top of page
Original_edited.jpg

కచదేవయాని - పార్ట్ 10

  • Writer: T. V. L. Gayathri
    T. V. L. Gayathri
  • Sep 6
  • 4 min read

Updated: Sep 11

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 10 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 06/09/2025

కచదేవయాని - పార్ట్ 10తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు. కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. శుక్రుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు. బయటకు వచ్చిన కచుడు, శుక్రాచార్యుని బ్రతికిస్తాడు. 


తనను వివాహం చేసుకొమ్మని కోరుతుంది దేవయాని. కచుడు అంగీకరించడు. ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటారు. కచుడు దేవలోకం వెళ్ళిపోతాడు. దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు.శర్మిష్ఠతో తనను పోల్చుకుంటుంది దేవయాని. చెలికత్తెలతో వేటకు వెళుతుంది శర్మిష్ఠ.   






ఇక కచదేవయాని పార్ట్ 10 చదవండి. 


ఆడపిల్లలయినా శర్మిష్ఠ ఆమె స్నేహితురాండ్రు కలిసి జోరు జోరుగా వేటాడుతున్నారు. శర్మిష్ఠ ఒక్కతే ఐదారు   మృగాలను చంపేసింది. ఇంతవరకు పులి కానీ సింహం కానీ కనిపించలేదు.వాటిని చంపితేనే వీరత్వం!


మధ్యాహ్నం కాస్త ఆగి భోజనాలు చేశారందరూ.


మళ్ళీ వేట మొదలుపెట్టారు. ఎండ పొద్దు వాలుతోంది.


"శర్మిష్ఠా!ఇంక చాల్లే! నాకు నీరసంగా ఉంది.. గుడారానికి పోదాం!"అంది కణిక.


"నీరసపడితే వీరవనితవు కాజాలవు! ఈరోజు పులినో సింహాన్నో చంపందే వెనక్కు వచ్చేది లేదు!" అంటూ గుర్రాన్ని ముందుకు ఉరికించింది శర్మిష్ఠ.


 చేసేదేమీ లేక ఆమెతో పాటు ఆమె చెలులందరూ  ఆమె వెనకాలే మెల్లగా వెళుతున్నారు. శర్మిష్ఠ వేగంగా ఇంకా ముందుకు ముందుకు వెళుతోంది.

తన చెలికత్తెలకు దూరమైంది.తను ఒక్కతే ముందుకు వెళుతోందని గమనించలేదామె.

 ఇంతలో ఒక పెద్ద అడవి పంది ఆమెకు కనిపించింది. ఒక్క బాణంతో దాన్ని నేలకూల్చింది. ఆ తర్వాత కొన్ని నక్కలను, తోడేళ్లను చంపేసింది.


 ఇంతలో పొదల మాటునుండి గాండ్రింపు వినిపించింది. సందేహం లేదు!అది పులి గాండ్రింపే!

ఉత్సాహంగా పొదలవైపు తన గుర్రాన్ని తిప్పింది శర్మిష్ఠ.

అక్కడే ఉన్న పెద్దపులి భీకరంగా గాండ్రిస్తూ ఆమె గుర్రం మీదకు దూకబోయింది.

పులి గాండ్రింపుకు గుర్రం బెదిరింది.అటూ ఇటూ భయంతో ఎగురుతోంది. 


ఇంతలో ఎక్కడి నుండి వచ్చాయో రెండు బాణాలు పెద్దపులికి బలంగా తగిలాయి.

అంతెత్తునుండి విలవిలలాడుతూ కింద పడింది పులి.

ఆ బాణాలు వేసింది తన చెలికత్తెలనుకొంది శర్మిష్ఠ.


కాదు... చెట్ల మధ్యనుండి గుర్రం మీద వచ్చాడొక యువకుడు.

ree

"ఇంత చిన్న పిల్లవాడివి! ఈ కీకారణ్యంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? నేను రావడం కాస్త ఆలస్యమైతే ఈ పెద్దపులి చేతిలో గాయపడేవాడివి కదా!"అన్నాడా యువకుడు శర్మిష్ఠను మందలిస్తున్నట్లుగా.


మహా అయితే పాతికేళ్లుండొచ్చు. చక్కటి ముఖ వర్చస్సు. చురుకైన కళ్ళు.  వేషధారణ చూస్తే రాజకుమారుడిలా ఉన్నాడు. ధనుర్బాణాలు  ధరించి ఉన్నాడు . బలిష్ఠంగా ఉన్నాడు.   


తను పురుష వేషంలో ఉన్నట్లు అప్పుడు గుర్తొచ్చింది శర్మిష్ఠకు 


"ఏమవుతుంది? ఆ పులితో పోరాడి చంపేసి ఉండేవాడిని.. మీరు అనవసరంగా మధ్యలో వచ్చారు!" అంది  ఉక్రోషంగా.


నవ్వాడా యువకుడు.సరదాగా ఉందతనికి.

పిట్ట కొంచమే అయినా కూత మాత్రం ఘనంగానే ఉంది.


"ఎవరి కుమారుడివి? పద!మీ పెద్దవాళ్ల దగ్గర వదిలి నేను వెళతాను!" అన్నాడు నవ్వుతూ.


"నా పుట్టుపూర్వోత్తరాలు మీకెందుకు? అసలు మా సీమలోకి వచ్చిన వాడివి! ముందు పేరు చెప్పి శరణు కోరుకుంటే నేనే వదిలేస్తాను!"


భుజాలెగరేసాడతడు.


ఈ చిన్న పిల్లవాడి  మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.


"నీకు యుద్ధం చేయడం కూడా వచ్చా!" గుర్రం దిగి నిల్చున్నాడతడు.


గుర్రం మీద నుండి ఎగిరి కిందికి దూకింది శర్మిష్ఠ.


అతడు నడుం మీద రెండు చేతులు పెట్టుకొని ముచ్చటగా  ఆమెనే చూస్తున్నాడు. 


ముద్దుగారే ముఖం..లావణ్యం ఉట్టిపడే సన్నని దేహం.. పదమూడు పద్నాలుగేళ్ళు ఉంటాయేమో!ఆడపిల్ల లాగా మధురమైన కంఠస్వరం. మూతిమీద మీసమింకా మొలవలేదు. అయినా కుర్రవాడి పౌరుషానికి మాత్రం తక్కువ లేదు.


అతడు అలా చూస్తూ ఉండగానే శర్మిష్ఠ వేగంగా విల్లు సంధించి రెండు బాణాలను లాగి పెట్టి అతడి మీద వేసింది.


అతడి భుజానికి బలంగా గుచ్చుకున్నాయా బాణాలు. చేత్తో బాణాలను లాగి వేసాడతడు. రక్తం చివ్వున  చిమ్మింది.

పకపకా నవ్వాడతడు.

"ఫర్వాలేదు!మంచి ఆటగాడివే!"అన్నాడు మురిపెంగా.


శర్మిష్ఠకు మండింది.


'అంత దెబ్బ కొడితే ఆట అంటూ నవ్వుతున్నాడు.

లాభం లేదు!బాగా గాయపరచి, బంధించి, నాన్నగారి దగ్గరికి తీసికెళ్లాలి!'


కసిగా కత్తితీసి ఎగిరి అతడి వైపు దూకింది శర్మిష్ఠ.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page