కచదేవయాని - పార్ట్ 5
- T. V. L. Gayathri
- 6 days ago
- 3 min read
Updated: 3 days ago
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 5 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 12/08/2025
కచదేవయాని - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యుని వద్ద మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం బయలుదేరుతాడు. అతన్ని శిష్యుడిగా అంగీకరిస్తాడు శుక్రాచార్యుడు. కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేస్తారు. శుక్రాచార్యుడు కచుడ్ని బ్రతికిస్తాడు. ఈ సారి కచుడ్ని చంపి, అతడి మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు.
ఇక కచదేవయాని పార్ట్ 5 చదవండి.
సాయంత్రం అయ్యింది.
మళ్ళీ కచుడు కనిపించక పోవటంతో దేవయానికి భయం వేస్తోంది.
'పోయినసారి దుష్టులైన రాక్షసులు కచుడిని చంపేశారు.ఈసారి కూడా అతడిని చంపేసి ఉంటారా? దేవయాని ఆందోళనతో తండ్రి దగ్గరికి వచ్చింది.
శుక్రాచార్యుడు గాఢంగా నిద్రపోతున్నాడు.
మధ్యాహ్నంగా పడుకొన్న తండ్రి ఇంకా లేవలేదు. సంధ్యాకాలంలో చేయాల్సిన పూజాదికాలు చేయకుండా తండ్రి నిద్రపోతుండటంతో దేవయానికి అనుమానం వచ్చింది. చుట్టుపక్కల చూసింది.అక్కడ ఖాళీ పానపాత్ర కనిపించింది.
'తండ్రి ఎంత మద్యపానప్రియుడైనా ఎప్పుడూ మధ్యాహ్న సమయంలో మద్యం సేవించడు. పైగా హోమాలు జరిపే విషయంలో సమయాన్ని తప్పడు.. అలాంటిది ఇలా ఎందుకు చేస్తాడు? ఎవరో బలవంతం చేసి ఉంటారు..ఇదేదో రాక్షసుల పన్నాగం!...'అనుకుంటూ దేవయాని తండ్రిని గట్టిగా కుదిపి కుదిపి లేపింది.
మత్తుగా కళ్ళు తెరిచాడు శుక్రుడు.
"లేవండి తండ్రిగారూ!మీ చేత మధ్యాహ్నం మద్యం త్రాగించి ఆ దుష్టరాక్షసులు ఏదో ఆఘాయిత్యం చేశారు... కచుడు ఇంకా ఇంటికి రాలేదు.. చూడండి! అంటూ గట్టిగా కుదుపుతున్న కూతుర్ని చూశాడు శుక్రాచార్యుడు.
గోలుగోలు మంటూ రోదిస్తోంది దేవయాని.
కాసేపటికి మత్తు వదిలించుకొని దివ్యదృష్టితో కచుని కోసం అంతటా వెతికాడు.కచుడు తన ఉదరంలోనే ఉన్నాడని తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు.
'రాక్షసులు కచుడిని చంపి,అతడి శరీరాన్ని కాల్చి బూడిద చేసి, దాన్ని మద్యంలో కలిపి అతి తెలివిగా బ్రతిమిలాడి తన చేత త్రాగించారు. ఇదంతా తనకున్న మద్యపానవ్యసనం వలెనే జరిగింది. ' అనుకుంటూ వెంటనే శుక్రాచార్యుడు ఎఱ్ఱబారిన కళ్ళతో "ఇకనుండి మద్యాన్ని సేవించడం అనేది మహాపాతకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది! ఈ వ్యసనం ఉన్నవాళ్లు గురుకులాల్లో గురువుగా ఉండే అర్హతని కోల్పోతారు!అలాగే శిష్యులు ఇటువంటి వ్యసనపరులైతే వారికి గురుకులాల్లో విద్యనభ్యసించటానికి ప్రవేశార్హత లేకుండు గాక!" అని శపించి తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించాడు.
'ఇపుడు కచుడు తన ఉదరంలోనే ఉన్నాడు కాబట్టి వాడిని వెంటనే బ్రతికించాలి!'అనుకుంటూ మృతసంజీవని విద్యను ప్రయోగించి కచుడిని బ్రతికించాడు.
గురువు యొక్క ఉదరంలో నుండి కచుడు శుక్రాచార్యుడిని ఇలా ప్రార్థించాడు.
"గురువర్యా! మీరు నాకు ప్రాణాన్ని, శక్తిని ప్రసాదించారు..అయితే నేను మీ ఉదరం నుండి బయటకు రావటం ఎలాగా? మార్గాన్ని చెప్పండి!"
దానికి శుక్రాచార్యుడు, "నాయనా కచా! ఇప్పుడు నువ్వు నా ఉదరాన్ని చీల్చుకొని రావటం తప్ప మరో మార్గం లేదు! అలా చేస్తే నేను మరణిస్తాను.. అందుకని ముందుగా నీకు మృత సంజీవని విద్యను బోధిస్తాను! నువ్వు నా ఉదరంలో నుండి బయటికి వచ్చాక దానిని ప్రయోగించి నన్ను బ్రతికించు!" అన్నాడు.
ఈ విధంగా శుక్రాచార్యుడు మృతసంజీవని విద్యను కచుడికి బోధించాడు. ఆ విద్యను నేర్చుకున్న కచుడు శుక్రాచార్యుని ఉదరాన్ని చీల్చుకొని బయటికి వచ్చాడు. తర్వాత మృతసంజీవని విద్యతో మృతుడై పడిఉన్న గురువును బ్రతికించాడు.
అప్పుడే నిద్రలేచిన వాడిలాగా శుక్రుడు కనులు తెరిచి శిష్యుడిని చూసి ప్రేమగా కౌగిలించుకున్నాడు.
దేవయాని కూడా తన తండ్రిని, ఆ పక్కనే ఉన్న కచుడిని చూచి ఎంతో సంతోషించింది. ఆమె హృదయం కచుడిపై ప్రేమతో పున్నమినాటి సముద్రం వలె ఉప్పొంగుతూ ఉంది.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comments