బ్రహ్మానందమూ – బంపర్ ప్రైజూ
- Pamarthi Vira Venkata Sathyanarayana
- Jun 21
- 6 min read
#Thirumalasri, #తిరుమలశ్రీ, #BrahmanandamuBumperPize, #బ్రహ్మానందమూబంపర్ప్రైజూ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

Brahmanandamu Bumper Pize - New Telugu Story Written By Thirumalasri
Published In manatelugukathalu.com On 21/06/2025
బ్రహ్మానందమూ – బంపర్ ప్రైజూ - తెలుగు కథ
రచన: తిరుమలశ్రీ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ముప్పయ్యేళ్ళ బ్రహ్మానందానికి లాటరీ పిచ్చి. ఓ ప్రైవేట్ కంపెనీలో నెలకు ఇరవైవేల ఉద్యోగం, ఓ పెళ్ళాం, ఇద్దరు పిల్లలూను అతనికి.. అన్ని లాటరీల టికెట్సూ కొంటుంటాడు. తన టికెట్ కి బంపర్ ప్రైజ్ తగిలినట్టూ, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయినట్టూ కలలు కంటుంటాడు.
దాని వెనుక ఓ చిత్రమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అయిదేళ్ళు వెనక్కి తొంగిచూస్తే..
అప్పటికి బ్రహ్మానందం ఇంకా బ్రహ్మచారి. కొత్తగా ఉద్యోగంలో చేరాడు.. ఓసారి బామ్మతో కలసి గుడికి వెళ్తే, అక్కడ ఓ కొండదొర తగిలాడు.
బ్రహ్మానందం ముఖాన్ని అన్ని డైమెన్షన్స్ లోనూ చూసి, “త్వరలోనే ధనసునామీ నిన్ను క్రమ్ముకోబోతోంది. లక్ష్మీదేవి నిన్ను కరుణించబోతోంది.. ఇది కొండదేవత వాక్కు!” అని చెప్పాడు.
“కొండదొరలు చెప్పేవి నిజమవుతాయి“ అంది బామ్మ.
కొండదేవత పూజ కోసమని వేయి రూపాయలు తీసుకున్నాడు కొండదొర.
కొండదొర చెప్పిన ‘ఐశ్వర్యం’ అయితే రాలేదు కానీ, ‘ఐశ్వర్య’ అన్న పేరుగల యువతి మాత్రం భార్యగా వచ్చింది బ్రహ్మానందానికి. కొండదొర పలుకులను కొట్టిపారేయలేక, ఆశతో లాటరీ టికెట్స్ కొనడం ఆరంభించాడు. సుమారు మూడేళ్ళుగా అలా కొంటూనేవున్నాడు. ఒక్క ప్రైజూ తగల్లేదు.. ఐతే, ఆ మధ్య ఒకటి, రెండు అంకెలలో తప్పిపోతోంది కోటిరూపాయల బంపర్ ప్రైజ్!
లాటరీ టికెట్స్ ని కొనడానికి వారం, వర్జ్యం వగైరాలు చూడాలంది అతని బామ్మ. అందువల్ల పేరున్న ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి ముహూర్తం పెట్టించుకు రాసాగాడు బ్రహ్మానందం. అదే ముహూర్తంలో టికెట్స్ కొనసాగాడు. అయినా, నోటి వరకు వచ్చిన ముద్ద చేజారిపోయినట్టు, ఒకటి రెండు అంకెలలో ప్రైజులు అతన్ని ఊరించి వెలివేసేవి. లేదా, అతను కొన్న టికెట్ నంబర్లు వేరే రాష్ట్రపు లాటరీలో ప్రైజు గెలుచుకునేవి!
దాంతో హతాశుడయిన బ్రహ్మానందం మళ్ళీ జ్యోతిష్కుణ్ణి ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు.
“నేను పెట్టిన ముహూర్తాలు బలమైనవే. అందుకే నువ్వు కొన్న టికెట్లు ఏదో ఒక రాష్ట్రపు లాటరీలో బహుమతులను గెలుచుకుంటున్నాయి. ఎప్పుడు ఏ రాష్ట్రపు టికెట్ కొనాలో చెప్పడానికి ఇది చిలకజోష్యం కాదు. ముహూర్తపు బలాలను నిర్ణయించే శాస్త్రం!” అన్నాడు జ్యోతిష్కుడు.
అతను చెప్పినదాంట్లో ఓ అంశం బ్రహ్మానందాన్ని ఆకట్టుకుంది. ‘ఎప్పుడు ఏ రాష్ట్రపు టికెట్ కొనాలో చిలకజోష్యం చెబుతుందన్నమాట!’ అనుకున్నాడు.
వెంటనే, చిలకజ్యోతిష్కుడు ఎక్కడ ఉంటాడోనని ఊరంతా తిరిగి, చివరకు ఓ చెట్టు క్రింద చిలకను పెట్టుకుని గోళ్ళూ గిల్లుకుంటూ ఖాళీగా కూర్చున్న ఓ జ్యోతిష్కుణ్ణీ వెదికి పట్టుకున్నాడు అతను.
తన ‘సమస్యను’ వివరించి ఆ నెల ఏ రాష్ట్రపు లాటరీ టికెట్ ని కొనాలో చెప్పమన్నాడు.
చిలుక జ్యోతిష్కుడు ముఖం నిండా నవ్వు పులుముకుని, “మనుషులు చెప్పలేని వాటిని జంతువులు తమ సంకేతాలతో తెలియపరుస్తాయి. ఉదాహరణకు, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు జంతువులు తమ ప్రవర్తనతో రానున్న ప్రమాదాన్ని సూచిస్తాయి. వాటిని మనం గుర్తించాలంతే!” ఉపోద్ఘాతంగా అన్నాడు.
“నా చిలకకు పాతికేళ్ళ అనుభవం ఉంది. దాని పలుకుకు తిరుగుండదు”.
అది ‘స్పెషల్ ప్రెడిక్షన్’ అంటూ వేయి రూపాయలు వసూలు చేసాడు అతను. ‘రాబోయే కోట్లలో వేయి రూపాయలు సముద్రంలో కాకిరెట్టాలాంటివి’ అనుకున్న బ్రహ్మానందం, బ్రహ్మానందంగా అడిగిన సొమ్ము చెల్లించాడు.
చిలకను పంజరం లోంచి బయటకు విడిచిపెట్టి, తనదైన ధోరణిలో దానితో మాట్లాడాడు జ్యోతిష్కుడు. ‘క్యాట్ వాక్’ చేస్తూ, చాప మీద పేర్చబడియున్న కార్డుల వద్దకు వెళ్ళింది చిలక.
“బాబుగారి కోరిక బోధపడిందిగా? బాగా ఆలోచించి చెప్పు..” అన్నాడు అతను.
చిలక కార్డులను ముక్కుతో తాకి వాటిని వదిలేస్తూంటే. బ్రహ్మానందంలో టెన్షన్ పెరిగిపోసాగింది. చినరకు అది ఓ ఆకుపచ్చ కార్డును తీసి యజమాని ముందు పడేసి, తిరిగి పంజరంలోకి వెళ్ళిపోయింది.
ఆ కార్డును తీసుకుని చదివిన జ్యోతిష్కుడు వెలిగే ముఖంతో, “ఆకుపచ్చ! అంటే హరితదనంతో కళకళలాడే రాష్ట్రపు టికెట్ కొంటే నీ కోరిక ఫలిస్తుందని చిలక చెబుతోంది” అన్నాడు.
“బాబుగారు కోటీశ్వరులు అయ్యాక ఈ చిలకను మరచి పోకూడదు!”
అయోమయంగానే అక్కణ్ణుంచి కదలాడు బ్రహ్మానందం.
బాగా ఆలోచించి జ్యోతిష్కుడు చెప్పిన సుమూహార్తానికి కేరళ రాష్ట్రపు టికెట్ కొన్నాడు. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ గా చెప్పబడే ఆ రాష్ట్రం అన్ని కాలాలలోనూ పచ్చదనంతో కళకళలాడుతుంటుంది మరి!
అయితే, ఫలితాలు వచ్చాక కానీ తెలియలేదు బ్రహ్మానందానికి తాను పప్పులో అడుగేసినట్టు!
ఆ నెలలో నేపాల్ దేశపు లాటరీ టికెట్ కి వచ్చింది బంపర్ ప్రైజ్!
కేరళ కంటే నేపాల్ మరింత పచ్చదనంతో విలసిల్లుతూంటుందన్న సంగతిని విస్మరించినందుకు తనను తానే తిట్టుకున్నాడు. చిలక కరెక్ట్ గానే ప్రెడిక్ట్ చేసినా, తన అవగాహనాలోపం దెబ్బతీసిందనుకున్నాడు.
బ్రహ్మానందం విలవిలలాడిపోతూంటే, అతని అవస్థ చూళ్ళేని ఓ స్నేహితుడు అతనికి ‘అంకెల బాబా’ గురించి చెప్పాడు.
‘అంకెల బాబా’ కి మంచి పేరుంది. గుర్రప్పందేలలో ఏ నంబరు గుర్రం గెలుస్తుందో.. లాటరీ టికెట్స్ లో ఏయే అంకెల కాంబినేషన్ ఉంటే ప్రైజ్ వస్తుందో.. సైంటిఫిక్ గా లెక్కలు కట్టి చెబుతాడు అంకెల బాబా. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది.
ఇన్నాళ్ళూ ఆ విషయం తనకు చెప్పనందుకు స్నేహితుడి పైన కోప్పడ్డాడు బ్రహ్మానందం. స్నేహితుడు అతన్ని ‘అంకెల బాబా’ వద్దకు తీసుకువెళ్ళాడు.
“ధనసునామీ నన్ను ముంచేస్తుందని కొండదొర చెప్పి అయిదేళ్ళయిపోయింది. ఈమధ్య బంపర్ ప్రైజులు ఒకటి, రెండు అంకెలతో చేజారిపోతున్నాయి,” అంటూ తన గోడు చెప్పుకున్నాడు బ్రహ్మానందం.
‘అంకెల బాబా’ నడివయస్కుడు. కాషాయపురంగు పట్టుపంచె, దాని పైన అంగవస్త్రం ధరించాడు. నుదుటను విభూతిరేఖలు, నడుమ పెద్ద కుంకుమబొట్టూ పెట్టుకున్నాడు. మధ్యపాపిడి తీసాడు.
అతని చుట్టూ ల్యాప్ టాప్, సెల్ ఫోన్స్, ఐ-పాడ్స్, క్యాల్ క్య్యులేటర్స్, అబెకస్, వగైరా ఆధునిక ఎలెక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఓ వైట్ బోర్డ్, స్కెచ్ పెన్స్ కూడా ఉన్నాయి.
“డోంట్ వర్రీ. నువ్వు కోటీశ్వరుడివి అయ్యే తరుణం ఆసన్నమయింది. అందుకు నిదర్శనం- నీకు నా దగ్గరకు రావాలన్న బుద్ధి పుట్టడమే!” అన్న అంకెల బాబా పలుకులతో బ్రహ్మానందంలో ఉత్సాహం ఉరకలు వేసింది.
బ్రహ్మానందం ముత్తాత పుట్టిన తేదీని అడిగాడు బాబా. బ్రహ్మానందం తెల్లమొగం వేసాడు.
“పరవాలేదు. తెలియనివాటికి దేవుడి అంకె తీసుకుందాం. మాస్టర్ డిజిట్ అన్న మాట అది” అంటూ క్యాల్ క్యులేటర్ లో ఏదో నంబరు ఫీడ్ చేసాడు బాబా.
ముత్తమామ్మ, తాత, బామ్మ, తండ్రి, తల్లి, మేనత్తల పుట్టిన తేదీలకు కూడా దేవుడి అంకె వేయబడింది. అనంతరం బ్రహ్మానందం పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, వివాహమైన తేదీ.. భార్య పుట్టిన తేదీ.. పిల్లల పుట్టిన తేదీలు నమోదుచేసి, ఏవేవో లెక్కలు కట్టాడు బాబా.
బ్రహ్మానందం ఉంటున్న ఏరియా వార్డ్ నంబరు, పోస్టల్ పిన్ కోడ్ నంబరు, అతను నివసిస్తున్న కాంప్లెక్స్ నిర్మించిన తేదీ, అందులోని ఫ్లోర్స్, ఫ్లాట్స్, అతను ఉంటున్న ఫ్లాట్ నంబర్లు తీసుకున్నాడు.
బ్రహ్మానందం థర్డ్ ఫ్లోర్ లో ఉంటున్నాడు. క్రింద నుండి అతని ఫ్లోర్ కి ఉన్న మెట్ల సంఖ్య కావలసి వచ్చింది. భార్యకు ఫోన్ చేసి, వెంటనే ఆ మెట్లు లెక్కపెట్టి చెప్పమన్నాడు బ్రహ్మానందం. తికమకపడినా, భర్త చెప్పినట్టు చేసిందామె.
అనంతరం బ్రహ్మానందం తన వద్దకు రావడానికి ఇంటి నుండి బయలుదేరిన సమయం, అందుకు పట్టిన సమయం, అతను అక్కడికి చేరుకున్న సమయం, తన వంతు వచ్చే వరకు వేచియున్న సమయం కూడా అడిగి నోట్ చేసుకున్నాడు బాబా.
ఆ సంఖ్యలన్నిటినీ వైట్ బోర్డ్ మీద రాసి ఏవేవో లెక్కలు కట్టిన బాబా చిన్నగా పెదవి విరిచాడు. , “ఇంపెర్ ఫెక్ట్ నంబర్ వస్తోంది. దీనికి యాంటీ లాగ్ – 3,” అన్నాడు సాలోచనగా.
బ్రహ్మానందం అయోమయంగా చూసాడు.
“ఓకే. మీ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య ఎంత? చివరిసారి ఎన్నికలు జరిగిన తేదీ ఏమిటి? అందులో పోల్ అయిన ఓట్ల సంఖ్య ఎంత? నెగ్గిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని, మెజారిటీ ఎంత?” అనడిగాడు బాబా మళ్ళీ.
‘బోడిగుండుకీ, బట్టతలకూ ముడిపెట్టినట్టు’.. తన సమస్యకు, వాటికీ సంబంధం ఏమిటో బోధపడకపోయినా, గూగుల్ సెర్చ్ చేసి చెప్పాడు బ్రహ్మానందం.
బాబా మళ్ళీ ఏవేవో లెక్కలు కట్టాడు. “ఇంటీజర్ 13 వచ్చింది. యూక్లిడియన్ థియరీ ఆఫ్ నంబర్స్ ప్రకారం ఇది ఇంపెర్ ఫెక్ట్ డివిజర్..” స్వగతంలా అన్నాడు. “ఆల్ రైట్. మీ ఇంట్లో కుక్క ఉందా?” అనడిగాడు.
“లేదు. మా పక్కింటివాళ్ళకుంది” అన్నాడు బ్రహ్మానందం.
“అది ఎప్పుడైనా మీ ఇంటికి వస్తుందా?”
“కాలకృత్యాలు తీర్చుకోవడానికి మా ఇంటికే వస్తుందది” అన్నాడు బ్రహ్మానందం, చిన్నగా పళ్ళు కొరుక్కుంటూ.
“ఓకే. దాని తోక పొడవెంత ఉంటుంది?” అని బాబా అడగడంతో.. ఆలోచించి, ఉజ్జాయింపుగా చెప్పాడు బ్రహ్మానందం.
“అది రోజుకు ఎన్నిసార్లు మొరుగుతుంది?” అడిగాడు బాబా.
ఇరవయ్ నాలుగ్గంటలూ మొరుగుతూనే ఉంటుందని చెప్పాడు బ్రహ్మానందం. బాబా ఏదో సంఖ్య వేసాడు.
‘అపసవ్యంగా ఉన్న సంఖ్యలను సవ్యం చేసి అనుకూలంగా మార్చడానికి మరికొంత ఎక్సర్ సైజ్ చేయకతప్పదు’ అని స్వగతంలా అనుకుంటూ.. బ్రహ్మానందం యొక్క ఫేస్ బుక్ ఫ్రెండ్స్ సంఖ్య, గత వారం దినాలలో అతని పోస్ట్ లకు వచ్చిన ‘లైక్స్’ సంఖ్యా అడిగాడు.
ప్రస్తుతం నడుస్తూన్న లాటరీ ‘నేపాల్’ దని చెప్పడంతో, ఆ దేశపు జనాభా సంఖ్య, ఆ దేశపు రాజు వయసు, అతనికి ఎంతమంది పెళ్ళాలో, పిల్లలో అడిగాడు. గూగుల్ గురువును ఆశ్రయించాడు బ్రహ్మానందం.
మరో గంటసేపు ఆ అంకెలతో కుస్తీపట్టి ‘పెర్మ్యుటేషన్-కాంబినేషన్’ తో చివరకు కొన్ని అంకెలను కూర్చాడు అంకెలబాబా.
“భళా, వత్సా! ఇదీ నీ గెలుపుగుర్రం! అంటే నీ అదృష్టసంఖ్యలన్నమాట. వీటిలో ఏ మూడు అంకెలైనా చివరలో వరుసగా ఉండే టికెట్ ని తీసుకున్నావంటే లాటరీలో బంపర్ ప్రైజ్ నీదే” అన్నాడు నవ్వుతూ. “అప్పుడే నీలో కోటీశ్వరుడు కనిపిస్తున్నాడు నాకు!”
ఆ పలుకులకు బ్రహ్మానందం ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అంకెల బాబాకి ఫీజుగా ఐదువేలు సమర్పించుకుని, స్నేహితుడితో హుషారుగా బయటకు నడచాడు. మనసు గాలిలో తేలిపోతూ గుర్రపుస్వారీ చేస్తున్నంత హాయిగా ఉంది అతనికిప్పుడు..
‘అంకెల బాబా’ చెప్పిన కాంబినేషన్ తో కూడిన టికెట్స్ కోసం ఊళ్ళో ఉన్న లాటరీ టికెట్లు అమ్మే షాపులన్నీ గాలించాడు బ్రహ్మానందం. అతనికి కావలసిన టికెట్స్ దొరకలేదు. చివరగా పాతబస్తీకి వెళ్ళాడు, అక్కడ అలాంటి షాపులు చాలానే ఉంటాయని తెలిసి.
నాలుగైదు షాపుల్లో చూసాడు. తనకు కావలసిన కాంబినేషన్ దొరకలేదు.
ఏం చేయాలా అని దిక్కులు చూస్తూంటే, ‘లోపల గల్లీలో ఓ షాపు ఉన్నదనీ, అక్కడ కొన్న టికెట్స్ కి తరచు ప్రైజులు తగులుతుంటాయనీ’ చెప్పారెవరో,
ఆ షాపును వెదుక్కుంటూ వెళ్ళాడు అతను. షాపు చిన్నదే అయినా అక్కడ జనం బాగానే ఉన్నారు. ఎగబడి వివిధ లాటీరీల టికెట్స్ ను కొంటున్నారంతా.
షాపులో టికెట్స్ అమ్ముతూన్న వ్యక్తిని చూసి చిన్నగా ఉలికిపడ్డాడు బ్రహ్మానందం.
ఖాకీ షార్ట్సూ, లైట్ బ్లూ కలర్ టీ షర్టూ తొడుక్కున్నాడు. మధ్యపాపిట తీసిన మధ్యవయస్కుడు.
“రండి బాబూ, రండి. నేపాల్ లాటరీ బంపర్ డ్రా రేపే. అయిదు కోట్లు. మీ అదృష్టం పరీక్షించుకోండి..” అనరుస్తూ, చకచకా టికెట్స్ అమ్ముతున్నాడు అతను.
‘అంకెల బాబా!’ అన్న పలుకులు అప్రయత్నంగా బ్రహ్మానందం నోటినుండి వెలువడ్డాయి.
బ్రహ్మానందం వంక చూసాడు అతను.
“అంకెల బాబా! మీరు.. ఇక్కడ.. ఇలా లాటరీ టికెట్లు అమ్ముతూ..!?” అయోమయంగా అడుగాడు బ్రహ్మానందం.
అతను గతుక్కుమన్నా, తమాయించుకుని చిరునవ్వు నవ్వేసాడు. “ఇదే నా వృత్తి!” అన్నాడు మెల్లగా.
“మరి.. విన్నింగ్ నంబర్స్.. గెలుపుగుర్రాలు..??” సందేహం వెలిబుచ్చాడు బ్రహ్మానందం.
“అది సైడ్ బిజినెస్” చెప్పాడు ‘అంకెల బాబా’.
బ్రహ్మానందాన్ని ఇంకా అయోమయం వదల్లేదు. “అదృష్టసంఖ్యలను అంత కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయగలిగినవాడివి.. నువ్వే ఓ లాటరీ టికెట్ కొనుక్కుని కోటీశ్వరుడివి కావచ్చుగా? ఇలా టికెట్లు అమ్ముకోవలసిన అగత్యం నీకేమిటి?” అన్నాడు.
అతని వంక వెర్రివాణ్ణి చూసినట్టు చూసాడు ‘అంకెల బాబా’– “అత్యాశతో కష్టార్జితాన్ని లాటరీ టికెట్స్ మీద వృథా చేసుకోవడానికి నేను మూర్ఖుణ్ణి కాదు!” అన్నాడు అదోలా నవ్వుతూ.
************
తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."
Comments