top of page

వీభోవరా - పార్ట్ 9

Updated: Jul 26

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Veebhovara - Part 9 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 20/07/2025

వీభోవరా - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. 


ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. 


కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. రామశర్మ, మాధవి దంపతులకు ఆడ, మగ కవలలు పుడతారు. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. ఆధ్యాత్మిక గురువుల గురించి, స్వాతంత్య్ర సమర యోధుల గురించి విద్యార్థులకు చక్కగా వివరిస్తారు రామశర్మ గారు.

కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను తమ ఇంటికి భోజనానికి పిలుస్తారు మురళీమోహన్ దంపతులు. ఎం.ఎల్.ఎ భీమారావు తన కుమార్తెకు ఇంటికివచ్చి ట్యూషన్ చెప్పమని విజయ్ శర్మను కోరుతాడు.

తన ఇంటికే వచ్చి నేర్చుకోమంటాడు విజయ్.




ఇక వీభోవరా - పార్ట్ 9 చదవండి.. 


సీనియర్ తెలుగు పండిట్, ఉభయ భాషా ప్రవీణ.. మురళీ మోహన్ గారు బి.ఎ. క్లాసురూములో ప్రవేశించారు. కూర్చొని గొంతు సవరించి.... 

"బాలబాలికలారా!.... ఈ రోజు మీకు మన రాష్ట్రంలో వున్న అతి గొప్ప శివక్షేత్రం శ్రీశైలాన్ని గురించి వివరిస్తాను.


పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. అతను చాలాకాలం మాతా గాయత్రిదేవి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి, ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. ఆ వర ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. 


జగత్ జనని వారికి ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రాన్ని అతను జపిస్తున్నంత వరకూ, అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తరువాత దేవతలు పథకం ప్రకారం, దేవగురువు అయిన బృహస్పతిని అరుణాసురుని వద్దకు పంపుతారు. 

అరుణాసురుడు తన వద్దకు దేవగురువు బృహస్పతి రాకను గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా, బృహస్పతి అందుకు సమాధానముగా, మనమిరువురమూ ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ నా రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. 


అందుకు అరుణాసురుడు, దేవతలు పూజించే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి, గాయత్రి మంత్ర జపాన్ని మానేస్తాడు. దానికి ఆగ్రహించిన మాత ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను (తుమ్మెదలను) సృష్టిస్తుంది. ఆ భ్రమరములు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరించాయి. 


కృతయుగమున పుత్ర సంతానం కోసం ఘోర తపమాచరించిన శిలాద మహర్షి పరమేశ్వరుల అనుగ్రహంతో, నందికేశ్వర, పర్వత, నామధేయములతో జన్మించిన పుత్రులు, తమ తీవ్ర తపోమహిమతో అగ్ని జ్వాలలతో త్రిలోకంబులను గడగడలాడించి పరమేశ్వరులను ప్రత్యక్షము గావించుకొనిరి. 


వారిలో నందీశ్వరుడు ప్రమధగణాధిపత్యమును ఈశ్వర వాహనత్వమును వరములుగా పొందిరి. పర్వతుడు తాను పర్వతాకారమును దాల్చుదునని తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిశత్కోటి దేవతలతో, ప్రమధులతో సర్వతీర్థ క్షేత్ర రాజములతో, స్వయంభూ లింగరూపమున మాతా పార్వతీ సమేతుడై శివుడు వెలయవలయుననియు, తన శిఖర దర్శన మాత్రముననే జనులకు ముక్తి నొసంగవలయుననియు, వేడుకొనెను. 


నాటినుండి శ్రీశైలము మహామహిమోపేతముగా ప్రఖ్యాతి గాంచినది. ఆ ప్రదేశము శ్రీశైలమని పేరు వచ్చుటకు కారణము, కృత యుగాంతమున కల సుమతి నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు శ్రీ, తన ఉగ్రతాపం చేత ఈశ్వరులను మెప్పించి ఈ పర్వమున ఎల్లకాలముల యందునూ, నా పేరును ప్రజలు పిలుచునట్లు పరమేశ్వరులను వరమడిగి వేడుకొనగా ఈశ్వరుల అనుగ్రహమున సఫల మనోరధురాలుగా అయినందున, ఆ పర్వతమును శ్రీ పర్వతమనియు, ఆ ప్రాంతమును శ్రీశైలమనియు వ్యవహరింపబడినది. 


ఆ స్వామికి మల్లికార్జున నామధేయము కలుగుటకు కారణము.... శ్రీశైల సమీపమందలి మల్లికాపుర మహారాజగు చంద్రగుప్తుడు శత్రు విజేతయై, స్వదేశానికి (తన ప్రాంతానికి) పన్నెండు సంవత్సరాల తరువాత రావడం జరిగినది. వారికి సర్వేశ్వర కరుణా కటాక్షము చేత జన్మించిన వారి కుమార్తె పౌడ అయ్యి అపురూప లావణ్య సౌందర్య రాశిగా వెలుగొందు చంద్రమతిని చూచి, కామంధుడై కామించెను. 


అనుచితముగా ప్రవర్తింప ప్రయత్నించెను. ఆమె (చంద్రమతి) తప్పించుకొని శ్రీశైలమునకు వెళ్ళి, శివుని మల్లికాపుష్పాలతో (మల్లెపూలు) పూజించి శివుని ప్రత్యక్షము గావించుకొన్నది. తన తండ్రిని శిక్షించి, మల్లికాపురమున దగ్ద మొనరింపవలయుననియు, తనకు దృఢమైన శివభక్తిని ప్రసాదించి, అంబారూపమును ఒసగమనియు, పరమేశ్వరుడు మల్లికార్జున నామముచే సుప్రసిద్ధుడు కావలయునని వరములు కోరినది. 


ఆ చంద్రమతికి శివానుగ్రహము కలిగినది. వరములు తీరినవి. చంద్రమతి భ్రమర కీటక న్యాయమున, అంబా స్వరూపముగా భ్రమరాంబ నామమున సర్వలోక ప్రశస్తమగుట జరిగినది. చరిత్రానుసారం ఆ ఆలయం శాతవాహన రాజవంశం రెండవ శతాబ్దంలోనూ ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి రాజులు, పెమ్మసాని రాజులు, విజయనగర రాజులు ఎందరో మహనీయులు సేవలు చేసిన మహాక్షేత్రం అంతకు ముందు శ్రీరాముడు, పాండవులు మొదలగు మన పురాణ పురుషులు పూజలు సలిపిన ఆరాధించిన శ్రీ మల్లికార్జునుని మహా పవిత్రధామం శ్రీశైలం.


శ్రీశైలంలో చూడవలసిన విశేషాలు :

1.స్వయంభూశివాలయము2. శ్రీ భ్రమరాంబమాత ఆలయము

3. పాతాళగంగ (లోయలో)

4. సాక్షిగణపతి దేవాలయము

5. దట్టమైన నల్లమల అడవులు

6. కన్నడ మహా కవయిత్రి అక్కమాంబ గుహలు, శివలింగం (ప్రధాన ఆలయం నుండి నల్లమల అడవుల్లో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్నాయి)

7. ఇష్ట కామేశ్వరి ఆలయం (నల్లమల అడవుల్లో ఇరవై కిలోమీటర్ల దూరంలో వుంది. జీప్‍లోనే పయనించగలం)

8. మెట్ల మార్గం - రోప్‍ వే

9. టైగర్ రిజర్వ్ (ఏనుగులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్ళ నిలయం)

బాలబాలికలారా! జీవితంలో కనీసం ఒక పర్యాయము అందరూ ఆ శ్రీశైల ఆధ్యాత్మికత నిలయమైన ఆ మహా క్షేత్రాన్ని తప్పక దర్శించవలయును. అది ఇహపరములకు మహాదానందదాయకం.


ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైలేశ్వరుల లింగము కడు ప్రశస్తమైనది.

ద్వాదశ జ్యోతిర్లింగములు అవి వుండు ప్రదేశముల వివరణ:


1. సోమనాధ జ్యోతిర్లింగం - గుజరాత్ రాష్ట్రంలో ’గిర్’ అనే ప్రదేశమున కలదు.

2. మల్లికార్జున జ్యోతిర్లింగం - ఆంధ్రప్రదేశ్‍లో శ్రీశైలంలో కలదు.

3. మహాంకాళేశ్వర జ్యోతిర్లింగం - మధ్యప్రదేశ్‌లో ’ఉజ్జయినీ’లో కలదు.

4. ఓం కారేశ్వర జ్యోతిర్లింగం - మధ్యప్రదేశ్‍లో "భాడవా’లో కలదు

5. వైధ్యనాథ్ జ్యోతిర్లింగం - జార్ఖండ్‍లో "డోవ్‍ఘర్’ లో కలదు.

6. భీమశంకర్ జ్యోతిర్లింగం - మహారాష్ట్రలో ’ఢాకినీ’లో కలదు.

7. రామనాధేశ్వర జ్యోతిర్లింగం - తమిళనాడులో ’రామేశ్వరం’లో కలదు

8. నాగేశ్వర్ జ్యోతిర్లింగం - గుజరాత్‍లో ’ద్వారక’లో కలదు.

9. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం - ఉత్తర ప్రదేశ్‍లో ’వారణాసి’లో కలదు.

10. త్రయంబకేస్వర్ జ్యోతిర్లింగం - మహారాష్ట్రలో ’నాసిక్’లో కలదు.

11. కేదార్‍నాథ్ జ్యోతిర్లింగం - ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ’రుద్రప్రయాగ’లో కలదు.

12. ఘృష్నేశ్వర్ జ్యోతిర్లింగం - మహారాష్ట్రలో ’ఔరంగాబాద్‍’లో కలదు.

సీనియర్ తెలుగు లెక్చరర్ మురళీమోహన్ గారు చెప్పడం ఆపారు. అందరు విద్యార్థులను పరీక్షగా చూచారు.


విజయ్ శర్మ లేచి నిలబడ్డాడు.

అతన్ని చూచిన మాస్టారు గారు చిరునవ్వుతో....

"విజయ్!..... ఏమైనా అడగాలనుకొంటున్నావా?...."


"అవును సార్!... సార్!...."


"అడుగు విజయ్!....."


"ఆ పన్నెండు మహాక్షేత్రాలలో మీరు ఎన్నింటిని చూచారు సార్!..." వినయంగా అడిగాడు విజయ్.


మిగతా పిల్లలందరూ అతని వైపుకు ఆశ్చర్యంతో చూచారు.

"నేను శ్రీశైల మల్లికార్జున, రామేశ్వర రామనాధేశ్వరుల, వారణాశి కాశీ విశ్వనాధుల ఆలయాలను దర్శించాను. మిగతా తొమ్మిదింటిని చూడలేదు."


"సార్!..."


"ఏమిటి విజయ్?...."


"పరీక్షలు ముగియగానే మీరు మమ్మల్ని శ్రీశైలం ఎక్స్ కర్షన్‍కు తీసుకొని వెళ్ళగలరా!...."


"నిరభ్యంతరంగా!.... మీలో ఎవరెవరు రాదలచుకొన్నది వ్రాసి నాకు ఇవ్వండి. నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి పరీక్షలు ముగియగానే శ్రీశైలం టూర్‍కు ప్లాన్ చేద్దాం" చిరునవ్వుతో చెప్పారు మురళీమోహన్ గారు.


పిరీయడ్ ముగిసింది. గంట మ్రోగింది. మాస్టారు గారు గదినుండి బయటికి నడిచారు.

ఇంగ్లీష్ లెక్చరర్ దివాకర్ శర్మ గారు క్లాసు గదిలో ప్రవేశించారు. 

*

సమయం సాయంత్రం ఆరున్నర అయింది. విజయ్, కాశ్యప్‍లు ఇంటికి చేరి స్నానం చేసి దుస్తులు మార్చుకొన్నారు.


వీధిలో వాకిట ముందు కారు వచ్చి ఆగింది. డ్రైవర్ హారన్ కొట్టాడు.

కాశ్యప్ చేపట్టు గోడను సమీపించి వీధివైపుకు చూచాడు. అందంగా అలంకరించుకొని సింధూ కారునుండి దిగింది.


కాశ్యప్ గదిలో ప్రవేశించి....

"అన్నా!...."


"ఏమిటి కాశీ!...."


"ఆ అమ్మాయి వచ్చింది?"


"ఏ అమ్మాయి?...."


"అదే ఎం.ఎల్. ఎ కూతురు సింధూ!"


విజయ్ రెండు క్షణాలు ఆలోచించి..... "అలాగా!..."


"అవునన్నా!...."


"సరే రానీ!...."


గంగ.... కారు హారన్ విని సింహద్వారాన్ని సమీపించింది. కారు దిగి లోనికి వస్తున్న సింధూను చూచింది. లోనికి వెళ్ళి తలుపును మూసింది.

గంగ ఆ చర్యను సింధూ గమనించింది.

’అహంకారి’ అనుకొంది. మెట్లు ఎక్కి మేడ పైకి నడవసాగింది. విజయ్ తన ఇంటిముందు చాపను పరిచాడు. ద్వారం పై భాగంలో వున్న బార్ లైట్‍ను ఆన్ చేశాడు.


సింధూ మేడపైకి చేరింది. కొన్ని క్షణాల్లో గంగ, గౌరీలు కూడా పైకి వచ్చారు. 

లోపల నుంచే విజయ్..... "కూర్చోండి" అన్నాడు.


సింధూ చాపపైన కూర్చుంది. ఆమె ప్రక్కనే గంగ, గౌరీలు కూర్చున్నారు. నలుగురు మగపిల్లలు వచ్చారు.


"సార్!...." అందులో ఒకడు చంద్ర పిలిచాడు.


"కూర్చోండి చంద్రా వస్తున్నా!...." విజయ్ జవాబు. 


కాశ్యప్ వైపు చూచి....

"కాశీ!....వంట పని నీవు ప్రారంభించు. నేను వారికి కొంత వివరించి అసైనుమెంటు ఇచ్చి వస్తాను."


"అలాగే అన్నా!...."


విజయ్ బయటికి నడిచాడు.

కూర్చున్న వారంతా లేచి నిలబడ్డారు.

"కూర్చోండి!...."


అందరూ కూర్చున్నారు.

తాను గోడకు ఆనుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు.

"మీరు ఏ సబ్జెక్ట్ బుక్స్ తెచ్చారు?" సింధూ ముఖంలోకి చూస్తూ అడిగాడు.


"ఇంగ్లీష్...."


"టెస్ట్ బుక్ ఇవ్వండి."


సింధూ బుక్‍ను అందించింది.

"ఇందులో మీకు అర్థం కానిదేది?"


"ది క్వాలిటీ ఆఫ్ మేరీస్!" మెల్లగా చెప్పింది సింధూ.


"ఒకసారి చదవండి" చెప్పాడు విజయ్.


సింధూ చదవడం ప్రారంభించింది.

మురళీమోహన్ వారి భార్యామణి శ్యామల మేడపైకి వచ్చారు. వారిని చూడగానే విజయ్ లేచి నిలబడి....

"గుడ్ ఈవెనింగ్ సార్!" అన్నాడు.


"ఆఁ....ఆఁ.... గుడ్ ఈవెనింగ్ విజయ్! ఎలా వుంది నీ ట్యూషన్ సెక్షన్" నవ్వుతూ అడిగాడు అక్కడవున్న పిలల్లనందరినీ పరీక్షగా చూస్తూ.


"అవును విజయ్!..... వీళ్ళంతా ఏమైనా నెలకు ఇంతని ఇస్తున్నారా!"


"మేడమ్! నేను ఏమీ తీసుకోను. విద్యను నేర్పాలే కాని విక్రయించకూడదు. ఇది మా నాన్నగారి మాట. నాకు ఆచరణయోగ్యం" చిరునవ్వుతో చెప్పాడు విజయ్.


"వీరిలో ఎం.ఎల్.ఎ గారి అమ్మాయి ఎవరు?"


చూపుడు వ్రేలితో సింధూను సమీపించాడు చిజయ్.

"విజయ్!.... ఒక్కమాట....!"


"ఏమిటి మేడం?...."


"మన గంగా, గౌరీలు ఎలా వున్నారు?..."


"ఫర్వాలేదు మేడం. చెప్పిన విషయాలను చక్కగా అర్థం చేసుకొంటున్నారు."


"ఏయ్!.... భయపడకుండా తెలియని విషయాలను విజయ్ నడిగి తెలుసుకోండి"


తల్లిమాటకు గంగా, గౌరీలు తలలాడించారు.


"సరే విజయ్! పని చూచుకో!...." మురళీమోహన్, శ్యామల క్రిందికి వెళ్ళిపోయారు.


కొద్ది నిముషాల్లో సింధూ చదవడం ముగించింది. విజయ్ ఆమెకు అర్థాన్ని వివరంగా చెప్పాడు. మిగతా వారికి నిన్న ఇచ్చిన హోం వర్కును చెక్ చేసి కరెక్ట్ చేశాడు. ఐదు సార్లు ఇంపోజిషన్ వ్రాయమన్నాడు.


తర్వాత అందరినీ ఉద్దేశించి....

"మనం చదువుకొనేటప్పుడు మనస్సున ఏ ఇతర ఆలోచనలూ వుండకూడదు. మనస్సును పూర్తిగా మనం చదివే దానిమీదనే లగ్నం చేయాలి. క్లాసులో లెక్చరర్స్ చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. వినికిడి వలన చదివేదానికంటే, విషయాలను బాగా అర్థం చేసుకొనగలము. దాన్నే ఏకాగ్రత అంటారు. అందరూ పాటించండి. సమయం ఎనిమిదిన్నర. ఇక మీరు మీ ఇళ్ళకు బయలుదేరండి. గుడ్ నైట్" లేచి నిలబడ్డాడు విజయశర్మ.


అందరూ లేచి నిలబడి "గుడ్ నైట్ సార్" చెప్పి మిద్దెనుండి క్రిందికి దిగారు.


అప్పటికి రెండుసార్లు కాశ్యప్ తొంగిచూచాడు. అతను చూచింది గంగను. విజయ్ ఇంట్లోకి నడిచాడు. విజయ్ వారికి అసైన్‍మెంటు ఇచ్చి తనూ చదువుకొనేవాడు. వంటచేస్తూ కాశ్యప్ తన లెసన్స్ ను చదువుకొనేవాడు.

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page