top of page

వీభోవరా - పార్ట్ 10

Updated: Aug 2

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Veebhovara - Part 10 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 26/07/2025

వీభోవరా - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ. 


అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు. ఎం.ఎల్.ఎ భీమారావు తన కుమార్తె సింధుకు ట్యూషన్ చెప్పమని విజయ్ శర్మను కోరుతాడు. ట్యూషన్ ప్రారంభమవుతుంది. 





ఇక వీభోవరా - పార్ట్ 10 చదవండి.. 


సింధూ క్రమం తప్పకుండా విజయ్ వద్దకు ట్యూషన్‍కు వచ్చేది. అలాగే గంగా, గౌరి. సింధూకు విజయ్ పట్ల. గంగ, గౌరీలకు కాశ్యప్ విషయంలో ఎంతో అభిమానం. వారి ఆ అభిప్రాయం దిన దినాభివృద్ధిగా పెరగసాగింది. ఇటువైపు విజయ్ పరమమిత భాషి, కాశ్యప్ సరదాగా మాట్లాడినా, అవకాశం తనకు వున్నా, హద్దులను దాటేవాడు కాదు. విజయ్ మాట మీద, అతనికి ఎంతో గౌరవం అభిమానం. కానీ వయస్సుకున్న సహజగుణం కారణంగా గంగను అతిగా అభిమానించేవాడు. సింధూ గంగలిరువురూ మంచి అందగత్తెలు. వారిరువురికి ఒకరిపైన ఒకరికి ద్వేషం. సింధూ సహజంగా అహంకారి. సంవత్సరాంతంలో కాలేజీలో అన్ని ఆటల పోటీలు జరిగాయి. విజయ్, కాశ్యప్‍లు కొంతమంది ఇతర విధ్యార్థులు పాల్గొన్నారు. అలాగే బాలికల పక్షంలో సింధూ, గంగ, గౌరి మరికొందరు పాల్గొన్నారు.


వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ లో విజయ్ టీమ్స్ విజేతలు.

రన్నింగ్ రేస్, జావలిన్ త్రో, లాంగ్ జంప్, హైజంప్ లో కాశ్యప్ విజేత.

సింధూ బ్యాడ్‍మింటన్, రన్నింగ్ రేస్, లాంగ్ జంప్‍లో విజేత.


గంగ, గౌరీల టీమ్ వాలీబాల్, బాస్కెట్ బాల్, రింగ్ బెల్ ఆటలలో విజేతలు.

ప్రిన్సిపాల్ మహమ్మద్ గారు ఒక సాయంత్రం  కాలేజీ ఆవరణంలో వేదికను ఏర్పాటు చేసి ఎం.ఎల్.ఎ భీమారావుగారిని, మున్సిపల్ ఛైర్ పర్సన్ దమయంతీ దేవి గారిని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్‍కు ఆహ్వానించారు.


తొలుత ప్రిన్సిపాల్‍ గారు ఆ అతిధులను గురించి, వారు సమాజానికి చేస్తున్న సేవలను గురించి ప్రసంగించారు. తరువాత ఎం.ఎల్.ఎ గారు మున్సిపల్ ఛైర్ పర్సన్ గారు ప్రసంగించారు. వారి ప్రసంగాలు వారి గొప్పల మీద సాగింది.


విజేతలైన మగపిల్లలకు భీమారావుగారు, ఆడపిల్లలకు దమయంతి దేవి గారు బహుమతులను పంచారు. కార్యక్రమం ముగిసింది. వారంరోజుల తరువాత పరీక్షలు ప్రారంభమై పదిరోజుల్లో ముగిసాయి.


ఆ కార్యక్రమం సందర్భంలో అక్కడికి వచ్చిన భీమారావుగారి సుపుత్రుడు దుర్గారావు కళ్ళకు గంగ... దేవకన్యలా గోచరించింది. మనస్సున దురాలోచన. పొందాలనే ఆకాంక్ష కలిగాయి. సమయం చూచి వల విసరాలనుకొన్నాడు.


మురళీమోహన్ సార్, మరో నలుగురు లెక్చరర్స్, ప్రిన్సిపాల్ మహమ్మద్ గారితో తాము పిల్లలతో శ్రీశైల మహాక్షేత్ర దర్శనానికి వెళుతున్నట్లు విన్నవించారు. వారు సమ్మతించారు.


టూరిస్టు బస్సును ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని పాతికమంది పిల్లలు పదిమంది ఆడ, పదిహేను మంది మగ వారిలో ఐదుగురు మాస్టార్లు శ్రీశైల సందర్శనానికి బయలుదేరారు.

దేవస్థాన నిర్వాక వర్గాన్ని సంప్రదించి మురళీమోహన్ గారు వారికి ఫోన్ ద్వారా పిల్లలకు కావలసిన వసతి గృహాలను ఏర్పాటు చేసికొన్నారు. వారు అక్కడికి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చేరారు.


సింధూ మనస్సున.... ’ఇది మంచి సమయం. విజయ్‍తో ఆమె మనస్సున తనకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయాలనుకొంది.’


గంగ.... కాశ్యప్‍తో  తన మనోభావాన్ని వివరంగా చెప్పాలని నిర్ణయించుకొంది.


కాశ్యప్.... గంగ పట్ల ఆసక్తి కలిగిన వాడైనందున, ఈ సందర్భంలో గంగతో ఏకాంతంగా మాట్లాడి ఆమెకు తనపట్ల వున్న అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవాలనుకొన్నాడు.

మురళీమోహన్ మాస్టారుగారు ఈ యాత్రా పర్యటనలో గంగ, కాశ్యప్‍లు సన్నిహితులు కావాలని, కాశ్యప్ ఏనాటికైనా తనకు అల్లుడు కావాలని ఆకాంక్షించాడు.


మరుదినం ఆరున్నరకు పాతాళగంగకు చేరి స్నానాలు తదుపరి శ్రీ సాక్షి గణపతి ఆలయం శ్రీశైల మల్లికార్జునుల, మాతా భ్రమరాంబల దర్శనాన్ని చేసికొన్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దట్టమైన నల్లమల అడవులను సందర్శించారు. వారు మరుదినం లక్కమాంబ గుహలను శివలింగాన్ని దర్శించారు. అక్కడవారికి ఒక సన్యాసి కనిపించారు. వారు ఎవరో కాదు లోగడ రామశర్మతో కలిసి విజయ్, కాశ్యప్‍లు విజయవాడలో మాత దుర్గమ్మ ఆలయంలో విజయ్, కాశ్యప్‍లతో విజయవాడలో సంభాషించి దీవించిన యోగిని చూచి, విజయ్, కాశ్యప్‍లు వారిని గుర్తుపట్టి నమస్కరించారు. చిరునవ్వుతో వారు అన్నాదమ్ములను దరికి పిలిచారు.


ఇరువురూ వారిని సమీపించారు....

కాశ్యప్‍ను దగ్గరకు రమ్మని చేతి సౌంజ్ఞను చేశారు వారు. కాశ్యప్ వారి దరికి వెళ్లారు.

"వత్సా!.... ఎలా వున్నావు?"


"మీ ఆశీర్వాద బలంతో ఆనందంగా చదువుకొంటున్నాము. బి.ఎ ప్రధమ సంవత్సరం ముగిసింది. మరో రెండు సంవత్సరములు చదవాలి. ఆ తరువాత ఎం.ఎ...."


"నాయనా!...."


"స్వామీ!....."


"నీకు స్థల మార్పిడి యోగం ఉంది. నీవు చదివే విద్యాలయంలో నీ మిగతా చదువు సాగదు. అనివార్య కారణాల వలన స్థానచలనం జరుగుతుంది. ఆవేశపడకు. అది అనర్థానికి దారి తీస్తుంది. శాంతం, సహనం సదా శ్రీరామరక్ష..."


"స్వామీ! ఏకారణంగా వాడికి స్థాన చలనం జరుగుతుంది?" ఆతృతతో అడిగాడు విజయశర్మ.


"ఒక యువతి వలన, ఒకడితో వైరం ఏర్పడుతుంది. దాని ఫలితంగా స్థాన చలనం తప్పదు. సదా అప్రమత్తతతో వ్యవహరించు. నీవు ధర్మం అనుకొన్నది ఎదుటివారికి ధర్మం కాబోదు. ధనబలం, పదవి, హోదా మూలంగా కొందరు పైశాచిక చర్యలను చేస్తారు. తాత్కాలికంగా వారికి ఆనందం కలుగవచ్చు. కానీ ఒకనాటికి అహంకారానికి అంతం తప్పదు...."


"అది జరుగకుండా మీరేదైనా మంచి సందేశాన్ని మావాడికి చెప్పగలరా! స్వామీజీ!..."


"అది దైవ నిర్ణయం నాయనా!. జరిగి తీరుతుంది. సర్వేశ్వరుని అండ మీ ఉభయులకూ సదా ఉంటుంది. దైవధ్యానం నిరంతరం కొనసాగించండి. ఓం నమఃశివాయః"

కుడిచేతిని పైకెత్తి వారిని ఆశీర్వదించి స్వామివారు వెళ్ళిపోయారు.


విజయ్, కాశ్యప్‍లు ఆశ్చర్యపోయారు.


"కాశీ!..... గంగ విషయంలో నీవు జాగ్రత్తగా వుండాలిరా!" విచారంగా చెప్పాడు విజయ్.


"అలాగే అన్నా!" సాలోచనగా చెప్పాడు కాశ్యప్.


ఆ రాత్రి.... అందరూ శయనించిన తరువాత....

విజయ్ లేచి బయటికి వచ్చాడు. కొంతదూరం నడిచి కృష్ణా నది ఒడ్డుకు చేరాడు.

అతని మనస్సున స్వామీజీ కాశ్యప్ విషయంలో చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. క్రిందిలోయలో కృష్ణవేణమ్మ వయ్యారంగా ముందుకు సాగుతూ వుంది. అతని చూపులు నదీ ప్రవాహం పైన లగ్నమై వున్నాయి. 


"విజయ్!.... సార్!...." స్త్రీ కంఠం పిలుపు.


తొట్రుపాటుతో వెనుతిరిగి చూశాడు. 


ఎదురుగా సింధూ నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె తల ముంగురులు గాలికి చిత్రంగా కదులుతున్నాయి. తల్లో మల్లెపూలు... మధురమైన వాసన.... విజయ్ నాశికలకు ఆ సుగంధం సోకింది. శరీరంలో జలదరింపు....


"మీరా!..." ఆశ్చర్యంతో అడిగాడు.


అవునన్నట్లు సింధూ చిరునవ్వుతో తలాడించింది.

"మీరెందుకు వచ్చారు?"


"మీతో మాట్లాడాలని!...."


"ఏం మాట్లాడాలి?"


"నా గురించి!"


"అంటే.....!"


"నా మనోభావాన్ని గురించి!...."


"ఏమిటది?....."


"మీ కారణంగా మీరు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా నేను అన్ని పరీక్షలు బాగా వ్రాశాను. తప్పకుండా మంచి మార్కులతో పాసవుతాను."


"చాలా సంతోషం"


"మరో మాట...?"


"అదేమిటి....?"


"మీ సాహచర్యం నాకు నా జీవితాంతం కావాలి!..."


"అసంభవం!...."


"మీరు తలుచుకొంటే అసంభవం సంభవం కాగలదు!...."


విజయ్ ఆశ్చర్యంతో సింధూ ముఖంలోకి చూచాడు.

"నేను!...." ఆపింది సింధూ.


"ఏమిటి?...."


"మిమ్మల్ని ప్రేమిస్తున్నాను!...." క్షణంసేపు విజయ్ ముఖంలోకి చూచి చిరునవ్వుతో సిగ్గుతో తలదించుకొంది సింధూ.


"నాకు వివాహం మీద ఆశ లేదు. నామీద మీరు ఆశలు పెంచుకోకండి. మరో విషయం.... మీ జాతి మా జాతి వేరు. పెద్దలకు మన వివాహం సమ్మతం కాదు. మీ నిర్ణయం మీ తల్లిదండ్రులకు తెలిస్తే.... మన రెండు కుటుంబాల మధ్యన వైరం, పగ పెరుగుతుంది. మీరు కలవారు. మీతో పోల్చుకొంటే మేము చాలా పేదవారం. మీతో మేము ఏ విషయంలోనూ సరితూగలేము. దయచేసి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి ప్లీజ్!..." ప్రాధేయపూర్వకంగా చెప్పాడు విజయ్.


సింధూ విచారంగా అతని కళ్ళల్లోకి చూచింది. ఆమె కళ్ళల్లో కన్నీరు.


"అర్థరాత్రి సమయం. ఎవరన్నా చూస్తే బాగుండదు. మీకు చెడ్డపేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. పదండి... వెళ్ళి పడుకుందాం" విజయ్ ముందు నడువగా అతని వెనుకాలే సింధూ మౌనంగా మనోవేదనతో నడిచింది.


గంగ..... కాశ్యప్ పడకను సమీపించింది.

అతని పాదాన్ని గీరింది....


కాశ్యప్ ఉలిక్కిపడి లేచాడు. ప్రక్కన చూచాడు. విజయ్ లేడు. ఎదురుగా గంగ నవ్వుతూ నిలబడి ఉంది.


అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని లాగింది.

ఇరువురూ బయటికి వచ్చారు.

"గంగా ఏం చేస్తున్నావ్!..."


మీరు నాతో రండి. నేను మీతో మాట్లాడాలి."


"ఇప్పుడా!...."


"అవును. ఇదే మంచి సమయం...!"


ఇరువురూ కొంతదూరం నడిచారు.


వైశాఖమాసం.... పౌర్ణమి.... పండువెన్నెల.... చల్లని మలయమారుతం (చల్లగాలి).

"కాశ్యప్!..."


"ఆఁ..... ఏమిటి?"


"నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను పెండ్లి చేసుకోవాలి!.... మీ ఇష్టం వచ్చినప్పుడు ఎంతకాలమైనా నేను మీకోసం ఎదురుచూస్తూ వుంటాను. నాకు మరో విషయం తెలుసు!....."


"అదేమిటి?...."


"మీరూ నన్ను ప్రేమిస్తున్నారు. మనం ఒకే కులం వారం. మన మధ్య ఎలాంటి బేధాలు లేవు. మీరంటే నాకే కాదు. మా అమ్మా నాన్నలకూ ఎంతో ఇష్టం..."


"గంగా!..."


"చెప్పండి!..."


"నేను చదవవలసినది ఇంకా చాలా ఉంది. ఐ.పి.యస్ కావాలన్నది నా ఆశయం."

"మీరు చాలా మంచివారు. అందుకే మీరంటే నాకు పిచ్చి. మీరు మీ ఆశయాన్ని సాధిస్తారు."


"అంటే.....!"


"అంతవరకూ నేను మీకోసం ఎదురుచూస్తూ వుంటాను కాశ్యప్ గారూ!...." వ్యంగ్యంగా పలికి నవ్వింది గంగ.


"నీకు ధైర్యం జాస్తి!...."


"ఆఁ.... అవును. కోరుకొన్నది ఎవరిని?.... మిమ్మల్ని కదా!...." ఓరకంట అతని ముఖంలోకి చూస్తూ అందంగా నవ్వింది గంగ.


కాశ్యప్ మనస్సున ఎంతో ఆనందం... సంతోషంతో తనూ నవ్వాడు.

"సరే.....! నీమాటే నా మాట. నీవు నాదానవు. పద వెళదాం. ఎవరైనా చూస్తే బాగుండదు."

ఇరువురూ వెనుతిరిగారు. కొంతదూరంలో తమవైపుకే వస్తున్న విజయ్, సింధూలను వారు చూచారు. త్వరగా లోనికి వెళ్ళిపోయారు.


వెనుక నడుస్తున్న సింధూ వారిని చూడలేదు. కానీ ముందున్న విజయ్ వారిరువురినీ చూచాడు.


’నా కథే వారి కథలా వుంది’ అనుకొన్నాడు విజయ్.


విజయ్, సింధూ వారి పడకగదులను చేరారు.

పడుకొని గంగను గురించి ఆలోచిస్తున్న కాశ్యప్‍ను చూచాడు విజయ్.


"కాశీ...!"


"అన్నా!...."


"నిద్ర రావడం లేదా?"


"ఒక విషయం జరిగిందన్నా!....."


"ఏమిట్రా అది?"


"గంగ వచ్చి నన్ను లేపింది.  నా చేయి పట్టుకొని నన్ను బయటికి తీసుకువెళ్ళింది."


"తర్వాత!....."


"తన నిర్ణయాన్ని నాకు తెలియజేసింది."


"ఏమిటా నిర్ణయం!...."


"తాను నన్ను పెండ్లి చేసుకొంటుందిట!....."


"దానికి నీ జవాబు?"


"ఇప్పట్లో కుదరదన్నాను."


"అంటే నీ ఉద్దేశ్యం?"


"అన్నా!....."


"చెప్పు....!"


"నేను గంగను ప్రేమిస్తున్నానన్నా!....."


"అంటే వివాహం చేసుకొంటావా!...."


"ఇప్పుడు కాదు!....."


"మరెప్పుడు?...."


"ఐ.పి.యస్ పూర్తిచేసి ఉద్యోగం వచ్చిన తరువాతనే కుదురుతుందని చెప్పాను."


"అంటే....!"


"అన్నా!.... గంగ అంటే నాకు చాలా ఇష్టం అన్నా. నీవే అమ్మా నాన్నలతో మాట్లాడి మా పెండ్లి జరిపించాలి. గంగ చెప్పింది!..."


"ఏమని?...."


"తాను అంతవరకూ ఆగుతానని!....."


"ఓహో!....."


"అవునన్నా!.... నీవు ఎక్కడకి వెళ్ళావు?"


"సింధూ నన్ను కలిసింది."


"ఏం చెప్పింది?"


"నీతో గంగ చెప్పినట్లే చెప్పింది."


"దానికి నీ సమాధానం?..."


"అది ఈ జన్మలో జరగదని, నన్ను మరిచిపొమ్మని చెప్పాను."


"అందుకు తానేమంది?"


"ఏడ్చింది...."


"నీవు!....."


"నేను వారికి మనకు వున్న వ్యత్యాసాలను గురించి చెప్పాను. నాకు వివాహం మీద ఆసక్తి లేదన్నాను."


"అందుకు తనేమంది?"


"మౌనంగా ఉండిపోయింది."


ఇరువురూ ఎవరి ఆలోచనలతో వారు శయనించారు.

మరునాటి ఉదయం.....

అందరూ ఇష్టకామేశ్వరి మాత ఆలయాన్ని దర్శించారు. టైగర్ రిజర్వు ఫారెస్టును చూచారు. అందరి వదనాల్లో ఎంతో ఆనందం. సింధూ, విజయ్ వదనాల్లో తప్ప. తమ గురువులను, పిల్లలందరూ అభినందించారు.


అందరూ బస్సు ఎక్కారు. బస్సు బయలుదేరింది.

విజయ్, కాశ్యప్ ఒక సీట్లో కూర్చున్నారు.

"కాశీ!...."


"అన్నా!...."


"ఏది ఏమైనా స్వామీజీ చెప్పిన మాట నాకు పదే పదే గుర్తుకు వస్తూ వుంది."


"ఏమిటన్నా అది?"


"అదే నీకు స్థాన చలనం వుందన్నారుగా!....."


"ఆఁ..... ఆఁ.... అవును."


"కాబట్టి నీవు సహనంతో ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలి. ఎవరితోనూ, ఎలాంటి గొడవలకు వెళ్ళకూడదు. ఇంకా ఈ కాలేజీలో మనం ఐదు సంవత్సరాలు చదవాలి కదరా!...."


"అవునన్నా!.... ఆ మాట నిజం!...."


"మన లక్ష్యమే మనకు ముఖ్యం. మిగతావన్నీ తరువాతనే. చదువు విషయంలో తప్ప మరే విషయాన్ని గురించి ఆలోచించడం, ప్రాముఖ్యత ఇవ్వడం తగదు."


"అలాగే అన్నా!...."


ఇరువురూ కళ్ళు మూసుకొన్నారు. బస్సు ముందుకు సాగిపోతూ వుంది. 

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page