పెళ్లికానుక
- Srinivasarao Jeedigunta
- Jun 6
- 5 min read
#JeediguntaSrinivasaRao, #Pellikanuka, #పెళ్లికానుక, #JeediguntaSrinivasaRao,#TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Pellikanuka - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 06/06/2025
పెళ్లికానుక - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“ఇదిగో! మీ తమ్ముడి కొడుకు పెళ్ళికి పది వేలు బహుమతి కవర్ యిచ్చి, ఫోటో కూడా దిగాము కదా, మరి మీ తమ్ముడు బావగారు వచ్చి వెళ్లారు కానీ పెళ్ళికొడుకు చేతిలో కవర్ కూడా పెట్టలేదని చాటింపు వేస్తున్నాడు. మీ చెల్లెలు మొగుడు నాతో చెప్పాడు” అన్నాడు భార్య రమణి తో శేఖరం.
“అలా ఎలా చెప్పాడు, మీరు కవర్ పెళ్ళికొడుకు చేతి లో పెట్టడం నేను చూసాను, వాడు ఆ కవర్ పక్కన వున్నవాళ్ళకి యిచ్చాడు” అంది రమణి.
“అది నాకు తెలుసు, నీకు తెలుసు, ఈ మాటలు పుట్టిస్తున్నవాళ్ళని ఎలా ఆపాలి?” అన్నాడు శేఖరం.
“మీరు అనవసరంగా వాళ్ళకి ఫోన్ చేసి గొడవ పెట్టుకోకండి” అంది.
భర్తతో అలా చెప్పినా తను మాత్రం తన చెల్లెళ్ల కి ఫోన్ చేసి, “మేము ఎక్కడికి వెళ్లినా డబ్బు వదుల్చుకుని వస్తాము, అలాంటిది వీడికి ఇవ్వకుండా ఎలా వస్తాము” అంది .
ఆ మాట కాస్తా రమణి తమ్ముడి దగ్గరికి చేరింది.
ఒకరోజు అతను ఫోన్ చేసి, “మాకు వచ్చిన బహుమతులలో మీరు యిచ్చిన కవర్ లేదు అక్కా, అయినా నువ్వు యివ్వలేదని నేను ఏమి అనుకోలేదు. నేను అన్నానని ఎవరు పుట్టించారో” అన్నాడు.
“ఎవ్వరు పుట్టించినా మాట మాకు వచ్చింది తమ్ముడు, మీ బావగారి విషయం నీకు తెలుసుగా, ఫంక్షన్ అంటే చాలు కవర్ రెడీగా పెట్టుకుంటారు. అటువంటిది తనగురించి అనడం భరించలేకపోతున్నారు.”
“మీతో ఎవ్వరు అంటున్నారు అక్కా, వాళ్ళ పేరు చెప్పు నేను అడుగుతాను” అన్నాడు.
“వద్దులే రా, అయిన గొడవ చాలు, ఇంతకీ ఫొటోస్, వీడియో వచ్చాయా” అని అడిగింది తమ్ముడిని రమణి.
“వచ్చాయి అక్కా, బావగారికి పంపుతాను చూడు, ఆల్బమ్ వచ్చిన తరువాత ఇంటికి వచ్చి చూద్దురు గాని” అన్నాడు.
“సరేలే, పెళ్లి అన్న తరువాత మాటలు పుట్టించే వాళ్ళు ఎక్కువ వుంటారు, మనసులో పెట్టుకోకు, పెళ్లి బాగా చేసారు. మీ కోడలు కూడా బాగుంది” అంది తమ్ముడితో ఎందుకైనా మంచిది అని.
“ఎందుకు ఆలా బతిమాలుతున్నావు, తప్పు వాళ్ళది మనది కాదు” అన్నాడు శేఖరం.
“వూరుకోండి, మిమ్మల్ని నమ్ముకుని అందరితో విరోధం పెట్టుకుంటే, రేపు తోరణం కడితే ముందుగా వచ్చి నిలబడేది వాళ్లే” అంది భర్తతో.
“యింకా ఏ తోరణం కడతావు, మిగిలింది ప్రయాణం ఒక్కటే” అంటున్న భర్తతో “ఆపండి అపశకునం మాటలు. యిప్పుడు మనం యింకా జూనియర్ సీనియర్ సిటిజన్స్, మంచి పనులు చేసుకుంటే ఆయువు పెరుగుతుందిట, ఆ పని చేయండి” అంది.
రెండు రోజులు అయిన తరువాత, బావమరిది కి ఫోన్ చేసి “ఆ కొత్త పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు తో పాటు మీరిద్దరూ కూడా రేపు ఆదివారం భోజనం కి రండి. మిమ్మల్ని దీవించాలి” అన్నాడు కే ఏ పాల్ లాగా.
“అలాగే తప్పకుండా వస్తాము, మా కోడలు వంకాయ కూర తినదు” అన్నాడు బావమరిది.
“మీ అక్కయ్య వండితే యిట్టే లాగిస్తుంది లే, మీ అక్కయ్య ఏ కూర వండినా రుచి ఒక్కలాగానే వుంటుంది” అన్నాడు శేఖరం.
వంటగదిలోనుంచి కాఫీ గ్లాస్ తీసుకొని వస్తున్న రమణి మళ్ళీ వెనక్కి పట్టుకొని వెళ్ళిపోయింది భర్త మాట విని.
శనివారం నుంచి పనిమనిషి తో యిల్లు అంతా క్లీన్ చేయించి, మంచం మీద దుప్పట్లు మార్పించింది.
“వాళ్ళు రాత్రి కి కూడా వుంటారా, దుప్పట్లు కూడా మార్పిడి చేస్తున్నావ్” అన్నాడు శేఖరం.
“రోడ్డు మీద తిరిగి వచ్చి, కాళ్ళు కడుగుకోకుండా మంచం ఎక్కి దుప్పట్లు మురికి చేస్తున్నారు మీరు, కొత్త పిల్ల వస్తోంది, ఈ ఒక్కరోజు దుప్పట్లు పాడుచేయకండి. స్నానం చేసే ముందు సాల్ట్ వాటర్ బకెట్ లో వేసుకుని కాళ్ళు పెట్టుకుని కూర్చుని ఫోన్ మాట్లాడుకోండి. కాళ్ళు తెల్లబడతాయి” అంది రమణి.
“మరీ తెల్లాబడితే తెల్ల కామెర్లు అనుకుంటారు చూసిన వాళ్ళు, నాకు యిలా సహజంగా వుండటం యిష్టం” అన్నాడు మంచం మీద కూర్చోబోతో.
“యిప్పుడే చెప్పాను, వెళ్ళి సోఫాలో కూర్చోండి ఆదివారం సాయంత్రం వరకు” అంది రమణి భర్తతో.
పనిమనిషి పక్కున నవ్వి, “సార్ బాగా నవ్విస్తారమ్మ” అంది.
ఆదివారం వచ్చేసింది. తమ్ముడికి పూరీ కూర తయారు చేసింది, యింకో స్టవ్ మీద పాతిక ఇడ్లీలు వచ్చే ఇడ్లీ పాత్ర రెడీగా పెట్టి వుంచింది.
“పూరీ చెయ్యమంటే నూనె వంటలు తినకూడదు అంటావు, యిప్పుడు మీ తమ్ముడికోసం పూరీ చేసావు పర్వాలేదా” అన్నాడు.
“సరే ముందు ఈ రోజైన ప్యాంటు వేసుకోండి, పైజామ వద్దు, రిటైర్ అయిన దగ్గరనుండి ఈ పైజమాలు తప్పా ప్యాంటు వాడటం లేదు. ఏమైనా అంటే ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా అంటారు. మీరు ప్యాంటు వేసుకోవడం కోసం ఫంక్షన్స్ ఎవ్వరు చేస్తారు” అంది రమణి.
“ఆ మాత్రం నాకు తెలియదా, ప్యాంటు, టీ షర్ట్ వేసుకుంటాలే” అని స్నానం కి వెళ్ళాడు.
మేడ మీద పడకగది నుంచి కెవ్వుమని భర్త కేక విని, “జారి పడ్డారా” అంటూ రమణి పైకి పరుగెత్తుకుని వెళ్ళింది.
చేతిలో ప్యాంటు పట్టుకుని చూస్తున్నాడు శేఖరం.
“ఏమైంది ఆలా అరిచారు” అంది.
“యిటు చూడు” అంటూ ప్యాంటు జేబులోనుంచి గులాబీ కవర్ తీసాడు.
“అదేంటి, బహుమతి కవర్ యివ్వలేదా అయితే” అంది తెల్లబోయి రమణి.
“వుండు, పొరపాటు జరిగింది, పెళ్లి రోజునాడు, భోజనాలు లేట్ అవుతాయి, తను వెళ్ళిపోతానని మా తమ్ముడు తన కవర్ నాకు యిచ్చి పెళ్ళికొడుకుకి ఇమ్మన్నాడు.
నువ్వు స్టేజ్ పైనుండి ‘రండి రండి అక్షింతలు వేయాలి’ అని కంగారు పెట్టడంతో నేను వచ్చి నా చేతిలోని మా తమ్ముడు యిచ్చిన కవర్ యిచ్చేసి, మన కవర్ జేబులోనే వుంది అని మరిచిపోయా, ఫోటోల హడావిడి లో గుర్తు రాలేదు” అన్నాడు శేఖరం.
“అంటే యిన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదా” అంది విచిత్రం గా చూస్తో రమణి.
“ఆనాడు ఇంటికి వచ్చి ప్యాంటు మడత పెట్టి అల్మారా లో పెట్టాను, తరువాత పైజమాలే” అన్నాడు.
“పాపం మా తమ్ముడు చెప్పిందే నిజం, అయినా మీ తమ్ముడు ఆ కవర్ తీరు తెన్నూ లేని మీకు యివ్వడం ఏమిటండి. మీరు యిస్తున్న కవర్ మనదే అనుకుని నేను కూడా మా తమ్ముడిని అపార్ధం చేసుకున్నాను” అంది రమణి.
“కొంప ఏం ములిగింది, అప్పుడు యిస్తే ఈపాటికి ఖర్చు పెట్టేసేవాళ్ళు. యిప్పుడు యిద్దాం లే” అన్నాడు భర్త శేఖరం.
“ఛాలెండి, యిప్పుడు కవర్ యిస్తే గుట్టు బయట పడుతుంది. ఏది ఆ కవర్ యిటు ఇవ్వండి. మీరు మాట్లాడకండి, నేను చూసుకుంటాను” అని కవర్ తీసుకుని వెళ్ళింది.
“కింద తలుపు చప్పుడు అవుతోంది. వాళ్ళు వచ్చినట్టున్నారు, త్వరగా ప్యాంటు షర్ట్ వేసుకుని రండి” అంది రమణి.
రాముడు మంచి బాలుడు అన్నట్టుగా భార్య చెప్పినట్టుగా తయారై కిందకి వచ్చి “తిరుపతి లో దర్శనం బాగా జరిగిందా” అన్నాడు పెళ్ళికొడుకు తో.
“బాగానే అయ్యింది మామయ్య, మీరు కానుకగా యిచ్చిన పదివేలతో తనకి కంచి పట్టు చీర కొన్నాను” అన్నాడు బావమరిది కొడుకు.
ఆ మాటకి తెల్లబోయడు శేఖరం. మరి జేబులో వున్న ఈ కవర్ ఎక్కడిది అనుకుంటూ.
“అదేంటి మామయ్య అలా వున్నారు, వొంట్లో బాగుండలేదా” అంటూ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని చూసాడు డాక్టర్ పెళ్ళికొడుకు.
అటు బావమరిది కూడా ‘అయితే బావగారు యిచ్చిన కవర్ వాడు నాకు ఇవ్వకుండా పెళ్ళానికి యిచ్చాడన్నమాట’ అనుకున్నాడు.
తేలు కుట్టిన దొంగలు లాగా మాట్లాడకుండా వుండిపోయారు శేఖరం, బావమరిది.
విషయం తెలియని రమణి పెళ్ళికొడుకుకి పెళ్లికూతురికి బట్టలు మీద చెరో అయిదు వేలు పెట్టి యిచ్చింది.
ఏమనాలో తెలియక ‘అక్షింతలు అక్షింతలు’ అన్నాడు కంగారు గా శేఖరం.
ఒకసారి అబ్బాయికి వీడియో కాల్ చేసి కొత్త జంటని చూపించండి అంది రమణి.
అలాగే అని కొడుక్కి ఫోన్ చేసి వీడియో కాల్ లో వాళ్ళతో మాట్లాడించి, వాళ్ళని పంపించి, భార్యకి డబల్ పేమెంట్ గురించి చెప్పాలా వద్దా అనుకుంటూ వుంటే కొడుకు నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది.
“అబ్బాయి.. ఏమిటో అర్ధం కావడం లేదు. ప్యాంటు జేబులో గిఫ్ట్ కవర్ అలాగే వుంది, వాడేమో ‘మామయ్య.. మీరు యిచ్చిన పదివేల కానుక తో పెళ్ళాన్నికి పట్టు చీర కొన్నాను’ అంటున్నాడు, డబ్బు ఇవ్వలేదని అమ్మ పదివేలు వాళ్ళకి బట్టలతో పెట్టి మరీ యిచ్చింది” అన్నాడు.
కొడుకు ఒక్క నిమిషం ఆగి, నవ్వుతో “నాన్నా! మీకు నేను వాడి పెళ్ళికి వుండలేను, మీరు వెళ్ళండి, మంచి బట్టలు వేసుకుని వెళ్ళండి అని చెప్పి, మీరు వేసుకోవలిసిన బట్టలు తీసి టేబుల్ మీద పెట్టి, ‘యిదిగో పదివేలు పెట్టిన గిఫ్ట్ కవర్ మీ ప్యాంటు జేబులో పెడుతున్నా మర్చిపోకుండా ఇవ్వండి’ అని చెప్పి నేను వచ్చేసాను. చివరికి చెప్పినవి మర్చిపోయి బాబాయ్ మీకు యిచ్చిన కవర్ యిచ్చి వచ్చేసారు అన్నమాట. ముందు యిహనుంచి ఇయర్ ఫోన్స్ వాడకండి చెవుడు వచ్చినట్టు వుంది” అన్నాడు.
“మరి యిప్పుడు డబల్ పేమెంట్ అయ్యింది ఎలారా” అన్నాడు.
“పోనీలే డాడీ, వాడు డాక్టర్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మామయ్యా అంటూ వస్తున్నాడు, వాడికి యిస్తే నష్టం లేదులే” అన్నాడు.
“అమ్మకి ఈ విషయం తెలుసా?” అన్నాడు.
“యింకా తెలియదు” అన్నాడు శేఖరం.
“అయితే అన్నీ మర్చిపోతున్నట్టే ఈ విషయం కూడా మర్చిపోండి” అన్నాడు కొడుకు నవ్వుతు.
“యిటువంటివి మరుపు రాదు, అయినా ప్రయత్నం చేస్తా” అని ఫోన్ కట్ చేసాడు శేఖరం.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments