అమ్మ చీర
- Karlapalem Hanumantha Rao

- Mar 4
- 3 min read
#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు, #అమ్మచీర, #AmmaCheera

Amma Cheera - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao Published In manatelugukathalu.com On 04/03/2026
అమ్మ చీర - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
నా పేరు శారద. అద్దంలో చూసుకుంటే నా ముఖంలో మా అమ్మ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. పోలికలు ఓ. కే గానీ అమ్మంత అనురాగం నాలో ఉందా? ఏమో! అనుమానమే!
ఈరోజు నా కూతురు అన్విత పదేళ్ల పుట్టినరోజు. అల్మారాలో భద్రంగా దాచిన ఆ పాత పట్టుచీరను బయటకు తీస్తుంటే, నా కళ్ల ముందు ఇరవై ఏళ్ల కిందటి దృశ్యాలు కదలాడాయి.
ఇది మా అమ్మమ్మ అమ్మకు ఇచ్చిన పట్టుచీర. ముదురు ఆకుపచ్చ రంగు, వెడల్పాటి బంగారు జరీ అంచు. అమ్మకు ఆ చీరంటే ప్రాణం. పండుగలకు, పబ్బాలకు అమ్మ ఆ చీర కట్టుకుంటే, ఇంటికంతా ఒక లక్ష్మీకళ వచ్చేది.
నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ యానివర్సరీలో 'ద్రౌపది' వేషం వేయాల్సి వచ్చింది. నాటకానికి మంచి పట్టుచీర కావాలి. అమ్మను అడిగితే, "వద్దమ్మా.. అది అమ్మమ్మ జ్ఞాపకం. అక్కడ పిల్లలంతా ఉంటారు, ఎక్కడ తగిలించుకుంటావో.. నా మాట విని వేరేది తీసుకెళ్లు" అంది.
నాకు కోపం వచ్చింది. అమ్మ మీద అలిగి అన్నం తినలేదు. అయినా అమ్మ మనసు కరగలేదు.
చివరికి అమ్మ పేరంటానికి వెళ్లినప్పుడు, నా పంతం నెగ్గించుకోవడానికి ఎవరికీ తెలియకుండా ఆ చీరను బ్యాగులో పెట్టేసుకున్నాను.
స్టేజి మీద వస్త్రాపహరణం ఘట్టం. దుశ్శాసనుడు చీర లాగుతున్నప్పుడు నేను ఆక్రోశిస్తూ అడ్డుకుంటున్నాను.ఖర్మ కాలి ఆ చీర జరీ అంచు దుశ్శాసనుడి గోళ్ళు దిగి నిలువునా ‘పర్’మని చిరిగి పోయింది.. పాత చీరె కదా!
నా గుండె ఆగిపోయినంత పనైంది. నాటకం అయిపోయాక మేకప్ రూములో కూర్చుని ఆ చీరను చూసి ఎంత వెక్కి వెక్కి ఏడ్చానో!
అట్లాంటి విషయాలు ఇంట్లో దాచలేం కదా! ఏమైతే అదవుతుందని ఉన్న మాట చెప్పేసాను. కొడుతుందేమో అని భయపడ్డాను. కానీ అలా జరగలేదు! అమ్మ ఆ చీరను చేతుల్లోకి తీసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరగడం నేను చూశాను.
ఆ రాత్రంతా నిద్రపోకుండా, సన్నటి సూదితో ఆ చిరిగిన చోట టాకాలు వేసింది అమ్మ. ఆ కుట్లు కనబడకుండా మడతపెట్టి, బీరువా అడుగున దాచేసింది. ఆ తర్వాత అమ్మ మళ్ళీ ఎప్పుడూ ఆ చీర కట్టలేదు.
కాలం గిర్రున తిరిగింది. నాకు పెళ్లైంది, అన్విత పుట్టింది.
అన్విత ఐదో ఏట పుట్టినరోజు వేడుక ఇంటి వరండాలో జరుగుతోంది.
చుట్టూ పిల్లలు, సందడి. ఆ ఉత్సాహంలో ఎవరో తారాజువ్వలు కాల్చినట్లున్నారు... అనుకోకుండా ఒక రవ్వ ఎగురుకుంటూ వచ్చి అన్విత పట్టు పావడ మీద పడింది. నిప్పు రాజుకుంటోంది. చూస్తుండగానే చిన్న మంటగా మారింది. అంతా కంగారులో కేకలు వేస్తున్నాం కానీ ఎవరికీ ఏం చేయాలో పాలుపోలేదు.
అమ్మ మెరుపు వేగంతో వంటి మీది పట్టుచీరను లాగి అన్విత చుట్టూ చుట్టేసి పక్కకు నెట్టేసింది. అన్విత ప్రాణాలు కాపాడింది.
కాని నిప్పురవ్వ వేడికి ఆ పాత పట్టుచీర బాగా కాలిపోయింది. జరీ నల్లగా మాడిపోయింది. నాకు ఏడుపు ఆగలేదు. అమ్మకు ఆ చీరె అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు.
"అమ్మా! అమ్మమ్మ గుర్తు కదా.. ఎంత పని చేశావు? చీరెట్లా కాలిపోయిందో చూడు!”బావురుమన్నాను బాధ తట్టుకోలేక.
అమ్మ మాత్రం ఆ కాలిపోయిన చీరను దులుపుతూ, నా తల నిమిరి ప్రశాంతంగా అంది, "పిచ్చిపిల్లా!.. ఈ చీరను అమ్మమ్మ నాకు ఎందుకు ఇచ్చిందో తెలుసా? కష్టకాలంలో నాకు అండగా ఉంటుందని. ఈ పసిగుడ్డు ప్రాణం కంటే ఈ గుడ్డముక్క ముఖ్యం కాదు! ఈపూట అమ్మమ్మే వచ్చి అన్వితను కాపాడిందనుకో "
అప్పుడు నాకు అర్థమైంది.. అమ్మల ప్రేమకన్నా ఏ వస్తువూ అమూల్యం కాదని,
ఈరోజు అన్విత పదేళ్ల పుట్టినరోజు. అమ్మ ఇప్పుడు మా మధ్య లేదు. ఆ కాలిపోయిన పట్టుచీరలో మంచిగా ఉన్న భాగాలను తీసి, నేనే సొంతంగా అన్వితకు ఒక లంగా కుట్టాను. ఆ పాత జరీ ముక్కలను డిజైన్ లాగా వాడాను.
అన్విత ఆ లంగా వేసుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటే, తన వెనుక అమ్మమ్మ, ముత్తవ్వల దీవెనలు ఉన్నాయని నాకు అనిపించింది.
మా వారు వెనుక నుండి వచ్చి, "ఏంటి శారదా.. కొత్త బట్టలు కొనడానికి క్రెడిట్ కార్డు ఇస్తానన్నా వద్దన్నావు! ఆ పాత ముక్కలతో సరిపెట్టుకోడానికా? బాగా లోభివి అయిపోతున్నావూ" అని ఆటపట్టించారు.
నేను నవ్వి అన్నాను, "ఇది లోభం కాదు మురళీ.. ఆస్తి! అమ్మ దీవెన కంటే గొప్ప బహుమతి నా కూతురికి ఇంకేం ఇవ్వగలను?"
అన్విత ఆ లంగా వేసుకుని గెంతుతుంటే, ఆ పాత పట్టుచీర మళ్ళీ కొత్తగా ప్రాణం పోసుకున్నట్టు లేదూ!”
'అవును’ అన్నాడు మురళి ఎత్తుకున్న అన్విత పట్టులంగాని ఆప్యాయంగా తడుముతూ!
సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.




@karlapalem2010
•15 minutes ago
అద్భుతమైన స్వరం .. దానికి తోడు అర్థవంతమైన చిత్రాలు !