” ఫ్రీజ్ లో నుండి కలకండా తీసుకవచ్చింది సరిత.


“ఆగాగు  ముందు  ఫణి   ఒప్పుకున్నాక  అందరం ఒకేసారి  నోరు తీపిచేసుకుందాము. ముందు కాఫీ పెట్టవే  మా వారికి ఇష్టం ,” అంది.


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 

ree



Comments


bottom of page