కన్నపేగు కాటేసిన వేళ
- Dr. Brinda M. N.
- Jun 3
- 3 min read
#KannapeguKatesinaVela, #కన్నపేగుకాటేసినవేళ, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Kannapegu Katesina Vela - New Telugu Story Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 03/06/2025
కన్నపేగు కాటేసిన వేళ - తెలుగు కథ
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
రామారావు–రమణీలకు ఇద్దరు ఆడ సంతానం. ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఆడుకుంటూ ఉండేవారు. వారి ఎదురింట్లోనున్న కామేశ్వరి–మల్లికార్జున దంపతులకు ఐదుగురు సంతానం. మొదటి వారిద్దరికీ వివాహాలు అయిపోయాయి. కామేశ్వరి మూడవ అమ్మాయి సరళి. రామారావుగారి పెద్దమ్మాయి రవళి అంటే సరళికి చాలా ఇష్టం. సరళి సంగీతం నేర్చుకుంటోంది.
"అక్కా! ఈ రోజు ఏమి నేర్చుకున్నావు?" అని రవళి అడిగితే, "ఆరోహణ–అవరోహణ" అంటూ జవాబిచ్చేది సరళి.
సాయంత్రం అమ్మవారి గుడిలో కలిసేవారు రవళి, సరళి. సంకీర్తనలుపాడుతూ ప్రసాదం తీసుకొని వచ్చేవారు.
సరళికి పెళ్లి ఈడు రానే వచ్చింది. ఎన్నో సంబంధాలు చూసినా పొంతన కుదిరేది కాదు. కట్నం అని, అందం అని, ఆస్తులని వంకలు పెట్టేవాళ్లు పెళ్లిచూపులవారు. దీంతో బాగా విసిగి, వేసారిపోయింది సరళి.
"రవళి! ఆడపిల్ల జీవితం చాలా విచిత్రమైనది. ఎన్ని రాగాలు ఉన్నా, ఒక్కోసారి వీణ మూగబోతోంది. వినువీధిలో ఊహారెక్కలు గట్టుకుని విహరించాల్సి వస్తోంది. ఆశలన్నీ ఆవాల డబ్బాలోనే దాచుకోవాలేమో?"
"అక్కా! ఏమైంది? ఎందుకు ఏదోలా మాట్లాడుతున్నావు ఇవాళ? ఆరోగ్యం బావుంది కదా?" రవళి అమాయకంగా అడిగేది.
"నువ్వు ఇంకా చిన్నపిల్లవు రవళి. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు."
"చిన్నపిల్లనికదా! కాబట్టి చిన్న చిన్నగా చెప్పు, అర్థం అవుతుంది" అని మనసారా నవ్వేసేది రవళి.
రవళి అమాయకమైన ఆ ముఖంలో అమ్మవారే తన ఎదురుగా వచ్చి ప్రశాంతంగా, ప్రసన్నంగా ఆశీర్వదించిందేమో అనిపించేది సరళికి.
అనతికాలంలోనే ఎంతో ప్రావీణ్యతను సాధించుకుంది సరళి.
సంగీత తరగతిలో పేదవాడు, పెద్దల పట్ల గౌరవం, భక్తిభావం ఉన్న, విద్యావినయ సంపన్నుడైన మురళితో స్నేహం ఏర్పడింది సరళికి. ఇద్దరూ కలిసి సంగీత సాధన చేసేవారు, కచ్చేరీలకు వెళ్లేవారు.
ఒకసారి ఉన్నపళంగా కచ్చేరికి రాలేకపోయింది సరళి. అప్పుడు మురళి తమ శిష్యబృందంతో ఎలాగో అలా కార్యక్రమం ముగించుకొచ్చాడు.
నాలుగు రోజులుగా సరళి సాధనకు రాకపోవడం బాధగా అనిపించింది. తర్వాత వచ్చిన సరళితో, "ఏమైంది అండి? ఇన్ని రోజులు మాయమైపోయారూ? పుణ్యతీర్థాలకు వెళ్ళారా?" ప్రశ్నల వర్షం కురిపించాడు మురళి.
మౌనమే సమాధానంగా ఇచ్చింది సరళి.
"అక్కా! మనం గుడిలో క్రొత్త పాట పాడుతాం, సరేనా?" అంది రవళి.
"నేను రాను. నువ్వొక్కతే పాడుకుని రా" అని విసుక్కుంది సరళి.
ఎప్పుడూ కలిసిపోయి పాడుకుని, ప్రసాదం తీసుకొచ్చేవారిద్దరూ, అలాంటిది అక్క ఇలా ఎలా అంది? అని ఆలోచిస్తూ వెళ్లిపోయిన రవళి, అమ్మకు చెప్పింది.
"అమ్మా! అక్క ఈ మధ్య ఎందుకో సరిగా మాట్లాడడం లేదు. విసుక్కుంటోంది చూడు..." అని గోముగా, బాధతో చెప్పిన రవళి మాటలు విన్న రమణికి అనుమానాస్పదంగా అనిపించాయి.
"సరేనమ్మా, నువ్వు ఎక్కువగా వెళ్ళకు."
సంతకు వెళ్ళి వస్తున్న రమణిని పలకరించింది సరళి. ఆ మాట ఈ మాట తర్వాత, "ఏమ్మా! బాగా చిక్కిపోయావు. ఆరోగ్యం బావుందా?" ప్రశ్నించింది రమణి.
"ఆ మీకు తెలియని ఏముంది అత్తా! పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా, ఏది సెట్ అవ్వట్లేదు. అమ్మ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. నేనేమి చేయను చెప్పండి? ఆ ఖర్చులు, ఇబ్బందులు వలన బాగా విసిగిపోయాను అత్తా, అంతే" అంది సరళి.
"అవునమ్మా, తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాలి కదా."
ఇంతలో రవళి పిలుపుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది రమణి. పది రోజుల తర్వాత మురళి సీరియస్‌గా అడిగాడు సరళిని.
అప్పుడు ఆగిపోని కన్నీటిని ఆపుకునే శక్తిలేక, ఉన్న విషయాన్ని వివరించింది సరళి. సంగీతాన్ని పెళ్లి తర్వాత కూడా అలాగే కొనసాగించాలని అడిగితే, వారెవరు ఒప్పుకోవట్లేదని, అందం, ఆస్తి, కట్నం ఇలా సతాయిస్తుంటే తట్టుకోలేక పోతున్నానని వాపోయింది.
"జీవితంపై విరక్తి వచ్చి, తనుువు చాలించాలని ఉంది మురళీగారు."
"మీకు అభ్యంతరం లేకపోతే, మీ సంగీత హస్తాన్ని అందుకునే అవకాశం ఇస్తారా?"
మురళి వాక్యంతో అవాక్కయ్యింది సరళి.
"నిజంగానా? ... సానుభూతా?"
"నిజమే... అండి!"
"మనిద్దరమూ భవిష్యత్తులో సంగీత సాధనను ఎంతో మందికి నేర్పవచ్చు. శిక్షణాలయం పెట్టుకోవచ్చు. ఏమంటారు?"
ఇంట్లో వాళ్లకి విషయం చెప్పి ఒప్పించాడు మురళి.
"సరే... నీ ఇష్టం" అన్నది తల్లి.
సరళి ఇంట్లో ససేమిరా ఒప్పుకోలేదు.
బాధను తట్టుకోలేక సరళి రవళిని గట్టిగా హత్తుకుని ఏడ్చేది.
"అక్కా! ఏమైంది? ఎందుకు రోజు ఏడుస్తున్నావు? ఎవరో కొట్టారా?" అమాయకంగా అడిగేది రవళి. జవాబు రాలేదు.
సాయంత్రం యథావిధిగా గుడికెళుతుంటే, రవళిని వారించింది రమణి.
సరళి–కామేశ్వరి మధ్య పెద్దపెద్ద మాటలు, గొడవలు. సరళిని బాగా కొట్టి, "కులాంతర వివాహం సరైంది కాదు. దాని వలన కుటుంబానికి తగని మచ్చ పడుతుంది. మన వంశ ప్రతిష్ఠ నీరు కారుతుంది. నువ్వు ఎలాగూ చావాలనుకున్నావు కదా, పద! నేనే నీకు మోక్షాన్ని చూపిస్తాను!" అంటూ సరళిని సౌచాలయంలోకి లాగి, కట్టేసి, ఒంటిమీద కిరోసిన్ మొత్తం పోసి, నిప్పంటించి, ద్వారానికి గొళ్ళెం వేసింది కామేశ్వరి.
"అమ్మా... అమ్మా... అమ్మా..." అని అరుస్తున్న సరళిపై కనికరం చూపలేదు ఆ తల్లి. కాలివంకాయలా నల్లగా మాడిపోయిన సరళి శవాన్ని ఎదురింట్లో చూసి, "అక్కా! అక్కా!" అంటూ హతాశురాలైంది రవళి.
కామేశ్వరి తనపై ఎవరికీ అనుమానం రాకుండా, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించింది. తాను ఒక ఆడదానినే విషయం మర్చిపోయి, అతి మూర్ఖంగా ప్రవర్తించి, కూతురి ప్రాణాలు బలి తీసుకుంది.
నెల రోజుల పాటు జ్వరం, భయంతో వణికిపోయింది రవళి. విషయం తెలుసుకున్న మురళి చాలా బాధపడ్డాడు. "త్వరపడిపోయి పొరపాటు చేశానేమో!" అంటూ ఆలోచించాడు.
నీతి: పెళ్లికి కావాల్సింది నమ్మకం, సహకారం, బాధ్యత, అర్థం చేసుకోవడం. కానీ కుల–మతాలంటూ పిల్లల్ని చంపుకోవటం కాదు.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.
Comments