కచదేవయాని - పార్ట్ 8
- T. V. L. Gayathri

- Aug 23, 2025
- 4 min read
Updated: Aug 27, 2025
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 8 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 23/08/2025
కచదేవయాని - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు. కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. శుక్రుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు. బయటకు వచ్చిన కచుడు, శుక్రాచార్యుని బ్రతికిస్తాడు.
తనను వివాహం చేసుకొమ్మని కోరుతుంది దేవయాని. కచుడు అంగీకరించడు. ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటారు. కచుడు దేవలోకం వెళ్ళిపోతాడు. దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక కచదేవయాని పార్ట్ 8 చదవండి.
మణుల దీపాలు వెలుగుతున్నాయి. మధ్యలో బంగారు నగిషీలు చెక్కిన పట్టుపానుపు.
ఎగిరి మంచం మీద దూకింది శర్మిష్ఠ.
"నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావా?"
"నీకు మా భవనం కొత్త కదా! నిద్ర పడుతుందా? నీకు తోడుగా నేను ఇక్కడే పడుకుంటా!" అంటూ దుప్పటి కప్పుకొంది శర్మిష్ఠ.
ఈ వాగుడుకాయను వదిలించుకొనే దారి లేదు.
చేసేదేమీలేక శర్మిష్ఠ పక్కనే పడుకొంది దేవయాని.
కాసేపు ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పి నిద్రపోయింది శర్మిష్ఠ.
నిద్ర పట్టలేదు దేవయనికి.
లేచి కిటికీ దగ్గరికి వచ్చింది.
అక్కడంతా లతలు పాకించి ఉన్నాయి. మంచి పూవుల పరిమళం. ఆకాశంలో నిండుగా చంద్రుడు. కచుడు గుర్తుకు వచ్చాడు దేవయానికి.
ఉస్సురంటూ పక్కమీదకి వచ్చి పడుకొంది.
ఎప్పటికో నిద్ర పట్టిందామెకు.

రోజులు గడుస్తూ ఉన్నాయి. శర్మిష్ఠకు దేవయాని ప్రాణసమానురాలైంది. శర్మిష్ఠ రాచకన్య కాబట్టి ఆమెకు ఒకవైపు నాట్యము, సంగీతము, చిత్ర లేఖనము లాంటి లలితకళలను నేర్పిస్తూ, మరొక వైపు రాజనీతి శాస్త్రము, న్యాయశాస్త్రము వంటి ధర్మశాస్త్రాల గురించి అవగాహన కలిగేలా కూడా శిక్షణనిప్పిస్తారు. ఇవే కాకుండా గుర్రపు స్వారి, కత్తిసాము, విలువిద్యల్లో కూడా క్రమం తప్పకుండా శిక్షణనిప్పిస్తారు.
శర్మిష్ఠ చదువు విషయంలో ఆమె తల్లికి శ్రద్ధ చాలా ఎక్కువ.
ఆ అంతఃపురంలో పెద్ద గ్రంథాలయం ఉంది. దేవయాని అక్కడ ఉన్న పుస్తకాలలో కొన్నింటిని తీసికొని చదువుతూ ఉండేది.
ఆ రోజు శర్మిష్ఠ దేవయాని దగ్గరికి వచ్చింది.
"అక్కా! ఈ రోజు నేను, నా చెలులు కణిక, మదనికలతో కలిసి వంట పని చెయ్యాలి! నువ్వు కూడా పాకశాలకు రారాదూ! చూద్దువు గానీ!"
దేవయానికి ఆశ్చర్యం వేసింది.
"నువ్వు వంట చేయటమెందుకు? మీ నాన్నగారు మహారాజు. నీ వివాహం కూడా ఇంకో మహారాజుతో చేస్తారు. ఇటువంటి గొప్ప వంశంలో పుట్టినదానివి. నీకు ఈ విద్యలన్నీ నేర్చుకోవలసిన అవసరం ఏముంటుంది? "
"మన ఆడవాళ్ళ గుర్తింపు ఒక మహారాజు కూతురుగానో లేకపోతే మరొక మహారాజుకు భార్యగానో ఉంటే సరిపోతుందా? ఒక రాజకుమారుడు ఎన్నో విద్యలను నేర్చుకుంటాడు. తర్వాత తర్వాత రాజ్యపాలనలో అతడికి ఆ విద్యలు అవసరం అవుతాయి. ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే సామాన్యమైన విషయం కాదు కదా! అలాగే కాలం ఎప్పుడూ సుఖంగా గడుస్తుందని నమ్మకం లేదు. నిరంతరం జాతుల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటప్పుడు అంతఃపుర స్త్రీలు కూడా యుద్ధం చేయవలసి వస్తే ఇప్పుడు సంపాదించిన నైపుణ్యం కష్టసమయాల్లో పనికివస్తుంది. మీ ఆశ్రమంలో నువ్వు ఏ ఏ విద్యలు నేర్చుకున్నావు? చెప్పు!"
"కొద్దిగా పుస్తకాలు చదువుతాను. నాన్నగారికి కావలసిన భోజనం తయారు చేస్తాను! అంతే!" అంది దేవయాని.
ఆమెకు కొద్దిగా అసంతృప్తిగా ఉంది.
'తనకు ఎటువంటి విద్యలూ రావని శర్మిష్ఠ భావించటం లేదుకదా! ఈ శర్మిష్ఠ పైకి చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ ఉంటుంది కానీ విద్యాభ్యాసం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తుంది. ఇదంతా ఆమె తల్లి సుమాలినీదేవి యొక్క శిక్షణ అని అర్ధం అవుతోంది. '
దేవయానికి తన తల్లి గుర్తొచ్చింది.
'తన తల్లి జయంతి. దేవేంద్రుని కూతురు. తల్లిదండ్రుల మధ్య ఏ గొడవ వచ్చిందో తెలీదు కానీ తన చిన్నప్పుడే తనను, తండ్రిని వదలి తల్లి వెళ్ళిపోయింది. తనకు ఊహరాని వయసు నుండి తండ్రి తనను గారాబంగా ఎటువంటి లోటూ లేకుండా పెంచాడు. కష్టం అనేది తెలియకుండా చూసుకున్నాడు. తన తాతగారైన ఇంద్రుడికి కూడా తన తండ్రి అంటే విపరీతమైన భయం. '
తండ్రిని తలుచుకొనే సరికి దేవయానికి ధైర్యం వచ్చింది.
'తను వేరు.. శర్మిష్ఠ వేరు.. తన తండ్రి అసామాన్యుడు.. ఈ ప్రపంచంలో అందరి కంటే బలవంతుడు. అతడు తల్చుకొంటే గాలిని, నిప్పును కూడా బంధించగలడు. అటువంటి తపోనిధి. శర్మిష్ఠ ఒక సామాన్యమైన రాజు కూతురు. ఆమెకు, ఆమె పరివారానికి ఎవరైనా హాని తలపెట్టే అవకాశం ఉంది కనుక ఈ చదువులూ, యుద్ధవిద్యలు సాధన చేస్తూ ఉండాలి.. ఇటువంటి వాళ్లకు అవి అవసరం కూడా!..
తనకేం ఖర్మ! వీటి అవసరం తనకు ఎందుకు వస్తుంది? ఏది కోరుకొంటే అది తనకు క్షణంలో తెచ్చి పెట్టే తన తండ్రి తల్చుకొంటే దేవతలందరూ క్షణంలో భస్మమైపోతారు. '
తల ఎగరేసింది దేవయాని.
"పద! చూస్తాను! నువ్వు ఏమి చేస్తావో! ఎలా వండి వడ్డిస్తావో?" అంది సరదాగా.
"అయితే పదక్కా!" అంటూ పాకశాల వైపు కదిలింది శర్మిష్ఠ.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments