జీవిత చిత్రాలు - 13
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Apr 29
- 6 min read
Updated: May 6
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha-chitralu-part-13-telugu-web-series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 29/04/2025
జీవిత చిత్రాలు - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు.
యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు.
కిరణ్ ప్రేమించిన గులాబీ పేరెంట్స్ ని కలవడానికి గోవిందరాజులు, ఇన్స్పెక్టర్ దివాకర్, గులాబీలతో హైదరాబాద్ వెళ్తాడు ఆదిత్య. గులాబీ తండ్రి ప్రొడ్యూసర్ వినాయకం అంగీకరించడు. గులాబీని తీసుకొని రావడానికి ఆమె తల్లి చిలకమ్మ వెళ్తుంది. కిరణ్ గులాబీల వివాహానికి అంగీకరిస్తుంది. తిరిగి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చెయ్యబడుతుంది చిలకమ్మ.
భార్య కిడ్నాప్ అయిన విషయాన్ని డి.ఐ.జి కొండలరావుకు చెబుతాడు వినాయకం.
ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పార్ట్ 13 చదవండి.
మూడు గంటల ప్రాంతంలో ఆ కిడ్నాపర్స్ కారు ఓ నగరం చివరన ఆగింది. అక్కడ మరో కారు సిద్ధంగా వుంది. వారిరువురూ చిలకమ్మ, కోటయ్యలతో ఆ కార్లోకి మారారు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు.
’చీకటి రాత్రి.. వీరెవరో!.. ఎక్కడికి తీసుకొని వెళుతున్నారో.. యింకా ఎంతదూరం ఈ కార్లో శిలల్లా కూర్చొని నోరు విప్పకుండా వుండాలో.. వీరికి మానుండి ఏం కావాలో.. ఈ ప్రయాణం ఇలా ఇంకా ఎంతసేపో.. మనల్ని వీరు ఏం చేయదలచుకొన్నారో.. యిక ముందు ఏం జరుగబోతూ వుందో.. అంతా అయోమయం.. ఏ మానవుడూ మమ్మల్ని కాపాడలేడు ఆ దేవుడు తప్ప. తనకు ఎంతో ఇష్టమైన భద్రాచల శ్రీ రామచంద్రమూర్తిని, సీతామాతనూ తలుచుకొంటూ.. మాతాపితా మమ్మల్ని కాపాడండి’ అని వేడుకొంది చిలకమ్మ.
వినాయకం.. అహంకారంతో.. ఆనాడు ఈ ఇరువురినీ కాళ్ళచేత తన్నిన దానికి ఫలితం.. ఈనాడు, తన భార్య నేను ఈ పాపుల చేతుల్లో చిక్కుకున్నాం. అమ్మగారికి బదులుగా వినాయకం కార్లో వుండి వుంటే.. వీరిని చూచినప్పుడు తాను చేసిన పాపం గుర్తుకు వచ్చి వుండేది.
అమ్మో!.. అమ్మగారి స్థానంలో వినాయకం వుండి వుంటే.. ఈపాటికి వీరు కాల్చి చంపేసేవారు. విధిలేని పరిస్థితుల్లో వినాయకాన్ని కాపాడేటందుకు.. నేను వీరికి అడ్డం వెళ్ళవలసి వుండేది. ఆ కారణంగా వీరు నన్నూ కాల్చి పారేసి వుండేవారు. తనకు ఇంకా భూమ్మీద.. నూకలు వున్న కారణం.. తనకు అమ్మగారు జతైనారు. రోట్లో తలపెట్టాక రోకలి పోటు తప్పుతుందా!.. అనుభవించాల్సిందే.
వీరు ఎక్కడికి తీసుకొని వెళుతున్నారో.. మమ్మల్ని ఏం చేయబోతున్నారో ఆ దేవుడికే ఎరుక. ’ఓ భగవంతుడా!.. నాకు భార్య నలుగురు చిన్నపిల్లలూ వున్నారన్న విషయం నీకు తెలిసిందే.. వీరి చేత నన్ను చంపించి నా భార్యా బిడ్డలకు అన్యాయం చేయకయ్యా!..’ కన్నీరు కార్చుతూ దైవాన్ని వేడుకొన్నాడు కోటయ్య.
కటిక చీకటిలో.. మౌన సామ్రాజ్యంలో ఆ వాహనం మరో రెండు గంటలు ముందుకు సాగింది. సమయం ఐదు గంటల ప్రాంతం. ఓ కుగ్రామంలో ఓ యింటి ముందు కారు ఆగింది.
వారిరువురూ దిగారు. చిలకమ్మను కోటయ్యను దిగమన్నారు. వారు దిగిన వెంటనే కారు వెళ్ళిపోయింది. వారిరువురూ వీరిని ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు. హాల్లో ఒక నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు వున్నాయి.
వారిరువురూ కూర్చున్నారు. వీరిని కూర్చోమన్నారు. ఇరువురూ కూర్చున్నారు.
"మీ యజమాని ఫోన్ నెంబర్ ఏంది?" అడిగాడు వారిలో ఒక వ్యక్తి.
"----------" చెప్పాడు కోటయ్య.
ఆ నెంబర్‍ను తన సెల్లోకి ఎక్కించి రింగ్ చేశాడు ఆ వ్యక్తి.
భయంతో కునికిపాట్లు పడుతున్న.. రంజిత్ వులిక్కిపడి లేచాడు. వినాయకం వైపు చూచాడు. గురకపెడుతూ నిద్రపోతున్నాడు వినాయకం. అతని భుజంపై రంజిత్.. గట్టిగా తట్టి..
"అయ్యా మీకు ఫోన్!.." రంజిత్ చేయి వణుకుతూ ఉంది.
అతని చేతిలో వినాయకం ఫోన్ వుంది.
"ఎవరో మాట్లాడారా!.." తన మామూలు ధోరణిలో అన్నాడు వినాయకం.
"అయ్యా!.. మీరు మాట్లాడవలసిన కాల్ అయ్య యిది నేను మాట్లాడలేను." తన చేతిలోని సెల్‍ను బలవంతంగా వినాయకం చేతిలో పెట్టాడు.
అప్పటికి.. వినాయకానికి ఏ స్టేజీ మీద ఏ పాత్రను పోషిస్తున్నదీ అర్థం అయింది. నిద్ర మైకం పోయింది. గొంతు సవరించుకొని.. రిసీవర్‍ను ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకొన్నాడు.
"హలో!.." మెల్లగా అన్నాడు.
"రేయ్!.. వారంరోజుల క్రింద నడిరోడ్లో.. నీవు నీ వాళ్ళు కలిసి నన్నూ నా తమ్ముణ్ణి కొట్టారు. గతుకుల రోడ్డు అయిన కారణంగా మీ కారుకు మేము హారన్ విన్న వెంటనే దారి ఇవ్వలేకపోయాం. ఇప్పుడు నీ భార్య నీ డ్రైవర్ మా దగ్గర వున్నారు.
నీకు చేసిన తప్పుకు నేను కట్టిన పరిహారపు విలువ రెండు కోట్లు లేకపోతే రెండు ప్రాణాలు. రెండు కోట్లు ఇచ్చి నీ వారిని విడిపించుకుంటావో.. హా.. లేక, ఆ భార్య పోతే మరో భార్య వస్తుంది.. ఆ డ్రైవర్ పోతే మరో డ్రైవర్ వస్తాడని అనుకొంటావో నీ ఇష్టం. నలభై ఎనిమిది గంటల గడువు..
ఈ నిమిషం నుంచీ, నీకు ఏది మంచిగా తోస్తే అది చెయ్యి, డబ్బు రెండు కోట్లు మాకు ఈలోగా.. చేరకపోయినట్లయితే.. నలభై తొమ్మిది గంటలా పదిహేను నిముషాలకు నీ భార్య, డ్రైవర్ నో మోర్. వారి శవాలు కావాలంటే నీవు.. నీ జీవితాంతం వెదికినా.. వెదికించినా.. నీకు లభ్యపడవు" ఆ వ్యక్తి కట్ చేశాడు.
వినాయకం చేతిలోని సెల్ జారి క్రింద పడిపోయింది. అతను మూర్ఛపోయి సోఫాలో కూలిపోయాడు.
"అయ్యా!.." అని బిగ్గరగా అరిచాడు రంజిత్. వాకిట్లో వున్న గుర్ఖా.. ఇంటి వెనుక వున్న తోటమాలి అతని భార్యా.. హాల్లోకి పరుగెత్తుకొని వచ్చారు.
తలా కాళ్ళు పట్టుకొని కార్లో వేసికొని రంజిత్ తోటమాలి హాస్పిటల్ వైపుకు బయలుదేరారు.
కాల్ కట్ చేసి.. ఆ వ్యక్తి చిలకమ్మనూ.. కోటయ్యనూ చూచి..
"నేను మాట్లాడిన మాటలు మీకు బాగ అర్థం అయినాయి కదూ!.. రెండు బెడ్ రూములు, టాయ్‍లెట్లు వున్నాయి. వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోండి. ఎనిమిది గంటలకు టిఫిన్ వస్తుంది. తినండి. రాత్రంతా సరిగా నిద్ర లేదుగా. హాయిగా నిద్రపోండి.
ఒంటి గంటకు భోజనం వస్తుంది. హాయిగా భోం చేయండి. ఒక బెడ్ రూములో టి.వి ఉంది. చూడాలనుకొంటే మీకు ఇష్టం వచ్చిన ఛానల్ పెట్టుకొని చూడండి. మిమ్మల్ని మేము ఏమీ చేయము. పారిపోవడానికి ప్రయత్నిస్తే.. అది మీకు ప్రమాదం అవుతుంది. కాల్చి చంపేస్తాము. పేచీ నీ భర్తకు మాకు. మీకు మాకు ఎలాంటి పేచీ.. విరోధం లేదు" అనునయంగా చెప్పాడు.
అన్ని గదులనూ ఒకసారి పరీక్షించి.. ఆ ఇరువురూ బయటికి నడిచి.. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు.
రంజిత్.. చాలా తెలివికలవాడు. స్పీకర్ ఆన్ చేసి సెల్‍ను వినాయకానికి అందించాడు. ఆ కారణంగా ఆ వ్యక్తి మాట్లాడిన మాటలనన్నింటినీ జాగ్రత్తగా విన్నాడు. వినాయకాన్ని హాస్పిటల్లో చేర్చి డి.ఐ.జి కొండలరావు గారికి విషయాన్నంతా చెప్పాడు. హాస్పిటల్‍కు రావలసిందిగా కోరాడు.
వినాయకాన్ని హాస్పిటల్లో చేర్చిన అరగంటకు డాక్టర్ల చికిత్స మూలంగా స్పృహ వచ్చింది. అదే సమయానికి కొండలరావుగారు హాస్పిటల్‍కు తన ఇద్దరు అనుచరులతో వచ్చాడు. వినాయకాన్ని కలిశాడు. వారు చెప్పిన వివరాలను విన్నాడు.
ఈలోగా.. పత్రికలవాళ్ళు.. టివి, మీడియా వాళ్ళు హాస్పిటల్‍కు వచ్చారు. బెడ్‍లో వున్న వినాయకాన్ని ఫొటోలు తీశారు. రంజిత్ చెప్పిన మాటలను నోట్ చేసుకొన్నారు. కొండలరావుగారిని ఈ కేసు ఎలా డీల్ చేస్తారని అడిగాడు. కొండలరావుగారు.. సాయంత్రం ఐదు గంటలకు తన కార్యాలయంలో కలిస్తే వివరాలు చెప్పగలనని అన్నారు.
వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఫోన్ చేసిన సెల్ నెంబరును నోట్ చేసుకొన్నాడు కొండలరావు. ఈ వార్త ప్లాష్ న్యూస్‍గా టివిల్లో ప్రసారం జరిగింది. వైజాగ్ చేరిన గోవిందరాజులు.. దివాకర్ విన్నారు. ఆశ్చర్యపోయారు. విషయాన్ని విన్న గులాబీ.. తల్లిని తండ్రిని తలుచుకొని.. భోరున ఏడ్చింది.
గోవిందరాజు శాంతమ్మ.. కిరణ్, ఆమెను ఓదార్చారు. కొండలరావుగారు.. దివాకర్, మీ తల్లిగారిని వారి బారి నుండి.. జాగ్రత్తగా కాపాడుతారని నచ్చచెప్పారు. ఆ విషయాన్ని గురించి గులాబీ సమక్షంలో గోవిందరాజు దివాకర్‍తో మాట్లాడాడు.
చిలకమ్మగారికి ఎలాంటి హానీ జరుగదని దివాకర్ వారికి హామీ ఇచ్చాడు. విషయం తెలిసిన వెంటనే దివాకర్.. డి.ఐ.జి కొండలరావుకు ఫోన్ చేశాడు.
మూడు సంవత్సరాలు బచేలీ.. ప్రాంతంలో దివాకర్ పనిచేసి యున్నందున.. కొండలరావు అతన్ని వెంటనే ఫ్లయిట్‍లో బయలుదేరి రావలసినదిగా ఆదేశించారు. తనపై అధికారుల అనుమతితో దివాకర్ హైదరాబాదుకు ఒంటిగంటకు చేరాడు.
డి.ఐ.జి కొండలారావుగారి ఆఫీసులో మీటింగ్ జరిగింది. ఐ.జి గారు కూడా ఆ మీటింగులో పాల్గొన్నారు.
వారి అ చర్యకు కారణం.,.. వినాయకం గారి తొందరపాటేనని.. వారు భార్యను డ్రైవర్ కోటయ్యను వారు క్షేమంగా రిలీజ్ చేయాలంటే.. వారు కోరినట్లు రెండు కోట్లు డబ్బును వారికి అందించవలసి ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు.
ఐదు గంటలకు వినాయకం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు. పార్టీ వర్గం వారంతా, బెల్లానికి ఈగలు ముసిరినట్లు చుట్టుముట్టారు.
ఐ.జి ఆదేశానుసారం.. డి.ఐ.జి కొండలరావు వినాయకం గారికి ఫోన్ చేసి.. మీతో పర్సనల్‍గా మాట్లాడేదానికి ఏడు గంటలకు మీ ఇంటికి వస్తున్నానని చెప్పాడు.
ఆఫీసు బయట ప్రెస్ వాళ్ళు టి.వి రిపోర్డర్లు డి.ఐ.జి కొండలరావు చెప్పిన సమయానికి హాజరైనారు.
వారికి.. కొండలరావుగారు.. ’ఈ పనిని చేసింది నక్సల్స్ అని.. వారు కోరిన డబ్బును వారికి యిచ్చి చిలకమ్మగారిని.. కోటయ్యగారిని వారి వద్ద నుండి రేపు సాయంత్రానికల్లా విడిపించుకొస్తామని, తెలియజేశాడు.
ఆ వివరాలను నోట్ చేసుకొని వారు వెళ్ళిపోయారు. ఏడు గంటలకు డి.ఐ.జి గారు వినాయకం ఇంటి కార్ పోర్టికోలో ఆగింది.
డి.ఐ.జి కొండలరావు ఎ.సి.పి హిరణ్య, ఎస్.ఐ. దివాకర్ కారు దిగి హాల్లో ప్రవేశించారు. వినాయకం చుట్టూ వున్న మొసలి కన్నీరు కార్చే హితులందరూ లేచి బయటికి వెళ్ళిపోయారు.
వచ్చిన ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ కూర్చున్నారు. "నా పెళ్ళాన్నీట్న కూతుర్ని.. విడిపించేదానికి మీరేం చేసినారు?" తన సహజ ధోరణిలో అడిగాడు వినాయకం.
"మేము చేయవలసింది చేశాము అంటే ఆ పనిని చేసింది ఎవరనే విషయాన్ని తెలుసుకొన్నాము. మీ శ్రీమతి మీ డ్రైవర్, వారి వద్ద నుండి విడుదల కావాలంటే.. మీరు వారు.. మీకు చెప్పినట్లు చేయాలి" చెప్పాడు ఏ.సి.పి హిరణ్య.
"అంటే!.." ఆవేశంగా అడిగాడు వినాయకం.
"వారు కోరిన డబ్బును మీరు వారికి ఇవ్వాలి" డి.ఐ.జి కొండలరావు చెప్పాడు.
"నేను డబ్బు ఇచ్చి విడిపించుకొనే దానికి మీరంతా ఎందుకు? మీవంటి మీద ఆ కాకీ డ్రస్సు ఎందుకు?" వ్యంగ్యంగా అడిగాడు వినాయకం.
"సార్!.. ఈ సమయంలో మీరు ఆవేశంగా మమ్మల్ని మా డిపార్టుమెంటును విమర్శిస్తూ మాట్లాడితే.. మీ ఒంటికి.. యింటికి.. మంచిది కాదు" అనునయంగా చెప్పాడు దివాకర్.
"ఏందయ్యో!.. నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావుండావో!.." ఎక్కిరిస్తున్నట్లు చూచాడు దివాకరాన్ని.
"అతను చెప్పిన మాటల్లో ఒక్క అక్షరం తప్పులేదు. మీవారు క్షేమంగా ఇల్లు చేరాలంటే.. వారి డిమాండ్‍ను మీరు ఆమోదించాలి. మీరు భావించే రీతిగా మేము తుపాకులను చేత పట్టుకొని వాళ్ళ ప్రాంతాల మీదికి దాడిచేస్తే.. రక్తపాతం జరుగుతుందే తప్ప.. మీ భార్య డ్రైవర్ ఇళ్ళకు చేరరు" అనునయంగా చెప్పాడు హిరణ్య.
"సార్!.. మీరు, వారు చెప్పిన మాటలను గురించి సావధానంగా ఆలోచించండి.. ఆవేశపడకండి. మీకు వచ్చింది హార్ట్ ఎటాక్. ఆవేశపడితే మీకు మంచిది కాదు.. ప్రమాదం" వినయంగా చెప్పాడు రంజిత్.
వినాయకం సెల్ మ్రోగింది.
"ఎవరో చూడరా!.." రంజిత్ వైపు తీక్షణంగా చూస్తూ చెప్పాడు వినాయకం.
రంజిత్ భయంతో.. సెల్‍ను చేతికి తీసుకొన్నాడు.
"హలో!.."
"ఏమండీ.. నేనండీ.. మీ చిలకమ్మను" రోదిస్తూ చెప్పింది. రంజిత్ వులిక్కిపడ్డాడు.
"అయ్యా!.. అమ్మగారు.." సెల్‍ను వినాయకానికి అందించాడు.
ముఖం చిట్లించి వినాయకం సెల్‍ను చేతికి తీసుకొన్నాడు.
"హలో!.." అన్నాడు.
"వారికి.. కావలసిన డబ్బును వారికి ఇచ్చేసేయండి వారి బారి నుండి మమ్మల్ని కాపాడండి" రోదిస్తూ దీనంగా కోరింది చిలకమ్మ.
"వాళ్ళు నిన్నేం చేయలేదు కదా!"
"పల్లెత్తు మాట అనలేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు."
"మరి పోరి ఎట్టా వుంది?"
"మన పోరి.. హుఁ.. వివాహ విషయంలో నీవు ఆమె అభిప్రాయాన్ని కనుక్కున్నావా!.. ఎవడో అమెరికాలో వున్న వాడికి కట్టి పెట్టాలని నిర్ణయించావ్. ఆ సంబంధం తనకు ఇష్టం లేని కారణంగా తాను ప్రేమించిన వాడి ఇంటికి వైజాగ్ వెళ్ళిపోయింది. ఆమెకు కాబోయే మామగారు అమ్మాయిని తీసుకొని వచ్చి.. నిన్ను కలవాలనుకొన్నాడు. కానీ.. నీవు దానికి అంగీకరించలేదు.
నా బిడ్డ సుఖం నాకు ముఖ్యం. అందుకే నే అమ్మాయి ఆ అబ్బాయి తండ్రి గారితో వైజాగ్ పంపేశాను. ఆ ఇంట్లో నా బిడ్డ సుఖపడుతుంది. మీరుగా అమ్మాయికి ఏమీ చేయనక్కరలేదు." ఆవేశంతో చెప్పింది చిలకమ్మ.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments