నైర్మల్యం
- Surekha Puli

- Nov 4
- 4 min read
#SurekhaPuli, #సురేఖపులి, #Nairmalyam, #నైర్మల్యం, #TeluguHeartTouchingStories

Nairmalyam - New Telugu Story Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 04/10/2025
నైర్మల్యం - తెలుగు కథ
రచన: సురేఖ పులి
“ఎన్నాళ్లీ ఆకలి బాధ!? కడుపులో మంట గుండె వరకు పాకింది. పేగులు మెలిక పెడుతున్నాయి. చచ్చిపోతానా!.. ఏమో? చావు ఇంత నొప్పిగా ఉంటుందా?”
వరుస బాంబు పేలుళ్లలో నాన్నతో పాటు అద్దెకు తీసుకున్న టిఫిన్ సెంటర్ వ్యాపారం కూడా శిథిలమైంది.
నేను చదివే వీధి బడిలో, తల్లిదండ్రులు లేని పిల్లలకు చదువు కంటే చాకిరీ ఎక్కువ. పనిలో అటు ఇటు అవకతవకలు ఉంటే వాతలు తేలే దెబ్బలు తప్పవు. ఆ దెబ్బలు తట్టుకోలేక చదువు కంటే పని పట్ల శ్రద్ధ పెరిగింది.
బ్రతుకుతెరువు చూపెట్టమని, న్యాయం కావాలని మండలాఫీసు చుట్టూ అలుపెరుగక తిరిగింది అమ్మ. రేపు, మాపు అని సంవత్సరాలు గడుస్తుంటే, పరిచయమున్న మేయర్ ఇంటికి వెళితే గొడ్డు చాకిరీ చేయించుకొని పాత బట్టలు ఇచ్చి ముఖం చాటేశారు. అమ్మను ఎవరైనా చిన్నచూపు చూసారో ఏమో, ఇంటికి రాగానే నాన్న ఫోటో చూస్తూ బోరున ఏడ్చింది; కారణం చెప్పలేదు.
ప్రభుత్వం మాకు జరిగిన నష్టపరిహారం చెల్లించలేదు. విసిగి వేసారిపోయాము. బాంబులు వేసిన ఉగ్రవాదికి అందాల్సిన భారీ పైకం అందే ఉంటుంది. దిక్కు లేదు మాకు. నాన్న గుర్తుకు వచ్చాడు. ఆ షాప్ చూడాలనిపించి వెళితే, బీమా సంస్థ నుంచి అధికారికంగా సేఠ్‌జీ చెక్కులు తీసుకున్నారని తెలిసింది. కాలి బూడిదైన టిఫిన్ సెంటర్ ఇప్పుడు “టీ-కాఫీ కార్నర్” పేరుతో కళకళలాడుతోంది. కౌంటర్ వైపు కూర్చున్న సేఠ్‌జీ అద్దాల తలుపు నుండి నన్ను చూసి బయటికి వచ్చి, “ఏదైనా పని కావాలా?” అన్నాడు.
ఘుమఘుమలాడే కాఫీ వాసన! పని కంటే ముఖ్యం ఆహారం కావాలి. నోటి వరకు వచ్చింది కానీ చెప్పలేకపోయాను.
“కూర్చీలు, టేబుల్ శుభ్రంగా తుడిచి పెట్టు; రోజు పనికి వస్తావా?” సేఠ్‌జీ అన్నాడు.
టీ-కాఫీ కార్నర్ క్షణం తీరిక లేకుండా మనుషుల సందడి. సేఠ్‌జీ ఎంతో వినయంగా జనాన్ని ఆహ్వానిస్తున్నాడు. చెప్పిన పని చేశాను. పది రూపాయలు చేతిలో పెట్టి, ఫ్రీగా ఒక కప్పు కాఫీ ఇచ్చాడు. పోటీ పడుతున్న ఆకలికి కాఫీ కడుపులో పేగులు పిసికి నట్టింది. సేఠ్‌జీతో చెప్పితే, “ఇక్కడ ఇంతకంటే వేరే ఏమీ లేవు, బయట ఎక్కడైనా ఫుడ్ దొరికే చోట పని చేసుకో” అంటూ నా వీపును సవరిస్తూ అన్నాడు.
ఆకలి బాధ తీరాలి. ఏం చేయాలి? బాగా ఆలోచించాను. డబ్బున్న వారి వద్ద ఉన్నట్లు; డబ్బు నాకు కావాలి. గట్టి నిర్ణయం తీసుకున్నాను. అమ్మ ఎవరింటికి వెళ్ళి చేయి చాచి అడుక్కోవద్దు.
నేను చేయబోయే పనిని ఏమంటారో తెలియదు. డబ్బున్న వాళ్ళ వద్ద నుంచి డబ్బు లేని వాడు తీసుకుంటే “దోచుకోవడం” అంటారు. మరి డబ్బున్న వాళ్ళ నుండి డబ్బున్న వాళ్ళే తీసుకుంటే కూడా దోచుకోవడమే అంటారా? రెండింటికీ ఒకటే పదం వర్తిస్తుందా? ఏదైతే అది, మా ఆకలి తీరాలి! పని మొదలుపెట్టాను.
అబద్ధం చెప్పి అమ్మ చేతికి డబ్బులు ఇచ్చాను. “నీ చిన్నారి చేతులు కూలి పని చేయడం నేను సహించలేను” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆకలి తీరింది.
నేనేదో బరువులు మోసి కష్టపడుతున్నానని, పనిమనిషిగా అమ్మ ఉపాధి వెతుక్కుంది. తిండికి, బట్టలకు ఇబ్బంది లేదు. దరిద్రం తట్టుకోలేక మొదలుపెట్టిన నా కొత్త వృత్తి — దోచుకోవడం — నేను వదల్లేకపోతున్నాను. ఎందుకంటే పని తక్కువ, రాబడి ఎక్కువ.
దర్జాగా బతుకుతున్న ఒకానొక దురదృష్ట సమయాన “దొంగ” అనే పేరుతో పోలీసులకు దొరికిపోయాను. గుర్తింపుగా కొత్త సంఖ్యతో బాల నేరస్తుడని ప్రత్యేక జైల్లో కొన్నాళ్లు శిక్షణ పొందాను. బుద్ధిగా ఇంటికి వస్తే తెలిసింది — నేనొక దొంగ ఖైదీ అని తెలిసి అమ్మ ఊరేసుకున్నదని.
బాంబు పేలుడులో అనాథలమైనప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తండ్రి లేడని స్కూల్లో చదువు బదులు బండ చాకిరీ చేయించినందుకు తీరని ఆకలి భరించాను. ప్రజలో, ప్రతినిధిలో చేసిన అవమానం వలన కుమిలిపోతుంటే అమ్మ కన్నీళ్లు చూడలేకపోయాను. దొంగతనంలో ఎదుర్కొన్న దెబ్బల బాధ భరిస్తుంటే భయం మాయమై బలం పెరిగింది.
వీటన్నిటికంటే మిన్న — అమ్మ నా మూలంగా లేదని తెలిసి ఊపిరి పీల్చుకోలేక పోయాను. మా పెంకుటిల్లు అస్తవ్యస్తంగా ఉంది. అమ్మ ఎక్కడుంటే నేను అక్కడికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాను.
తెల్లవారుజాము ఇంకా జనసందడి లేనప్పుడు రైలు పట్టాల మీద పడుకుంటే నేరుగా అమ్మను కలుసుకోవచ్చని మనసులో ఖాయం చేసుకున్నాను. “నేను చేసిన తప్పు — దొంగతనం ఎవరూ చేయకండి” అని కాగితం మీద రాసి పడుకున్నాను. అమ్మ నవ్వుతూ పలుకరించింది.
“పుట్టిన వాళ్లు భూమికి శాశ్వతం కాదు. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే జరిగే పర్యవసానం విను:
ఎన్ని రుజువులు చూపించినా నీ నాన్న చావుతో రోడ్డున పడ్డ మన కుటుంబం పట్ల ఎవ్వరూ బాధ పంచుకోలేదు. ప్రభుత్వం, నగర పంచాయతీ వారెవ్వరూ మనల్ని ఆదుకోలేదు. కానీ నువ్వు రాసిన చిన్న కాగితం రుజువు దొరికిందని పట్టుదలగా శవానికి పంచనామా జరిపిస్తారు. బతికున్న మనిషి ఆకలి కంటే మృతదేహం మెడికల్ రిపోర్ట్ ఇంపార్టెంట్. అక్కడితో నిన్ను అందరూ మర్చిపోతారు.
మరో వైపు ఆలోచించు: చచ్చి సాధించేది శూన్యం, బతికి సాధించాలి స్వర్గం! సుఖం కంటే కష్టం మనకు బాగా తెలుసు. నీకు లభించిన శిక్షణ ప్రయోజనం తెలుసుకో, సక్రమంగా ఉపయోగించు. నిన్ను దిగజార్చాలని ఎవరూ వేలెత్తి చూపినా వెనక్కి తగ్గకు. నిన్ను నువ్వు సుస్థిరం చేసుకో. అందరితో మంచిగా ఉంటూ, ఎవరికీ కీడు తలపెట్టకు. నిన్ను మరుగున పెట్టాలని ప్రయత్నించే వారితో జాగ్రత్తగా ఉండు.
ప్రపంచంలో బతుకుతెరువులు చాలా ఉన్నాయి. వెతికి పట్టుకో. ఓటమి సహజం, ఓటమిలో గెలుపు దాక్కుంటుంది. గెలుపు సాధించే వరకు శ్రమించు. నేను చేసిన పిరికి పని నువ్వు చేయకు. నువ్వు ఒంటరి కాదు. ప్రతి క్షణం నీతోనే ఉన్నాను. నీకు ఎప్పుడు మాట్లాడాలని అనిపించినా నీ కళ్ల ముందు ఉంటాను. ధైర్యంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎప్పటికీ నీతోనే ఉన్నట్టు…”
అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రపోయాను.
తెల్లారింది. అమ్మ ఇచ్చిన శక్తివలన మనసంతా ఆహ్లాదంగా ఉంది! హుషారుగా లేచాను. భగవంతుడు ఇచ్చిన అపురూపమైన ప్రసాదం ‘జీవితం’. మంచి మలుపు ఇచ్చి నా జీవితానికి సాధికారత కలిగించాలి.
సమాప్తం.
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli



ధన్యవాదాలు🙏