top of page

కచదేవయాని - పార్ట్ 4

Updated: 6 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part -4 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 09/08/2025

కచదేవయాని - పార్ట్ 4తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ

దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యుని వద్ద మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం బయలుదేరుతాడు. అతన్ని శిష్యుడిగా అంగీకరిస్తాడు శుక్రాచార్యుడు.  కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేస్తారు. 



ఇక కచదేవయాని పార్ట్ 4 చదవండి. 


మళ్ళీ దేవయాని భయంతో తండ్రి దగ్గరికి వచ్చింది. 


"తండ్రిగారూ! చూడండి! కచుడు ఇంకా రాలేదు.. అతడు ఆపదలో ఉండి ఉంటాడు.. దేవజాతికి చెందిన వాడు. అతడంటే గిట్టని వాళ్లు ఏదైనా హాని తలపెట్టారేమో ఒకసారి చూడండి! "అంటూ దుఃఖంతో తండ్రి పక్కన కూలబడింది. 


శుక్రాచార్యుడు" ఏడవకు తల్లీ! నేను చూస్తానుగా! " అంటూ దివ్యదృష్టితో అంతటా పరికించి చూశాడు. 

 అడవిలో చెట్టుకు కట్టబడిన కచుడి దేహం కనిపించింది. 


వెంటనే శుక్రుడు ఆకాశగమనంతో కచుడు ఉన్న ప్రదేశానికి వెళ్లి మృతసంజీవని విద్యను ప్రయోగించి అతడిని బ్రతికించాడు. గురుశిష్యులిద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు. 

కచుడిని చూచి దేవయాని ఎంతో సంతోషించింది. తండ్రితో పాటు అతడికి కూడా భోజనాన్ని వడ్డించింది. 


 దేవయానికి కృతజ్ఞతలు తెలిపి కచుడు తన బసకు వెళ్లిపోయాడు. 


కచుడు బ్రతికి రావడంతో దానవులకు క్రోధం ఇంకా ఎక్కువైంది. అందరూ ఒకచోట రహస్యంగా సమావేశమయ్యారు. 


"కచుడు కనిపించడం వలన గురువుగారు వాడిని బ్రతికించగలిగారు.. మనం వాడిని ఎక్కడ పాతిపెట్టినా గురువుగారు దివ్యదృష్టితో తెలుసుకుంటారు.. వాడిని చంపేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏముంది?ఎలాగూ మళ్ళీ బ్రతికి వస్తాడు! " అన్నాడు ఒక రాక్షసుడు. 


"సమస్య వాడు గురువుగారికి కనిపించటం కదా! ఈసారి గురువు గారికి వాడి శరీరం కనిపించకుండా చూద్దాము! కాల్చి బూడిద చేస్తే సరి! "అన్నాడొక తెలివైన రాక్షసుడు. 


" కానీ గురువుగారు బూడిద కుప్పకు కూడా జీవం పొయ్యగలరు కదా! "


"దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించా! వాడి బూడిదను గురువు గారి చేతే త్రాగిద్దాం! అసలే గురువుగారికి మద్యపానం అంటే మహా ఇష్టం.. దాన్లో కలిపి ఆయన చేత త్రాగిస్తే వాడి పీడ శాశ్వతంగా వదిలిపోతుంది!.. ఇంక వాడి ఆనూపాను గురువు గారికి తెలిసే అవకాశమే లేదు! అన్నాడా తెలివైన రక్కసుడు. 


"భేష్! ఈ ఉపాయం బాగుంది! దీనికింక తిరుగులేదు! " అనుకుంటూ అందరూ నవ్వుకున్నారు. తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారు రాక్షసులు. 


త్వరలోనే వాళ్లు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. 


ఆ రోజు పూలు కోసుకొని రావడం కోసం కచుడు ఒంటరిగా అడవికి వెళ్ళాడు. 


అతడిని చూచి గుంపుగా దూకి పట్టుకున్నారు రాక్షసులు. ఈసారి కచుడిని చంపి అతడి దేహాన్ని బూడిదగా చేసి ఆ బూడిదని మొత్తం మద్యంలో కలిపి, శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చారు రాక్షస శిష్యులు. ఒక అందమైన బంగారు పానపాత్రలో మద్యాన్ని పోసి, 


 "గురువుగారూ! మీకోసం ఎంతో రుచిగా ఉండే మద్యాన్ని చేసి తీసుకొచ్చాము! ఇది మీరు సేవించి ఎలా ఉందో చెప్పండి! ఎంతో శ్రద్ధగా మంచి మంచి మూలికలతో తయారు చేశాము! చూడండి! దీని సువాసన ఎంత బాగుందో! " అన్నారు వినయంగా. 


 అప్పుడే పూజాదికాలు ముగించుకుని వచ్చిన శుక్రుడు పానపాత్ర వైపు చూశాడు. కానీ ఎలాగోలా నిగ్రహించుకున్నాడు. 


"ఇప్పుడే వద్దులేరా! ఇంకా చేయాల్సిన హోమాలు మిగిలి ఉన్నాయి! అన్నీ పూర్తి చేసుకొని రాత్రికి త్రాగుతాను! అక్కడ పెట్టండి! "అన్నాడు. 



 నిరాశ పడ్డారు శిష్యులు. 


" మీరు ఎప్పుడూ ఇంతే గురువుగారు! అదే ఆ కచుడు తెచ్చి ఉంటే వెంటనే తాగేసేవాళ్ళు.. వాడు చెప్తే చాలు ఏ మాటైనా ఆలోచించకుండా వింటారు! మీకు వాడంటేనే ఇష్టం!.. మేమంటే అసలు ప్రేమ లేదు.. మీకోసం ఈ మద్యాన్ని ఎంతో ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొని వస్తే, మా వైపు చూడటమే లేదు మీరు!.. అంతేలెండి! వాడు మా కంటే అందంగా ఉంటాడని ముద్దుగా చూసుకుంటున్నారు! మమ్మల్ని మాత్రం దూరంగా పెడుతున్నారు!.. " అంటూ నిష్ఠూరంగా అలకను అభినయిస్తూ నిలుచున్నారు రాక్షసులు. 


వాళ్ల ముఖాలను చూస్తే జాలి వేసింది శుక్రాచారుడికి. వాళ్ళు కూడా శిష్యులే! విద్యకోసం తన దగ్గరికి వచ్చిన వాళ్ళు! పాపం! చిన్న పిల్లలు! 

అనుకుంటూ

ఆయన నవ్వుతూ "అలా ఎందుకు అనుకుంటున్నారు? నాకు శిష్యులు అందరూ సమానమే! మిమ్మల్ని తక్కువగా ఎందుకు చూస్తాను? బాధ పడకండి! ఏదీ! ఇలా ఇవ్వండి! ఏమేమి కలిపి చేశారు? ఇప్పుడే త్రాగుతానులే! "


అంటూ వాళ్ల చేతుల్లోంచి పానపాత్రను తీసుకున్నాడు. 


 అక్కడే కూర్చొని కొంచెం కొంచెంగా త్రాగాడు. 


"ఊ!.. బాగానే ఉంది! కానీ కొంచెం కొత్త రుచితో ఉంది! "అన్నాడు శుక్రుడు శిష్యులను మెచ్చుకుంటూ. 


"అయితే ఇంకొంచెం తీసుకోండి గురువుగారూ! "అంటూ, ప్రేమగా మాట్లాడుతూ ఆయన చేత మొత్తం మద్యాన్ని త్రాగించారు రాక్షసులు. మద్యం ఎక్కువ అవ్వడం వలన మత్తుతో శుక్రాచార్యుడు గాఢంగా నిద్రపోయాడు. //

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comentários


bottom of page