కచదేవయాని - పార్ట్ 7
- T. V. L. Gayathri

- Aug 20
- 4 min read
Updated: Aug 23
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 7 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 20/08/2025
కచదేవయాని - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు. కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. శుక్రుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు. బయటకు వచ్చిన కచుడు, శుక్రాచార్యుని బ్రతికిస్తాడు.
తనను వివాహం చేసుకొమ్మని కోరుతుంది దేవయాని. కచుడు అంగీకరించడు. ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటారు. కచుడు దేవలోకం వెళ్ళిపోతాడు.
ఇక కచదేవయాని పార్ట్ 7 చదవండి.
కచుడు వెళ్లిపోయాక దేవయాని దిగులుగా ఉంటోంది. ఉలకదు. పలకదు. మన్ను తిన్న పాములాగా ఉదాసీనంగా కూర్చుంటోంది. కచుడు ఆమెను పరమ ఘోరంగా అవమానించాడని ప్రతిక్షణం బాధపడుతూ ఉంది.
శుక్రాచార్యుడు కూతురిని గమనించాడు. చలాకీగా నవ్వుతూ తుళ్లుతూ ఉండాల్సిన పిల్ల మనశ్శాంతి కోల్పోయి బాధపడుతూ ఉంటే ఆయనకు కూడా మనసులో కష్టంగా ఉంది.
రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కూతురు ఉంది. ఆ అమ్మాయి దేవయాని కంటే మూడేళ్లు చిన్న పిల్ల.
ఆ అమ్మాయితో ఉంటూ రాణివాసంలో ఉండే చెలికత్తెలతో ఆడుకుంటే దేవయాని కాస్త మామూలు మనిషవుతుందని భావించాడు శుక్రాచార్యుడు. అనుకున్నదే తడవుగా వృషపర్వుడిని పిలిపించి విషయం చెప్పి, దేవయానిని రాచనగరుకు పంపించే ఏర్పాటు చేశాడు.
అది విని దేవయాని అంత ఉత్సాహం చూపలేదు.
"తండ్రిగారు! ఇంతకుముందు ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు కదండీ! కొత్త చోటు.. కొత్త మనుషులు.. ఎవరింట్లోనో నేను ఉండటం ఏమిటి?" అంది ముభావంగా.
దానికి శుక్రాచార్యుడు
"వృషపర్వుడికి నేను పురోహితుడిని. ఆయనకు నా మాటే వేదం! నన్ను గురువులాగా భావించి పూజిస్తుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే నాకు సేవకుడి వంటివాడు. నువ్వేమీ సందేహించకు తల్లీ! రాజధానిలో నీవు దర్శించ దగ్గ వింతలు, విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి. శర్మిష్ఠ చాలా మంచి పిల్ల!.. నీతో కలిసి ఆడుకుంటుంది. కాస్త నలుగురితో కలిసి కొత్త ప్రదేశాలు చూసిరా! నీ మనసుకు ఆనందం కలుగుతుంది!నువ్వు దిగులుగా తిరుగుతుంటే నీమీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు!" అంటూ కూతురిని సమాధానపరిచాడు.
విధిలేక "సరే!" అంటూ తన అంగీకారాన్ని తెలిపింది దేవయాని. రాజు పంపించిన రథం ఎక్కి రాజధానికి బయలుదేరారు తండ్రీ కూతుళ్లు.
దారిలో కనిపించిన పొలాలను తోటలను, సరస్సులను చూసుకుంటూ రాచనగరకు చేరారు. వీళ్లకు ఘనమైన స్వాగత సత్కారాలు చేశాడు రాజు.
దేవయాని రథాన్ని దిగి కాలు కింద పెట్టగానే "అక్కా!" అంటూ వచ్చింది బంగారు రంగులో మెరిసిపోతున్న శర్మిష్ఠ. ఆమె వంకీల జుట్టు గాలికి ఎగురుతోంది. గుండ్రటి ముఖం. లేడికనులు.. ఆ కళ్ళలో పసితనపు ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విలువైన రత్నాల నగలు, పట్టువస్త్రాలు ధరించిన ఆమె వెలిగిపోతూ ఉంది.
శర్మిష్ఠను చూసి మొహమాటంగా నవ్వింది దేవయాని. దేవయానిది కోలముఖం. నిడుపాటి కేశపాశం.. ఆశ్రమంలో పెరిగిన దేవయాని అందుకు తగ్గ నేత చీర కట్టుకొని ఉంది. పెద్దగా నగలేవీ లేవు. సహజ సౌందర్యానికి ప్రతీకగా ఉందామె.. ఆమెవి సోగకళ్ళు. ఆ కళ్ళల్లో గాంభీర్యం తొణికిసలాడుతూ ఉంది.

"రా అక్కా! నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాము! మనిద్దరం ఆడుకుందాం!" అంటూ చనువుగా దేవయాని చెయ్యిపట్టుకొని అంతఃపురానికి తీసికొని వెళ్ళింది శర్మిష్ఠ. అక్కడ ఉండే రాణివాసపు స్త్రీలందరు దేవయానిని ఆప్యాయంగా పలకరించారు. ఆ రాత్రి దేవయానిని పక్కనే కూర్చోబెట్టుకొని తనకు తెలిసిన విషయాలన్నీ చెబుతూ, మధ్య మధ్యలో తన గదిలో ఉన్న బొమ్మలను, కళాఖండాలను చూపిస్తూ సందడి చేస్తోంది శర్మిష్ఠ.
ఆ పిల్లది భోళా మనస్తత్వం. రాజుగారి కూతురే అయినా ఆ దర్పం, అహంకారం ఆమెలో మచ్చుకైనా కనిపించటం లేదు. గబగబా మాట్లాడుతూ ఉంటుంది. ఏదీ మనసులో దాచుకోదు. కల్మషం లేని పిల్ల.
దేవయాని అలా కాదు. మితంగా మాట్లాడుతుంది. గుంభనంగా ఉంటుంది. ఆచితూచి వ్యవహరిస్తుంది.
తను మాట్లాడుతూ ఉంటే, దేవయాని ఏదో ఆలోచిస్తోందని గమనించింది శర్మిష్ఠ.
"అక్కా! అక్కా! ఏమాలోచిస్తున్నావు? " అంటూ గట్టిగా కుదిపింది.
ఉలిక్కిపడింది దేవయాని.
"ఏం లేదు.. ఏం లేదు.. నాకు నిద్రవస్తోంది!" అంది. ఈ వసపిట్టను ఎలా అయినా వదిలించుకొని తన గదిలోకి వెళ్లాలని ఆలోచన.
"పద అక్కా! నీ గది చూపిస్తాను!" అంటూ దారితీసింది శర్మిష్ఠ.
పెద్దగది అది. అద్భుతమైన శిల్పసౌందర్యంతో ఎంతో అందంగా తీర్చిదిద్ది ఉంది.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments