top of page
Original.png

వీభోవరా - పార్ట్ 8

Updated: Jul 20, 2025

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Veebhovara - Part 8 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 15/07/2025

వీభోవరా - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. 


ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. 


కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. రామశర్మ, మాధవి దంపతులకు ఆడ, మగ కవలలు పుడతారు. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. ఆధ్యాత్మిక గురువుల గురించి, స్వాతంత్య్ర సమర యోధుల గురించి విద్యార్థులకు చక్కగా వివరిస్తారు రామశర్మ గారు.

కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను తమ ఇంటికి భోజనానికి పిలుస్తారు మురళీమోహన్ దంపతులు.




ఇక వీభోవరా - పార్ట్ 8 చదవండి.. 


విజయశర్మ, కాశ్యపశర్మలు కాలేజీలో చేరి ఆరునెలలు గడిచాయి. ఈ అన్నాతమ్ముల ప్రతిభ లెక్చరర్స్ కు, సాటి విద్యార్థినీ విద్యార్థులకు కొంతవరకూ అర్థం అయ్యింది. వారి తెలివితేటలతో వారు అందరిచేత ఆకర్షింపబడ్డారు.


మాస్టర్ దృష్టిలో సాటి విద్యార్థుల దృష్టిలో వీరికి గౌరవం మర్యాద ఏర్పడ్డాయి.


గడచిన ఆరునెలల కాలంలో నాలుగుసార్లు రామశర్మ, రెండు సార్లు మాధవి రుద్రమ, భాస్కర్‍లు వీరి వద్దకు వచ్చారు. అందరూ ఆనందంగా రెండురోజులు గడిపి వారు గ్రామానికి వెళ్ళిపోయారు. ఆరునెలల కాలేజీ శిక్షణలో అన్నాతమ్ములు జీవిత విధానాన్ని క్రమబద్ధంగా సాగించడం బాగా అలవరచుకొన్నారు.


విజయశర్మ అంటే అందరికీ భయం గౌరవం. కాశ్యపశర్మ అంటే అందరికీ ప్రీతి, చనువు.

రామశర్మ, తన పిల్లలను గురించి మురళీ మోహన్ గారితో, మాధవి వారి సతీమణి శ్యామల గారిని అడిగి తెలుసుకొన్నారు. ఆ దంపతులు, ఈ అన్నాదమ్ములను గురించి చెప్పిన మాటలను విన్న రామశర్మ, మాధవి, రుద్రమ, భాస్కర్ శర్మలు ఎంతగానో సంతోషించారు.


ప్రిన్సిపాల్ మహమ్మద్ గారు అందరు లెక్చరర్లు వీరిరువురి తెలివితేటలకు ఎంతగానో ఆనందించేవారు. ఇరువురినీ ఆదరాభిమానాలతో ప్రీతిగా చూచేవారు.


గంగకు... కాశ్యప్‍కు పరిచయం పెరిగింది. కానీ కాశ్యప్‍ను ఎప్పటికప్పుడు విజయశర్మ హెచ్చరిస్తూ... కర్తవ్యాన్ని వారి లక్ష్యాన్ని గుర్తు చేస్తూ వుండేవాడు. విజయశర్మ మాట కాశ్యప్‍కు వేదవాక్యం. మిగతా కాలేజీ విద్యార్థులు, విద్యార్థినీలు వీరిని గురించి వారి వారి ఇండ్లలో తల్లితండ్రులు గొప్పగా చెప్పేవారు. 


కాలేజీ ఫీజ్ కట్టవచ్చిన పిల్లల తల్లిదండ్రులు వీరిని కలిసికొని అభినందించి, ‘మా పిల్లలనూ మీలా తయారు చేయండి బాబూ!’ అని కోరేవారు చదువుమీద గౌరవాభిమానాలు కల తల్లిదండ్రులు.


ఆకారణంగా దాదాపు చదువు పట్ల బాగా ఆసక్తి కలిగిన కొంతమంది పిల్లలు వీరివద్దకు చేరి, వారికి అర్థం కాని విషయాలను వీరినుండి తెలుసుకొని వెళుతుండేవారు. ఆ రీతిగా అన్నాతమ్ములిరువురూ కాలేజీలో మంచిపేరును సంపాదించుకొన్నారు, చదువులోనూ అన్ని ఆటల్లోనూ.


 బిట్రగుంట భీమారావు.... 

ఎం.ఎల్.ఎ వారి ఒక్కగానొక్క కుమారుడు దుర్గారావు, కూతురు సింధూ. 


దుర్గారావు రెండుసార్లు బి.ఎ ఫెయిలయ్యి, తండ్రి వ్యాపారాలను చూచుకొంటున్నాడు. సింధుకు విజయశర్మ అంటే వీరాభిమానం. పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఎంతో గారాబంగా చూచి తండ్రి.... తల్లి... అన్నయ్య... సింధూ పెంకిగా తయారైంది. 

"ఏంది తల్లీ ఈ మార్కులు?..." ఆశ్చర్యంతో అడిగాడు భీమారావు. 


"నాన్నా! నాకు లెసన్స్ సరిగా అర్థం కావడం లేదు" విచారంగా చెప్పింది సింధు.


"ట్యూషన్‍కు వెళతావా!...."


"ఆఁ....."


"ఏ లెక్చరర్ దగ్గరికి?..."


"లెక్చరర్ కాదు!...."


"మరి ఎవరే?" ఆశ్చర్యంగా అడిగింది తల్లి కావేరి.


"ఇదిగో చూడమ్మా! నీవు బాగా చదవాలి. మంచి మార్కులతో బి.ఎ, ఎం.ఎ పాస్ కావాలి. నా రాజకీయ వారసురాలివి కావాలి. నీకు ఏ లెక్చరర్ కావాలో చెప్పు."


"అది లెక్చరర్ కాదని అందండి!" విసుగ్గా చెప్పింది కావేరి.


"మరెవరు?"


"విజయశర్మ!..."


"వాడెవడు?...." ఆశ్చర్యంతో అడిగాడు భీమారావు.


"స్టూడెంట్, జీనియస్!..."


"జీనియస్సా!...." ఆశ్చర్యంతో అడిగాడు భీమారావు.


"అవును నాన్నా!.... అన్ని సబ్జెక్టుల్లో అతనిదే ఫస్టు మార్కు!..." అందంగా కళ్ళు తిప్పుతూ చెప్పింది సింధూ.


"ఏవే విన్నావా!...."


"ఆ నాకు చెవుడు లేదుగా వినపడింది!...."


"తనతో చదువుకొనే ఒక అబ్బాయటనే!" ఆశ్చర్యంతో అన్నాడు భీమారావు.


"అవునండీ!.... నాకు అర్థం అయ్యింది. మీకే ఇంకా అర్థం కానట్టు వుంది!...." విసుగ్గా చెప్పింది కావేరి.


"అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే?"


"ప్రిన్సిపాల్ మహమ్మద్‍కు ఫోన్ చేసి, విషయం చెప్పి, ఆ అబ్బాయిని మన ఇంటికి పంపమనండి" చెప్పింది కావేరి.


భీమారావు ఆశ్చర్యంతో భార్య ముఖంలోకి చూచాడు. 


’ఓరి నా తండ్రీ!, నీవు నన్ను ఈ కావేరి కొంపకు ఆస్థికోసం ఇల్లరికం పంపావు. పెండ్లి అయ్యి పాతిక సంవత్సరాలయింది. కూతురు, కొడుకు, భార్య ఒకటైనారు. వారు అడిగింది ఆట పాడింది పాట. ఈ తానా తందానా దరువు వేయలేకే చచ్చిపోతున్నా ఓ నా నాయనో!...’ విచారంగా గతాన్ని గురించిన ఆలోచన.


"ఏమండీ!...." గద్దించినట్లు పిలిచింది.


ఉలిక్కిపడి "ఆఁ..... కావేరీ!....."


"మహమ్మద్‍కు మీరు ఫోన్ చేస్తారా!.... నేను చేయనా!...."


"ఒసే కావేరీ! మరీ నా పరువు తియ్యవాకవే, నేనే చేస్తాను" విచారంగా భీమారావు ప్రిన్సిపాల్ మహమ్మద్‍కు ఫోన్ చేశాడు. విషయాన్ని చెప్పి విజయశర్మను తన ఇంటికి పంపమని చెప్పాడు.

ఫోన్ కట్ చేసి....

"ఆ అబ్బాయిని మన ఇంటికి వెంటనే పంపుతాడట!....." అన్నాడు భీమారావు.


తల్లీ కూతుళ్ళ వదనాల్లో ఆనందం.

సమయం సాయంత్రం ఐదుగంటలు. కాలేజీ ప్యూన్ భాషా విజయశర్మను గ్రౌండులో కలిశాడు. భాషా సయ్యద్ బావమరిది.

"విజయ్!...." పిలిచాడు భాషా.


"ఆఁ.... ఏం భాషా మామ!..." చిరునవ్వుతో అడిగాడు విజయ్.


"ప్రిన్సిపాల్ గారు నిన్ను పిలుస్తున్నారు అల్లుడూ!"


"నన్నా!...."


"అవును...."


"విషయం ఏమిటి మామా!..."


"నాకు తెలిదయ్యా!..."


"సరే పద..."


ఇరువురూ ప్రిన్సిపాల్ గదిని సమీపించారు. కొంచెం దూరంలో వున్న కాశ్యప్ వారిని అనుసరించాడు.


భాషా తలుపు తెరిచుకొని ప్రిన్సిపాల్‍ గారితో విజయ్ వచ్చిన విషయాన్ని చెప్పాడు. వారు విజయ్‍ని గదిలోనికి పంపమన్నారు. భాషా మాట ప్రకారం విజయ్ ప్రిన్సిపాల్ గదిలో ప్రవేశించాడు.


"గుడ్ ఈవెనింగ్ సార్!" వినయంగా కుడిచేతిని పైకెత్తాడు.


ఏదో ఫైల్‍ను చూస్తున్న ప్రిన్సిపాల్ మహమ్మద్ గారు దాన్ని మూసి విజయ్ ముఖంలోకి చూచాడు.

"కూర్చో విజయ్!..."


"ఫరవాలేదు సార్!.... పిలిచారట!...."


"అవునయ్యా!..."


"విషయం ఏమిటి సార్!..."


"నీవు ఎం.ఎల్.ఎ భీమారావు పేరు విన్నావా!"


"విన్నాను సార్!"


"వాళ్ళ అమ్మాయి సింధూ మన కాలేజీలోనే చదువుతూ ఉంది."


"అలాగా సార్!..."


"అవును... ఆమెకు నీవు ట్యూషన్ చెప్పాలట. వారు నిన్ను వారి ఇంటికి పంపమన్నారు విజయ్.

నీవు వారి ఇంటికి వెళ్ళాలి."


"సార్!...." ఆశ్చర్యంతో అడిగాడు విజయ్.


"ఏమిటి విజయ్!...."


"నేను వారి అమ్మాయికి ట్యూషన్ చెప్పాలా!..."


"అవును. ముందు వెంటనే నీవు వెళ్ళి వారిని కలవాలి!"


విజయశర్మ మౌనంగా వుండిపోయాడు.

"విజయ్!..."


"సార్!..."


"నీవు వారి ఇంటికి ఇప్పుడు వెళ్ళాలి."


"ఇప్పుడా సార్!...."


"అవును వెంటనే!...."


"సరే సార్!...."


ప్రిన్సిపాల్ మహమ్మద్ గారు ఎం.ఎల్.ఎ గారి ఇంటి విలాసాన్ని వ్రాసి విజయ్‍కు అందించారు.

ఆ కాగితాన్ని తీసుకొని విజయ్...


"సరే సార్!... నేను వెళ్ళి వస్తాను. గుడ్ ఈవెనింగ్ సార్!.." విజయ్ గదినుండి బయటికి నడిచాడు. 


"అన్నా!..... విషయం ఏమిటి?...." ఆత్రంగా అడిగాడు కాశ్యప్.


"మనం ఇప్పుడు ఎం.ఎల్.ఎ భీమారావు గారి ఇంటికి వెళ్ళాలి." ప్రిన్సిపాల్ గారు తనకు చెప్పిన విషయాన్ని విజయ్ కాశ్యప్‍కు తెలుయజేశాడు.


"ఆ పిల్లకు చాలా పొగరు అన్నా!..." అన్నాడు కాశ్యప్.


"ఆ విషయం నీకు ఎలా తెలుసు...?"


"ఆమె వాలకాన్ని చూచి గ్రహించాను అన్నా!..."


"అంటే నీకు ఆమె బాగా తెలుసన్నమాట!...." ఆశ్చర్యంగా కాశ్యప్ ముఖంలోకి చూచాడు విజయ్.


"అందరూ అంటుంటే విన్నానన్నా!..."


"సరే పద..."


కాలేజీ ప్రాంతం నుండి ఎం.ఎల్.ఎ గారి ఇల్లు ఒక కిలోమీటర్.


ఇరువురూ వారి ఇంటిని సమీపించారు. గేట్‍కీపర్‍కి తన పేరును చెప్పాడు విజయ్. అతను లోనికి వెళ్ళి పదినిముషాల్లో గేటు దగ్గరకు వచ్చాడు.


"సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి..." గేటును తెరిచాడు గేట్ కీపర్.


విజయ్, కాశ్యప్‍లు భవంతిని సమీపించారు. భీమారావు వారి సతీమణి కావేరి, సింధూ వరండాలోనికి వచ్చి కూర్చున్నారు. వరండాను సమీపించిన విజయ్, కాశ్యప్‍లు ఎం.ఎల్.ఎ గారికి నమస్కరించారు.


"మీలో విజయ్ ఎవర్రా!..." అధికారం ధ్వనించింది ఆ సంబోధనతో....

అన్నాతమ్ములు ఒకరినొకరు ఆశ్చర్యంతో చూచుకొన్నారు.


"నేను సార్!... వీడు నా తమ్ముడు కాశ్యప్ శర్మ."


"నీ గురించి మా అమ్మాయి సింధూ చాలా గొప్పగా చెప్పింది" నవ్వుతూ అంది కావేరి.


చిరునవ్వుతో సింధూ విజయ్ ముఖంలోకి చూచింది. క్షణం సేపు ఆమె ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు విజయ్.


"నీవు మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి ట్యూషన్ చెప్పాలి. నీకు ఎంత కావాలి?..." అడిగాడు భీమారావు.


"సార్!..."


"ఆఁ... అడుగు!...."


"నెంబర్ వన్ - నేను మీ అమ్మాయి గారికి ట్యూషన్ మీ ఇంటికి వచ్చి చెప్పలేను. నెంబర్ టూ - నేను డబ్బును తీసుకోను. నెంబర్ త్రీ - నేను మీ అమ్మాయికి తెలియని విషయాలను చెప్పాలంటే ఆమె మా ఇంటికి రావాలి" స్పష్టంగా నిర్భయంగా చెప్పాడు విజయ్.


విజయ్ మాటలకు వారు ఆశ్చర్యపోయారు. ఆ భార్యా భర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. సింధూ వదనం వాడిపోయింది. దీనంగా తండ్రి ముఖంలోకి చూచింది. కాశ్యప్.... విజయ్ ముఖంలోకి భయంగా చూచాడు. విజయ్ ముఖంలో ప్రశాంతత. చిరునవ్వు.....

"బాగా ఆలోచించుకో!...." భీమారావు హెచ్చరిక.


"సార్!... నేను బాగా ఆలోచించే నా నిర్ణయాన్ని తెలియజేశాను" చిరునవ్వుతో చెప్పాడు విజయ్.


"నాన్నా!.... నేను వారి ఇంటికి వెళతాను" మెల్లగా చెప్పింది సింధూ.


"నీ నిర్ణయం...."


"మారదు సార్!..." భీమారావు మాట పూర్తి చేయకముందే చెప్పాడు విజయ్. రెండు క్షణాల తర్వాత....


"సార్!.... నా దగ్గరకు సాయంత్రం సమయంలో దాదాపు పదిమంది పైగా బాలబాలికలు వస్తున్నారు. ఆ కారణంగా నేను మీ ఇంటికి రాలేను."


"ఏమండీ!...."


"ఆఁ.... ఏమిటీ?..."


"సాయంత్రం సమయంలో మన అమ్మాయిని అతని ఇంటికి పంపిద్దామండి" అనునయంగా చెప్పింది కావేరి.


"సార్!... ఇక మాకు శలవిప్పించండి" అడిగాడు విజయ్.


భీమారావు కొన్ని క్షణాలు ఆలోచించాడు. నా మాటను కాదనడానికి వీడికి ఎంత ధైర్యం?... అయినా, అవసరం మనది. వాడి షరతుకు ఒప్పుకోవడం సమంజసం’ అనుకొన్నాడు.

"సరే!.... రేపటినుండి మా సింధూ మీ ఇంటికి వస్తుంది."


"మంచిది సార్!... నమస్తే!...." విజయ్ వేగంగా వరండా మెట్లు దిగాడు. కాశ్యప్ అతన్ని అనుసరించాడు. భీమారావు, కావేరి, సింధూ వారిని ఆశ్చర్యంతో చూస్తూ వుండిపోయారు.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page