top of page

పల్లె పిలిచింది - 11

Updated: May 28

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కావ్యము

ree

Palle Pilichindi - 11 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 23/05/2025

పల్లె పిలిచింది - 11 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


 

52.

అంబురుహము.

భ, భ, భ, భ, ర, స, వ.

యతి -13.


సీమలఁ బౌరులు చిందులు వేయుచు శీఘ్రమేకడు భక్తిఁ శ్రీ 

రాముని పెండ్లిని చేయగ దూకిరి రాణ చూపుచు నుద్ధతిన్ 

దామసభావన లెల్లను వేగమె దగ్ధమౌగతిఁ మేలుగా 

నీమముగా తమ దేవుని సేవలు నిష్ఠమీరగఁ జేసిరే //


తాత్పర్యము.


ఆ పల్లెలో ప్రజలు సంతోషంతో ఉగాది తర్వాత వచ్చిన శ్రీరామనవమి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఆ రాముని కల్యాణాన్ని జరపటానికి పూనుకొన్నారు. ఆ దేవుని కళ్యాణం జరిపితే జనులలో ఉన్న చెడు భావనలు అన్నీ తొల్గిపోతాయనే నమ్మకంతో సేవలు చేస్తూ ఉన్నారు.//


53.

కందము.


చల్లని దేవుని సన్నిధిఁ

వెల్లను వేయుచు ప్రణతిగ వేడుక చేయన్ 

బిల్లలు పెద్దలు రాగా 

తెల్లగ మెరిసెను వరదుని దేవళమెల్లన్.//


తాత్పర్యము.


జనులు ఆ దేవుని దేవళమునకు తెల్లటి రంగును పూశారు. (సున్నం వేశారు ) అప్పుడు ఆ దేవాలయం తెల్లగా మెరిసింది.//


54.

కందం.


పంటలు వృద్ధిగ పండెను 

కుంటలు చెరువులట నిండ కూరిమితోడన్ 

గంటలు మ్రోగించిరి వెను 

వెంటనె రామునికి జనులుపెండిలిసల్పన్.//


తాత్పర్యము.


ఆ పల్లెలోని కుంటలు, చెరువులు నిండటంతో పంటలు చక్కగా పండాయి. గంటలు మోగిస్తూ ప్రజలు శ్రీరాముని కళ్యాణం జరిపారు.//


55.

కందం 


కళకళలాడెను పల్లెలు 

పెళపెళరావములు మ్రోగ విజయంబంచున్ 

తళతళ మెరసెను దేవుడు 

పులకించినలోకు లపుడు మ్రొక్కిరి భక్తిన్.//


తాత్పర్యము.


ఆ సమయంలో పల్లెలు కళకళలాడాయి.  మేళతాళాలు మోగుతుండగా దేవుడు చక్కగా ప్రకాశించాడు. ప్రజలంతా సంతోషంతో దేవునికి భక్తిగా మ్రొక్కుకున్నారు.//


56.

తేటగీతి.


ఇటుల దేవుని కల్యాణమే సలిపిరి 

పటుతరంబగు బుద్ధితో ప్రజలు కలిసి 

రామభద్రుండు నిరతము లలినిజూప 

వర్థిలిరి సుఖముగ జనుల్ పల్లెయందు.//


తాత్పర్యము.


ఈ విధంగా ప్రజలందరూ శ్రీరామచంద్రుని వివాహం జరిపారు. ఆ దేవుని దయవలన ఆ పల్లెలో జనులు సుఖంగా వర్థిల్లారు.//





ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page