జీవిత చిత్రాలు - 15
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 3 days ago
- 6 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Jeevitha Chitralu Part - 15 Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 14/05/2025
జీవిత చిత్రాలు - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య, చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు. యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు.
గోవిందరాజు కుమారుడు కిరణ్, గులాబీల వివాహానికి గులాబీ తండ్రి.. ప్రొడ్యూసర్ వినాయకం అంగీకరించడు. తల్లి చిలకమ్మ అంగీకరిస్తుంది. కూతుర్ని కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చెయ్యబడుతుంది చిలకమ్మ.
భార్య కిడ్నాప్ అయిన విషయాన్ని డి.ఐ.జి కొండలరావుకు చెబుతాడు వినాయకం. కిడ్నాపర్లు చిలకమ్మ చేత వినాయకంతో మాట్లాడిస్తారు.
చిన్నప్పటి తన ఇంటి జాగా తిరిగి కొనాలనుకుంటాడు ఆది. యువరాణి అందుకు అంగీకరిస్తుంది.
ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పార్ట్ 15 చదవండి.
"నా విషయంలో మీరు అనవసరంగా శ్రమ తీసుకొంటున్నారు" క్షణంసేపు యువరాణి ముఖంలోకి చూచి చెప్పాడు ఆది.
టీ కప్పును క్రిందికి దించి.. అందంగా నవ్వింది యువరాణి. ఇరువురూ టీ త్రాగడం ముగించారు. జనార్థన్ హాల్లోకి వచ్చారు. ఆదిని చూస్తూ యువరాణి లేచి నిలబడింది.
"ఈ అయ్యగారి ఇంటి పని ప్రారంభం అయింది బాబాయ్!" చిరునవ్వుతో చెప్పింది యువరాణి.
"అమ్మా!.. నీవు తలుచుకొంటే కాని పని అంటూ ఉందా!.." ఆది వంక చూస్తూ నవ్వాడు జనార్థన్.
"రండి" యువరాణి వరండా వైపుకు నడిచింది.
"ఆదీ!.. షి ఈజ్ వెరీ గుడ్ గర్ల్.. ప్లీజ్ గో!" నవ్వుతూ చెప్పాడు జనార్థన్.
వెళ్ళి వస్తానని వారికి చెప్పి ఆది.. బయటికి నడిచాడు.
ఎవరి కార్లో వారు ఆది కొన్న యింటి స్థలం వైపుకు బయలుదేరారు.
రెండు కార్లు పది నిముషాల్లో ఆ స్థలం దగ్గరకు చేరాయి. ముకుందయ్య జె.సి.బి పనివాళ్ళు.. పనిని ప్రారంభించగానే ఆశ్చర్యపోయి ’ఎవరు చెబితే మీరు ఈ పని చేస్తున్నారని’ వారిని అడిగాడు. వారు యువరాణి పేరును చెప్పారు.
ఆదిత్య తనతో చెప్పిన మాటలను తలుచుకొని.. విషయం తెలిసి.. ఆదిత్య నిర్ణయానికి వ్యతిరేకంగా యువరాణి.. తన స్వప్రయోజనానికి పనిని ప్రారంభించిందని నిర్ణయించు కొన్నాడు. రెండు కార్ల నుండి ఒక్కసారిగా దిగిన ఆదిత్యను.. యువరాణిని చూచి ముకుందయ్య ఆశ్చర్యపోయాడు.
"మామయ్యా! ఎలా వున్నారు?" నవ్వుతూ యువరాణి ముకుందయ్యను సమీపించింది.
"ఏదో.. ఇలా వున్నానమ్మా!" మెల్లగా చెప్పాడు ముకుందయ్య.
జరుగుతున్న పనిని చూచి.. కొద్ది క్షణాల తర్వాత ఆదిత్య ముకుందయ్యను సమీపించి చేతులు జోడించి.. "నమస్కారం బాబాయ్.. ఎలా వున్నారు?" చిరునవ్వుతో అడిగాడు.
"ఆదీ!.. నీమీద నాకు కోపం. నాతో చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయావుగా!"
ఆ మాటల్లో వారికి తన పట్ల వున్న అభిమానం.. ప్రేమ.. ఆదరణ గోచరించాయి ఆదిత్యకు.
’వీరికి నిజాన్ని చెప్పాలి’ అని నిర్ణయించుకొన్నాడు.
"మామయ్యా!.. వీరు ఈ స్థలాన్ని కొన్నారు. వీరు ముందే మీకు తెలుసా!" ఆశ్చర్యంగా ఇరువురి ముఖాలను చూచింది యువరాణి.
"పోయినసారి వచ్చినప్పుడు నన్ను కలిసి ఈ స్థలాన్ని కొనాలని మాత్రం నాతో చెప్పాడు."
"వీరెవరో మీకు తెలీదా!"
"తెలీదమ్మా!"
"వీరు మీ అన్నయ్య రామచంద్రయ్యగారి అబ్బాయి ఆదిత్య!" నవ్వుతూ ఇరువురి ముఖాల్లోకి చూచింది యువరాణి.
ఆదిత్య ఆశ్చర్యంగా యువరాణి ముఖంలోకి చూచాడు.
"నేనేం తప్పుగా చెప్పలేదుగా!" ఆది ముఖంలోకి చిలిపిగా చూస్తూ నవ్వింది యువరాణి.
యువరాణి మాటలను విన్న ముకుందయ్య తన చెవులను తాను నమ్మలేకపోయాడు.
"అమ్మా!.. నీవు ఏమన్నావ్!.. మరోసారి చెప్పు.."
"బాబాయ్!.. నేనే మీ ఆదిత్యను.."
"ఆఁ.." అంతులేని ఆశ్చర్యం.
"బాబాయ్!.." ముకుందయ్యను కౌగలించుకొన్నాడు ఆది పరవశంతో.
"ఒరేయ్!.. నీవు మా ఆదిత్యవేనా!" గద్గద స్వరంతో కన్నీటితో అడిగాడు ముకుందయ్య.
"అవును బాబాయ్" బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు ఆది.
"మామయ్యా!.. నేను వచ్చిన పని అయిపోయింది. తండ్రి కొడుకులు తీరిగ్గా కూర్చొని మాట్లాడుకొండి" నవ్వుతూ చెప్పి యువరాణి తన కారువైపుకు వెళ్ళి కూర్చొని తన ఇంటివైపుకు ఆనందంగా వెళ్ళిపోయింది.
ఆదిత్య చేతిని పట్టుకొని ముకుందయ్య ఎంతో ఆనందంగా తన ఇంటి వైపుకు నడిచాడు. పసిపిల్ల వానిలా ఆది.. వారిని అనుసరించాడు. ఇరువురూ వరండాలో కూర్చున్నారు.
ముకుందయ్య యింటి ముఖ ద్వారం వైపు చూచి.. "సావిత్రీ.. సావిత్రీ.." బిగ్గరగా పిలిచాడు. కొన్ని క్షణాల్లో సావిత్రి వారి ముందు నిలబడింది.
"ఏమండీ!.."
"ఈ అబ్బాయిని చూడు. ఎవరైయుంటాడో చెప్పు చూద్దాం!" నవ్వుతూ అన్నాడు.
సావిత్రమ్మ ఆదిత్య పరీక్షగా చూచింది కొన్ని క్షణాలు..
"నాకు గుర్తుకు రావడం లేదండీ!" విచారంగా చెప్పింది సావిత్రి.
"వీడు.. వీడు.. మా అన్నయ్య రామచంద్రయ్య కొడుకు ఆదిత్య" నవ్వుతూ చెప్పాడు.
ఆది లేచి వెళ్ళి ఆమె పాదాలను తాకి "పిన్నీ!.. బాగున్నారా!.. నేను మీ ఆదిత్యను" వినయంగా చెప్పాడు.
సావిత్రి ఆశ్చర్యపోయింది. "నీవు.. నీవు మా ఆదిత్యవా!" అంది నవ్వుతూ.
"అవును పిన్నీ!"
సావిత్రమ్మ ముకుందయ్య ప్రక్క కుర్చీలో కూర్చుంది.
"నాయనా!.. అదీ.. అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడ వున్నారయ్యా!" ఆత్రంగా అడిగింది.
"తెలిదు పిన్నీ.. తెలుసుకోవాలి" విచారంగా చెప్పాడు ఆది.
వారిరువురికీ ఆది.. తన గత చరిత్రనంతా వివరించాడు. చివరగా..
"బాబాయ్!.. పిన్నీ.. ఆ దైవానుగ్రహం వుంటే త్వరలో అమ్మా నాన్నలను కూడా కలిసి కొంటాను" అన్నాడు సాలోచనగా.
"అది.. త్వరలో తప్పకుండా జరుగుతుంది. ఆదీ!.." కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానిస్తూ అన్నాడు ముకుందయ్య.
ఆది వారికి.. ఆ స్థలంలో నిర్మించదలుచుకొన్న యింటిని గురించి అనాథ ఆశ్రమాన్ని గురించి.. ఎక్కడ వున్నా అమ్మా నాన్నలను తీసుకొని వచ్చి వారు ఆ ఇంట్లో వుండేలా చేయాలనే తన నిర్ణయాన్ని తెలియజేశాడు. యువరాణి వారికి సంబంధించిన అన్ని భూములను తన పేర రిజిస్టర్ చేసి పత్రాలను తనకు యిచ్చిందని చెప్పాడు.
ఆది మాటలకు వారు ఎంతగానో సంతోషించారు. ఆది సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది జనార్థన్. కాంట్రాక్టర్ వచ్చి వున్నాడని, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పాడు.
విషయాన్ని విన్న ముకుందయ్య, "పద, నేనూ వస్తాను" అని ఆదితో బయలుదేరాడు.
జనార్థన్ బిల్డర్ నరేంద్రను ఆదికి పరిచయం చేశాడు. తాను తయారు చేసిన, తన బ్రీఫ్ కేసులో వున్న యింటి ప్లాన్‍ను ఆది వారికి చూపించాడు.
నాలుగు నెలల్లో బిల్డింగ్‍ను పూర్తి చేసి మీకు హ్యాండోవర్ చేస్తానని నరేంద్ర వారికి చెప్పాడు. అన్ని బాధ్యతలను నేను చూచుకొంటానని ముకుందయ్య చెప్పాడు. ఎస్.ఎఫ్.టికి వెయిన్ని ఎనిమిది వందల చొప్పున రేట్ ఫైనల్ చేసి.. ఐదు లక్షల అడ్వాన్సు చెక్కును నరేంద్రకు యిచ్చాడు ఆది.
వారంరోజుల్లో పని ప్రారంభిస్తానని చెప్పి నరేంద్ర వెళ్ళిపోయాడు.
గోవిందరాజులు ఫోన్ చేశాడు. తాను వచ్చిన పనులన్నీ సవ్యంగా నెరవేరాయని రేపు బయలుదేరి వస్తున్నానని వారికి చెప్పాడు ఆది.
మరో ఐదు లక్షల చెక్కును వ్రాసి ముకుందయ్యకు యిచ్చి.. అవసరాలకు తగినట్లుగా వాడండనీ.. మరో పదిరోజుల్లో తిరిగి వస్తానని వారికి చెప్పాడు ఆది.
భాస్కర్ హాస్పిటల్ నుండి వచ్చాడు. ఆది చెప్పిన విషయాలనన్నింటినీ విని ఆనందించాడు.
స్కూలు నుంచి మీటింగ్ వున్న కారణంగా సుధ ఆలస్యంగా యింటికి వచ్చింది. ఆమెతో పాటే యువరాణి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆరోజు ఆ ఇంటికి ఆమె రావడం మూడవసారి. సుధ ఇంట్లోకి వెళ్ళిపోయింది. యువరాణి వారందరి ముందు నిలబడి వుంది.
"కూర్చో యువరాణి" అన్నాడు జనార్థన్.
"నేను మీ ఆదిత్య గారితో మాట్లాడాలని వచ్చాను. నేను చెప్పబోయేది మీరు వినాలి" అంది.
"చెప్పమ్మా!" అన్నాడు ముకుందయ్య.
"మా నాన్న.. మా అన్నయ్య.. మామయ్యా మీ కుటుంబానికి చేసింది అన్యాయం. మా నాయనమ్మ చాలా మంచిది. ఆమె చెప్పగా నాకు నిజానిజాలు తెలిశాయి. ఊహ తెలిసిన నాటినుంచీ.. నేను ఆదిత్య విషయంలో తప్పు చేసి.. వారిని వారి కుటుంబానికి దూరం చేశాననే బాధ నన్ను వేధిస్తూ వుంది. తప్పు.. ఏ వయస్సులో చేసినా తప్పే అవుతుంది.
కానీ నేను ప్రస్తుతంలో ఎంతగానో పశ్చాత్తాప పడుతున్నాను. మీ విషయంలో అన్యాయంగా వర్తించిన వారంతా.. తగిన శిక్షను అనుభవించారు. మా మామయ్య, అన్నయ్య గతించారు. మీకు కష్టాలను కలిగించి.. మీ ఆస్థిని అల్ప వెలకు కొన్నవారు పైకి పోయారు. మంచంలో పక్షవాతంతో నరకయాతన అనుభవిస్తున్నాడు మా నాన్న. కొద్దిరోజుల్లో వారి కథ ముగిసిపోతుంది.
నేను.. నాతత్త్వం.. మనిషిని మనిషిగా గౌరవించడం.. అభిమానించడం. పగవాడినైనా ప్రేమించాలనేది నా అభిమతం. మామయ్య ముకుందయ్యగారికి సాయంగా వుండి మీ గృహ నిర్మాణానికి నేను చేయతగిన సాయం చేయాలన్నది నా సంకల్పం.
మీ మదిలో నా పట్ల వున్న ద్వేషాన్ని మరిచిపోండి. నన్ను మీ హితవును అభివృద్ధిని కోరే వ్యక్తిగా భావించండి. మీపట్ల నా మదిలో వున్నది ఎంతో అభిమానం, ప్రేమ" గంభీరమైన వదనంతో చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పి.. "నా తప్పును మన్నించండి" చేతులు జోడించింది యువరాణి.
ఆమె సుదీర్ఘ ఉపన్యాసం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చిత్రంగా ఆమెను చూస్తూ అచేతనంగా వుండిపోయారు.
"పగ.. కక్ష.. ప్రతీకారం నాకు గిట్టని లక్షణాలు" మెల్లగా చెప్పాడు ఆది.
ఆ మాటలను విన్న యువరాణి ఆది ముఖంలోకి ఓరకంట చూచి.. "వెళ్ళి వస్తాను" చెప్పి వెళ్ళిపోయింది.
"యువరాణి చాలా మంచిది" అన్నాడు జనార్థన్.
"అవును జనార్థనా!.. నీ మాట సత్యం" అన్నాడు ముకుందరావు.
వారిరువురినీ చూచాడు ఆది.
’అవును వీరి మాటలు నిజం’ అనుకొన్నాడు.
ముకుందయ్య తన నిలయానికి బయలుదేరాడు. మరుదినం.. వేకువన, ఆది వైజాగ్.. బయలుదేరాడు.
*
పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి.. కిడ్నాపర్స్ ఏ టవర్ ప్రాంతం నుండి ఫోన్ చేస్తున్నదీ గ్రహించారు. అది భద్రాచలం ఎయిర్‍టైల్ టవర్..
ఆ ప్రాంతంలో పనిచేసి వచ్చిన దివాకర్ పై అధికారులతో సంప్రదించి.. హైదరాబాదుకు బయలుదేరబోయే ముందే.. పాతిక మంది పోలీసులను మఫ్టీలో భద్రాచలానికి, కుంటకు రెండు బ్యాచెస్‍గా.. బయలుదేరే దానికి ఏర్పాటు చేశాడు. వారు భద్రాచల్.. కుంటా చేరారు.
వినాయకం సెల్‍ను కొండలరావు తన తోటే తీసుకొని వెళ్ళాడు.
రంజిత్.. తన పార్టీకి సంబంధించిన ముగ్గురు అనుచరులతో రెండు కోట్ల క్యాష్ బ్రీఫ్‍కేసుతో.. భద్రాచలం శ్రీ రామస్వామి నామాన్ని జపిస్తూ.. టాటా సుమోలో, భద్రాచలం వైపుకు ప్రాణాలను పిడికిట్లో పెట్టుకొని బయలుదేరాడు. ఆ విషయాన్ని కొండలరావుకు ఫోన్ చేసి చెప్పాడు రంజిత్. ’ప్రొసీడ్..’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కొండలరావు.
మరుదినం.. శ్రీరామనవమి. గోవిందరాజు యాత్రికులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశాడు. వారి బాల్య స్నేహితుడు వర్క్ షాప్ ఇన్‍ఛార్జి జగ్గయ్య అధ్వర్యాన అన్నదానం ఏర్పాట్లు జరిగాయి.
రాత్రి పన్నెండు గంటల సమయం. భద్రాచలంలో మఫ్టీలో వున్న కొండలరావు చేతిలో వున్న వినాయకం సెల్ మ్రోగింది. ఆందోళనతో చెవి దగ్గర వుంచుకొన్నాడు కొండలరావు.
"సార్!.. ఇప్పుడు సమయం పన్నెండున్నర. శుభోదయం. ఈరోజు శ్రీరామనవమి. హైందవుల కందరికీ పర్వదినం.
వైజాగ్‍లో వున్న ఓ గొప్ప వ్యక్తి గోవిందరాజు ఈ రోజంతా పేదలకు ఆ క్షేత్రంలో అన్నదానం చేయబోతున్నారు. వేలల్లో భక్తులు రానున్నారు.
మీరు.. ఆ వినాయకం గారి రెండు కోట్లు డబ్బును ఆ స్వామిని దర్శించ వచ్చిన పేదలకు పంచండి. ఆరుగంటలకల్లా వారి శ్రీమతి.. డ్రైవర్ ఆలయంలో వుంటారు. వారిరువురూ చాలా మంచివారు.
మీరు మీ బలగం.. మఫ్టీలో మమ్మల్ని పట్టుకోవాలని భద్రాచలంలో.. కుంటలో వున్న విషయం మాకు తెలుసు.
మంచిరోజున రక్తపాతం తగదు సార్!.. తప్పు చేసిన వ్యక్తి ఏసీ రూములో హాయిగా వుంటే.. మన మధ్యన కాల్పులు ఎందుకు సార్!.. వున్నవారు లేని వారికి.. వారికి వున్న కోట్లను, దానం చేయకపోయినా ఫర్వాలేదు. లేనివాడు తనలాగే సాటి మనిషి అని గుర్తిస్తే.. జాతికి ఎంతో మంచిది సార్!.. వర్గ భేదాలు సమసిపోతాయి. ఈ మంచిరోజున ఆ రామయ్య తండ్రి సన్నిధిలో పేదలంతా ఆనందించేలా చూడండి. సార్. నమస్తే" సెల్ కట్ చేశాడు ఆ వ్యక్తి.
అతని మాటలకు.. కొండలరావు ఆశ్చర్యపోయాడు. తనతో వున్నవారికి తెలియజేశాడు. ఫోన్‍లో కుంట ప్రాంతంలో వున్న దివాకర్‍కు చెప్పాడు. ’డబ్బును మనం వినాయకం పర్మిషన్ లేకుండా పేదలకు పంచవచ్చునా!’ అని అడిగాడు. ’పంచబోయేది వారి పి.ఎ రంజిత్ సార్.. మనం కాదు’ నవ్వాడు దివాకర్.
ఐదు గంటలకు రంజిత్.. కొండలరావును కలిసికొన్నాడు. ఆలయం ముందు ఆరుగంటలకు చిలకమ్మ కోటయ్యలను కొండలరావు.. దివాకర్ వారి బృందం.. రంజిత్ కలిసికొన్నారు.
కిడ్నాపర్ చెప్పిన విషయాన్ని కొండలరావు చిలకమ్మకు చెప్పాడు.
గోదావరి నదిలో స్నానం చేసి.. భద్రాద్రి సీతారామ లక్ష్మణ శ్రీ ఆంజనేయ స్వాములను దర్శించి చిలకమ్మ డబ్బును రంజిత్ సాయంతో పోలీస్ స్టేషన్ దగ్గర.. తన చేతులతో వచ్చిన పేద యాత్రికులకు పంచింది. పోలీసులు ఆమె ప్రక్కన నిలబడి ఆ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చూచారు.
చిలకమ్మ దివాకర్ వెంట వైజాగ్ వెళ్ళిపోయింది. కొండలరావు వారి బృందం.. రంజిత్, కోటయ్య హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఉప్పెనలా వచ్చిన సమస్య ప్రశాంతంగా ముగిసింది.
=======================================================================
ఇంకా వుంది..
జీవిత చిత్రాలు - పార్ట్ 16 (చివరి భాగం) త్వరలో..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.