top of page

పల్లె పిలిచింది - 12

Updated: May 30

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #సీసం, #కందం, #కుసుమవిచిత్ర, #కావ్యము

Palle Pilichindi - 12 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 28/05/2025

పల్లె పిలిచింది - 12 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



57.

సీసం.


పదవ తరగతిలో ప్రథమశ్రేణి వరించ

శ్రీకరుని సుతుడు శ్రీనివాసు 

వైద్యవృత్తిని గోరి పట్టణంబున చదువ 

బోవగ లేదాయె ముడుపు కొంత 

బడియందు గురువుగా పాఠములను జెప్పు 

తనయొద్ద తగినంత ధనము లేదు 

ననుచుదిగులు నొందు  నా శ్రీకరుని గాంచి 

ధనము తాన్ సర్దెద ననుచు పలికి /


తేటగీతి.

నాత్మ బంధువుగా మల్లయాదరించ 

శ్రీకరుడుతాను ముదమొంది చింత మరచె 

నిటుల మువ్వురు మిత్రులు నిరవుగాను 

పట్టణంబుకు బిడ్డలన్ పంపిరపుడు.//


తాత్పర్యము.


శ్రీకరుని కుమారుడు శ్రీనివాసుడు పదవ తరగతిలో ప్రథమ శ్రేణిని (ఫస్ట్ క్లాసును )తెచ్చుకున్నాడు.అతడు వైద్యవృత్తిని (డాక్టర్ ) చదవాలని అనుకున్నా అతని తండ్రి వద్ద డబ్బు ఎక్కువగా లేదు. దానితో శ్రీనివాసు దిగులు పడుతూ ఉండగా మల్లయ్య ఆ ధనము తాను సర్దెదనని చెప్పగానే శ్రీకరుడు మల్లయ్య చూపిన ఆదరానికి చాలా సంతోషించాడు.//


58.

కందం.


బడిలో చదివెడి బుడతలు 

వడివడి వర్థిలుచు యుక్త వయస్సు రాగా 

సుడులెన్నో కల జగమను 

కడలిని బడి సాగ బోయి కదలిరి వడిగన్.//


తాత్పర్యము.


అప్పటిదాకా బడిలో చదువుకున్న చిన్న పిల్లలు పట్టణమునకు పోయి చదవటానికి కదిలారు. ఈ ప్రపంచం ఒక సముద్రము వంటిది. దానిలో ఎన్నో సుడులు ఉంటాయి. ఈ పిల్లలు (శ్రీనివాసుడు, మణివికాసుడు, వీరేశుడు, చిత్ర మరియు హైమ ) అటువంటి ప్రంపంచంలోకి అడుగుపెట్టారు.//


58.

వచనం.

అరుణగిరి బిడ్డలకు పట్టణములోని మంచిచెడ్డలను వివరించి, మంచినడవడికతో విద్యనేర్చుకొనమని బోధించుట.//


59.

కుసుమవిచిత్ర.

న, య, భ, య.

యతి -7.


ఇరుకగు వీధుల్ హేయమగు కంపుల్ 

కరువగు గాలుల్ కాంతియట లేదే 

మురికిగ దారుల్ మూగునట దోమల్ 

సిరులకు దాసుల్ చింతపడు పౌరుల్ //


తాత్పర్యము.

ఆ పట్టణము ఎలా ఉంటుందంటే వీధులు ఇరుకుగా ఉంటాయి.కాలుష్యముతో కంపు కొడుతూ ఉంటాయా వీధులు. గాలి ఆడదు. పగలు కూడా ఇళ్లల్లో చీకటిగా ఉంటుంది. దారులు మురికిగా ఉంటాయి. దోమల బాధ ఎక్కువ. అచ్చట డబ్బులు సంపాదించుకుంటూ కూడా నగరవాసులు దిగులుగానే ఉంటారు.//




టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page