కచదేవయాని - పార్ట్ 23
- T. V. L. Gayathri

- 2 days ago
- 5 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 23 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 15/11/2025
కచదేవయాని - పార్ట్ 23 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు, వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ పుట్టిన రోజు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. శర్మిష్ఠ వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 23 చదవండి.
యయాతి వాళ్ళు పుష్కర ద్వీపానికి చేరారు.
వైభవంగా స్వాగత సత్కారాలు జరిగాయి. పుష్కర ద్వీపానికి చేరగానే చారుమతి ఎక్కడికో వెళ్ళి పోయింది.
వీతిహోత్ర చక్రవర్తి నహుష చక్రవర్తిని కౌగలించుకొని కుశల ప్రశ్నలతో ఆదరించి తనతో పాటు తీసికొని వెళ్ళాడు. అతని కుమారులు యయాతిని క్షణం కూడా వదలి పెట్టకుండా తమ వెంటే తిప్పుతున్నారు. శక్తిధర, పింగళులు యయాతి ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరిస్తున్నారు.
అప్పుడే వీళ్ళ దగ్గరికి వచ్చాడు కచుడు.
అతడి ప్రక్కన దేవ, గంధర్వ జాతులకు చెందిన యువతీ యువకులు చాలా మందే ఉన్నారు. పరిచయాలయ్యాయి. ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ తోటలోకి వచ్చారందరు.
కచుడి అందం సమ్మోహనం. అతడి నవ్వు మనోజ్ఞం. అతడిని చూసి ఎవరైనా సరే చూపు తిప్పుకోవటం చాలా కష్టం! మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం.
కాసేపు మాట్లాడాక కచుడు అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాడని అర్ధం అయింది యయాతికి.
కచుని రూపమే కాదు గుణం కూడా ఎన్నదగినదే!
"మిమ్మల్ని చూస్తే మగవాడినైన నాకే మోహం కల్గుతోందే! ఇంక ఆడవాళ్లయితే మీ కోసం పిచ్చివాళ్లయిపోతారు! " నవ్వుతూ చెప్పాడు యయాతి.
నవ్వాడు కచుడు.
"మనం ఒకే వయసు వాళ్ళం కదా! ఇంకా మన మధ్య గౌరవ వాచకాలెందుకు? పేరు పెట్టి పిలువు యయాతీ! నువ్వు అంటే దగ్గరితనంగా ఉంటుంది. నన్ను మీరు మీరు అన్నావనుకో ఇంక మాట్లాడను అంతే! "అన్నాడు కచుడు.
నవ్వుతూ కచుడిని కౌగలించుకొన్నాడు యయాతి.
"మీరు.. నువ్వు మృతసంజీవని కోసం భూలోకానికి వచ్చావని తెలిసింది. అప్పుడు నీ వెంట చారుమతిని తీసికొని వచ్చావా?" కుతూహలంగా అడిగాడు యయాతి.
"చారుమతి గురించా! ఆమె మా దేవలోకపు చిలుక. పూర్వ పుణ్యం వలన ఇలా మాట్లాడుతోంది. "
"అంటే?"
"చారుమతి ఒక గంధర్వ కన్య. గంధర్వులు కామరూపులు కదా! ఒకసారి చారుమతి చెలులతో కలిసి విహారానికి భూలోకానికి వచ్చింది. అక్కడ ఒక అరణ్యంలో తిరుగుతూ పెద్ద మఱ్ఱి చెట్టు తొఱ్ఱలో మినుకు మినుకు మంటున్న వెలుగులను చూచి ఏమిటో తెలుసుకుందామని చిలుక రూపంలో తొఱ్ఱ లోకి వెళ్ళింది. అక్కడ బొటన వేలంత ఎత్తులో ఉన్న వాలఖిల్య మునులు తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ వెలుగులవి. చారుమతి తెలియక వాళ్ళను ముక్కుతో పొడిచింది. వాళ్లకు బాధ కలిగి చిలుక రూపంలోనే ఉండమని శపించారు. చారుమతి దుఃఖంతో వాళ్ళను ప్రార్థిస్తే వాళ్ళు కరుణించి చిలుకగా ఉన్నా ఆమె మాట్లాడగలదనీ, ఆలోచించ గలదనీ అనుగ్రహించారు. అలాగే చిలుక రూపం పోయి మరలా గంధర్వ రూపం రావాలంటే ఆమె కొంత కాలం పాటు నిరీక్షించాలని చెప్పారు. అప్పుడు మా నాన్నగారు భూలోకంలోనే వున్నారు. చారుమతి శాపగ్రస్త అయిందని తెలిసి ఆమె తల్లి దండ్రులు మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. మా నాన్నగారు వాళ్లను ఓదార్చి చిలుక రూపంలో ఉన్న చారుమతిని దేవలోకానికి తీసికొని వచ్చారు. ఆమెకున్న జ్ఞానం మాత్రం పోలేదు.
అలా మా ఇంట్లో ఉండి మా నాన్నగారి దగ్గర వేదవిద్యను నేర్చుకొంది. నేను భూలోకానికి వస్తుంటే నా వెంటపడి వచ్చింది. నేను అమరావతికి వచ్చేశాను కానీ తను మాత్రం అక్కడే ఉండి పోయింది"
" చాలా చిత్రమైన విషయం! .. నువ్వు భూలోకానికి అప్పుడప్పుడూ వస్తుంటావా? "
"వస్తుంటాను! మీ రాజ్యానికి ఒక వంద యోజనాల దూరంలో అరణ్యంలో అరుణకేశి మహర్షిగారి గురుకులానికి వస్తుంటాను. ఆయన చాలా గొప్ప వైద్యుడు. నేను ఆయన దగ్గర శస్త్రచికిత్సలు ఎలా చెయ్యాలో నేర్చుకుంటూ ఉన్నాను! "
"ఆయన ఇక్కడికి కూడా వచ్చారు కదా! "

"అవును యయాతీ! అదిగో! ఆయన మేనకోడలు శరావతి. ఆమెకు తండ్రి లేడు. రాక్షసుల దాడిలో చనిపోయాడు. అప్పట్లో నా దగ్గర మృతసంజీవనీ విద్య లేదు. తల్లితో సహా మేనమామ దగ్గర ఉంటోంది. ఆయన దగ్గరే వైద్యవిద్యను నేర్చుకొంటోంది. చారుమతికి శరావతి మంచి స్నేహితురాలు. చారుమతి శరావతికి తను నేర్చుకున్న శాస్త్రాలలోని విషయాలను చెబుతూ ఉంటుంది.
అక్కడ చారుమతిని భుజం మీద పెట్టుకొని మాట్లాడు తున్నాడే! అతడే సారంగదేవుడు. గంధర్వుడు. అతడు కూడా అరుణకేశి మహర్షి దగ్గర విద్య నభ్యసిస్తున్నాడు సారంగ దేవుడితో చారుమతి వివాహాన్ని నిశ్చయించారు పెద్దలు. చారుమతికి శాపవిమోచనం కలిగాక తను సారంగదేవునితో కలిసి గంధర్వ లోకానికి వెళ్ళి పోతుంది. ఇదీ చారుమతి కథ! "
శరావతిని చూశాడు యయాతి. మెరుపుకు చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంది.
కచుడి మొహంలో ఆ మెరుపు ప్రతిఫలిస్తోంది. విషయం అర్థమైంది యయాతికి.
"మొత్తానికి ఇక్కడ రెండు ప్రేమ జంటలు ఉన్నాయాన్నమాట! మొదటి జంట చారుమతి సారంగదేవులు అయితే రెండు నువ్వూ శరావతి! అవునా! "
చిలిపిగా యయాతి అడుగుతుంటే చిన్నగా నవ్వాడు కచుడు.
"మరీ! అలా అడిగితే ఎలా? ప్రేమలో పడిన వాళ్ళే ప్రేమికులని కనిపెట్టేస్తారట! నా గురించి తెలిసింది కదా! నీ ప్రేమకథ గురించి చెప్పు! "
"అంత పెద్ద కథ కాదులే! మా బంధువులమ్మాయి. దానవరాజు వృషపర్వుని కూతురు. "
"వృషపర్వుని కూతురా? శుక్రాచార్యులవారు వాళ్లకు గురువు. రెండు మూడుసార్లు ఆయనను చూశాను.. ఆయన బంధువర్గమే నన్ను కాల్చి వేశారు. ఏదో ఆయుష్షు గట్టిగా ఉండటం వల్ల బ్రతికి బయట పడ్డాను.. ఎప్పుడూ వాళ్ళ నుండి తప్పించుకుంటూ ఉండేవాడిని. అయినా మృతసంజీవనితో సహా అమరావతికి చేరటం నేను చేసిన పెద్దసాహసమనే చెప్పాలి!" అంటూ ఆ రోజుల్ని గుర్తుతెచ్చుకున్నాడు కచుడు.
"నేను ఆ దానవరాజుకే కాబోయే అల్లుడిని! ఇప్పుడు చెప్పు! నేను నీకు మిత్రుడినా? శత్రువునా?"
యయాతి ప్రశ్నకు నవ్వి అతడిని కౌగలించుకొన్నాడు కచుడు.
"నీకు ఈ జాతుల మధ్య విద్వేషాలకు సంబంధం ఏముంది? ఊరికే చెప్పాను! నువ్వు నాకు ఎప్పటికీ మిత్రుడివే! ఇప్పుడు దేవ దానవులకు మధ్య యుద్ధాలు జరగటం లేదు.. ఇరు జాతుల మధ్య శాంతి నెలకొని ఉంది. కారణం! .. ఇరువురి దగ్గర మృత సంజీవని ఉంది కాబట్టి! నేను అమరావతికి వచ్చాక అశ్వనీ దేవతలకు మృతసంజీవనీ విద్యను నేర్పించాను. వైద్యరంగంలో వాళ్ళు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. చ్యవన మహర్షి, అరుణకేశి మహాముని లాంటి చాలా మంది భూలోకంలో వైద్యశాస్త్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.. "
కచుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే విందుకు పిలుపు వచ్చింది. కిలకిలమంటూ ఆడపిల్లలు ముందుగా విందుకు బయలుదేరారు. కచుడు, యయాతి మిగిలిన యువకులతో కలిసి విందుకు వెళ్లారు. అలా పుష్కర ద్వీపంలో యయాతి తన మొదటి రోజును గడిపాడు.
======================================================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 24 త్వరలో
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments