top of page

పల్లె పిలిచింది - 15

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ధ్రువకోకిల, #మత్తకోకిల, #కావ్యము

Palle Pilichindi - 15 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 05/06/2025

పల్లె పిలిచింది - 15 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


67.

మత్తకోకిల.


మంచిచెడ్డల  మేళవింపుగ మానవుల్ కల పృథ్విలో 

పొంచియుండగ భీతిగొల్పెడి మోసపూరిత రక్కసుల్ 

కంచెలెక్కడ? చేరి దౌష్ట్యము కట్టివేయుచు పూనికన్

వంచనాత్ముల దొల్గ చేసిన భావి వెల్గును శోభగన్.//


తాత్పర్యము.


ఈ ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు.అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అందరూ కలిసే ఉండటంతో ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు మంచివాళ్ళోతెలిసికోవటం ఎలాగా? పైగా వంచకులను వారించటానికి కంచెలు లేవు. అందరూ కలిసి చెడ్డవాళ్ళను ఏరి పారేయాలి. అప్పుడే భావి జీవితం వర్థిల్లుతుంది.//


68.

మత్తకోకిల.


ద్రవ్యరాశిని కూడ బెట్టుచు దైన్యమున్ విడనాడుచున్ 

సవ్యమైన పురోగతిన్ గను సానుకూలతనొప్పగన్ 

దివ్యమౌ మన దేశమున్ సరి దిద్దుచున్ దమ మేధతో 

నవ్యమౌ పథగామినుల్ గద నైతికవర్తనులీ ధరన్.//


తాత్పర్యము.


దీనత్వము లేకుండా డబ్బు సంపాదిస్తూ, సవ్యమైన రీతిలో కష్టపడుచు, నీతితో మేలుగుచూ,తమ మేధస్సుతో నగరవాసులు దేశ ప్రగతికి పాటుపడుతూ ఉంటారు.//


69.

ధ్రువకోకిల.


ప్రగతి బాటను జూపుచుండును పట్టణంబులు పృథ్విలో 

పగలు రేయను భేదమెచ్చట? వాహనంబులు ద్రిమ్మరున్ 

దిగులు చెందరు లోకులిచ్చట ధీరతన్ జరియింతురా 

నగరవాసులు చేరు కుందురు నవ్య మౌపథి మేలుగన్//


తాత్పర్యము.


పట్టణాభివృద్ధి వలన దేశమునకు మేలు కలుగుతుంది. ఇక్కడ పగలు రేయి అని లేకుండా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. లోకులు దిగులు చెందరు. ధైర్యంతో పని చేసుకుంటూ నగరవాసులు ప్రగతి బాటలో పయనిస్తూ ఉంటారు.//


70

తేటగీతి.


శ్రేష్ఠమౌ వైద్యశాలల సేవలిపుడు 

పట్టణంబుల లభియించ భయమువీడి 

యాయురారోగ్యములతోడ హాయినొంది 

ప్రజలు నిత్యము సుఖముగా వరలుచుండ్రి//


తాత్పర్యము.


గొప్పవైన వైద్యసేవలు పట్టణాల్లో లభిస్తూ ఉండటం వలన ఇక్కడి ప్రజలు ఆయురారోగ్యముల తోడ హాయిగా జీవనం సాగిస్తున్నారు.//


(సశేషం)


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page