పేరుకే సుందరం
- Srinivasarao Jeedigunta
- Aug 22
- 5 min read
#PerukeSundaram, #పేరుకేసుందరం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Peruke Sundaram - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 22/08/2025
పేరుకే సుందరం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఈ పూట బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీ వేస్తాను, కొబ్బరి పచ్చడి చెయ్యాలి అంటే కొబ్బరికాయ ఖరీదు ఎక్కువగా వుంది, చింతకాయ పచ్చడి నూరాను అది వేసుకుని తినేసేయండి. నాకు పచ్చడి లేకపోయినా పర్వాలేదు” అంది పార్వతి భర్త సుందరం తో.
“ఏమిటీ వారం రోజుల నుండి ఉదయం ఇడ్లీ, సాయంత్రం ఇడ్లీ పిండితో దోశ వేస్తున్నావు, మొన్న మీ అమ్మ వెళ్ళేటప్పుడు ఏడాది కోసం కొన్న మినప్పప్పు మొత్తంతో పిండిరుబ్బి పెట్టిందా నువ్వు చేసుకోలేవని?” అన్నాడు సుందరం.
“ఏమన్నారు.. ఏడాది కోసం కొన్నారా, మీరు కొంది అరకిలో మినపప్పేగా, ఏదో బస్తాలు కొన్నట్టు.. నిన్న రవ్వదోశ తిన్నారు, మొన్న పులిహోర తిన్నారు. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టరకి చూపించుకోండి, రుచి తెలుస్తున్నట్టు లేదు” అని దులిపేసింది.
“మీ అమ్మని ఏమన్నాను అని ఆలా విరుచుకుపడుతున్నావు” అన్నాడు సుందరం.
“మీ అమ్మగారి ని కూడా మర్యాద ఇవ్వకుండా పిలుస్తే అప్పుడు మీకు అర్ధం అవుతుంది మీరు ఏం తప్పుచేసారో, ఏదో మనవరాలికి పెళ్లిచూపులు పెట్టుకున్నాము రమ్మంటే వచ్చింది, మీ అమ్మగారు వస్తున్నారు అంటే మనం రుచిగా చేయించుకుని తినచ్చు అని అన్నారు, యిప్పుడు ఆవిడ ఆటు వెళ్ళగానే లెక్కలు తీస్తున్నారు, మా అన్నయ్య కి ఒంట్లో బాగుండలేదు అని ఫోన్ వస్తే వెళ్ళింది, పాపం మనవరాలికి కాబోయే వాడిని చూడాలి అని ఎంతో సరదా పడింది” అంది.
“సరేలే, ఇడ్లీ నువ్వు తినేసి నాకు చింతకాయ పచ్చడి యివ్వు నాలుకకి రాసుకుంటాను” అన్నాడు.
“పిల్లని చూడటానికి అబ్బాయి వాళ్ళు రేపు ఆదివారమే, మీరు యిలా నాతో జోక్స్ వేస్తోంటే పనులు కావు, అలా బయటకు వెళ్ళి యిల్లు దులపటానికి పనిమనిషి దొరుకుతే తీసుకుని రండి, యిలోపున మీకు ఇడ్లీ తో పులిహోర చేసిపెడతాను” అంది పార్వతి.
“వద్దులే ఆ ఇడ్లీనే యిటు యివ్వు, నములుకుంటో వెళ్ళి పనిమనిషిని తీసుకొని వస్తాను” అన్నాడు.
‘ఏమిటో ప్రతీ సారి పెళ్లిచూపులు అంటూ యిల్లు, ఫ్యాన్స్, దులిపించడం, చేసిన పకోడీలు తినేసి యింటికి వెళ్ళి ఫోన్ చేస్తాను అని గమ్మున ఉండటం, దీని పెళ్లి త్వరగా కుదిరితే బాగుండును’ అనుకుంది పార్వతి.
పార్వతి సుందరం కి ఒక్కత్తె ఆడపిల్ల, సుందరం ఆ వూరిలో బట్టలషాప్ లో గుమస్తా ఉద్యోగం. రాజకీయనాయకుల పుణ్యమా అని ఫ్రీగా కూతురిని ఇంజనీరింగ్ చదివించారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది కూతురు కవిత.
“ఏమండి, శాస్త్రి గారికి యింకోసారి చెప్పండి, మనకి తగ్గ సంబంధం చూడమని. పిల్లకి ఉద్యోగం వస్తే దానికి కాబోయే భర్త యిలా వుండాలి, తనకంటే ఎక్కువ హోదాలో ఉండాలి అని కోరికలు పుడతాయి” అంది పార్వతి.
“ప్రతీ వాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఒక్క కూతురు అయి ఉండాలి, మామగారు కోటీశ్వరుడు అయ్యి ఉండాలి, అమ్మాయి తనతో సమానంగా చదువుకుంది కదా, అత్తా మామల యిచ్చే ఆస్తులు కంటే చదువుకుని ఉద్యోగం చేసే భార్య వుంటే పుట్టిన పిల్లలకి చదువు అబ్బుతుంది అని అనుకునే వాళ్లే లేరు” అన్నాడు సుందరం.
కవితకి అదే వూరిలో ఉద్యోగం వచ్చింది. జీతం నలభై వేలు నెలకి. యింకో పది వేల కోసం పట్నం వెళ్ళటం కంటే యిదే సుఖం అనుకుంది. మొదటి నెల జీతం రాగానే తీసుకుని వచ్చి తండ్రి చేతికి యిచ్చింది.
“నాకెందుకు తల్లీ, నువ్వు దాచుకో” అన్నాడు.
“ఉంచండి నాన్నా, యిన్నాళ్ళు మీరు కష్టపడి కుటుంబాన్ని పోషించారు, నా పెళ్లి అయ్యిన తరువాత మీకు యిద్దామన్నా ఏమో వచ్చిన ఆయన యివ్వానిస్తారో లేదో” అంది.
“నా తల్లే. అందరూ నీలాంటి కూతురులు వుంటే ఎంత బాగుండును, మగపిల్లాడు లేడు అని బాధ అక్కరలేదు” అన్నాడు డబ్బులు బీరువాలో పెట్టి.
రెండు నెలలో సుందరం ఇంటికి ఫ్రీజ్ వచ్చింది, ఆతరువాత ప్లాసమా టీవీ వచ్చింది. దాని వెంటనే వెట్ గ్రైండర్, ఆ తరువాత వాషింగ్ మెషిన్.. ఈ విధంగా కొత్త వస్తువులు వస్తున్నాయి.
పార్వతి భర్త ని అడిగింది “అది కష్టపడి సంపాదన అంతా ఈ ఆడంబరాలకు ఖర్చు చేస్తోవుంటే రేపు దాని పెళ్ళికి చేతిలో కాణి లేకుండా చేస్తారా? ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి లేని షోకులు యిప్పుడు ఎందుకు” అని నిలదీసింది.
“పిచ్చదాన.. ఈ వస్తువులు లేకుండా కుక్కి మంచం, విరిగిపోయిన కుర్చీలు ఉండటం వలన ఒక్క సంబంధం కుదరటం లేదు. అమ్మాయి డబ్బులు యిస్తోంది కాబట్టి ఈ వస్తువులు కొన్నాను, లేకపోతే నా జీతం తో ఈ జన్మలో కొనలేను. సాగినంత వరకు సాగని. దాని పెళ్లి అయ్యి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి” అన్నాడు సుందరం.
కొన్ని సంబంధాలు కట్నకానుకల కోసం, కొన్ని సుందరం మాటలు నచ్చక కుదరలేదు. కవితకి ఇరవై ఏడు ఎళ్ళు వచ్చేసాయి. ఎక్కడో తప్పు జరుగుతుందో అని పార్వతికి అనుమానం వచ్చింది.
ఆరోజు సాయంత్రం రాముడి గుడికి వెళ్ళింది శాస్త్రి గారిని కలవడానికి. ఎవ్వరితోనో మాట్లాడుతున్న శాస్త్రిగారు పార్వతి ని చూసి కూర్చోమని సైగ చేసాడు.
అరగంట తరువాత పార్వతమ్మ ని పిలిచి “ఏమిటి యిలా వచ్చారు, ఏదైనా మాట్లాడాలా” అన్నాడు శాస్త్రిగారు.
“మా అమ్మాయి పెళ్లి విషయం గురించే బెంగ, మీరు అడిగినవాళ్ళకి యిట్టే సంబంధం కుదర్చగల సమర్థులు కదా.. మా అమ్మాయి సంబంధం విషయంలో ఎందుకు శ్రద్ద చూపటం లేదు” అని అంది.
“శ్రద్ధ నేను చూపకపోవడం కాదు, మీ ఆయన మీ అమ్మాయి ఉద్యోగం రాకముందు రోజు నా ప్రాణం తీసేవాడు సంబంధాలు చూడమని. ఉద్యోగం వచ్చిన తరువాత నుంచి మీవారు మారిపోయారు. ఎన్ని అడ్రసులు యిచ్చినా ‘యిప్పుడే వద్దులెండి, కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకోనియ్యండి’ అని అన్నాడు, నేను అర్ధం చేసుకోగలను ఇటువంటి ఒక్కత్తె ఆడపిల్ల కలిగిన మధ్య తరగతి కుటుంబాలలో ఇది జరిగేదే” అన్నాడు శాస్త్రి గారు.
“ఆయన లో మార్పు నేను గమనించాను శాస్త్రిగారు. కానీ పిల్ల జీతం కోసం పిల్ల జీవితం నాశనం చేసే అంత దుర్మార్గుడు కాదు ఆయన. మీరు మంచి సంబంధం చూసి నాకు ఫోన్ చేసి చెప్పండి, మిగిలిన విషయం నేను చూసుకుంటాను” అంది పార్వతి.
పదిరోజులలో ఒక మంచి సంబంధం గురించి పార్వతమ్మ కి చెప్పాడు. “పిల్లాడు కూడా మీ అమ్మాయి చేసే కంపెనీ లోనే ఇంజనీర్ చేస్తున్నాడు. మీ అమ్మాయి ని చూసాడుట. వాళ్ళ నాన్నగారు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. కానుకలతో పనిలేదు, యింతకంటే మంచి సంబంధం దొరకడం కష్టం” అన్నారు శాస్త్రి గారు.
మంచి రోజు చూసి పెళ్లి చూపులకి తేది నిర్ణయం చేసారు పార్వతి, శాస్త్రి గారు. ఈలోపు కూతురు కవితకి చెప్పింది మీ ఆఫీస్ లో పని చేస్తున్న వేణు నిన్ను ఇష్టపడ్డాడు అని, ‘అతను నీతో మాట్లాడుతాడు జాగ్రత్తగా మాట్లాడు, ఆతరువాత మిగిలిన విషయాలు చూసుకోవచ్చు’ అంది.
తనకి అతను ముందే తెలిసి ఉండటం, ఆఫీసులో మంచి పేరు ఉండటం తో వేణు మాట్లాడినప్పుడు తన కుటుంబం విషయం చెప్పింది. తన తండ్రి చిన్న జీతగాడు అని, దాని వలన తన జీతం ఆయనకు బాగా సహాయపడటంతో ‘నాకు వివాహం వెంటనే చేస్తే ఆ డబ్బులు తనకి రావు అనే భయంతో నా పెళ్లి వాయిదా వేయటానికి కూడా వెనకాడాలేదు. అలా అని ఆయన చెడ్డవాడు కాదు, పరిస్థితులు ప్రభావం అంతే’ అంది.
“ఒక విధంగా మీ నాన్న గారు నాకు చాలా సహాయం చేసారు. ఆయన నీకు అప్పుడే పెళ్లిచేసివుంటే ఈ రోజు నాకు దక్కేదానివి కాదు, మన పెళ్లి అయిన తరువాత కూడా నీ జీతం నుంచి మీ నాన్నగారికి సహాయం చెయ్యి, అది ధర్మం. కొడుకైనా కూతురు అయినా నువ్వే. వృద్దప్యం లో వాళ్ళు ఏ చింత లేకుండా ఉండాలి, ఆలా చూడాలిసిన బాధ్యత నీదే” అన్నాడు.
సాయంత్రం సుందరం ఇంటికి వచ్చేసరికి ఇల్లు కోలాహలంగా వుంది. పెళ్లిచూపులకి జడ్జి గారి ఫ్యామిలీ వచ్చింది అని భార్య ద్వారా తెలుసుకుని, “యిప్పుడేమి తొందర వచ్చింది.. నాకు చెప్పకుండా ఆరెంజ్ చేసావు” అన్నాడు.
“కొనాలిసిన వస్తువులు అన్నీ కొనేసారుగా, ఇహ మిగిలింది పెళ్లిచూపులే అందుకే, మీరు త్వరగా మొహం కడుక్కుని వెళ్లి జడ్జి గారిని పెళ్లికొడుకుని పరిచయం చేసుకోండి, యింకో విషయం అమ్మాయి, నేను ఈ సంబంధం కి పూర్తి అంగీకారం తెలిపాము, మీరు కూడా సవ్యంగా మాట్లాడండి” అంది.
పూర్తి పెళ్లిఖర్చులు పెట్టి జడ్జిగారు కవితని కోడలుగా తెచ్చుకున్నారు. అత్తారింటికి వెళ్తున్న కవిత తండ్రిని కౌగిలించుకుని “ధైర్యంగా, ఆరోగ్యం గా ఉండండి” అంది.
సుందరం జేబులో నుంచి పదివేల రూపాయల కట్ట తీసి కూతురు చేతిలో పెట్టి, “తిరుపతి ప్రయాణంలో వాడుకో. ఇది నీ డబ్బే” అన్నాడు.
“నాది అంటూ ఏమి లేదు నాన్న, మన డబ్బు అంతే” అంది.
కూతురు అత్తారింటికి వెళ్లిన తరువాత మొదటి మొదటి తారీకు వచ్చింది. వాలు కుర్చీలో కూర్చున్న సుందరం మనసులో అనుకున్నాడు, ఈపాటికి కూతురు జీతం నా అకౌంట్ లో పడేది అనుకున్నాడు. యింతలో ఫోన్లో టింగ్ మని సౌండ్ రావడం తో ఫోన్ చూసుకున్నాడు. ఇరవై వేలు తన అకౌంట్ లో క్రెడిట్ అయ్యినట్టు మెసేజ్. అల్లుడు పంపించాడు. ‘యిదేమిటి అల్లుడు దగ్గర తేలిక చేసింది కూతురు’ అనుకున్నాడు.
వాట్సాప్ లో వున్న అల్లుడు పంపిన మెసేజ్ చదివిన సుందరం కి కన్నీళ్లు వచ్చాయి.
‘మామయ్యగారు.. మీ కుటుంబ పరిస్థితులు కవిత పెళ్ళికి ముందే చెప్పింది. ప్రతీ తండ్రి తన కొడుకు మీద చివరి రోజులలో డబ్బులు కోసం కాకపోయినా ఆప్యాయత కోసం ఎదురు చూడటం సహజం. అదే సరైన సంపాదన లేకపోతే ఆ తల్లిదండ్రుల పోషణ బాధ్యత ఆతని కొడుకుదైనప్పుడు, ఒక్కత్తె కూతురు ఉండి వున్న తల్లిదండ్రులు కూడా ఆ కూతురు మీద ఆధారపడటం తప్పులేదు. అల్లుడైనా, కొడుకైనా నేనే అని మీరు భావించితే ప్రతి నెల పంపించే డబ్బుని మనస్ఫూర్తిగా తీసుకుంటారని అనుకుంటాను, ఇట్లు మీ వాడు వేణు’ అని రాసాడు.
భార్యకి విషయం చెప్పాడు సుందరం. “పెళ్లి అయిన కూతురు నుంచి కూడా సహాయం కావాలా మనకి, మీ జీతం తో అదివరకు గడుపుకున్నట్టు గడుపుకోలేమా” అంది.
“మనకి అమ్మాయి జీతం తో సుఖాలు అలవాటు అయిపొయింది, యిప్పుడు మళ్ళీ మొదటికి రావాలి అంటే అలవాటు కావాలి, అప్పుడు వాళ్ళని డబ్బులు పంపద్దు అందాము లే” అన్నాడు సుందరం.
“ఏమో! మీరు పేరుకే సుందరం” అంది పార్వతి.
పిల్లలకు తల్లిదండ్రుల అవసరం, తల్లిదండ్రులకు పిల్లల అవసరం.. తప్పులేదు గా.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments