top of page

పల్లె పిలిచింది - 13

Updated: Jun 2

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #చంచల, #ధ్రువకోకిల, #చంద్రభాను, #మత్తకోకిల, #కావ్యము

Palle Pilichindi - 13 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 31/05/2025

పల్లె పిలిచింది - 13 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



60.

చంచల

ర, జ, ర, జ, ర, ల.

యతి -9.


పట్టణంబునందు చాల బాధనొంది పౌరులయ్యొ 

వెట్టిచాకిరీని చేసి బెంగతోడ క్రుంగిపోయి 

నెట్టుచుంద్రు భారమాయె నేటి జీవనంబు తిండి 

పెట్టువారులేరు చూడు!వేరు దారిలేదు సుమ్మి!//


తాత్పర్యము.


నగరంలో నివసించు ప్రజలు వెట్టిచాకిరీని చేస్తూ బెంగతో కుంగిపోయి ఉంటారు. వేరే దారిలేదు. పట్టణంలో ఎక్కడా ఉచితంగా తిండి దొరకదు.//


61.

ధ్రువకోకిల.


భవనరాశులు ప్రాకటంబగు భాతితో విలసిల్లనా 

చివర పేదల గేహముల్ పలు చీకుచింతలు మోయగన్ 

నవపథంబున సాగువారలు నచ్చినట్లుగ మెల్గుచున్ 

పవలు రేయిని విస్మరింతురు పట్టణంబున జేరగన్.//


తాత్పర్యము.


ఒకచోట పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఆ ప్రక్కనే మురికి వాడలు కూడా ఉంటాయి. నాగరికులు కొందరు నచ్చినట్లుగా ఉంటూ రాత్రింబవళ్ళను మరిచిపోతూ ఉంటారు.//


62.

చంద్రభాను.

న, ర, జ, ర,జ, గ.

యతి -10.


వినయమించుకైనలేదు భీతినొందబోరులే 

వెనుకముందు చూడలేరు వెఱ్ఱిపట్టి మానవుల్ 

మునిగిపోవుచుందురయ్యొ!బుద్ధిలేని వారలై 

ధనముకోరి సంతతంబు దారితప్పి పోవుచున్ //


తాత్పర్యము.


ఈ నగరవాసుల్లో కొందరు పొగరుగా ఉంటారు.వారిలో భయభక్తులు అస్సలు ఉండవు.డబ్బు సంపాదనే ధ్యేయంగా మానవులు వెఱ్ఱి వారలై విలువలు లేకుండా జీవనం సాగిస్తూ ఉంటారు.//


63.

మత్తకోకిల.


రాత్రి వేళల క్లబ్బు పబ్బుల లాహిరిన్ బడి తూలుచున్ 

చిత్రమౌ పలు చేష్ట లెల్లను చేసి కూళల గూడుచున్ 

మిత్రులై  దిగజారి పోవుచు మేలు చూపని దారిలో 

ఛాత్రబృందములోని కొందరు సాగుచుందురు వెఱ్ఱిగన్.//


తాత్పర్యము.


నగరవాసుల్లోని విద్యార్థులు కొందరు రాత్రిళ్ళు క్లబ్బుల్లో, పబ్బుల్లో పడి మద్యం త్రాగుతూ, తూలుతూ చెడ్డవారితో స్నేహం చేస్తూ  చెడుదారిలో సాగిపోతూ ఉంటారు.//





టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page