top of page

పల్లె పిలిచింది - 14

Updated: Jun 5

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #చంపకమాల, #ధ్రువకోకిల, #మత్తకోకిల, #కావ్యము

Palle Pilichindi - 14 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 02/06/2025

పల్లె పిలిచింది - 14 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



64.

చంపకమాల.


మనదగు సంస్కృతిన్ విడచి మైకములోబడి దొర్లిపోవుచున్ 

వినరట ధర్మసూక్తులను వింతగు వర్తనతోడ పొంగుచున్ 

ఘనమగు విద్యలన్ మరచి కానితనంబును జూపి మెల్గునా 

ఘనులను నమ్మరాదట !చికాకులు తెత్తురు ధూర్తులై ఖలుల్ //


తాత్పర్యము.


కొంతమంది ఘనులు మన సంస్కృతిని వదిలి, మైకంలో బడి దొర్లుతూ ఎవరైనా మంచి చెబితే వినకుండా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు అటువంటి దుష్టులను నమ్మరాదు!అటువంటి వారు చికాకులు తెచ్చి పెడతారు. //


65.

మత్తకోకిల.


అన్నసత్రము లేవి? లేరట నాదరించెడి వారలే!

కన్నవారిని కాంచరక్కట!కాసులే బహుప్రీతియే!

మన్నుపై మమకారమెచ్చట? మాయలో బడి పోదురా 

పన్నులన్ విదిలించుకొందురు పట్టణంబున తుచ్ఛులున్//


తాత్పర్యము.


నగరంలో అన్నసత్రాలు ఉండవు. ఏదైనా అవసరం వస్తే మనల్ని పట్టించుకొనే వారు ఉండరు. అసలక్కడ కన్న తల్లిదండ్రులను చూడని ప్రబుద్ధులు ఉంటారు. సహాయం కోరిన వారిని  విదిలించుకొని పోతూ ఉండే వాళ్ళే ఎక్కువ. చాలా మంది ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటారు.//


66.

ధ్రువకోకిల.


కుఱచ దుస్తులు కట్టుకొంచును కోమలుల్ బహు ప్రీతిగన్ 

బరుల సంస్కృతి బట్టుకొందురు భ్రాంతిలో పడి మున్గుచున్ 

గరువు భారము మోసినట్లుగ కాంత లివ్విధి మెల్గగన్ 

బరువు పోవును భారతాంబకు భావి యెచ్చట తెల్పరే!//


తాత్పర్యము.


ఆ నగరంలో ఆడవాళ్లు కొందరు పొట్టి దుస్తులు వేసుకొని తిరుగుతూ, పాశ్చాత్య సంస్కృతిని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళను చూస్తే బట్టలకు కరువు వచ్చిందా అని అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళ వలన మన దేశము పరువు పోతుండగా భవిష్యత్తు ఎలా ఉంటుంది?//





టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Komentar


bottom of page