A V పోరాటం
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 4 days ago
- 5 min read
#AVPoratam, #AVపోరాటం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

A V Poratam - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 14/11/2025
A V పోరాటం - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
ఇరు కుటుంబాలు వుండేది ఒకే వూరు... అవనిగడ్డ ఇంటి పెద్ద ఆనందభూపతి. అర్ధాంగి అమరావతి. ఇరువురు సంతానం. మొదటి కుమారుడు కృష్ణభూపతి. రెండవది కుమార్తె, సౌదామిని. వీరమనేని ఇంటి పెద్ద ధర్మారాయుడు. వారి ఇల్లాలు సుశీల. వీరికి ఇరువురు సంతానం. తొలుత ఆడబిడ్డ, పేరు మీనాక్షి. రెండు సంవత్సరాల తరువాత మొగబిడ్డ జననం. పేరు కార్తికేయ. ఆదిలో ఆ రెండు కుటుంబాల మధ్యన (యాభై సంవత్సరాల క్రిందట) ఎంతో అన్యోన్యత. కాలగతిలో బద్ధ విరోధులుగా మారిపోయారు. రెండు కుటుంబ వర్గాల మధ్యన చిన్న చిన్న సాకులతో వాదోపవాదాలూ, రచ్చలు, పోరాటాలు. కోర్టులు కేసులు. తరచుగా సాగుతున్నాయి. ఇరు కుటుంబాలు బాగా కలవారు.
గ్రామంలోని కొంతమంది అవనిగడ్డవారి వర్గీయులు. కొంతమంది వీరమనేనివారి హితులు. అవనిగడ్డ, వీరమనేని ఇండ్ల పెద్దలు ఆనందభూపతి, ధర్మారాయుడు. వీరి ఇరువురిలో ధర్మారాయుడు పట్టు విడుపు కలవాడు. ఆనందభూపతి తాను పట్టిన కుందేలుకు కాళ్ళు మూడే అనేవాడు. వారు ఇరువురూ విరోధులుగా మారేదానికి కారణం ఆనందభూపతి వివాహం. ముందుగా ఆనందభూపతి సుశీలను పెండ్లిచూపుల్లో చూచాడు. అతనికి ఆమె బాగా నచ్చింది.
సుశీల మంచి తెలుపు. చక్కని అంగసౌష్టవం. పాలరాతి బొమ్మలా మంచి అందగత్తె. ఆనందభూపతి చామనఛాయ. కసరత్తు బాగా చేసినందున కండలుతిరిగిన మొరటు శరీరం. సుశీల తల్లిదండ్రులు ఆనంద భూపతి ఆకారం నచ్చలేదు. ఆలోచించుకొని అభిప్రాయాన్ని తెలియజేస్తామని ఆనందభూపతి తల్లిదండ్రులను మధ్యవర్తినీ సాగనంపారు. కానీ ఆనందభూపతి మనస్సున సుశీల నిలిచిపోయింది. ఆరునెలల తరువాత ధర్మారాయుడు, తల్లిదండ్రులతో సుశీలను పెండ్లిచూపులు చూడటం జరిగింది. ధర్మారాయుడు తెల్లని తెలుపు. యం. ఏ. వరకూ చదువుకొన్నవాడు, అందగాడు. సుశీలకు, కుటుంబసభ్యులందరికీ ధర్మారాయుడు గొప్పగా నచ్చాడు.
పెండ్లిచూపులరోజే సుశీల తల్లిదండ్రులు... త్వరలో మంచిరోజును చూచి నిశ్చితార్థం, వివాహ ముహూర్తం నిర్ణయిద్దాం... ఆనందంగా ధర్మారాయుడి తల్లిదండ్రులకు వారు తెలియజేశారు. వారం రోజులలో నిశ్చితార్థం, నెలరోజుల్లో సుశీల ధర్మారాయుడి వివాహాన్ని ఇరు కుటుంబ పెద్దలు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో గొప్పగా జరిపించారు. ధర్మారాయుడి తల్లిదండ్రులు ఆనందభూపతి కుటుంబాన్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించినా, వారెవరూ ఆ సుశీల ధర్మారాయుల వివాహానికి వెళ్ళలేదు.
అది మొదలు ఆనందభూపతి కుటుంబీకులు, ధర్మారాయుడి కుటుంబాన్ని వైర వర్గంగా భావించారు. ఆనందభూపతి వివాహాన్ని వారి తల్లితండ్రులు, పోలీస్ ఆఫీసర్ (డి.యస్.పి.) ధర్మరాజు కుమార్తె అమరావతితో జరిపించారు. తొలుత ఆనంద భూపతికి కొడుకు పుట్టాడు. పేరు కృష్ణభూపతి. రెండు సంవత్సరాల వ్యత్యాసంతో ధర్మారాయుడికి కూతురు పుట్టింది. పేరు కామాక్షి. ఆమె వయస్సు రెండు సంవత్సరాల సమయంలో సుశీల మొగశిశువుకు జన్మనిచ్చింది. ఆ బాబు పేరు కార్తికేయ. కార్తికేయ వయస్సు ఒక సంవత్సరం అయినప్పుడు అమరావతికి ఆడబిడ్డ కలిగింది. ఆ పాప పేరు సౌదామిని.
కృష్ణభూపతి, కార్తికేయ, కామాక్షి, సౌదామినీలు ఒకే స్కూల్లో చదువుకొనేవారు. వారు నలుగురూ మంచి స్నేహితులు. ప్రాథమిక విద్య ముగిసి సెకండరీ హైస్కూల్లో చేరిన తరువాత, వారు అప్పుడప్పుడూ తమ తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకోకుండా వుండేదానికి కారణాలను గురించి చర్చించుకొనేవారు. సఖ్యత సర్వులకూ ఆనందదాయకం కదా!... పెద్దలు ఎలా వున్నా మనం నలుగురం ఎప్పుడూ మంచి స్నేహితులుగా వుండాలని ఆ చిన్న వయస్సులో ప్రమాణాలు చేసుకొన్నారు. మాధ్యమిక విద్య ముగిసింది. జిల్లా రాజధాని నగరంలో నలుగురూ ఒకటి రెండు సంవత్సరాలు వెనకాముందుగా కాలేజీలో చేరారు... కృష్ణభూపతి కామాక్షి ఒక క్లాస్, కార్తికేయ సౌదామిని మరో క్లాస్. నలుగురూ బి.ఏ. యం.ఏ. పూర్తిచేశారు.
కృష్ణభూపతి, కామాక్షి సివిల్స్ వ్రాసి ఉత్తీర్ణులై, అవసరమైన ట్రయినింగ్స్ ముగించి కృష్ణభూపతి ఐ.పి.యస్., కామాక్షి ఐ.ఏ.యస్. పాసై, డి.యస్.పి, అసిస్టెంట్ కలెక్టర్లుగా అయినారు. అప్పటికి వారి ఇరువురి మధ్యన చిన్ననాటి నుంచి వున్న స్నేహం, వయస్సురీత్యా ప్రేమగా మారింది. కానీ ఎవరూ అవసరపడి తమ అభిప్రాయాలను ఒకరికొకరు చెప్పుకోలేదు. కార్తికేయ లా చదివి లాయర్ అయ్యాడు. సౌదామిని యం.బి.బి.యస్. చదివి డాక్టర్ అయింది. వీరిరువురి మధ్యనా వున్న స్నేహం ప్రేమగా మారింది. ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. మన తల్లిదండ్రులు కాదన్నా మనం వివాహం చేసికోవాలనే నిర్ణయానికి వచ్చారు. కృష్ణభూపతి ఐ.పి.యస్. అసిస్టెంట్ కలెక్టరుగా ఆ జిల్లాలోనే ఉద్యోగాల్లో ప్రవేశించారు. కృష్ణభూపతి కామాక్షికి ఫోన్ చేశాడు.
“గుడ్మార్నింగ్ కలెక్టర్గారూ!...” “ఏం?...” “కనిపెట్టండి!...” నవ్వాడు కృష్ణ.
కామాక్షి ఫోన్ చేసింది కృష్ణ అని గ్రహించింది. “గుడ్మార్నింగ్ డియస్పి గారూ!...”
“నేను డియస్పిగా మాట్లాడడంలేదు కామూ!...”
“ఓ అలాగా!...” నవ్వింది కామాక్షి...
"ఉదయాన్నే ఫోన్ చేశావ్ ఏమిటి విషయం?... “
"వివాహం చేసుకోమంటున్నారు మా అమ్మానాన్నలు!...”
“ఆ...”
“అవును కామూ!...”
“ఆ!...”
“నా మనస్సున ఒక అమ్మాయి వుంది చాలా కాలంగా!...”
“ఎవరో ఆ అదృష్టవంతురాలు!...”
“నీకు బాగా తెలుసు!...”
“ఏం!...”
“ఏం ఏం!...”
“ఆఁ...” ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది కామాక్షి.
“ఎందుకు అంత ఆశ్చర్యం? ఆ బంగారు బొమ్మ ఎవరో కాదు నీవే కామూ!...”
“నా అభిప్రాయంతో పనిలేదా!...”
“నీ అభిప్రాయం నాకు తెలుసుగా!...”
“అమ్మానాన్నల...” కామాక్షి పూర్తిచేయకముందే... “మాట్లాడడం జరిగింది. వారు సంతోషించారు. సరే అన్నారు.”
“నీవు చెప్పేది నిజమా కృష్ణా!...”
"అవును అవును!...”
“మరి మీ అమ్మానాన్నలకు చెప్పావా?...”
“చెప్పి ప్రయోజనం లేదు. వారి ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. త్వరలో మన ఇరువురం మన వూర్లోనే పెండ్లి చేసుకోబోతున్నాము. నీకు సంతోషమేగా!...”
“మీ నాన్నగారు మన పెండ్లిని జరగనిస్తారా!...” విచారంగా అడిగింది కామాక్షి.
“వి ఆర్ మేజర్స్!... మనం ఒకరినొకరం ఇష్టపడి పెండ్లి చేసుకోబోతున్నాము. మీ అమ్మానాన్నలు మనకు సపోర్టు. మా నాన్న మన పెండ్లిని ఆపలేరు!...”
“నాకెందుకో!...” ఆగిపోయింది కామాక్షి.
“ఎందుకూ, నీవు భయపడకు. అంతా సవ్యంగా సాగుతుంది. మన వివాహాన్ని జరిపించబోయేది మా బాస్ యస్.పి.కోదండపాణి, నా పోలీస్ బలగం” గర్వంగా చెప్పాడు కృష్ణభూపతి.
కామాక్షి తల్లిదండ్రులతో ప్రస్తావించింది. వారు కృష్ణభూపతి, వారిని కలిసి తన నిర్ణయాన్ని చెప్పినట్లుగా చెప్పారు. వారి అంగీకారాన్ని కామాక్షికి తెలిపారు. ఆమె మనస్సుకు పరమానందం. లాయర్ కార్తిక్ సౌదామినితో తన ఇంటికి వచ్చాడు. కార్తిక్, పేరుగల పెద్ద లాయర్ వెంకట్రామయ్యగారి వద్ద పనిచేస్తున్నాడు. సౌదామిని జిల్లా గవర్నమెంటు హాస్పిటల్లో ఉద్యోగంలో చేరింది. ఆ ఇరువురూ ప్రతిరోజూ సాయంత్రం సమయంలో కలిసికొనేవారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. సౌదామినిని చూచి ధర్మారాయుడు సుశీల ఆశ్చర్యపోయారు. సౌదామినిని ఆశ్చర్యంగా చూడసాగారు.
“నాన్నా!... సౌదామిని!...” చిరునవ్వుతో చెప్పాడు కార్తిక్.
“తెలుసు. ఎందుకు తీసుకొచ్చావు?... ఆ ఆనందభూవతి చూస్తే!...” అన్నాడు వ్యాకుల వదనంతో ధర్మారాయుడు.
“నాన్నా!.. మేమిరువురం ప్రేమించుకొన్నాము. జీవితాంతం కలసి బ్రతకాలని, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాము. మాకు నా అమ్మానాన్నలైన మీ ఇరువురి సమ్మతి కావాలి. అందుకే సౌదామినిని తీసుకొచ్చాను.” ధర్మారాయుడు అర్ధాంగి సుశీల ఆశ్చర్యంతో వారిని చూస్తూ వుండిపోయారు.
“మామయ్యా!... మీరు మా నాన్నగారిని గురించి భయపడుతున్నట్లున్నారు. మేము చిన్నపిల్లలం కాదు. యుక్త వయస్కులం. మీ కూతురు కామాక్షి మా అన్నయ్య కృష్ణభూపతి మాలాగే ప్రేమించుకొన్నారు. వారు మన వూరి రామాలయంలో వివాహం చేసుకోబోతున్నారు. మా వివాహాన్ని మీరు మంచి మనస్సు చేసికొని వారి వివాహంతోపాటు జరిపించండి. మా నాన్నగారి విషయాన్ని మా అన్నయ్య డియస్పి కృష్ణభూపతి చూచుకొంటాడు. మీరు న్యాయంగా మీ సమ్మతిని మాకు తెలియజేయండి” చిరునవ్వుతో చెప్పింది సౌదామిని.
వాకిట కారు ఆగింది. కృష్ణభూపతి కామాక్షి కారు దిగి ఇంట్లోకి ప్రవేశించారు. “మామయ్యా!.. శుభరాత్రి. కార్తిక్ సౌదాలు మీకు వారి నిర్ణయాన్ని తెలియజేశారుగా!... సంతోషంగా మీ అనుమతిని వారికి మాకు తెలియజేసినట్లుగానే తెలియజేయండి. మన రెండు కుటుంబాల మధ్యన వున్న పగ-ప్రతీకార వాంఛలు మా వివాహాలతో సమసిపోవాలి. మన రెండు కుటుంబాలు ఏకం కావాలి. మన సఖ్యత ముందు మా నాన్నగారి అహంకారం గర్వం ద్వేషం దహనమైపోతాయి. వారు ఇంతకాలం సాగించిన పోరాటం సమాధి అవుతుంది.
వారు మారుతారు. మా వివాహాలకు వస్తారు. మీ ప్రక్కన నిలబడి మీలాగే వారు మా తలలపై అక్షితలు చల్లి మమ్మల్ని దీవిస్తారు. ఆ అద్భుత దృశ్యాన్ని మీరు చూడబోతారు. ఇప్పుడు మా బాస్ యస్.పి.కోదండపాణిగారు మా నాన్న మెదడుకు ట్రీట్మెంటు ఇస్తున్నారు” వ్యంగ్యంగా నవ్వాడు కృష్ణభూపతి.
అతని చివరిమాటలకు అందరూ ఆనందంగా నవ్వారు...
“అయ్యా!... ఆనంద భూపతిగారు!... మీరు నాకన్నా పెద్దవారు. నేను మీకు చెప్పేటంతటి వాడిని కాను. కానీ ఈ గ్రామం కోసం చెప్పక తప్పడంలేదు. మన ఈ భారతావనికి వెన్నెముక గ్రామాలే. ప్రతి గ్రామం ప్రశాంతంగా వుంటే నగరాలు, యావత్ భారతదేశం ప్రశాంతంగా వుంటుంది. మీ సంతతి, అటు ధర్మారాయుడుగారి సంతతి ఉద్దేశ్యం గ్రామసీమలను బాగుచేయాలని. కలహాలు కక్షలు పార్టీలు లేని గ్రామాలను రూపొందించి ప్రజాసఖ్యతను చూడాలని... వారు వారి నిర్ణయాన్ని నాకు తెలియజేశారు. వారి ఆశయాలు చాలా గొప్పవి. అందుకే నేను వారిని సమర్ధించాను.
ఆ నలుగురి వివాహాలకు ఏర్పాటుచేశాను. అదుగో వింటున్నారా మేళతాళాలు. మీ ఇల్లాలు ఇంట్లో లేదు. కళ్యాణమండపం వద్ద వున్నారు ధర్మారాయుడి వర్గీయులతో కలిసిపోయి. వారి వెనుక మా పోలీస్ బలగం వుంది శాంతిస్థాపనకు, వారి వివాహాలు నిరంతరాయంగా జరిగేదానికి. వూరి జనం అంతా రామాలయం ముందుండగా తమరు మాత్రం ఇలా ఒంటరిగా కూర్చొని ఏవేవో తలపోసుకోవడం, మీ ఇంటికి వంటికీ మంచిది కాదు. లేవండి. మంచి మనస్సుతో ఆ నవ దంపతులు, భావిభారత ప్రగతి నిర్మాతలను దీవింతురుగాని. ముహూర్త సమయం ఆసన్నమయింది కదలండి సార్!...” చిరునవ్వుతో చెప్పాడు యస్.పి. కోదండపాణి.
కుర్చీ నుంచి లేచాడు. వూరంతా ఒక్కటైపోయింది. నా భార్య నాకు చెప్పకుండా కళ్యాణమండపానికి వెళ్ళిపోయింది. యస్.పి. మాటలప్రకారం నడచుకోవడం నాకు మర్యాద, గౌరవం. ఏ(A) వీ(V) పోరాటానికి సమాధి. అందరితో కలిసి బ్రతకడంలోనే వుంది ఆనందం. మనస్సున ఆ భావనతో చిరునవ్వుతో యస్.పి. ముఖంలోకి చూచాడు ఆనందభూపతి. “సార్!... పదండి!..” నవ్వుతూ చెప్పాడు యస్.పి. కోదండపాణి. యస్.పి. కోదండపాణి, ఆనందభూపతి రామాలయం ముందున్న వివాహవేదిక వైపుకు వేగంగా చిరునవ్వుతో నడిచారు. వీనులకు విందుగా సన్నాయిమేళం.
(సూచన: గ్రామసీమ ప్రజల సఖ్యత కోసం వ్రాసిన కల్పిత కధ)
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments