top of page

వీభోవరా - పార్ట్ 6

Updated: 7 hours ago

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika


Veebhovara - Part 6 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 03/07/2025

వీభోవరా - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. 

ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. 

కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. రామశర్మ, మాధవి దంపతులకు ఆడ, మగ కవలలు పుడతారు. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ,  కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. ఆధ్యాత్మిక గురువుల గురించి, స్వాతంత్య్ర సమర యోధుల గురించి విద్యార్థులకు చక్కగా వివరిస్తారు రామశర్మ గారు.


ఇక వీభోవరా - పార్ట్ 6 చదవండి.. 


విజయశర్మ, కాశ్యపశర్మలకు పదిహేడు, పదహారు సంవత్సరాలు. మాధ్యమిక విద్యాపాఠశాల చదువు పూర్తయింది. ఆ రోజుల్లో వారు ప్రతి సంవత్సరం కేవలం చదువులోనే కాకుండా అన్ని ఆటల్లో గొప్ప ప్రావీణ్యత సంపాదించారు. ప్లస్ టు చదువున ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.


ఆశ్చర్యకరమైన విషయం ఇరువురికి స్టేట్ ఫస్ట్ మార్కులు. వారి ఫొటోలు ప్రక్క ప్రక్కన వాటి దిన పత్రికలలో ప్రచురించారు. ఇరువురినీ గురించి ఆ పత్రికల వారు గొప్ప ప్రశంసలు వ్రాశారు.

స్కూలు యాజమాన్యం సభను ఏర్పాటు చేసి రామశర్మ మాస్టారు గారికి సన్మానం చేశారు. విజయ్, కాశ్యప్‍లను గురించి గొప్పగా మాట్లాడారు. ఇరువురికీ ఎన్నో బహుమతులు స్కూల్లో లభించాయి. ఉత్తమ విద్యార్థులన్న పేరును సంపాదించారు. ఆ ఇరువురికి, రామశర్మ మాస్టారుగారికి ఎంతో ఆనందం. సభ ముగిసి ఇంటికి వెళ్ళిన విజయ్, కాశ్యప్‍లకు మాధవి వాకిట దిష్టి తీసింది. ఇరువురు నొసటన ప్రీతిగా ముద్దులు పెట్టింది.


అప్పటికి భాస్కర్ శర్మ, రుద్రమల వయస్సు పదకొండు సంవత్సరాలు. ఇరువురూ ఆరవ తరగతి చదువుతున్నారు. విజయ్, కాశ్యప్ శర్మలను వారిరువురూ ఎంతగానో పొగిడారు. విజయ్, కాశ్యప్‍లు వారిని ప్రక్కన కూర్చొన పెట్టుకొని హోం వర్కు చేయించేవారు. 


చిన్నతనం నుండీ, రుద్రమకు విజయశర్మ అంటే ఎంతో గౌరవం, అభిమానం. చిన్నవారిరువురూ నవ్వుతూ పెద్దవారికి కరచాలనం చేశారు.


ఆరోజు ఇంట్లో రామశర్మ ఘనంగా పూజ చేశారు. మాధవి పిండివంటలతో నైవేధ్యాన్ని సిద్ధం చేసింది. తన స్వహస్తాలతో విజయ్, కాశ్యప శర్మలకు తలంటి స్నానం చేయించింది మాధవి. నలుగురు పిల్లలూ రామశర్మ, మాధవీల సమక్షంలో దైవాన్ని ధ్యానించారు.


ఆ క్రింద సంవత్సరంలో రామశర్మ వారిరువురికీ ఉపనయాలు జరిపించారు. మాతాగాయత్రి మంత్రోపదేశం చేశారు. అందరూ కలిసి పూజానంతరం ఆనందంగా భోంచేశారు. ఆ సాయంత్రం పున్నమి వెన్నెలలో వాకిటి ముందు రాత్రి భోజనం చేశారు.


అంతకుముందు రెండు వారాల క్రిందట రుద్రమ యుక్త వయస్కురాలయింది. బంధుమిత్రుల సమక్షంలో రుద్రమ యుక్త వయస్సు వేడుకలను రామశర్మ, మాధవీలు ఘనంగా జరిపారు.

పున్నమి రాత్రి భోజనానంతరం రామశర్మ, విజయ్, కాశ్మప్‍లను దగ్గరకు పిలిచారు.


"విజయ్!..."


"నాన్నగారూ!"


"నీవు ఏ పై చదువును చదవాలనుకొంటున్నావు?"


"నేను ఎం.ఎ ముగించి పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రజలకు సేవ చేయాలనుకొంటున్నాను. పేదలకు అండదండగా వుండాలనుకొంటున్నాను. నీతి, న్యాయం, నిజాయితీలను రక్షించాలనుకొంటున్నాను" ఎంతో భావావేశంతో చెప్పాడు విజయశర్మ.


రామశర్మ, మాధవీల వదనంలో చిరునవ్వు....

"నాయనా కాశ్యప్!....."


"ఏమిటమ్మా!....."


"నీవు ఏం చేయాలనుకొంటున్నావు?...." అడిగింది మాధవి.


"విజయ్ నిర్ణయమే నా నిర్ణయం!" చిరునవ్వుతో చెప్పాడు కాశ్యప్.


"ఇరువురూ పోలీసులు అవుతారా!" ఆశ్చర్యంతో అడిగాడు రామశర్మ.


"అవును నాన్నా!.... ప్రజలను అన్ని విధాలా అదుకొని రక్షించగలిగిన ఉపాధి నాన్నా అది!... ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ చేయగలిగిన వృత్తి కదా నాన్నా అది. అందుకే నాకు ఆ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం" నవ్వుతూ విజయ్ ముఖంలోకి చూచాడు కాశ్యప్.


విజయ్ తన చేతిలోకి కాశ్యప్ చేతిని తీసుకొన్నాడు. ఇరువురూ ఆనందంగా నవ్వుకొన్నారు.

“చిన్ననాటి నుంచి మీరిరువురూ ఒకేమాట, ఒకే పద్ధతిలో పెరిగారు. మీ భావి జీవితంతో కూడా మీరు ఇలాగే కలిసి మెలసి మీరిరువురూ ఒకే తత్వంతో ఆ శ్రీరామ లక్ష్మణుల్లా వర్దిల్లాలని నా ఆశయం. మనిషి కేవలం తన స్వార్థం కోసం బ్రతకడం జీవితం కాదు. సాటి పదిమందికి ఉపయోగపడే రీతిగా జీవిత గమనాన్ని సాగించడం మంచిగుణం. అదే మానవత్వం. సర్వకాల సర్వావస్థల యందున, మీ ఇరువురికీ నా శుభాశీస్సులు" చిరునవ్వుతో ఆనందంగా చెప్పాడు రామశర్మ.


విజయ శర్మ, కాశ్యపశర్మలు రామశర్మ, మాధవీల పాదాలను తాకారు.

ఆ దంపతులు వారిరువురినీ హృదయపూర్వకంగా దీవించారు. 


మరుదినం....

రామశర్మ, విజయశర్మ, కాశ్యపశర్మలతో ప్రక్కన వున్న రాష్ట్ర రాజధాని నగరాలకు వెళ్ళాడు.

వారి మిత్రుడు, కాలేజీ ప్రిన్సిపాల్ మహమ్మద్ గారిని కలిశాడు. పిల్లలను మహమ్మద్ గారికి పరిచయం చేశాడు. విజయశర్మ, కాశ్యపశర్మలు వినయంగా ప్రిన్సిపాల్ గారికి నమస్కరించారు. 

తాను వచ్చిన పనిని రామశర్మ మహమ్మద్‍కు తెలిపి, పిల్లల సర్టిఫికేట్స్ ను, బహుమతులను చూపించాడు. మహమ్మద్ గారు చాలా సంతోషించారు. ఇరువురికీ బి.ఏ లో సీట్స్ ఇస్తానని మాట ఇచ్చారు.


రామశర్మ, విజయ శర్మ, కాశ్యపశర్మలకు పరమానందం. రామశర్మకు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు మురళీమోహన్, సీనియర్ తెలుగు లెక్చరర్ తటస్థపడ్డాడు. ఇరువురూ సంతోషంతో కరచాలనం చేసుకొన్నారు. ఒకరి యోగ క్షేమాలు ఒకరు అడిగి తెలుసుకొన్నారు.


రామశర్మ, పిల్లలను మురళీమోహన్‍కు పరిచయం చేశాడు....


"రాము నాకు గంగా, గౌరి ఇరువురు ఆడపిల్లలు. ఈ కాలేజీలోనే చదువుతున్నారు. నా భార్య హైస్కూలు హెడ్ మాస్టర్ శ్యామల. గంగ ఇంటర్ ఫస్ట్ ఇయర్. గౌరి ఇంటర్ సెకండ్ ఇయర్" చిరునవ్వుతో తన కుటుంబ విషయాలను రామశర్మకు తెలియజేశాడు మురళీమోహన్. 


మిత్రుని వద్ద శలవు తీసుకొని రామశర్మ, విజయశర్మ, కాశ్యప శర్మలు గ్రామానికి తిరిగి వెళ్లారు.

మురళీ మోహన్ గారికి సొంత ఇల్లు రెండు అంతస్థులతో ఉంది. మేడమీద వున్న ఇంజనీరు రామారావు గారు వారం రోజుల క్రిందట విజయవాడకు ప్రమోషన్ మీద వెళ్ళిపోయారు.

ప్రస్తుతం ఆ పోర్షన్ ఖాళీ. మురళీ మోహన్ గారికి మనస్సున ఒక ఆలోచన కలిగింది.


ఆ పోర్షన్‍లో రామశర్మ తన కుమారులను అద్దెకు ఉంచితే తన ఆదాయం యధా ప్రకారంగా వస్తుందని భావించాడు. విజయ్, కాశ్యప్‍లు కాలేజీలో మూడు సంవత్సరాలు చదవాలి కాబట్టి తన ఇంటి విషయాన్ని గురించి మురళీమోహన్ రామశర్మకు ఫోన్ చేసి ఖాళీగా ఉందని చెప్పాడు.

రామశర్మకు పరమానందం. ఇల్లును గురించి వెదకటం తప్పినందుకు, ముఖ్యంగా మురళీ మోహన్ తన మిత్రుడైనందుకు సంతసించి, విషయాన్ని తన అర్థాంగి మాధవికి చెప్పాడు.


మాధవికి ఎంతో ఆనందం.


రెండు రోజుల్లో కాలేజీ తెరుస్తారనగా, రామశర్మ దంపతులు విజయ్, కాశ్యప్‍లతో నగరానికి వచ్చి, మురళీమోహన్ ఇంట్లో పాలుకాచి ఆ పోర్షన్‍లో చేరారు. మరుదినం వూరికి తిరిగి వెళ్ళేముందు.....

"మురళీగారూ! పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళను కొంచెం గమనించి వుండండి. మీరు అదే కాలేజీలో పనిచేస్తున్నారు కాబట్టి కాలేజీలో కూడా వారిరురి మీద ఒక కన్ను వేసి ఉంచండి. నా పిల్లలను గురించి నేను చెప్పడం బాగుండదు. కొద్దిరోజుల్లో మీకే తెలుస్తుంది. అయినా మీరు పెద్దవారు కదా కొంచెం గమనిస్తూ వుండండీ. మీకు తోచిన మంచి సలహాలను ఇవ్వండి." ప్రాధేయపూర్వకంగా చెప్పారు రామశర్మ. 


"రామూ!..... మీరు నాకు అంతగా చెప్పాలా!.... నేను చూచుకొంటానుగా. మీరు నిర్భయంగా వూరికి బయలుదేరండి." చిరునవ్వుతో అభిమాన పూర్వకంగా చెప్పాడు మురళీమోహన్.


"ధన్యవాదాలు మురళీగారూ!....." కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించాడు రామశర్మ.


కాలేజీకి వెళ్ళి ఫీజులు, మురళిగారికి వారు చెప్పినట్లుగా మూడు మాసాల అద్దె పద్దెనిమిది వేలు చెల్లించాడు రామశర్మ.


విజయశర్మ, కాశ్యపశర్మలు, రామశర్మ, మాధవీలు బస్టాండుకు వచ్చారు.


"నాయనా!.... విజయ్, నీ తమ్ముడిని గురించి నీకు తెలిసిందే. వాడు మహా పిరికి. భయస్తుడు. వాణ్ణి జాగ్రత్తగా చూచుకో. ఇల్లు, వంట, కాలేజీ తప్ప ఎక్కడా తిరగవద్దు. చదువుమీద మన వూర్లో, మన ఇంట్లో ఎలా సాధన చేసేవారో, అలాగా ఇక్కడా చదవండి. మాస్టార్స్ అందరిచేత మంచి పిల్లలనిపించుకోవాలి. అందరితో కలిసిమెలసి సఖ్యతతో మెలగాలి. సోమవారం, శనివారం ప్రక్కనే వున్న రామాలయానికి, శివాలయానికి వెళ్ళి మీకు ఎప్పుడు అండదండగా వుండాలని జగన్మాతాపితలను వేడుకోండి. టైం ప్రకారం భోజనం, నిద్ర, వ్యాయామం, యోగ, ఆసనాలు నిర్వర్తించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త" అనునయంగా చెప్పాడు రామశర్మ.


"నాన్నా!.... నా దగ్గర మీరు వంట నేర్చుకొన్నారుగా, కావలసిన వాటిని వండుకొని ఆనందంగా ఆరగించండి. హైస్కూల్లో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారో, ఆ కాలేజీలో కూడా అలాంటి మంచి పేరును సంపాదించాలి. జాగ్రత్త" ప్రీతిగా చెప్పింది తల్లి మాధవి.


"అలాగే అమ్మా!....." అన్నాడు విజయ్ శర్మ.


"అమ్మా!... నాకు అన్న.... అన్నకు నేను. మాకేం భయం లేదమ్మా. నెలకు ఒకసారి వూరికి వస్తాముగా!" నవ్వుతూ చెప్పాడు కాశ్యపశర్మ.


"చింతకాయ పచ్చడి, గోంగూర, మామిడికాయ వూరగాయ జాడీల్లో వున్నాయి. చేయిపెట్టకుండా స్పూన్‍తో వేసుకోండి. సరేనా! వారం రోజుల తరువాత మీ నాన్నగారిని పంపుతాలే. వారితో పచ్చళ్ళు పంపిస్తాను."


"అలాగే అమ్మా!.... మీరు జాగ్రత్త. రుద్రమను భాస్కర్‍ను బాగా చదువుకొనమని చెప్పండి అమ్మా!..."

అన్నాడు విజయ్.


"అలాగే నాన్నా!...."


"అమ్మా!.... నాన్నా!.... సీట్లు ఫుల్ అయిపోయాయి బస్సు ఎక్కండి" చెప్పాడు కాశ్యపశర్మ.


రామశర్మ ఇరువురి భుజాలపై చేతులు వేసి "మీరు చదవనున్న కాలేజీలో కలవారు వుండవచ్చు, పేదవారూ వుండవచ్చు. అందరినీ సమదృష్టితో చూడాలి. సత్యం, ధర్మం, నీతి, న్యాయాన్ని ఎప్పుడూ తప్పకూడదు. మీరు మంచిగా వర్తిస్తూ, అందరిచేత మంచివారనిపించుకోవాలి. మితభాషిగా వుండడం ఎప్పుడైనా, ఎవరి విషయంలోనైనా చాలా ఉత్తమం. ఈ కాలేజీలో కో-ఎడ్యుకేషన్. ఆడపిల్లలూ చదువుతున్నారు. వారిని గౌరవించడం, అభిమానించడం, ఏదైనా సాయం కోరితే చేయడం ఎవరివల్లనైనా వారికి కష్టనష్టాలు కలిగితే, అలాంటి సన్నివేశాలు మీరు చూస్తే, ఆడబిడ్డలకు అండగా నిలబడి వారిని ఆదుకోవడం, మీ ధర్మంగా భావించాలి. ఆచరించాలి. 


ఇవన్నీ నేను మీకు ఇంతకు ముందు చెప్పిన విషయాలే. మీకూ తెలిసిన విషయాలే. మరలా ఈనాడు ఎందుకు చెప్పానంటే..... మొన్నటి వరకూ మీ జీవితం మీ అమ్మ నా ముందు సాగింది. రేపటి నుండి మీకై మీరే అవసరానికి తగిన రీతిగా మార్గాన్ని ఎన్నుకొని ప్రశాంతంగా ముందుకు సాగిపోవాలి. అర్థం అయిందా!....." చిరునవ్వుతో రామశర్మ ఇరువురి ముఖాల్లోకి చూచాడు.


మౌనంగా ఇరువురూ తలలూ ఆడించారు.


"నాయనా!.... విజయ్!....."


"ఏమ్మా!...." తల్లిని సమీపించాడు విజయ్.


తన నోటిని విజయ్ చెవి దగ్గరకు చేర్చిన మాధవీ....


"నాన్నా!...... క్రింద ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారు మిమ్మల్ని చూచిన చూపు నాకు నచ్చలేదు. మీరు ఆ పిల్లలతో ఎప్పుడూ మాట్లాడకండి. ఒకవేళ అవసరం ఏర్పడితే.... ముక్తసరిగా వారివైపు చూడకుండా, అడిగిన దానికి క్లుప్తంగా జవాబు చెప్పి వెళ్ళిపోండి. జాగ్రత్త!...."


"ఏంటి మాధవీ!... ఆ దేవ రహస్యం!...." నవ్వుతూ అడిగాడు రామశర్మ.


"అహా!..... ఏమీ లేదు లేండి. ఏదో వాడి మధ్య నా మధ్య మాట!..." తలాడిస్తూ చెప్పింది మాధవి.


డ్రైవర్ బస్ వైపుకు నడిచాడు. రామశర్మ, మాధవీలు బస్సు ఎక్కారు. బస్సు కదిలింది. ’టా....టా’ చేతులు పైకెత్తి చెప్పారు ఆ అన్నా తమ్ముడు.

ఆ పైవారం... రామశర్మ గారు రిటైర్ అయ్యారు. వ్యవసాయ పనులను చూచుకోసాగారు



=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page