కచదేవయాని - పార్ట్ 11
Updated: Sep 20, 2025
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 11 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 11/09/2025
కచదేవయాని - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. చెలికత్తెలతో పురుష వేషంలో వేటకు వెళుతుంది శర్మిష్ఠ. అక్కడ ఆమెకు నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి తారస పడతాడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 11 చదవండి.
'ఈ కుర్రవాడితో కాసేపు ఆడుకుందాం!'అనుకుంటూ తను కూడా కత్తిదూసి శర్మిష్ఠను ఎదుర్కొన్నాడతడు.
శర్మిష్ఠ తన బలమంతా ఉపయోగించి కత్తితో అతడిని దెబ్బ కొట్టాలని చూస్తుంటే అతడు మాత్రం తన కత్తి చిన్న పిల్లవాడికి తగిలితే గాయపడతాడేమోనని జాగ్రత్తగా శర్మిష్ఠను నిలవరిస్తున్నాడు.
ఇంతలో శర్మిష్ఠ బలంగా అతడి చేతిమీద కొట్టింది.
పెద్దదెబ్బే! రక్తం కారుతోంది.
'ఇంక ఉపేక్షించకూడదు. చిన్నవాడైనా రెచ్చిపోతున్నాడు!' అనుకుంటూ ఆ యువకుడు కత్తితో ఆత్మరక్షణ చేసుకుంటూ ఒక్క ఊపుతో శర్మిష్ఠ తలపై ఉన్న శిరస్త్రాణాన్ని ఎగరకొట్టాడు.
ఆశ్చర్యం!..
ఒత్తైన జుట్టు ఆమె ముఖంమీద పడింది. కురులను వెన్నక్కి తోసుకొందామె. రొప్పుతోంది.
ఆ.. డ.. పి.. ల్ల..

అతడు యుద్ధం చెయ్యటం ఆపేసి ఆమెవైపు అలాగే విస్మయంగా చూస్తున్నాడు.
ఆ అవకాశం చాలు శర్మిష్ఠకు.
ఒక్క క్షణంలో అతడి చేతిలోని కత్తిని ఎగరకొట్టేసింది. మరుక్షణంలో అతడి గుండెల మీద కత్తిపెట్టి
"కదలకు!కదిలితే చంపేస్తాను!ఇది దానవరాజైన వృషపర్వులవారి రాజ్యసీమ. మా నుండి నువ్వు తప్పించుకోలేవు!"అంటూ ఆమె తన నడుముకు ఉన్న కొమ్ముబూరను గట్టిగా ఊదింది.
అతడికి తప్పించుకోవాలని ఉంటేగా.
'ఎంత అందంగా ఉంది.. వృషపర్వుని కూతురా?.. లేక ఆయన మంత్రికూతురా? ఎవరైతేనేం? 'కళ్ళనిండుగా ఆమె రూపాన్ని నింపుకుంటూ మైమరచి ఆమెనే చూస్తున్నా డతడు.
ఈ లోపల బిలబిలమంటూ రాక్షస సైనికులు గుర్రాల మీద అక్కడికి వచ్చారు.
"ఇతడిని బంధించి తీసుకొని రండి!తగినశిక్ష వేస్తాను!" అంటూ సైనికులకు పురమాయించి, గుర్రం ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది శర్మిష్ఠ.
అలా వెళుతున్న శర్మిష్ఠనే కన్నార్పకుండా చూస్తున్నాడతడు.
సైనికులు బలంగా అతడిని పట్టుకున్నారు.
అప్పుడు స్పృహ వచ్చిందతడికి.
దానవులు ఇరవై మందికంటే ఎక్కువ మందిలేరు.
బలంగా వాళ్ళ పట్టు విడిపించుకొని పిడి గుద్దులతో ఓ పదిమందిని మట్టి కరిపించాడు. కత్తితో గిర్రుమని విన్యాసం చేస్తూ మిగిలిన వాళ్ళను కూడా తీవ్రంగా గాయపరచి, ప్రక్కనే ఉన్న తన గుర్రాన్ని ఎక్కి ఆ కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడా యువకుడు.
అతడలా గుర్రం మీద వస్తుంటే అతడినే వెదుకుతున్న అతడి మిత్రులిద్దరు ఎదురుబడ్డారు.
"ఇంతలో ఎక్కడికి పోయావు యయాతీ!"అంటూ అతడిని చూచి ఆశ్చర్యంగా "ఈ రక్తపు మరకలేమిటి? ఎవరితోనైనా గొడవ వచ్చిందా? అయినా ఈ భూమ్మీద నీతో ఎవరు గొడవ పెట్టుకొంటారు? అసమాన వీరుడివి!.. నిన్ను ఇంతగా గాయపరిచిందెవరు?" అడిగాడు మొదటి మిత్రుడు.
"వీరుడు కాదు శక్తిధరా! ఒక అందమైన అమ్మాయి.. " అంటూ నవ్వాడు యయాతి.
"ఇది దానవరాజైన వృషపర్వుని రాజ్యం. ఇక్కడ నీతో యుద్ధం చేసిన అమ్మాయి ఋషికన్యనా? దేవకన్యనా?"
రెండవ మిత్రుడు అడిగాడు.
"అదే తెలియదు. మొత్తానికి వగరు, పొగరు ఉన్న సుందరాంగి. బహుశా ఆ రాజు కూతురేమో! అంతా దారిలో చెబుతాను పింగళా! చీకటి పడకముందే మనం అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకోవాలి! పదండి!" అంటూ తన మిత్రులైన పింగళ, శక్తిధరులతో కలిసి వేగంగా అక్కడికి కొంత దూరంలో ఉన్న అత్రిమహాముని ఆశ్రమానికి బయలుదేరాడు నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి అనే వీరుడు.
చెలులతో గుడారానికి వచ్చింది శర్మిష్ఠ.
ఆమెకు చాలా సంతోషంగా ఉంది. తను యుద్ధం చేసి ఒక వీరపురుషుడిని ఓడించింది.
అతడు రాజకుమారుడేమో! ఆ ఠీవి, ఆ నవ్వు చూస్తే అలాగే ఉంది. ఏమైనా తను మాత్రం గొప్ప పని చేసింది.
ఇంతలో గుడారంలోకి సైనికులు వచ్చారు.
"అతడిని బంధించి తెచ్చారా?" అంటూ వాళ్ళ ముఖాలు చూసిన శర్మిష్ఠ నివ్వెరపోయింది.
సైనికులందరూ గాయలతో ఉన్నారు.
వాళ్ళ ముఖాలు, ముక్కులూ ఎవరో పచ్చడి చేసినట్లుగా వాచిపోయి ఉన్నాయి.
"మేము శక్తివంచన లేకుండా పోరాడాము యువరాణీ! కానీ.. "అంటూ తలవంచుకొన్నాడొకడు.
మిగిలిన వాళ్లకు ఆ మాత్రం మాట్లాడే శక్తి కూడా లేదు.
అర్ధం అయ్యింది శర్మిష్ఠకు.
"ఛీ.. ఛీ.. వెధవల్లారా! మీ కంటే నేనే నయం!.. వెళ్ళండి! అతడిని వెదకండి!.. ఒక్కడిని పట్టుకొని రాలేరూ? మీ పరాక్రమాలు ఎందుకు? తగలెయ్యనా? వెళ్ళండి!" అంటూ గట్టిగా కసిరింది వాళ్ళని.
తలవంచుకొని వెళ్లిపోయారు సైనికులు.
'నాన్నగారి సైన్యం ఇంత అధ్వాన్నంగా ఉంటే రేపు ఏ దేవతలో దండెత్తి వస్తే ఏమవుతుంది? రాజధానికి వెళ్ళాక సమూలంగా ప్రక్షాళన చెయ్యాలి' అనుకుంటూ అసహనంగా అటూ ఇటూ పచార్లు చేయసాగింది శర్మిష్ఠ.
ఆమె కనుల ముందు అతడి రూపం సమ్మోహనంగా కనిపిస్తోంది.
అతడి నవ్వు మనసును గిలిగింతలు పెడుతోంది.
'ఛ.. ఛ.. అలా ఆలోచించకూడదు.. కాస్త అందంగా ఉంటే మాత్రం శత్రువు శత్రువే! ఇలా ఆలోచించకూడదు.. ఒకవేళ దేవజాతికి చెందినవాడా? '
ఈ ఊహ మరీ భయంకరంగా అనిపించిందామెకు.
'ఇతడు దేవజాతికి చెందిన వాడు కాకుండా ఉంటే బాగుండు!.. ఎవరైతేనేం? తను అతని గురించి అస్సలు ఆలోచించదు.. తానేమిటి? తన వ్యక్తిత్వం ఏమిటి?.. '
కాదు కూడదు అనుకుంటూ శర్మిష్ఠ తనకు పరిచయమైన ఆ యువకుడి గురించే రాత్రంతా ఆలోచిస్తూ గడిపింది.
======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.





Comments