top of page

ఏకాగ్రత - మనసుకు విద్యుల్లత

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #Ekagratha, #ఏకాగ్రత, #TeluguArticleOnMeditation

Ekagratha Manasuku Vidyullatha - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 19/05/2025

ఏకాగ్రత - మనసుకు విద్యుల్లత - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


నిశ్చలంగా, ఏకాగ్రతతో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి తనలోని ఆత్మను వీక్షించగలడని (ఆత్మసాక్షాత్కారం) బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది. ధ్యానం ద్వారా, మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవచ్చు. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అనే నానుడి యెక్క భావం ఏకాగ్రత లేనప్పుడు చిత్తం శివుని పైన నిలవదు, చెప్పులు వదిలిన దగ్గరే ఆగిపోతుంది. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం చేయడం వలన, అందులో నిఘూడమై ఉన్న గుప్తమైన శక్తిని వెలికితీయవచ్చు. "శ్రద్దవాన్ లభతే జ్ఞానం" - అన్నారు కృష్ణ పరమాత్మ. ‌ శ్రద్ద ఎవరైతే పెడుతారో వారికే జ్ఞానం సిద్ధిస్తుంది. 


అయితే మనసును నియంత్రించడం ఎలా అనేదే సగటు మానవుడి ప్రశ్న. మనస్సు చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మరియు మూర్ఖపు పట్టుగలది, దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నదని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడితో మొరపెట్టుకున్నాడు. ఎటో వెళ్లిపోయింది మనసు అని తెలుగు సినీ సాహిత్యంలో, మనం ఒరు కురంగు (మనసు ఒక కోతి) అనే తమిళ పాటలో సైతం అదే భావవ్యక్తీకరణ. దీనికి జవాబుగా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ 'నిరంతర అభ్యాసము వైరాగ్యములతో మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చని' గీతా బోధన ద్వారా తెలియజేశారు. 


ఏ పనిలో ఐనా ఏకాగ్రత ఉంటేనే విజయం సాధించగలం. చేస్తున్న పనిమీద స్పృహ లేకుండా యాంత్రికంగా జరిపే పనిలో సృజనాత్మకత కనబడదు. ఏకాగ్రతకు మరో పేరు ‘తదేక దీక్ష'. వ్యక్తిత్వ వికాసంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏకః అంటే ఒకే ఒక్క విషయం. అగ్రతః అంటే మన ఎదుట ఉండాలి. ధ్యాస పెట్టవలసింది ఒక సమయంలో ఒక్క విషయం పైనే కానీ రకరకాల పనులపై కాదు. ఇది ధ్యానానికి మాత్రమే పరిమితం కాదు. అన్ని కార్యాల్లోనూ అవసరమే. ఏకాగ్రతను దెబ్బతీయడానికి రకరకాల అవరోధాలు వస్తాయి. అందులో కొన్ని మనం తెచ్చుకొనేవి, మరికొన్ని బలవంతంగా దూరిపోయేవి. రెండింటినీ నియంత్రించే అభ్యాసం చేస్తే గానీ చేపట్టిన పనిపై ధ్యాస ఉండదు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః అని యోగ దర్శనంలో కూడా చెప్పడం జరిగింది. 


యూట్యూబ్ లో, గూగుల్ శోధనలో తరచుగా ఏ విషయం గురించి శోధిస్తుంటామో దాన్నే గుర్తుపెట్టుకుని తదుపరి శోధనలో సంబంధిత సమాచారాన్ని, చిత్రాలనే తెరపై సూచిస్తూ ఉంటుంది. అదే రీతిలో మనం దేని గురించి ఎక్కువగా ఆసక్తి చూపుతామో దాని తాలూకు ఆలోచనలే మన మదిలో మెదులడం సహజం. మనసే మన శత్రువు, ‌ మిత్రుడు కూడా. ‌ ఉన్న చోటనే ఉంటూ స్వర్గాన్ని నరకంగా, నరకాన్ని స్వర్గంగానూ మార్చగలదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే అనుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. మమకారాసక్తులను త్యజించి, అనవసరమైన ఆలోచనలను దారి మళ్ళించగలిగితే మనస్సు యొక్క అపారమైన శక్తిని వెలికి తీయవచ్చు. ఎంత ఏకాగ్రతనొందితే, అంత శక్తిమంతం కావడమే మనసు మర్మం. 


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గిటార్ వాద్య కారుడుని ఇంత వీనుల విందుగా మీరు గిటారు ఎలా వాయించగలుగుతున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన జవాబు - నా గిటార్ కు మధురమైన ధ్వని, సంగీతాన్ని విడుదల చేసి శక్తి ఉంది. నా చేతి వేళ్ళు నేర్పుగా, అద్భుతంగా దాని తంతులు మీటగలవు. ఈ రెంటిని సమన్వయపరిచేసి నేను తప్పుకుంటాను అంటాడు. చేయగలిగే ఇంద్రియాలతో చేయించే విధంగా దృష్టి పెట్టడమే ఏకాగ్రత. ఏ పని చేస్తున్నా ఆ పని మీదే ధ్యాస ఉండాలి. తల దువ్వుకుంటున్నప్పుడు కూడా దువ్వెన మీద, దువ్వడం మీదే ధ్యాస ఉండాలి. మరో విషయం గురించి ఆలోచిస్తూ ఏ పనినీ నామమాత్రంగా చేయకూడదు. 


ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికి, మనిషికి ఉన్న తేడాను నిర్ణయిస్తుంది. కింది స్థాయిలో ఉన్న మానవుణ్ణి, ఉత్తమ స్థాయిలో ఉన్న మానవుడితో పోల్చి చూసి వారి ప్రవర్తనను గమనించండి. వారి ఏకాగ్రతలోని అంతరాలే వారి మధ్యనున్న స్థితిగతులకు కారణమని తెలుస్తుంది. తొందరపాటు పనులు, నిర్ణయాల వల్ల తప్పులు లేదా చెడు ఫలితాలు కలుగుతాయి. అటువంటి ఫలితాలు వ్యర్థమే కదా. హేస్ట్ మేక్స్ వేస్ట్ అని అందుకే అంటారు. హడావిడిగా ఏ పని చేసినా, దానివల్ల వచ్చే ప్రతికూల ఫలితాలు చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయిస్తూ ఉంటుంది. 


పుస్తకాలు చదివి సంపాదించే పాండిత్యమే విద్య అనిపించుకోదు అంటారు స్వామి వివేకానంద. వారి దృష్టిలో మనస్సును ఏకాగ్రమొనర్చడమే విద్య. అంతేగానీ, విషయసేకరణ చేయడం విద్య అనిపించు కోదు. ఈ విషయంపై మరింత వివరణ ఇస్తూ "నేనే గనుక విద్యాభ్యాసాన్ని మళ్లీ ప్రారంభించవలసివస్తే విషయసేకరణపై దృష్టి పెట్టకుండా ఏకాగ్రతను, సంగరాహిత్యాన్ని పెంపొందించుకొంటాను. ఆ విధంగా పరిపూర్ణంగా, సమగ్రంగా నన్ను నేను మలచుకొంటే, బుద్ధి అనే పరికరంతో నా ఇష్టం వచ్చిన రీతిలో విషయసేకరణ చేయగలను" అని స్పష్టంగా తెలిపారు. 


శివుడుని ఎప్పుడు చూసినా ఆదియోగి గా ధ్యానముద్ర లోనే కనిపిస్తాడు. మనం కూడా యోగా లేదా ధ్యానం వంటివి అభ్యసిస్తే క్రమశిక్షణ, సమయపాలన, ఏకాగ్రత కూడా మెరుగుపడుతాయి. భారతంలో ద్రోణాచార్యుల వారు కురుపాండవ బాలలకు ధనుర్విద్యా కౌశలాన్ని నేర్పుతూ చెట్టుకొమ్మ మీద ఉన్న ఒక పక్షిని బాణంతో కొట్టమంటాడు. గురి చూసుకుంటున్న వారిని ఉద్దేశించి ఆయన “మీకేం కనబడుతున్నది?” అని అడిగితే అందరూ “చెట్టు, కొమ్మ, వెనక ఆకాశం, అన్నీ కనబడుతున్నాయి గురువుగారు” అంటారు. అర్జునుడు మాత్రం “నాకు లక్ష్యంగా మీరు నిర్దేశించిన పక్షి కన్ను తప్ప మరేదీ కనబడ లేదు” అని నిర్దిష్టంగా చెప్తాడు. అదీ ఏకాగ్రత అంటే! మిగతావన్నీ కనబడుతున్నాయంటే అవి లక్ష్యాన్ని ఛేదించడానికి అడ్డుపడే అవరోధాలు. అందుకే అర్జునుడు ద్రోణాచార్యులకు ప్రియశిష్యుడైనాడు. వేగంగా తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని క్రింద కొలనులోని నీటిలో ప్రతిబింబంగా చూస్తూ కొట్టగలిగాడు. 


గ్రాహక శక్తిని పెంచుకొని, తక్కువ కాలంలో విషయాలను ఆకళింపు చేసుకోవడమే జ్ఞానసంపాదనకు ఏకైక మార్గం. కాబట్టి, ఏకాగ్రతాశక్తి ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా విషయజ్ఞానాన్ని ఆర్జించుకోవచ్చు. చేస్తున్న పనిలో నైపుణ్యాన్ని సాధించాలంటే అసంబద్ధమైన ఆలోచనలకు తావివ్వకుండా కార్యసాధనలో నిమగ్నమైతే సాధించదగ్గ లక్ష్యం దానికదే చేరువవుతుంది. బట్టలు కుట్టేవాడు కూడా మరింత ఏకాగ్రతతో పనిచేస్తే, ఆకర్షణీయంగా దుస్తులను తయారు చేయగలడు. ఏకాగ్రత ఉన్న వంటవాడు రుచిగా వంట చేస్తాడు. ధనార్జనలోగానీ, దైవతార్చనలోగానీ లేక ఏ ఇతర కార్యాలలో గానీ ఏకాగ్రతాశక్తి ఎంత బలవత్తరంగా ఉంటుందో కార్యసిద్ధి అంత బాగా సమకూరుతుంది అనడంలో సందేహం లేదు. అటువంటి ఏకాగ్రత ద్వారానే సత్త్వరజస్తమో గుణాత్మకమైన మనస్సును జయించి, ఆవల ఉన్న జ్ఞాన కాంతిని ప్రసరింప చేసుకోవచ్చు. 


ధన్యవాదాలు, కృష్ణం వందే జగద్గురుమ్ 

ఆర్ సి కుమార్


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page