పల్లె పిలిచింది - 10
- T. V. L. Gayathri
- May 21
- 2 min read
Updated: May 23
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #ఉత్పలమాల, #చంపకమాల, #మత్తకోకిల, #ధ్రువ కోకిల, #తేటగీతి, #కావ్యము

Palle Pilichindi - 10 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 21/05/2025
పల్లె పిలిచింది - 10 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
44.
ఉత్పలమాల.
వసంతఋతువు.
ఆమని శోభలన్ గనుచు హాయిగ త్రుళ్లగ పుల్గుపాళికల్
మామిడి పూతలన్ దినుచు మత్తుగ కూయుచు నుండకోయిలల్
సేమము నీయగా భువికి శీర్షములూపెను వృక్షరాజముల్
కాముని మాసమందున వికాసముతో విలసిల్లె పల్లెలున్.//
తాత్పర్యము.
అలా ఆ పల్లె ప్రజలు హాయిగా ఉండగా వసంతఋతువు వచ్చింది. వసంతఋతువును చూచి పక్షి గుంపులు చాలా సంతోషించాయి. మామిడి పూతలను తినుచు కోయిలలు తీయగా కూస్తూ ఉన్నాయి. భూమికి క్షేమాన్ని కలుగచేయుచు చెట్లు తమ చిటారు కొమ్మలను ఊపుతున్నాయి. ఆ పల్లెలన్నీ వసంత ఋతువులో ఎంతో అభివృద్ధిని పొందుతున్నాయి.//
45.
చంపకమాల.
విరులట తొంగలించ బహు వేగముగా రవి పర్వులెత్తగా
మురియుచు భృంగరాజములు మూగుచు నత్తరి సందడించగన్
జెరువున తామరల్ చిలుక స్నిగ్ధముగా తమ పుప్పొడుల్ వెసన్
ధరణికి వచ్చె మాధవము తద్దయు రమ్యముగా చరించగన్ //
తాత్పర్యము.
వసంతంలో పూవులు పూస్తూ ఉంటే తుమ్మెదలు ఆనందంగా ఆ పువ్వుల దగ్గరికి చేరుతున్నాయి. చెరువులో తామరలు తమ పుప్పొడులను చిల్కుతూ ఉంటే భూమికి అందాన్నిచ్చే వైశాఖమాసం వచ్చింది.//
46.
మత్తకోకిల.
జీవరాసుల జీవనంబున శ్రేయమున్ గలిగించగా
భావికంతయు నాశ నిల్పెడు భావనల్ వికసించగా
చేవ నిచ్చెడు మాసమియ్యది చేరవచ్చె వసంతమై
దీవెనల్ కురిపించి జాతికి దివ్యమౌ పథి చూపగన్ //
తాత్పర్యము.
భూమిలోని జీవరాసులకు జీవమును ఇచ్చి, భవిష్యత్తు మీద ఆశ కలిగించే భావనలు వికసించేటట్లు ఈ వసంతం వచ్చింది. ఈ మాసము మానవులకు మంచి మార్గాన్ని చూపిస్తుంది.//
47.
చంపకమాల.
శుకపికముల్ చెలంగ బహు శోభగ సాలములెల్ల వర్థిలన్
బకపకలాడుచున్ విరులు భాతిగ భానుని స్వాగతించగన్
బ్రకటితమాయె రశ్మినిడు పాంథుడు నిర్మలమౌ నభంబునన్
వికసీతమాయె వెల్గుమెయి పృథ్వి వసంత విభూతి బొందుచున్.//
తాత్పర్యము.
పక్షులు అన్నీ సంతోషంతో తిరుగుతూ ఉంటే, చెట్లు చిగురులతో అందంగా కనిపించగా, ఆ సూర్యుడు ఆకాశంలో కనిపించగానే భూమి అంతా వెలుగుతో నిండిపోయింది.//
48.
ధ్రువ కోకిల.
నవవసంతపు వేళ కోయిల నాదముల్ వినిపించగా
దివి సమంబుగ గోచరించగ దివ్యమై భువియందముల్
నవయుగాదికి నాంది పల్కుచు నర్మిలిన్ జను లెల్లరున్
భవము పొందగ స్వాగతించిరి భవ్యమౌ శుభ వర్షమున్.//
తాత్పర్యము.
ఆ వసంత వేళలో కోయిలలు పాడుతూ ఉంటే, భూమి స్వర్గాన్ని తల పించేట్లుగా ఉన్న సమయంలో క్రొత్త సంవత్సరం (ఉగాది) వచ్చింది. ఆ ఉగాదిని జనులంతా ప్రేమగా స్వాగతించారు.//
49.
తేటగీతి.
స్వచ్ఛమై నదులన్నియు పాఱుచుండ
ప్రాణవాయువొసంగెడి పచ్చదనము
పరుచుకొన్నట్టి ధరణిలో పసులు పెరుగ
శాంతి కావాసస్థానమై జగతి వెలసె.//
తాత్పర్యము.
నదులన్నీ స్వచ్ఛంగా పారుతున్నాయి. పచ్చదనం అంతటా పరుచుకొంది. పశువృద్ధి జరిగింది. అంతటా శాంతి నెలకొంది.//
50.
తేటగీతి.
వచ్చెనిప్పుడు నూతన వత్సరంబు
ప్రజలు భక్తిగా పూజించి వైభవంబుగ
దివ్యమౌ యుగాదిని స్వాగతించి కలిసి
శుద్ధమౌ మదిన్ జేసిరి స్తుతులనపుడు.//
తాత్పర్యము.
ఇపుడు నూతన సంవత్సరం వచ్చింది. ప్రజలు ఉగాది పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ భగవంతుడిని స్తుతించారు.//
51.
తేటగీతి.
జనులు ధర్మమౌ దారిలో సాగుచుండి
క్రొత్త వత్సరమీ భువిన్ గొలువు చేయ
'మంచికాలమా!నీకిదే మంగళంబు!'
యనుచు పల్కిరి కాలపు ఘనత తెలిసి.//
తాత్పర్యము.
ఆ పల్లెలో జనులందరూ ధర్మంగా నడుచుకొంటూ మంచికాలము వచ్చిందని సంబరంతో మంగళ గీతాలు పాడుతూ ఉన్నారు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Commentaires