వర్షం కురిసిన రాత్రి
- Srinivasarao Jeedigunta
- Jun 1
- 6 min read
#JeediguntaSrinivasaRao, #VarshamKurisinaRathri, #వర్షంకురిసినరాత్రి, #JeediguntaSrinivasaRao, #TeluguCrimeStory, #TeluguMoralStories, #నీతికథలు, #కొసమెరుపు

Varsham Kurisina Rathri - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 01/06/2025
వర్షం కురిసిన రాత్రి - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శాంతమ్మ గారికి అతికష్టం మీద రెండో పెళ్లి సంబంధం చూసి పెళ్లిచేసి పంపించారు తల్లిదండ్రులు తమ బీదతనం వల్ల. శాంతమ్మ గారిని పెళ్లి చేసుకున్న రాజారావు మార్టేరు జమిందారు. ముప్పై ఎకరాల పంట పొలం, అయిదు ఎకరాల కొబ్బరి తోట వుండటంతో రెండో పెళ్లి వాడు అన్న సమస్య లేకుండా పెళ్లిచేసారు.
శాంతమ్మ గారికి మొదటి నుంచి బాగా చదువుకుని, పట్నం లో ఉండాలి అని కోరిక. అయితే తనకి తల్లిదండ్రులు రెండో పెళ్లి వాడిని యిచ్చి పెళ్లిచేసారు అనే కోపంతో పెళ్లి అయిన తరువాత తల్లిదండ్రుల మొహం చూడలేదు. పెళ్లి అయిన రెండేళ్లకి శాంతమ్మ కి ఆడపిల్ల పుట్టినతరువాత గుండె పోటుతో రాజారావు చనిపోయాడు.
చెప్పలేని అంత ఆస్తి, యినపపెట్టి నిండా డబ్బు, కూతురు కి యింకా ఏడాది కూడా రాకపోవడం, తను ఆరో తరగతి చదువు తో సంసారం ముందుకి నడపటం ఎలా అని భయం పట్టుకుంది. అయినా తన పుట్టింటి తరుపున వాళ్ళని ఎవ్వరిని దగ్గరికి రానివ్వకుండా తనే ఆస్తిపాస్తులు స్వయంగా చూసుకుంటో వున్న డబ్బుని వడ్డీలకు యిచ్చి కూతురు కవిత ని డిగ్రీ చదివించి హైదరాబాద్ లో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న సుకుమార్ కి యిచ్చి పెళ్లి చేసింది. కూతురుకి అత్తమామలు వుండని సంబంధం చూసి మరీ చేసింది, తను కూతురు అల్లుడితో కలిసి ఉండచ్చు అని.
“నాయనా, మా అమ్మాయిని బాగా చూసుకుంటో, దిక్కులేక నీ దగ్గరికి చేరాను అనే భావం లేకుండా నన్ను బాగా చూసుకుంటే నా ఆస్తి మొత్తం నా తదనంతరం మీకే చెందుతుంది. అప్పటివరకు నా ఆస్తి మీద ఆధారపడకుండా నీ జీతంతో పోషించాలి. మీ మామగారు నీ భార్యకి ఏడాది వుండగా చనిపోయారు. అప్పటినుంచి ఆస్తిని పెంచుకుంటూ వస్తున్నాను” అంది శాంతమ్మ.
‘ఈ మధ్య అందరూ తన ఆస్తి తన తదనంతరం యిస్తామనటం అలవాటు అయ్యింది. వాళ్ళ తదనంతరం యిస్తే మేము అరవై ఏళ్ళు వచ్చిన తరువాత ఏంచేసుకోవాలి, మళ్ళీ మా తదనంతరం ఇంకొళ్ళకి ఇవ్వడమేనా’ అనుకున్నాడు మనసులో.
అయితే అత్తగారు తనని స్వంత తల్లిలాగా చూసుకుంటోంది. తనకి యిష్టమైన వంటలు అడిగి మరీ చేస్తుంది. సుకుమార్ ఆఫీస్ నుంచి రాగానే కూతురిని ‘అబ్బాయికి మంచినీళ్లు తీసుకుని యిచ్చి టీ పెట్టవే టీవీ ఎక్కడకిపోదు’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది, అల్లుడు కూతురు మధ్య కూర్చోకుండా. యిటువంటి అత్తగారు దొరకడం తన అదృష్టం అనుకునేవాడు సుకుమార్.
ఆరోజు ఉదయం నుంచి జోరున వాన పడుతోంది, ట్రాఫిక్ జామ్స్ వల్ల ఉద్యోగస్తులని యింటి నుంచే పనిచేయమనటం తో సుకుమార్ కూడా ఉదయం నుంచి కదలకుండా లాప్టాప్ ముందేసుకుని పనిచేసుకుంటో ఆఫీస్ వాళ్ళతో ఫోన్లో చేస్తో భోజనం కి అత్తగారు రెండుసార్లు పిలిచినా ‘ముందు మీరు తినేయండి, నాకు పని వుంది’ అన్నాడు.
మూడు దాటిపోయినా భర్త భోజనం కి రాకపోవడంతో కవిత వచ్చి “ఏమైంది మీకు? వారం రోజులనుంచి ఏదో ఆలోచిస్తో వుంటున్నారు, భోజనం కూడా చెయ్యకూడదు అని మీ ఆఫీస్ వాళ్ళు అన్నారా” అంది.
“లేదు, ప్రాజెక్ట్ చివరి స్టేజికి వచ్చింది. అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను. నేనే కాదు, మా టీం మొత్తం పిచ్చక్కి వున్నాము.” అంటూ రెండు మెతుకులు తిని మళ్ళీ లాప్టాప్ ముందు కూర్చున్నాడు. రాత్రి ఎనిమిది అయినా గాలివాన తగ్గలేదు. కిటికీ రెక్కలు తెగ కొట్టుకుంటున్నాయి.
ఈ టీవిలో వస్తున్న లవకుశ సినిమా చూస్తో కూర్చున్నారు తల్లి కూతురు. సుకుమార్ ని అడిగింది అత్తగారు, “బాబూ! నాకు లవకుశ సినిమా అంటే ప్రాణం. మేము చూస్తోవుంటే నీ పనికి యిబ్బంది లేదుగా” అంది.
“పర్వాలేదు, నేను డైనింగ్ గదిలో కూర్చుని నా పని చేసుకుంటాను, రామారావు కుశలవుల తో యుద్ధం చేసే సీన్ వచ్చినప్పుడు పిలవండి. ఆ ఘట్టం చాలా చక్కగా తీసారు” అంటూ లాప్టాప్ తీసుకుని పక్కన గదిలోకి వెళ్ళిపోయాడు.
కవిత కొంతసేపు చూసి, “అమ్మా! ఈ సినిమా చాలా పెద్దది, యింకా ‘లేరు కుశలవుల సాటి’ పాటలోనే వున్నాము, నువ్వు చూడు, జాగ్రత్త.. కరెంటు పోతే చూసుకుని నీ గదికి వెళ్ళు” అంది.
ఇంతలో అల్మారా లో నుంచి కొత్తగా కొన్న ఇంగ్లీష్ నవల తీసుకొని వెళ్తున్న భర్తని చూసి, “యిప్పటి వరకు లాప్టాప్ యిప్పుడు పుస్తకం చదువుతో కూర్చుంటారా, త్వరగా పడుకోండి, రేపు వాన వుండదు, ఆఫీసుకి వెళ్ళాలి” అని తన గదిలోకి వెళ్ళిపోయింది పడుకోవడానికి.
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, ఇంతలో ఏదో కింద పడ్డ చప్పుడు, ‘అత్తయ్యగారు’ అంటూ సుకుమార్ అరుపులు విని కంగారుగా లేచి వచ్చింది.
సోపా మీద పుస్తకం అలాగే వుంది, సుకుమార్ బాల్కనీ లోనుంచి అరుస్తో “మీ అమ్మ బాల్కనీ లోనుండి జారి కింద పడిపోయింది”, అంటూ పరుగులు తీసాడు.
లిఫ్ట్ కోసం చూడకుండా మెట్లు దిగి కిందకి వెళ్లారు. అప్పటికే శాంతమ్మ చుట్టూ జనం మూగివున్నారు. నెత్తురు మడుగులో పడివున్న తల్లిని చూసి కెవ్వున అరుస్తో దగ్గరికి వెళ్ళింది.
ఇంతలో అప్పుడే వచ్చిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజినీకాంత్ కవితని పక్కకి నెట్టి “మీరు శవం మీద అలా పడిపోతే ఆధారాలు చెరిగిపోతాయి, ముందు మమ్మల్ని ఫొటోస్ తీసుకోనియ్యండి” అంటూ ఆ వానలో తడుస్తూ ఫోటోగ్రాఫర్ కి ఫొటోస్ తీసుకోమని చెప్పాడు. ఫొటోస్ తీసుకునే లోపు అంబులెన్సు వచ్చింది. దానిలోకి శాంతమ్మ ని ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్ కి పోలీసులనిచ్చి పంపించాడు. “రేపు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత వచ్చి కలుస్తాను, అంతవరకు యింట్లో వస్తువులు ప్రత్యేకంగా మీ అత్తగారు చివరలో గడిపిన గదిలోవి కదపకుండా ఉంచండి” అని చెప్పాడు.
రెండవ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ తో పాటు డిటెక్టివ్ శ్రీకాంత్ కూడా సుకుమార్ వాళ్ళ యింటికి చేరుకున్నారు. కాలింగ్ బెల్ చప్పుడు కి తలుపు తీసిన కవిత పోలీసులని లోపలికి రానిచ్చింది. సోపాలో ఎర్రటి కళ్ళు మొహం వాచి వున్న సుకుమార్ ని చూసి రజనీకాంత్ ఏమైంది అని ఆడిగాడు.
“మా అమ్మని అత్తగారిలా కాక స్వంత తల్లిలా చూసుకునే వారు ఆయన, నిన్నటి నుంచి ఏడుస్తోనే వున్నారు” అంది కవిత.
“యిప్పుడు రోజులు అలాగే వున్నాయి లేండి. అత్తామామల్ని తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటున్నారు లేండి. అసలు ఆ రాత్రి ఏమి జరిగిందో చెప్పండి” అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్.
“మొన్న రాత్రి నుంచి భారీ వర్షము కురుస్తోవుండటం తో నిన్న మా వారు యింటి నుంచే వర్క్ చేసుకున్నారు. మా అమ్మగారు అల్లుడిని రెండు సారులు భోజనం కి పిలిచినా రాలేదు. రాత్రికి కూడా వాన తగ్గలేదు. ఈటీవీ లో లవకుశ సినిమా చూస్తూ కూర్చున్నాము. ఆయన ఆఫీసు వర్క్ కి ఆటంకం లేకుండా పక్క గదిలోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు.
నేను ఎక్కువ సేపు సినిమా చూడకుండా వెళ్ళి పడుకున్నాను. మా వారు కూడా ఏదో ఇంగ్లీష్ నవల తీసుకుని పక్క గదిలోకి వెళ్ళటం చూసాను. మా అమ్మకి సినిమా చూడటం అయిన తరువాత బాల్కనీ లో ని బట్టలు లోపల దండెం మీద వేసి, తలుపులు వేసి పడుకోమని చెప్పాను. ఆతరువాత పెద్దగా చప్పుడు వినిపించడం, మా వారు ‘అత్తయ్యా’ అంటూ అరవడం విని లేచి వచ్చి చూస్తే మా మేడ మీద నుంచి కింద పడివున్నారు, ఆతరువాత రజనీకాంత్ గారికి తెలుసు” అంది కవిత.
“మీరు ఆలా బాధపడుతు వుంటే ఈ కేసుని పూర్తి చెయ్యలేము. మీ భార్య గారు ఆమె గదికి వెళ్లిన తరువాత మీరు ఏం చేసారు, మీ అత్తగారు బతికి వుండగా చివరన ఎప్పుడు చూసారు, ఆవిడ మీతో ఏమైనా మాట్లాడారా” అని అడిగాడు శ్రీకాంత్.
కళ్ళు తుడుచుకుని, “ఆరోజు విపరీతంగా వాన పడుతోంది, నేను ఇంటినుంచే వర్క్ చేసుకుంటున్నాను” అని చెప్తున్న సుకుమార్ ని వారించి, “అది అంతా మీ భార్య చెప్పారు, మీరు చెప్పాలిసింది కొత్తగా అంటే మీ భార్య తన గదిలోకి వెళ్లిన తరువాత సినిమా చూస్తున్న మీ అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడారా, మీరు చివరిగా ఆవిడని ఎప్పుడు చూసారు” అన్నాడు విసుగ్గా శ్రీకాంత్.
“నేను పుస్తకం చదువుకుంటూ వుండగా పెద్దగా అరుపు వినిపించి చదువుతున్న పుస్తకం అక్కడే పెట్టి నా గదిలోనుంచి హల్ లోకి వచ్చాను, అత్తగారు కనిపించలేదు, బాల్కనీ లో కొన్ని బట్టలు పడి వున్నాయి. దానితో బట్టలు తీసుకుని క్రింద గొడవ వినిపించటం తో చూస్తే మా అత్తగారు నేల మీద పడివున్నారు.
చుట్టూ వాచ్మాన్, అపార్ట్మెంట్ వాళ్ళు ఉండటం చూసి భయంతో కెవ్వున అరిచాను. మా ఆవిడ ఏమైంది అంటూ వచ్చింది, యిద్దరం కిందకి వెళ్ళాము. అంతే” అన్నాడు.
“పై నుంచి చూసినప్పుడు ఆ పడిపోయింది మీ అత్తగారే అని ఎలా అనుకున్నారు” అని ఆడిగాడు శ్రీకాంత్.
“హల్ లో మా అత్తగారు లేదు ఒకటి, పడిపోయిన మనిషి చీర ఆ రోజు మా అత్తగారు కట్టుకున్నది, యింకొకటి, మా అరుపులుకి మా అత్తగారు వుంటే తన గదిలోనుంచి బయటకు తప్పకుండా వచ్చే వారు, కానీ ఆవిడ రాలేదు, అనుమానం తో కిందకి వెళ్లి చూస్తే అప్పుడు కన్ఫర్మ్ గా తెలిసింది మా అత్తగారే అని” అన్నాడు.
“మీ ప్రశ్నలు చూస్తోవుంటే మా వారిని అనుమానిస్తున్నారేమో అనిపిస్తోంది, కాని నా కంటే మాఅమ్మకి అల్లుడంటే ఎక్కువ అభిమానం. మా వారు కూడా మా అమ్మని తల్లిలా చూసుకుంటారు” అంది కవిత.
టేబుల్ మీద వున్న పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పుతో “యిదేనా రాత్రి మీరు చదువుతున్న పుస్తకం?” అని అడిగాడు శ్రీకాంత్.
“అవును, నలభై అయిదు పేజీలు చదివి పేజీ మడత పెట్టి ఇహ పడుకుందాం అనుకోగా అరుపు వినిపించింది” అన్నాడు సుకుమార్.
“ఇన్స్పెక్టర్.. సుకుమార్ ని కష్టడిలోకి తీసుకోండి. రజనీకాంత్.. మన అనుమానం నిజం అయ్యింది, అత్తగారిని మేడ మీద నుంచి కిందకి త్రోసేసి నాటకాలు ఆడుతున్నాడు” అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్.
“మా అమ్మని చంపాలిసిన అవసరం మా వారికి ఏముంది, అనవసరంగా ఆయనని అనుమానిస్తే నేను ఒప్పుకోను” అంటూ భర్త కి అడ్డంగా నుంచుంది కవిత.
“కవితా గారు ఆవేశపడకండి, మీ వారు బ్రాకెట్టు, ఆన్లైన్ బెట్టింగ్ ఆటలకి అలవాటు పడి వూరంతా అప్పులు చేసి, చివరికి ఆఫీస్ లోని స్నేహితులనుంచి కూడా పెద్దఎత్తున డబ్బులు అప్పు తీసుకున్నాడు. అతని దురదృష్టం డబ్బులు పోవడమే గాని ఒక్క పైసా సంపాదించలేక పోయాడు. అప్పు తీర్చమని వత్తిడి ఎక్కువ అవ్వడం తో మీ అమ్మగారి ఆస్తి రావాలి అంటే ఆవిడని అడ్డు తొలిగించడమే అని ప్లాన్ చేసుకుని, అవకాశం రాగానే బాల్కనీ లో బట్టలు తీస్తున్న మీ అమ్మగారిని కిందకి తోసేసాడు” అన్నాడు శ్రీకాంత్.
“నేను నమ్మను, ఆయన అటువంటి వ్యక్తి కాదు, ప్రతి నెల జీతం తీసుకుని నాకు యిచ్చేస్తారు, మీరన్నట్టుగా డబ్బులు యిబ్బంది వుంటే ఆ డబ్బులు కూడా యింట్లో ఇవ్వరు” అంది కవిత.
“మీకు ఈ అనుమానం వస్తుంది అని నాకు తెలుసు మేడం, మేము మీ వారి ఆఫీస్ కి వెళ్లి వివరాలు సేకరించాము, అన్నిటికంటే బలమైన ఆధారం మీవారు చదివిన ఈ పుస్తకం, ఆయన చెప్పిన దానిప్రకారం నలభై అయిదు పేజీలు చదివాను అన్నారు, దానికి రుజువు గా నలభై అయిదో పేజీని మడత పెట్టారు, కాని కొత్త పుస్తకం అవ్వడం వలన పదహారో పేజీ నుంచి మూడు పేజీలు బైండింగ్ లో అతుక్కుపోయి వున్నాయి, నిజంగా పుస్తకం చదువుతున్న వారు అయితే ఆ పేజీలు ఆలా వదిలేసి నలభై అయిదో పేజీకి ఎలా వెళ్తారు, కాబట్టి మీ వారే హంతకుడు” అన్నాడు శ్రీకాంత్.
“ఆస్తి కోసం అయితే మా అమ్మని చంపితే ఆస్తి నాకు వస్తుంది, అంతేగాని మా వారికి ఎలా వస్తుంది” అంది కవిత.
అది మీ ఆయనకు తెలుసు. ముందు ఆవిడ నుంచి మీకు వస్తే, మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకోవచ్చు అని, అది కుదరకపోతే మిమ్మల్ని కూడా అడ్డుతోలిగించుకోవాలి అని ప్లాన్ వేసాడు. దుర్వ్యసనాలు ఎంత పని చెయ్యడానికి అయినా అవకాశం కోసం చూస్తాయి,. ఇహ పోస్టుమార్టం రిపోర్ట్ లో మీ అమ్మగారి వీపు బలమైన తోపిడికి గురి అయినట్టు వుంది, మిగిలిన విషయాలు మీ వారిని విచారించినప్పుడు తెలుస్తాయి” అన్నాడు.
“మిమ్మల్ని కన్నకొడుకులా చూసుకుంది మా అమ్మ. యిన్ని చెడు అలవాట్లు చేసుకుని చివరికి ఆస్తి కోసం అత్తగారిని, భార్యని కూడా హతమార్చుదాము అనుకున్న మీ మొహం చూడటానికి అసహ్యం గా వుంది, ఇన్స్పెక్టర్ గారు.. ఈ హంతకుడుని లాక్కొని పోండి” అని చెప్పింది కవిత ఏడుస్తూ. బేడీలు వేసి సుకుమార్ ని జీపులోకి ఎక్కించారు.
దుర్వ్యసనాలకి దూరంగా ఉండకపోతే మిగిలేది చీకటే.
సమాప్తం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


@t.s.sbhargavateja6196
• 2 hours ago (edited)
Well said story. Srinivas rao garu. Linking the story to recently came lava kusa cinema is awesome