top of page

గందరగోళం

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguInspirationalStories, #Gandaragolam, #గందరగోళం


Gandaragolam - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 06/06/2025 

గందరగోళంతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


సతీష్ నీటి వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఈవెనింగ్ వాక్ చేస్తూ. కొద్దిదూరం నడిస్తే అక్కడ జనం అంతా గుంపుగా ఉండడం చూసి అటువైపు నడిచాడు ఏమి జరిగిందో తెలుసుకుందామనే కుతూహలంతో. 


జనం మధ్యలో చొరబడ్డాడు. నెమ్మదిగా వారిని పక్కకు తప్పించుకుంటూ వెళ్లి చూస్తే, అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి వున్నారు. వాళ్ళు పూర్తిగా తడిసిపోయి వున్నారు. 

 'నీళ్ళల్లో దూకారేమో! ఎందుకో? అనుకుంటుండగా.. 


ఇంతలో.. 

 అక్కడికి పరుగు పరుగునా రకరకాల ఛానల్స్ నుండి మీడియా వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. 

 గబగబా మైక్, కెమెరా సెట్ చేస్కుని నిల్చున్న ఆ ఇద్దరిలో ఎటో దిక్కులు చూస్తున్న అతన్ని వదిలి, ఇంకో అతనితో.. 

"మీరు నీళ్ళల్లోకి దూకి ఎందుకు ఆత్మహత్య చేస్కోవాలనుకున్నారు? అసలు మీ సమస్య ఏమిటి? ప్రేమ విఫలం అయ్యిందా? భార్యతో విభేధాలా? ఆర్థిక సమస్యలా? లేక ఇంకేమైనా ప్రభుత్వం నుంచి కష్టాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? పాపం అతను మిమ్మల్ని నీళ్ళల్లో నుంచి బయటకు తీసి కాపాడాడు కదా! దీనిపై మీ స్పందన ఏంటి?" అంటూ ఊపిరాడకుండా ప్రశ్నలవర్షం కురిపించారు. 


 వాళ్లు వేసిన ప్రశ్నలు అన్నీ విన్నాక అతను ఇలా అన్నాడు.. 

 "అయ్యా! నా పాటికి నేను ఆ కాలువలో ఈదుకుంటున్నాను. అతడే నీళ్ళల్లో పడి కొట్టుకుంటుంటే నేను రక్షించాను నాయనా! అతని వల్ల నా టైం అంతా వేస్ట్ అయ్యింది. ఛ.. ఇప్పుడు మీరు ఇలా వాయిస్తున్నారు" అని అన్నాడో లేదో.. పూర్తిగా వినకుండానే, 

అతన్ని వదిలి వెంటనే మీడియా వాళ్లు అందరూ బిలబిలమని పరుగెత్తుకెళ్లారు దిక్కులు చూస్తున్న అతని వద్దకు. 

 

 అతని పైన ఇవే ప్రశ్నలు గుప్పించారు.. 

 "మీరెందుకు చావాలనుకున్నారు? ప్రేమ విఫలం కారణమా? మీ భార్యతో విభేధాలా? నిరుద్యోగ సమస్యనా? ఆర్ధిక ఇబ్బందులా? లేదంటే ప్రభుత్వం మీకేమయినా అన్యాయం చేసిందా? నిజాన్ని నిర్భయంగా చెప్పండి. మీ తరపున మేమంతా ఉన్నాం. మీకు న్యాయం జరగడానికి పోరాటం చేస్తాం. ధైర్యంగా ఉండండి" అన్నారు.


 ఇలా అతన్ని మాట్లాడనివ్వకుండా అనేసి, మైక్ పట్టుకుని లైవ్ ప్రోగ్రాం చేయసాగాడు. 


 "ఏమి జరిగిందో? అతను ఎందుకు చావాలనుకున్నాడో? ఇప్పుడు కారణాలు తెలుసుకుందాం! రాజకీయ నాయకులు, సైకాలజిస్ట్ లు, ఇంకా విద్యావేత్తలు ఈ సంఘటనను గురించి ఏమంటున్నారో లైవ్ లో చూడండి మా ఛానెల్ లో! కెమెరామెన్ గంగతో రాంబాబు!.. " అలా చెప్పుకుపోతున్నాడు మీడియా అతను. 


అలా ప్రతి ఛానెల్ వాళ్ళు తన జవాబు వినకుండా గందరగోళంగా హడావుడి చేస్తూ వుంటే చిర్రెత్తుకొచ్చిన ఆ రెండోవాడు మీడియా అబ్బాయి చేతులోనుంచి మైక్ బలవంతంగా లాక్కుని గట్టిగా ఇలా అన్నాడు.. 


"అయ్యా! అమ్మా! నేనేమీ చావాలని దూకలేదు. నేను ఈ అంచున నిలబడి సెల్ఫీ తీస్కుంటున్నాను. ఇంతలో ఎవరో నన్ను తోసారు. నేను ఆత్మహత్య చేసుకోవడం కోసం నీళ్లలో దూకానని అనుకుని, ఈయన కూడా దూకి, నన్ను బయటకు లాక్కుని తీసుకొచ్చాడు. నాకు ఈత వచ్చు! ఆ మాట చెప్పినా ఇతగాడు నీటి సౌండ్ లో వినిపించుకోలేదు! 


ఎవరు తోసారో అని నీళ్లలోనుంచి తల పైకి పెట్టి, చూస్తుంటే ఈయన నీళ్లలో నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఆ తోసినవాడు ఎవడో కాని వాడు మీరు అందరూ చేసిన గందరగోళం వల్ల తప్పించుకున్నాడు. నా మాట వినిపించుకోకుండా మీ ధోరణి మీదేనా.. ? వెధవ గోల! ప్రశాంతంగా సెల్ఫీ కూడా తీసుకొనివ్వరు జనాలు!" అని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాడు. 


దాంతో దిమ్మదిరిగిన మీడియా వాళ్ళందరూ సరిగ్గా విషయం తెలియకుండా అత్యుత్సాహం చూపించాము. ఇప్పుడీ న్యూస్ ఏమి చేసుకోవాలి అని బుర్రగోక్కున్నారు. కానీ ఒక మీడియా అబ్బాయి బుర్రలో ఓ ఐడియా ఫ్లాష్ అయ్యింది. వెంటనే అమలులో పెట్టాడు అతడు. ఎటువంటి పరిస్థితిని అయినా తమకు టీఆర్పీ రేటు పెరిగేలా కథనాన్ని వండగల ఆ లేటెస్ట్ కుర్ర జర్నలిస్టు.

"నీటి వంతెన అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదం కొని తెచ్చుకుంటున్న కుర్రకారు!.. " అంటూ కథనం మొదలుపెట్టి మరోలా వ్యాఖ్యానం చేస్తూ టి ఆర్ పి రేటు పెంచుకోవడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నాడు. 


మిగిలిన వాళ్ళు ముందు బుర్ర గోక్కుని తర్వాత వాళ్ళూ ఇలాగే రెచ్చిపోయి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. మొత్తానికి వాళ్లకు ఒక లైవ్ ప్రోగ్రామ్ దొరికింది. మీడియాకి మేత దొరికింది. పనిలేని జనానికి టైం పాస్ దొరికింది. తాము తప్ప ప్రపంచం లో ఉన్నవాళ్లు అందరూ తప్పులు చేసేవాళ్లే అనుకునే లోకోద్ధారకులకు సమాజాన్ని తిట్టిపోయడానికి కావాలిసినంత టాపిక్ దొరికింది. 


దీనిలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే నీళ్ళల్లో పడ్డవాడు అక్కడ అంత అజాగ్రత్తగా నిల్చున్నాడు సెల్ఫీ తీస్కుంటూ. అందువల్ల ఎవరో ఇలా తోయగానే పడిపోయాడు కానీ అదృష్టవశాత్తూ మరోవ్యక్తి చే కాపాడబడ్డాడు. అయినా అతనికి ఈతవచ్చు అని అన్నా, అతను చేసిన పని సరియైనది కాదు!

సమయం, సందర్భం లేకుండా ఎక్కడపడితే అక్కడ ఈ సెల్ఫీ తీసుకునే పిచ్చి వల్ల ఇలాంటివే ఎన్నో రకాల అనర్ధాలు జరుగుతాయి. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు కాపాడడానికి రెడీగా వుండరుగా! తమను తాము కాపాడుకోగలం అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రమాదాల అంచునకు వెళ్లడం సబబు కానేకాదు!


అందుకే.. 

ప్రతి మనిషి తనుచేసే చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్తలు తీసుకుని, ఆచితూచీ అడుగులు వేయాలి! ఎప్పుడూ ఎవరి పైనా డిపెండ్ అవ్వకుండా, తమకు తామే స్వతంత్రంగా ఆలోచించి, మంచి నిర్ణయాలు తీసుకుంటే, అభ్యున్నతి సాధిస్తాడు. జీవితం గందరగోళం చేస్కోడు. 


ఇక మీడియా విషయానికి వస్తే, టీఆర్పీ రేటు పెంచుకోవడం కోసం, తోచిన విధంగా ప్రసారాలు చేయడం, సెన్సేషనల్ అనీ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగేలా డిబేట్లు పెట్టి, రెచ్చగొట్టడం, పనికిమాలిన చెత్త ప్రోగ్రాంలు ప్రసారంచేసి జనాల మెదడు భ్రష్టు పట్టించడం వంటివి చేస్తే, ఎప్పుడో ఒకప్పుడు దాని పర్యవసానం అనుభవించవలసి వస్తుంది. సమాజానికి ఉపయోగకరం అయినవి ప్రసారం చేస్తూ, బాధ్యాతాయుతమైన రంగంగా ఉండాలి!


అప్పుడే ఉపయోగం!

అంతే కదా!


-సుధావిశ్వం





Comments


bottom of page