top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 27

Updated: May 9

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

చివరి భాగం

Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 27 - New Telugu Web Series

Written By Pandranki Subramani Published In manatelugukathalu.com On 08/05/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 27 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. నరసింహ మూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఇండియా వచ్చిన నరసింహ మూర్తికి శంకరం గురించి తెలుస్తుంది. మాధవి, శంకరాల వివాహం జరుగుతుంది. 



నరసింహమూర్తి చేసే కాల్స్ కి రెస్పాండ్ కాదు సుజాత. అమెరికా వెళ్లిన నరసింహ మూర్తిని సుజాత కాంప్ ఫైర్ కు తీసుకొని వెళ్తుంది. అక్కడ తన కోపానికి కారణం చెబుతుంది. ట్రైనింగ్ సమయంలో నరసింహ మూర్తిని అతని ట్రైనీ మేట్స్ అయిన ఇద్దరు విదేశీ యువతులు ముద్దు పెట్టుకుంటారు. ఆ విషయంగా అతన్ని నిలదీస్తుంది సుజాత. ఇద్దరి మధ్యా అపోహలు తొలగి, వారి వివాహం జరుగుతుంది. 



ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 27 చదవండి.. 


మంగళకర కార్యమంతా పూర్తయిన తరవాత లోపలకు దుస్తులు మార్చుకోవడానికి వెళ్తూ సుజాత— తనను వెన్నంటి వస్తూన్న ముత్తయిదువులతో అటు తిన్నగా వెళ్లకుండా వాళ్ళను అక్కడే ఆపి నరసింహమూర్తిని మాత్రం చేయి పట్టుకుని ప్రక్కలకు తీసుకు వెళ్ళింది. 

“మీరు వెతుకుతూన్న ఇద్దరూ రాలేదండీ! వాళ్ళు లేకుండా మోహన కూడా వచ్చే ప్రసక్తి ఉండదు కదా! ”


అతడు బాధగా దిగులుగా తన జీవనచరి వేపు చూస్తూండి పోయాడు. అతడికి మాట పెగలడం లేదు. శ్రమతో ఎట్టకేలకు పెదవి విప్పి అడిగాడు- “పెళ్లికి రాకుండా ఉండటమేమిటి?! ఏమైంది?ఎందుకురాలేదు? అస్వస్థకు లోనయిందా?” 


“కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి. మన గురించి తెలియని వారు మరోలా అనుకునేరు. నిదానంగా వినండి. మీ మామగారూ అత్తగారూ మనల్నే గమనిస్తున్నారు-- చూసారా! ”


ఆమాటతో అతడు ఊరకుండిపోయాడు. మోహన రాలేదన్న విషయం అతణ్ణి నిరుత్సాహంతో ఊగిసలాడించింది. పెళ్ళి పందిరలో కళ తగ్గినట్లనిపించింది. నాదస్వరమే లేని మేల తాళమా! 

కొన్ని క్షణాలు ఆగి- “కూల్ డౌన్” అని నిదానంగా చూస్తూ చెప్పసాగింది సుజాత- “అది మనకు చెప్పినట్టే చేసింది. ఆది నుంచీ అందరికీ తెలియపర్చినట్లే చేసింది. మేమే దాని మాటల్ని లైట్ గా తీసుకున్నాం. తన కాలేజీ మేటైన వైట్ అమెరికన్ ని ప్రేమించి ఇంట్లోవాళ్లు ఎంతవద్దన్నా వినకుండా ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. తను అతనితోనే ఉంటానని తమను ఎవరూ విడదీయలేరని కంకణం కట్టుకుని నిష్క్రమించింది.


పిన్నీ చిన్నాన్నా మొదట్నించీ దానిని భారతీయ యువకుడికి ఇచ్చి చేయాలనే అనుకుంటున్నారు. అందువల్ల దాని నిర్ణయంతో చాలా అప్సెట్ అయారు. మా పిన్ని ఎంతగా డిప్రెషన్ కి లోనయిందంటే- మాపిన్నిని ఆస్పత్రిలో అడ్మిట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు మా పిన్ని ఆస్పత్రిలోనే ఉంది. మా చిన్నాన్నే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. పెళ్లికి తను రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతూ మీ పెదనాన్నగారికీ మీ నాన్నగారికీ ఉత్తరాలు వ్రాసి పంపించారు. ”


అప్పుడతనికి ఉన్నపాటున వైదేహిగారు తనతో అన్న మాటలు గుర్తుకి వచ్చాయి- “మీకు తమ్ముడు లేడు కదూ నర సింహా! మీ పెదనాన్నగారింట్లో కూడా మగపిల్లల్లెవరూ లేరా?”


దీనమైన మోముతో అన్న ఆమె మాటలు తలచుకుంటుంటే అతడి గుండె తరుక్కుపోతూంది. సుజాత గొంతు వినిపించి తల తిప్పి చాసాడు- “గుడ్డిలో మెల్లగా ఒక మంచి పని చేసింది”  


ఆమాటతో అతడికి అసహనం పొంగుకొచ్చింది. ఏమిటా మంచి పని? కన్నతల్లిని ఆస్పత్రికి పంపడమా! వాళ్లిద్దరూ మెంటలీ ప్రిపేర్ కావడానికి కాస్తంత ఓపిక పట్టవద్దూ!”

“మిమ్మల్ని ఆవేశంతో ముఖం పెట్టి మాట్లాడకన్నాను కదండీ! చూసేవారు ఇంకేదో అనుకుంటారన్నానా!”


“ఓకే ఓకే! సారీ! మీ చెల్లిపైన కోపంతో కాదు. అభిమానంతో ఫీలవుతున్నాను. సరే- విషయం చెప్పు. గుడ్డిలో మెల్లగా ఆ మహాతల్లి చేసిన మంచి పనేమిటి?”


“లివ్- ఇన్- రిలేషన్ షిప్ జోలికి వెళ్లకుండా లక్షణంగా అబ్బాయి పెద్దల సమక్షాన చర్చిలో పెళ్ళి చేసుకుంది; అతడెంత బలవంత పెడ్తున్నా కాదని- కనీసం కొన్నాళ్ళయినా సహజీవనం చేద్దామని నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినకుండా-- తమ కుటుంబానికి అటువంటివన్నీ పడవని మరీ పట్టుబట్టి మూడు ముళ్లూ వేయించుకుంది. ఇది మంచి విషయం కాదా! ఒక విధంగా మా ఇంటి పరువు కాపాడినట్లే కదా! ”


అతడు సుజాత కళ్లలోకి దీర్ఘంగా చూస్తూ తలూపాడు. 


“మీ పినతల్లి గాని అక్కణ్ణించి ఫోను చేసి నీతో మాట్లాడితో మోహనకి నేను కంగ్రాట్స్ చెప్పినట్టు తెలియజేయి. ఒక రోజు తప్పకుండా యు. ఎస్ వచ్చి ఆమె కూతుర్నీ అల్లుణ్ణీ చూడటానికి వస్తా నని కూడా చెప్పు” అంటూ అతడు సుజాతకు అక్కడ నిల్చున్న ముత్తయిదువులతో పరిచయం చేసి ఇక తన పోర్షన్కి వెళ్ల మని చూపులతో సైగ చేసాడు. ఆమె కదల్లేదు. 


“మీరిప్పుడే కదూ మాచెల్లిని దెప్పి పొడిచారు- మా పిన్ని పరిస్థితికి అదే కారణమని— తొందర పడిందని--”


అతడు తల అడ్డంగా ఆడించాడు. “లేదు— ఏదో ఆవేశంలో పడి అలా అనేసి ఉంటాను. నాకు ముందునుంచీ మోహనంటే అభిమానం. అదిప్పుడు రెట్టింపయింది” 


సుజాత విడ్డూరంగా చూసింది— తనకేమీ అర్థం కానట్టు- 

“నిష్కపటి- నిర్మల హృదయి మోహన! ” అంటూ సుజాతను ఆమె కోసం అల్లంత దూరాన యెదురు చూస్తూ నిల్చున్న బంధువుల వేపు సాగనంపుతూ అక్కణ్ణించి కదిలాడు నరసింహమూర్తి- విడిది ప్రాంగణం వేపు- పల్లవించే మనోరాగపు మలుపు వేపు- నవజీవన పూల పందిరి వేపు-- 


ఇంతకూ జీవిత ప్రయాణమంటే అంతులేని అనూహ్యమైన తీర్థ యాత్రలేగా—ఇదిగో! ఇలా వెళ్లి అలా రానూ- అంటూ సాగి పోయి, మధ్యన ఆగిపోయి మరొక తావున ఆరాటపడుతూ ఆగిపోవడమేగా! అయోమయంగా నాలుగు రోడ్ల కూడలి వద్ద నిస్తేజంగా నిల్చుండిపోవడమేగా- 

అతడికి చప్పున, యేనాడో చదివిన శివనామ తేటగీతి మనసున ప్రభంజనమై మెదిలింది. హృదయరాగమై ధ్వనించింది. 


జరిగినది జరిగెడునది జరుగునున్నదంత తెలిసిన ఆది మధ్యాంత రహిత మూర్తి- మన మనస్సుల భావములను చదువు గురుడు- ‘సర్వజ్ఞ‘భవునకు కోటి నుతులు

____________________________________________________________________

 

నవల సంక్షిప్తం(అందీ అందని హృదయ గీతికలు)


నవలా రచన రెండు తెలుగు కుటుంబాలకు సంబంధించినది. రెండు కుటుంబాల అనువంశిక బీజాలు తెలుగు గడ్డకు సం బంధించినవైనా— వాటిలో ఒక కుటుంబం తెలుగు గడ్డపైన మనుగడ సాగిస్తుంటుంది. మరొక కుటుంబమేమో అమెరికాలో స్థిరపడి మనుగడ సాగిస్తుంటుంది. దాదాపు అందరిదీ పుట్టినది తెలుగు గడ్డే! 


ఇకపోతే— అమెరికాలోని శ్రీరామ్— ఇక్కడున్న భూషణం — ఒకేబడిలో చదువుకున్న చిన్ననాటి మిత్రులు. వాళ్ల వాళ్ల ఉపాధి వెతుక్కుంటూ వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నా ఇద్దరి మధ్యా స్నేహపు పరిమళం తగ్గలేదు. నిజమైన ఆత్మీయతలకు దూరం ఎన్నడూ ఒక అడ్డుగోడ కాజాలదు కదా! 


రాజమండ్రిలో ఉంటూన్న భూషణం దంపతులకేమో బిడ్డలు లేరు. ఆ కారణం చేత- తమ్ముడు నరసింహులు కొడుకు నర సింహమూర్తిని మిక్కిలి అనురాగంతో చూస్తారు. 


నరసింహమూర్తి కూడా పెదతండ్రి పట్ల- పెద తల్లి పట్లా అదే అనురాగం చూపిస్తా డు. మీదు మిక్కిలి గౌరవ ప్రపత్తులతో నడుచుకుంటాడు. నరసింహమూర్తి తల్లి వర్థనమ్మేమో రిటైర్ ఐన హెడ్ మిస్ట్రెస్. కొడుక్కి కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం దొరకటాన— తదుపరి పరిణామంగా హైద్రాబాదులోనే స్టాఫ్ క్వార్టర్స్ లభించిన కారణాన ఆమె కూతురు మాధవితో—భర్త డాక్టర్ నరసింహులుతో కొడుకింటికి చేరుకుంటుంది. 


ఆమె సహజంగా తన బావగారు భుషణంలా— తోడుకోడలు మందారమ్మగారిలా జీవన విధానంలో పధ్ధతిగా- కచ్చితంగా-- నికార్సుగా ఉంటుంది. సున్నిత మనోభావాలతో బా టు ఉదాత్తమైన గుణాంశాలు గల స్త్రీ. సామాజిక స్పృహ గల సంస్కార సంపన్నురాలు. ఎటొచ్చీ కాస్తంత ఉద్యేగభరితురాలు. 


సెంట్రల్ సర్వీసు కమీషన్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకుతో నెగ్గుకు వచ్చిన నరసింహమూర్తికి హైద్రాబాదులో రెవెన్యూ ఆ ఫీసరుగా పోస్టింగుతో బాటు అమెరికా ట్రైనింగుకి వెళ్ళే అవకాశం ఎదురవుతుంది. నార్త్ కరోలినా సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగ ణంలో సుమారు మూడు నెలల అకాడమిక్ ట్రైనింగ్ కోర్సు. 


అక్కడికి బయల్లేదే ముందు రాజమండ్రినుండి పెదనాన్న ఫోనుచేసి చెప్తాడు;తన తమ్ముడి కొడుక్కి నార్త్ కరోలినాలో సర్ప్ రైజ్ ఎదురు చూస్తుంటుందని. అంచేత వెళ్లే ముందు నాలుగైదు స్వీటు ప్యాకెట్లూ రెండుమూడు కారపు మిక్చర్లూ తీసుకెళ్ళమంటాడు. అదేవిధంగా అతడికి ప్లజంట్ సర్ప్ రైజ్ ఎదురవుతుంది. సిటీ ఆఫ్ క్యా రీలో ప్రముఖ వ్యాపారస్థులుగా వెలుగొందుతున్న భూషణం చిన్ననాటి మిత్రుడు శ్రీరామ్- అతడి తమ్ముడు శ్రీలక్ష్మణ్ ఇద్దరూ నరసింహమూర్తి ట్రైనింగ్ హాస్టల్ కి వచ్చి తమ ఇంటికి తీసుకెళ్తారు. 


అక్కడేమో— శ్రీరామ్ కూతురు సుజాత- శ్రీలక్ష్మణ్ కూతురు మోహన కనిపిస్తారు. వాళ్ళ ఇంటినీ ఇంట్లోని స్త్రీలను చూసిన తరవాత నరసింహమూర్తి పులకాంకితమవుతాడు. 


ఎందుకంటే- అక్కడింటి వాతావరణంలో తెలుగుతనం నలువైపులా ఉట్టిపడుతుంటూంది. అటువంటి నిండు తెలుగుతన వాతావరణానికి మూలకారణం- అన్నదమ్ములిద్దరి దివంగత తల్లి రఁణమ్మకారకురాలని తెలుసుకుంటాడు నరసింహ మూర్తి. అక్కడ— సున్నిత మనస్కురాలు— కట్టూబొట్టులో— మాట తీరులో సంస్కారవంతురాలూ ఐన సుజాత వేపు అతడి మనసు పోతుంది. గురజాడ వారన్నట్టు- మరులు మరలును వయసుతోడనే కదా! 


ఇక్కడ ట్రైనింగ్ హాస్టల్ లోనేమో— నరసింహమూర్తికి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అతడి పోర్షన్కి రూమ్ మేటుగా షేక్ అహ్మద్ అనే పాకిస్థానీయుణ్ణి వేస్తారు. ఆది నుండీ ఇరు ధ్రువాలైన ఇరుదేశాల వ్యక్తులు ఎలా సర్దుకుపోగలమన్న సందే హంలో పడి కొట్టుమిట్టాడుతుంటాడు; అటువంటి హడావడి యేర్పాటు చేసినందుకు ట్రైనింగ్ నిర్వాహకులను మనసున తిట్టు కుంటూ, కాని— కొద్ది రోజుల్లోనే ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. మిత్రులవుతారు. 


ఇకపోతే— ఇద్దరక్కా చెల్లెలిద్దరులోనూ మోహన బామ్మ రఁవణమ్మ పెంపకంలో పెరిగినా— తల్లీ పెదతల్లి పర్యవేక్షణలో మెసలినా— సర్వస్వతంత్ర భావాలతో ఉంటుంది. నిక్కచ్చిగా మనసులోని భావాలను ప్రకటిస్తుంది. తను అమెరికాలోనే పుట్టి పె రిగింది కాబట్టి— అక్కడి తెల్ల అమెరికన్లతో— బ్లాక్ అమెరికెన్లతోనే కలసి చదువుకున్నది కాబట్టి తను వాళ్ళతోనే మమేకమవు తానని— భారతదేశంలో ఉన్న వాళ్లతోనో— లేక అమెరికాలో ఉంటూన్న మరొక భారతీయుణ్ణో జీవన సహచరుడిగా చేసుకోవాల న్న అవసరం తనకు లేదంటుంది. 


ఇంకా చెప్పాలంటే—ఇంట్లోవాళ్ల కళ్ళ కదలికల వల్లనే ఆమె సాధ్యమైనంత మేర భారతీయ సాంస్కృతిని అవలంబించడానికి ప్రయత్నింస్తుందే గాని— మనసా వాచా కర్మణ: అన్నట్టు కాదు. ఎవరేమి అన్నా నరసింహ మూర్తికి ఆమె నిక్కచ్చితనం నచ్చుతుంది. సూటిదనం నచ్చుతుంది. 


ఈలోపల హైద్రాబాదులో నరసింహమూర్తి చెల్లెలు మాధవికి ఆమ సీనియర్ టీచర్ గా పనిచేస్తూన్న అదే స్కూలులో స్టా ఫ్ గా ఉంటూన్న శంకరంతో స్నేహం ఏర్పడుతుంది. అతడేమో—వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు. ఆ వైనం వెలుపల కు రాకముందే— వర్థనమ్మ అతణ్ణి అభిమానించనారంభిస్తుంది. 


అతడి ఉద్యోగపర్వంలో— అతడి ఎదుగుదలకు ఆఫీసు స్టాఫ్ ఇన్చార్జీ గా వత్తాసు ఇస్తుంది. ఆ తీరున శంకరం వర్గం గురించి తెలుసుకున్న తరవాత కూడా- అతడితో కూతురుకి ఏర్పడ్డ చనువుని గ్రహించి కూడా వ్యతిరేకించదు. 


ఎందుకంటే— శంకరం మట్టిలో పుట్టిన మాణిక్యంలా ఉత్తమ గుణ సంపన్నుడు. ఆ కా రణాన భర్త డాక్టర్ నరసింహులుని కూడా సుతారంగా ఒప్పించగలుగుతుంది. నిజానికి-- తన పైన వ్యామోహం పెంచుకున్న మాధవిని వారిస్తాడు శంకరం— తనతో దగ్గరితనం పెంచుకోవద్దని— ఇప్పటి తన బ్రతుకు మలుపులో మాధవి తల్లి వర్థనమ్మగారి సహకారం తనకు ఎంతైనా అవసరమని— ఆమెగారి అభిమానాన్ని తను కోల్పోలేనని. కాని— వ్యక్తిత్వంగల మాధవి పట్టుదలతో అతడి మాట వినకుండా అతణ్ణి తన వేపు తిప్పుకుంటుంది. ప్రేమ సంకెళ్ళలో బంధిస్తుంది. 


ఇక ఈలోపున నిశ్చితార్థం కోసం ఇండియానుండి అందరూ అమెరికాకి బయల్దేరే సమయంలో శ్రీరామ్ వాళ్ళ ఇంట్లో చిచ్చు రగల్కుంటుంది. ఎక్కడ ఏతిరకాసు ఎదురైందో చెప్పకుండా అంతవరకూ సాత్వికురాలని పేరు తెచ్చుకున్న సుజాత ఇండియా నుండి వచ్చే నరసింహమూర్తి కాల్స్ ని అందుకోవడానికి తిరస్కరిస్తుంది. హఠాత్తుగా మొండితనంతో ప్రవర్తించనా రంభిస్తుంది. చివరకు— చెల్లి ప్రోద్బలంతో— తల్లి సుగాత్రమ్మగారు— పిన్ని వేదేహిల ప్రమేయంతో ఒక విచిత్తమైన షరుతుతో తన పట్టు సడిలిస్తుంది— 


తాంబూలాలు పుచ్చుకోకముందు నరసింహమూర్తి ముందస్తుగా అమెరికా వచ్చి తనను కలుసుకోవాలని - ఆ విధంగా అతడికి తన పట్ల ఉన్న అక్కరను నిరూపించు కోవాలని షరతు పెట్తుంది. చేసేది లేక— కూతురి కోరక మేర శ్రీరామ్ గారు ఏదో ఒక నెపంతో కాబోయే అల్లుడిని నార్త్ కరోలినాకు రప్పిస్తాడు. 


ఇక పోతే— నరసింహమూర్తికి దిగీ దిగిన వెంటనే షాక్ వంటి దృశ్యం ఎదురవుతుంది. 

అతడికి ఎదుర్కోలు పలకడానికి శ్రీరామ్ వాళ్ళ ఇంటినుండి ఎవరూ రారు-- సుజాత మాత్రమే ఒంటరిగా వచ్చి అతడికి ఎదుర్కోలు పలుకుతుంది. అంతేకాక— అతణ్ణి తిన్నగా ఇంటికి తీసుకెళ్లకుండా జార్డెన్ నదీతీరాన ఉన్న అడవుల వేపు కారు డ్రైవ్ చేస్తూ తీసుకు వెళ్తుంది. అతడికి అదేదో హిచ్ కాక్ సినిమాలోని సీనులా అగుపిస్తుంది. 


ఆమె మాట తీరు సహితం సరళత్వం కొరవడి, అతడికి వింతగా తోస్తుంది. తను ఆనాడు ఆహ్లాదకర వాతావరణంలో చూసిన సుకుమారి సుజాత- ఈమేనా— అసలీమె సుజాతేయేనా-- లేక-- మరవరైనా— అన్న విస్మ యం కూడా కలుగుతుందతనికి. మరి అన్ని చోట్లకీ- అవసరం ఉన్నా లేకపోయి నా తనకు తోడుగా తీసుకు వచ్చే ఆమె చెల్లి మోహన ఏదీ! ఇవన్నీ నవల మలుపుల్లో చూపించాను. 


నవలలోని పాత్రలు—పేర్లు

1)ముచ్చటపూడి నరసంహమూర్తి-- కథానాయకుడు. ఇండియన్ ఎకనామిక్ సర్వ సులో ఉత్తీర్ణుడై ఆపీసరుగా హైద్హాబాదులో పోస్టింగ్ 

2- a)నరసింహులు—తండ్రి—రిటైర్డు గవర్నమెంటు డాక్టరు. 

2- b)వర్థనమ్మ—తల్లి—రిటైర్డు హెడ్ మిస్ట్రెస్- ఇక్కడి స్కూలులో స్టాఫ్ ఇన్చార్జీగా చేరుతుంది. 

2c)మాధవి—నరసింహమూర్తి చెల్లి- తల్లి వర్థనమ్మ పనిచేసే గురజాడ హైస్కూలులో సీనియర్ టీచర్- పట్టుదల స్వతంత్ర అభ్యు దయ భావాలున్న అమ్మాయి. 

2- d)కోదండం—స్కూలు కరెస్పాండెంట్. 

3- a)భూషణం—నరసింహమూర్తి తండ్రి డాక్టర్ నరసింహులు అన్నయ్య—పెద్ద మనసు గలవాడు—పెద్దదిక్కు

3- b) మందారమ్మ- భూషణంగారి భార్య- వర్థనమ్మ మిక్కిలి అభిమానించే తోడుకోడలు. 

4- a)శంకరం—రెండవ కథానాయకుడు—వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి—పెద్దల పట్ల మన్నన- సామాజిక స్పృహ కలిగిన వాడు—వర్థనమ్మగారి నమ్మకాన్ని అభిమానాన్ని పొందగలిగిన వాడు. మాధవి ప్రేమకు పాత్రుడయిన వాడు

4- b)సాంబయ్య—శంకరం తండ్రి- ఊరి పోలేరమ్మ గుడికి ఒక ట్రస్టీ- 

4- c)దమయంతమ్మ—శంకరం తల్లి. ఓర్పూ నేర్పూ గల కష్టజీవి. 

5- )హైమ చంద్రరావు- గురజాడ స్కూలు ప్రిన్స్ పాల్

6)పావనమ్మ—హైస్కూలు లో ఆయాగా—వర్థనమ్మగారి పర్సనల్ అసిస్టెంటుగా ఉంటుంది. 

7)మిస్టర్ రస్సెల్ గిల్ బర్ట్—నార్త్ కరోలినా (USA)- సెంట్రల్ యూనివర్సిటీలోని అకడమిక్ ట్రేనింగు ప్రోగ్రాముకి ఇన్చార్జీ. 

8)షేక్ అహ్మద్—ట్రైనింగ్ ప్రోగ్రాములో నరసింహమూర్తికి సహ రూమ్మేటుగా చేరిన పాకిస్థానీ దేశస్థుడు. 

9- a)సుజాత- కథానాయకురాలు—పుట్టి పెరిగింది అమెరికాలోనైనా బామ్మ రఁవణమ్మగారి పెంపకం వలన అచ్చు తెలుగు ఆడపడుచులా ఉంటుంది. భారతీయ విలువల్ని మిక్కిలి గౌరవస్తుంది. పెళ్లి సంబంధం కుదరక ముందే—నరసింహమూర్తిని ప్రేమించనారంభింస్తుంది. మిక్కిలి సున్నిత హదయరాలు—సంస్కార వంతురాలు. పరోపకారి

9- a)శ్రీరామ్—తండ్రి- భూషణంగారి చిన్ననాటి మిత్రుడు. అమెరికాలో వ్యాపారిగా స్థిరపడినవాడు

9- b)శ్రీలక్ష్మణ్—తమ్ముడు. 

9- c)సుగాత్రమ్మ—విద్యావంతురాలు- శ్రీరామ్ భార్య- సుజాత తల్లి. 

9- d)వైదేహి—శ్రీలక్ష్మణ్ భార్య

9- e)మోహన—శ్రీలక్ష్మణ్ దంపతులు ఏకైక కూతురు. అక్కయ్య సుజాతలాగే అమెరికాలో పుట్టి పెరిగినది. 

10)రాబర్ట్ రామ్ మోహన్—శ్రీరామ్ దంపతుల కొడుకు- సుజాతకు తమ్ముడు- 

11)లేడీ గ్రేస్—అమెరికన్ స్త్రీ—విమాన ప్రయాణంలో నరసింహమూర్తికి పరిచయం ఐన ఆర్ట్స్ ప్రొఫెసర్- పెద్దావిడ0

12)ఎమ్- ఎస్- క్రిస్టోఫర్—అమెరికన్ బ్లాక్—మొదటి ప్రపంచ యుధ్ధంలో రాజమండ్రి తెలుగు వంశానికి చెందిన రఘురామరా యుడి మునిమనవడు. అనూహ్యంగా తెలుగు గడ్డపైన అభిమానం పెంచుకున్నవాడు. కొద్దిగా తెలుగు తెలిసినవాడు. చైనీస్ రెస్టా రెంట్ మేనేజర్. 13)a- క్యాథరిన్b)లిమండ్ నాన్సీ- నరసింహమూర్తి లేడీ ట్రైనీ బ్యాచ్ మేట్లు- అతడి దగ్గరితనాన్ని ఆశించిన స్త్రీలు. 

నవలలోని పాత్రలన్నీ కేవలం కల్పితాలే ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కావు. 

  -పాండ్రంకి సుబ్రమణి


===========================================================================================

                                              సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ పాండ్రంకు సుబ్రమణి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

===========================================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





bottom of page