ఆకాశ వీధిలో
- Srinivasarao Jeedigunta
- Jun 25
- 5 min read
#JeediguntaSrinivasaRao, #AkasaVeedhilo, #ఆకాశవీధిలో, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguStory, #తెలుగుకథ

Akasa Veedhilo - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 25/06/2025
ఆకాశ వీధిలో - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“అమ్మాయి రాధికా.. రేపు ఆఫీసు కి సెలవు పెట్టగలనంటే, మా ఫ్రెండ్ చెప్పిన సంబంధం వాళ్ళని నిన్ను చూసుకోవడానికి రమ్మంటాను. ఏదైనా నీ ఇష్టమే నాకు అంగీకారం” అన్నాడు రమణారావు కూతురు తో.
గోంగూర వలుస్తున్న భార్య సంధ్య “ముందు దానికి ఈ సంబంధం ఇష్టమా లేదా అడగకుండా వాళ్ళని పిలవనా అని అడుగుతారేమిటి అర్ధం లేకుండా, రాధి నువ్వు చెప్పు, అబ్బాయి గురించి నాన్నగారు చెప్పినవి నీకు నచ్చాయా” అంది.
తండ్రి మంచం మీద కూర్చొని, “నిన్న మీరు చెప్పింది ఏది సరిగ్గా వినలేదు నాన్నా, అబ్బాయి పైలట్ అన్నది తెలిసింది” అంది.
“ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పైలట్. మంచి ఉద్యోగం,, రేపు నువ్వు కూడా అతనితో పాటు ప్రపంచం అంతా తిరిగిరావచ్చు. అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రే కొడుకుని పుట్టపర్తి లో సత్యసాయి స్కూల్లో చదివించాడు, అక్కడ చదివిన పిల్లాడి అలవాట్లు మంచివే ఉంటాయి, మాకు నువ్వు ఒక్కదానివే, మాతో ఉంటున్నావు కాబట్టి అప్పుడప్పుడు నీ జీతం డబ్బులు మాకోసం ఖర్చు చేసినా రేపు నీ పెళ్లి అయిన తరువాత మా బ్రతుకు మేము సుఖంగా బతకగలము.”
“సరేలే నాన్న, రేపు సాయంత్రం ఎర్లీగా వస్తాను, మీరు వాళ్ళని అయిదు గంటలకు రమ్మని పిలవండి” అంది రాధిక.
“మా తమ్ముడిని కూడా పిలవండి, మొహమాటం లేకుండా అన్నివిషయాలు అడుగుతాడు” అంది సంధ్య.
“అదేదో నువ్వే పిలువు, మీ తమ్ముడేగా వస్తాడులే” అన్నాడు రమణారావు.
జానకిరామయ్య గారి ముద్దుల కొడుకు రవికాంత్. ఆరో తరగతి నుంచి పుట్టపర్తి స్కూల్ లో చదివించాడు. తన ఉద్యోగం లో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండటం తో కొడుకు చదువు పాడుకాకూడదు అని తను నమ్మే బాబా గారి స్కూల్ లో చదివించాడు. పెరిగి పెద్దయిన తరువాత ఐఐటీ లో సీట్ సంపాదించి కూడా విమానం నడపాలి అనే కోరిక బలంగా వుండటంతో పైలట్ ట్రైనింగ్ తీసుకుని మంచి ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం సంపాదించాడు. ‘ఎందుకురా హాయిగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చెయ్యక ఈ విమానాల పిచ్చి’ అని చెప్పి చూసాడు తప్పా కొడుకుని బలవంతం చెయ్యలేదు జానకిరామయ్య గారు. కొడుకు సంతోషమే తన సంతోషం అనుకున్నాడు.
సాయంత్రం ఎస్ రావ్ నగర్ లో వున్న రమణారావు ఇంటికి వెళ్లారు జానకిరామయ్య, రవికాంత్.
“మీతో ఆడవాళ్లు రాలేదా అమ్మాయి తో మాట్లాడటానికి” అని అడిగాడు రమణారావు.
“లేదండి, మొదట్లో మా అబ్బాయి ని ఒక్కడిని వెళ్లి చూసి రమ్మన్నాను, మా అబ్బాయి సెలక్షన్ మీద నాకు పూర్తి నమ్మకం వుంది” అన్నాడు జానకిరామయ్య సోఫాలో కూర్చుంటో.
“నమస్కారం అండి, నేను పెళ్లికూతురి మేనమామని. నా పేరు కుమార్” అని పరిచయం చేసుకున్నాడు.
స్నాక్స్, కాఫీ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టింది పెళ్లికూతురు తల్లి సంధ్య. స్నాక్స్ ప్లేట్ చెరొకటి జానకిరామయ్య గారికి, రవికాంత్ కి అందించాడు రమణారావు.
“మీరు అబ్బాయిని పైలట్ గా చెయ్యాలి అని ఎందుకు అనుకున్నారు. ఐఐటీ లో ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళచ్చు కదా” అని అడిగాడు.
“మీ ప్రశ్న అర్ధం అయ్యింది. వాడు చిన్నప్పటినుండి చదువు ప్రశాంతనిలయం లో చదువుకున్నాడు, చదువులో వందికి ఒకటి రెండు మార్కులు మాత్రమే తగ్గేవి. అయితే వాడికి పైలట్ ఉద్యోగం అంటే ఇష్టం. నాకు భయం. అయితే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మా అబ్బాయి కూడా మంచి వాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు, యిప్పటికి సంధ్యవంధానం ఏదేశం లో వున్నా చేస్తాడు” అన్నాడు జానకిరామయ్య.
“అబ్బే ఆ ఉద్దేశ్యం తో అడగలేదు, ఫ్యాన్ కింద కూర్చుని చేసే ఉద్యోగాలు అంటే ఇష్టపడే ఈ రోజుల్లో యింత చదువు చదివి ఆకాశం లో తిరిగే ఉద్యోగం ఎందుకు ఇష్టపడ్డాడో అని అంతే” అన్నాడు రమణారావు.
యింతలో రాధిక వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆ గదిలో ఆమె రాకతో వెలుగులు జిమ్మినట్టు అయ్యింది.
రవికాంత్ గొంతు సవరించుకుని, “మీకు నా ఉద్యోగం గురించి చెప్పాలి, నాకు నెలకు 15 రోజులు ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఉద్యోగం, మిగిలిన రోజులు యింట్లో వుంటాను. ఏడాదికి ఒకసారి ఫ్యామిలీ ని కూడా నాతో తీసుకుని వెళ్లి సెలవు వున్న ఆ పదిహేను రోజులు ఆ దేశంలో ఉండవచ్చు. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆశాంతి తో ఉండకూడదు, ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలకి నాదే బాధ్యత.
అందుకే నన్ను చేసుకోబోయే ఆమె నాకు ఎటువంటి టెన్సన్స్ కలిగించకూడదు. నేను డ్యూటీకి వెళ్లకుండా వుండే మిగిలిన 15 రోజులు కావాలంటే రాసి రంపాన పెట్టుకోవచ్చు” అన్నాడు నవ్వుతో.
“మీరు నాకు నచ్చారు, మీకు నేను, నా ఉద్యోగం నచ్చితే తెలియచేయండి” అని లేచి, “నాన్నా బయలుదేరుదాం” అన్నాడు.
“అక్కయ్యా, బావగారు.. అబ్బాయి ముక్కుసూటిగా మాట్లాడాడు. అయితే పదిహేను రోజులు గాలిలో ప్రయాణం చేసే సంబంధం మన రాధిక కి అవసరమా, ఎలాగో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వుంది. యింకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మనకి దానికి ప్రశాంతం గా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇహ మీరు ఎలా అంటే ఆలా” అన్నాడు బావమరిది కుమార్.
“నువ్వు ఏమంటావ్?” అని కూతురిని అడిగాడు రమణారావు.
“నాకు పైలట్ ఉద్యోగం అంటే గౌరవం. కానీ మామయ్య చెప్పినట్టుగా నెలకు పదిహేను రోజులు టూర్ లో అన్నదే కొద్దిగా ఆలోచించాలి. సాయంత్రం కి ఇంటికి చేరితే బాగుంటుంది” అంది రాధిక.
“పిచ్చమోహమా.. మీ నాన్న రిటైర్ అయ్యిందగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండి, కుర్చీలోనుంచి లేవకుండా అన్నిపనులు నా చేత చేయిస్తున్నారు. పదిహేను రోజులు యింట్లో ఉండి బాగా చూసుకునేటట్లున్నాడు, అతను డ్యూటీకి వెళ్లిన రోజులు మా దగ్గరి ఉండవచ్చు ఆలోచించు” అంది సంధ్య.
“మధ్యలో నా గొడవ ఎందుకు, దానికి యింట్లో మామగారిని చూసుకోవలిసిన బాధ్యత ఉంటుంది, మన ఇంటికి ఎలా వస్తుంది” అన్నాడు.
“అందుకే బావ.. యిన్ని సమస్యలు వున్నప్పుడు మనకెందుకు ఈ సంబంధం” అన్నాడు బావమరిది. “సరేలెండి, రేపు వాళ్ళకి విషయం తెలియచేస్తాను” అన్నాడు రమణారావు.
“చూసావా.. పైలట్ ఉద్యోగం అబ్బాయి అనగానే ఆడపిల్లలు భయపడిపోతున్నారు పెళ్లిచేసుకోవడానికి. అయితే ఏ ఉద్యోగం లో అయినా ప్రమాదం జరగవచ్చు. రిక్షా నడిపే వాడి దగ్గర నుంచి ఎవ్వరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కదా” అన్నాడు కొడుకు రవికాంత్ తో జానకిరామయ్య గారు.
“ఎవ్వరి భయం వాళ్ళది నాన్న, ఆడపిల్ల.. అందులో ఒక్కతే కూతురుని గాలిలో తిరిగే నాకు యివ్వాలి అంటే భయం ఉండటం సహజమే. అయినా నా పెళ్లి గురించి తొందర ఏముంది నాన్న, అయితే మిమ్మల్ని కనిపెట్టి చూసుకోవడానికి కోడలు వస్తుంది లేదంటే నేనే మిమ్మల్ని చూసుకుంటాను” అన్నాడు రవికాంత్.
రెండు మూడు సంబంధాలు వచ్చి పోయే సరికి జానకిరామయ్య గారికి దిగులు పుట్టింది. కొడుకు పెళ్లి తను చూడగలనా లేదా అని.
“అబ్బాయి.. నువ్వు ఏ ఎయిర్ హోస్టెస్ నైనా చూసి పెళ్లి చేసుకోరా, అప్పుడు ఇద్దరిది ఓకే ఉద్యోగం కావడం తో అభ్యంతరం వుండదు” అన్నాడు.
***
లండన్ వెళ్లే విమానంకి బోర్డింగ్ మొదలైంది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కావడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పిల్లలని పరాయి దేశం పంపుతున్నాము, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రులని వదిలి వెళ్లిపోతున్నాము, మళ్ళీ వాళ్ళని ఎలా చూస్తామో అని పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటో సాగనంపుతున్నారు.
ఫ్లైట్ మెల్లగా కదిలి ఒక్కసారిగా వేగం అందుకుని గాలిలోకి లేచింది. ప్రయాణికులు తమ తమ సీట్స్ కి అలవాటు అయ్యి, తమకి ఎదురుగా వున్న స్క్రీన్ మీద తమకి నచ్చిన చానెల్స్ పెట్టుకుంటున్నారు. ఫ్లైట్ బయలుదేరి పదినిమిషాలు అయ్యింది.
“పదిహేను గంటల ప్రయాణం అంటే కష్టమే, మన హనీమూన్ కు ఏ దుబాయ్ పెట్టుకుంటే బాగుండేది” అన్నాడు సంతోష్ తన భార్య రాధిక తో.
“లండన్ అయితే బాగుంటుంది అని చాలా మంది అంటారు, ఏదైనా మాట్లాడండి టైము తెలియకుండా” అంది కొత్తగా పెళ్లి అయిన వారం రోజులకే హనీమూన్ కి బయలుదేరిన రాధిక. రమణారావు తనకు తెలిసిన ట్రావెల్ ఆఫీస్ వాళ్ళతో కూతురు అల్లుడికి ఎటువంటి యిబ్బంది కలగకుండా లండన్ లో అన్ని ఏర్పాట్లు చేసాడు.
ఉన్నట్టుండి ఫ్లైట్ లో ఏసీ ఆగిపోయింది, టీవీ స్క్రీన్ కూడా ఆగిపోయింది, ఫ్లైట్ కుదుపులతో కదులుతోంది. ఎయిర్ హోస్టెస్ లందరూ అటు ఇటు కంగారుగా పరుగులు తీస్తున్నారు. ఏమైంది అంటూ ప్రయాణికులు అరుపులు, కేకలు. రాధిక గుండెల్లో దడ అయిపొయింది. పెళ్లి అయ్యి వారం లోపే మా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయా అని భర్తని గట్టిగా పట్టుకుని ఆంజనేయ దండకం చదువుతోంది.
అప్పుడు కో పైలట్ అనౌన్స్ చేసాడు, విమానం ఇంజిన్స్ కి ఆయిల్ అందటం లేదు అని, విమానం కొన్ని నిమిషాలలో కూలిపోతుంది అని, సీనియర్ పైలట్ రవికాంత్ చివరి ప్రయత్నం గా ఆయిల్ సరపరా పైప్ రిపేర్ చెయ్యటానికి చూస్తున్నారని.. ప్రయాణికులు అందరూ తమ ఇష్ట దైవంని ప్రార్ధన చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు.
ప్రయాణికుల హాహాకారాలు చేస్తున్నారు. విమానం కుదపులతో క్రిందకి దిగిపోతోంది. రాధిక భర్తని పట్టుకుని ఏడుస్తోంది. అంతే ఎంతో వేగం తో క్రిందకి కూలిపోతున్న విమానం ఒక్కసారిగా పైకి ఎగిరింది. ఏసీ, లైట్స్ పనిచెయ్యడం మొదలుపెట్టాయి.
“పైలట్ రవికాంత్ గారు ఎంతో నేర్పుతో ఫ్యూయల్ పైప్ ని సరిచేసారు, విమానం ఈ స్థితిలో ముందుకు వెళ్లడం మంచిది కాదు. అందుకే తిరిగి ఢిల్లీ కి వెళ్లిపోతున్నాము, దైవ ప్రార్దన కంటిన్యూ చెయ్యండి, విమానంని రవికాంత్ సేఫ్ ల్యాండింగ్ చేస్తారు” అని విని ఊపిరి పిలుచ్చుకున్నారు.
ఢిల్లీ విమానాశ్రయం లో ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు కంగారుగా కిందకి దిగి అక్కడే నుంచున్న పైలట్ రవికాంత్ కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. భారంగా దిగిన రాధిక ప్రయాణికుల మధ్యలో నిలబడి వున్న రవికాంత్ ని గుర్తించింది. భర్తని తీసుకుని జనం ని తప్పించుకుంటో రవికాంత్ ముందుకు వచ్చి “కృతజ్ఞతలు, మాకు మళ్ళీ జన్మనిచ్చారు” అంది.
రాధిక పక్కన వున్న అతనిని చూసి విషయం గ్రహించి “మీకు పెళ్లి శుభాకాంక్షలు” అన్నాడు. “పదండి, టీవీ లో వార్త చూసి మీ వాళ్ళు కంగారు తో ఎయిర్పోర్ట్ కి వచ్చి వుంటారు. వాళ్ళని కలవండి ముందు” అంటూ ముందుకు నడిచాడు.
కూతురు అల్లుడిని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు రాధిక తల్లిదండ్రులు. తమని ఈ గండం నుంచి రక్షించింది మన ఇంటికి పెళ్లిచూపులకి వచ్చిన పైలట్ రజనీకాంత్, అతని నేర్పరితనంతో ఫ్లైట్ ని సేఫ్ గా ల్యాండ్ చేసాడు అని తల్లిదండ్రులకి చెప్పింది.
రాధిక మేనమామ కుమార్, జానకిరామయ్య గారి యింట్లో కాఫీ తాగుతో “రేపు ఆదివారం మీ అబ్బాయిని తీసుకుని మా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చేయండి. ఈ సారి అంతా శుభంగా జరుగుతుంది” అన్నాడు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


@t.s.sbhargavateja6196
•3 hours ago
Kadha chala bavundi Srinivas Rao garu. 👌👌👌
@getrags555
• 3 hours ago
Hats off to Pilots