వీభోవరా - పార్ట్ 11
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Aug 2
- 8 min read
Updated: Aug 7
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Veebhovara - Part 11 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 02/08/2025
వీభోవరా - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు. ఎం. ఎల్. ఎ భీమారావు తన కుమార్తె సింధుకు ట్యూషన్ చెప్పమని విజయ్ శర్మను కోరుతాడు. ట్యూషన్ ప్రారంభమవుతుంది. స్వామీజీ తిరిగి కనబడి గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 11 చదవండి..
శలవల రోజులు. కాశ్యప్, విజయ్‍లు తమ స్వగ్రామానికి వచ్చారు. తండ్రి రామశర్మ, తల్లి మాధవి వారి కూతురు రుద్రమ, చిన్నవాడు భాస్కర్ శర్మ వారిరువురినీ చూచి చాలా సంతోషించారు.
మాధవి ఎంతో ప్రీతిగా విజయ్, కాశ్యప్‍లకు తలంటింది. ఇరువురూ వేడినీళ్లు స్నానం చేశారు. పూజామందిరంలోకి వెళ్ళి జగత్ మాతా పితలకు నమస్కరించి ధ్యానించారు. అందరూ కలిసి ఉదయపు అల్పాహారాన్ని (టిఫిన్) ఆనందంగా ఆరగించారు. వారి కాలేజీ అనుభవాలను, లెక్చరర్స్ ను, ప్రిన్సిపాల్ గారిని గురించి కాలేజీలో జరిగిన క్రీడల పోటీల్లో వారికి వచ్చిన బహుమతులను గురించి ఇరువురూ తల్లితండ్రి సోదర సోదరీలకు వివరించారు. శ్రీశైల యాత్రను గురించి, అచ్చట వారు చూచిన విషయాలను గురించి చెప్పారు.
ఆ సాయంత్రం విజయ్, కాశ్యప్, భాస్కర్, రుద్రమలు శివాలయానికి వెళ్ళారు. ఆ సందర్భంలో కాశ్యప్, భాస్కర్‍లు ఒక జంటగా విజయ్, రుద్రమలు ఒక జంటగా నడవసాగారు.
"విజయ్!" పిలిచింది రుద్రమ.
"ఆ.. "
"ఆ నగరంలో నేను నీకు ఎప్పుడైనా గుర్తుకు వచ్చానా!"
"నిజం చెప్పనా అబద్దం చెప్పనా?"
"నీవు అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకొన్నావా!" ఆశ్చర్యంతో అడిగింది రుద్రమ.
రుద్రమ తండ్రి పోలిక. భారీ విగ్రహం. ఆమె వయసు అప్పటికి పదమూడు సంవత్సరాలు. చూచేదానికి పద్దెనిమిది ఏళ్ళ యువతిగా కనిపిస్తుంది. విజయ్ వయస్సు పందొమ్మిది.
విజయ్ ఒక్కసారి పరిశీలనగా రుద్రమ ముఖంలోకి చూచాడు. ఆమె మనోభావాలు తనపట్ల వేరుగా వున్నాయని అతనికి అనుమానం. రుద్రమ చిన్న వయస్సులోనే ఇరుగు పొరుగు వారు తన తల్లితో మాట్లాడే మాటలను బట్టి, విజయ్ తన సొంత అన్న కాదన్న విషయాన్ని గ్రహించింది.
యుక్తవయస్కురాలైన తరువాత రుద్రమ, విజయ్ పట్ల ఆకర్షితురాలైంది. విజయ్‍ను ఒప్పించి, మెప్పించి అతన్ని వివాహం చేసుకోవాలనే సంకల్పం రుద్రమకు.
"రుద్రమా! నాన్నగారు నాకు అబద్ధం మాట్లాడటం నేర్పించలేదు. నేను ఇంతవరకూ అబద్ధం ఆడలేదు. భావి జీవితంలో కూడా ఎన్నడూ అబద్ధం ఆడను. "
"అయితే అలా నన్ను ఎందుకు ప్రశ్నించావు?.. "
"నీవు ఏమంటావోనని!.. " నవ్వాడు విజయ్. క్షణం తరువాత "బాగా చదువుతున్నావా!.. మంచి మార్కులు వస్తున్నాయా!.. " ఆప్యాయంగా అడిగాడు విజయ్.
"ఆ.. విజయ్.. ! బాగా చదువుతున్నాను. మంచి మార్కులూ వచ్చాయి. "
"మరి భాస్కర్?.. "
"వాడూ నా మాదిరే.. మేము కవలలం కదా!" అందంగా నవ్వింది రుద్రమ.
"నాకు తీరికగా ఉన్నప్పుడు నిన్ను గురించే ఆలోచిస్తుంటాను" క్షణం తర్వాత..
"ఆఁ.. ఒక ప్రశ్న!.. "
"అడుగు!.. "
"మీ కాలేజీలో ఆడపిల్లలు చదువుతున్నారా!.. "
"ఆ.. వున్నారు!.. "
"తమరికి ఎవరితోనైనా పరిచయమా!.. "
"అలాంటివేం మనకు లేవు"
"అంటే!.. "
"అలాంటి ఆలోచనలు నాకు రావని అర్థం.. "
ముందు నడుస్తున్న కాశ్యప్, భాస్కర్‍లు ఆగారు. వీరు వారిని సమీపించారు. అందరూ ఇంట్లో ప్రవేశించారు.
నెలరోజుల శలవుల్లో పుట్టిన గ్రామంలో, ఇతర స్నేహితులతో, తల్లితండ్రులతో ఎంతో ఆనందంగా గడిపారు విజయ్, కాశ్యప్ శర్మలు.
రుద్రమ అన్ని విషయాల్లో విజయ్‍కి సాయంగా వర్తించేది. విజయ్‍కు రుద్రమ మీద ఎంతో ప్రేమాభిమానాలు ఒక సోదరిగా. ఆ రోజు వారు నగరానికి బయలుదేరుతున్నారు.
తల్లి మాధవి వారికి మసాలా పొళ్ళు, వూరగాయలు, పచ్చళ్ళు బాటిల్స్ లో నింపి ఒక సంచిలో క్రమంగా అమర్చింది.
అందరూ బస్టాండుకు వచ్చారు.
విజయ్, కాశ్యప్‍లు ఎక్కవలసిన బస్సు వచ్చింది.
అందరికీ చెప్పి ఇరువురూ బస్సు ఎక్కారు. నెలరోజులు తల్లితండ్రి, తోబుట్టువులతో ఆనందంగా గడిపిన విజయ్, కాశ్యప్‍ల మనస్సున వేదన. ముఖంలో విచారం. పైకి నవ్వుతూ కిటికీ గుండా చేతులు ఆడించారు.
రుద్రమ, భాస్కర్ శర్మల కళ్ళల్లో కన్నీరు. చేతులు పైకెత్తి వారిరువురికీ టాటా చెప్పారు.
పెద్దవారు ఇరువురూ వారు సదా చెప్పే జాగ్రత్తలను చెప్పారు.
బస్సు కదిలింది. బస్సు మలుపు తిరిగేంత వరకూ తల్లితండ్రి సోదరీ సోదరులు బస్సులోని వారినే చూస్తూ వున్నారు. బస్సు మలుపు తిరిగింది.
రామశర్మ మాధవి, రుద్రమ, భాస్కర్ శర్మలు ఇంటివైపుకు నడిచారు విచారవదనాలతో.
గంగ, గౌరీలు, మురళీమోహన్ వారి సతీమణి శ్యామల, వారిని ప్రీతిగా పలుకరించారు. వారి తల్లిదండ్రులు సోదరి సోదరుల యోగక్షేమాలనువిచారించారు.
వారింట్లో భోంచేసి విజయ్, కాశ్యప్‍లు కాలేజీకి వెళ్ళారు. ఫీజ్ కట్టారు.
ఆ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సింధు అన్న దుర్గారావు, నలుగురు అతని స్నేహితులతో, కాలేజీ ఆవరణంలో ప్రవేశించారు. గంగ, గౌరి కొంతమంది వారి స్నేహితులు కాలేజీ గ్రౌండులో మంచిరోడ్డు వైపుకు నడుస్తున్నారు.
దుర్గారావు అతని మిత్రులు వారిని సమీపించారు. వారు రోడ్డు ఎక్కగానే దుర్గారావు బృందం గంగా, గౌరీల బృందాన్ని చుట్టుముట్టారు. నోటికి వచ్చిన పిచ్చి పేర్లతో వారిని హేళన చేశారు.
సహజంగా గంగ చాలా ధైర్యశాలి. గౌరి మెతక, భయస్థురాలు. వారి అల్లరి మాటలకు ఆడపిల్లలు భయపడ్డారు. ప్రక్కకు ఒదిగి ముందుకు పోను ప్రయత్నించారు. కానీ దుర్గారావు బృందం వారిని కదలనివ్వలేదు. హేళన చేస్తూ పడిపడి నవ్వసాగారు.
గంగకు కోపం, ఆవేశం కలిగింది. కాలికి వున్న చెప్పును తీసి దుర్గారావుకు చూపిస్తూ..
"పిచ్చి వాగుడు వాగావంటే ఇది తెగుద్ది!.. " ఆవేశంగా చెప్పింది.
దూరానా గ్రౌండులో వున్న కాశ్యప్ రోడ్డువైపుకు చూచాడు. దుర్గారావు, అతని సహచరులు ఆడపిల్లలను వేధిస్తున్నట్లు అతనికి అర్థం అయ్యింది.
చీకటి పడింది. రోడ్డులో దీపాలు వెలిగాయి. అందరూ ఇళ్ళకు వెళ్ళే సమయం అయినందున రోడ్డులో ఎవరిపాటి వారు ముందుకు తమ తమ గమ్యాల వైపుకు వెళుతున్నారు.
దుర్గారావు ఆవేశంగా గంగను సమీపించి ఆమె చేతిలోని పాదరక్షను లాక్కొని ఆమెను కొట్టడానికి చేతిని పైకెత్తాడు. అదే సమయానికి కాశ్యప్ వేగంగా వచ్చి అతని చేతిని పట్టుకొన్నాడు.
దుర్గారావు కాశ్యప్‍ను చూచాడు. తన్ను గంగను కొట్టనీయకుండా ఆపిన కాశ్యప్‍పై ఆగ్రహం. ఆ చెప్పుతో కాశ్యప్‍ను కొట్టాడు. కాశ్యప్‍లో సహనం నశించింది. ఆవేశం పెరిగింది. బలవంతంగా దుర్గారావు చేతిని పాదరక్షను తన చేతిలోకి లాక్కున్నాడు. గంగ అతన్ని సమీపించింది. ఆ పాదరక్ష గంగదని తెలిసి కాశ్యప్ దాన్ని ఆమెకిచ్చాడు.
దుర్గారావు ఆగ్రహావేశాలతో.. "నీవెవడివిరా!.. నా విషయంలో జోక్యం చేసుకొనేదానికి!.. " ఎంతో ఆవేశంగా కాశ్యప్‍ను కొట్టాడు. కాశ్యప్ తిరగబడి దుర్గారావును చిత్తుచిత్తుగా కొట్టాడు. ఇరువురి పెనుగులాటలో దుర్గారావు రోడ్డు ప్రక్కన వున్న పల్లంలో (గుంట) పడిపోయాడు.
దుర్గారావు కాలు విరిగింది ’అమ్మా.. ’ అంటూ బిగ్గరగా అరిచాడు. గొడవ ప్రారంభం కాగానే దుర్గారావు మిత్రులు పారిపోయారు. కాశ్యప్ మిత్రులు గుమికూడారు.
దుర్గారావు గుంటలో పడి కాలు విరిగడంతో ఫైటింగ్ ముగిసిపోయింది.
ఇంతలో రోడ్డులో గొడవ అన్న వార్త కాలేజీ ప్రిన్సిపాల్ వారితో మాట్లాడుతున్న విజయ్, మురళీ మోహన్ ముగ్గురు లెక్చరర్లు విని రోడ్డు మీదికి వచ్చారు.
వారు వచ్చేలోపల కాశ్యప్, గంగ, గౌరీలను రిక్షాలో ఇంటికి పంపేశాడు.
విజయ్‍కి జరిగిన విషయాన్ని చెప్పాడు కాశ్యప్.
కాశ్యప్, విజయ్‍లు గుంటలోని దుర్గారావుని బయటికి తీశారు. రిక్షాలో ఎక్కించి విజయ్, అతన్ని హాస్పిటల్‍కు తీసుకొని వెళ్ళాడు. కాశ్యప్ ఇంటికి వెళ్ళిపోయాడు.
దుర్గారావును డాక్టర్ చేత పరీక్ష చేయించాడు విజయ్.
డాక్టర్ కాలు విరిగిందని కన్ఫామ్ చేశాడు.
"తగిన ట్రీట్‍మెంటు చేయండి సార్!" వినయంగా కోరాడు విజయ్.
ఆ స్థితిలోనూ దుర్గారావు..
"నేను ఎం. ఎల్. ఎ భీమారావు కొడుకుని!.. " అహంకారంతో చెప్పాడు.
డాక్టర్ తల ఆడించారు. దుర్గారావును స్ట్రెచ్చర్‍పై పడుకోపెట్టి హాస్పిటల్‍లోనికి తీసుకుని వెళ్ళారు.
దుర్గారావు మిత్ర బృందంలో ఒకడు ఈ విషయాన్ని భీమారావు గారి ఇంటికి చేరవేశాడు.
భీమారావు, సింధూ కార్లో హాస్పిటల్‍కు వచ్చారు.
అక్కడ వున్న విజయ్‍ను చూచారు. విజయ్ వారికి చెప్పవలసినంత వరకూ చెప్పాడు. వారు డాక్టరుతో మాట్లాడటానికి వారి గదికి వెళ్లారు. ఆ క్షణంలో విజయ్ మస్తిష్కంలో ఒక అనుమానం..
’స్వామీజీ చెప్పిన స్థల మార్పుకు ఈ సంఘటన నాందియా!.. ముందు ఏం జరుగబోతూ వుందో!.. కాశ్యప్ పరిస్థితి ఏమిటో!.. అంతా అయోమయం సర్వేశ్వరా!.. నా సోదరుని కాపాడు.. ’ దీనంగా దైవాన్ని మనస్సున వేడుకొన్నాడు.
భీమారావు సింధూ డాక్టర్ రూము నుండి బయటికి రాగానే వారికి చెప్పి తన ఇంటికి బయలుదేరబోయాడు విజయ్.
"విజయ్ సార్!.. " పిలిచింది సింధూ.
’ఏం.. ’ అన్నట్లు ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూచాడు విజయ్.
"మా అన్నయ్యకు సాయం చేసి హాస్పిటల్‍కు చేర్చినందుకు థాంక్యూ సార్!.. " గంభీరంగా చెప్పింది.
"నో మెన్షన్ ప్లీజ్!.. " తలాడించి తన ఇంటివైపుకు బయలుదేరాడు విజయ్.
విజయ్ ఇంటికి చేరే సమయానికి మురళీమోహన్ గారి ఇంటి హాల్లో సమావేశం జరుగుతూ ఉంది. సభ్యులు గంగ, గౌరి, కాశ్యప్, మురళీమోహన్ గారు వారి సతీమణి శ్యామల. జరిగిన దుస్సంఘటన గురించి చర్చ జరిగింది. ఎవరి ఆలోచనలో వారు వున్నారు. విజయ్ కాలింగ్ బెల్ కొట్టాడు.
గౌరి వచ్చి తలుపు తీసింది.
"రండి సార్!.. " లోనికి ఆహ్వానించింది.
విజయ్‍ను చూడగానే కాశ్యప్ విచారంగా తల దించుకొన్నాడు. గంగ కళ్ళల్లో నీళ్ళు..
"రా.. విజయ్ కూర్చో!.. " అన్నాడు మురళీమోహన్ గారు.
విజయ్ సోఫాలో కాశ్యప్ ప్రక్కన కూర్చున్నాడు.
"రేయ్!.. ఏం జరిగిందిరా!.. "
"సార్!.. వారు కాదు నేను చెబుతాను" అంది గంగ.
"చెప్పండి.. "
గంగ పరీక్షలకు ముందు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజున కాలేజికి దుర్గారావు రాక, అతను తన్ను చూచిన రీతిని.. ఈ రోజు గ్రౌండు నుంచి రోడ్డు వరకు వారి బృందాన్ని ఫాలో చేసి, చేసిన, అల్లరి విమర్శలను గురించి, ఉపయోగించిన అసహ్యకరమైన భాషను గురించి, ఆవేశంతో తాను చేసిన పనిని (కాలి చెప్పును దుర్గారావుకు చూపడం) గురించి, ఆ తర్వాత కాశ్యప్ రాక, వారిరువురి మధ్యన వాగ్వాదం, దుర్గారావు కాశ్యప్‍ను కొట్టడం.. తిరిగి కాశ్యప్ ఆవేశంతో దుర్గారావును కొట్టడం.. వివరంగా చెప్పింది. క్షణం తరువాత..
"సార్!.. యదార్థంగా జరిగిన విషయం ఇది!.. " గంగ చెప్పడం ఆపింది.
తలవంచుకొని వున్న కాశ్యప్ భుజంపై చేయి వేసిన విజయ్..
"కాశీ!.. బాధపడుతున్నావా!.. " మెల్లగా అడిగాడు.
లేదు అన్నట్లు తల ఆడించాడు కాశ్యప్.
"విజయ్! భీమారావు మంచి మనిషి కాదు. వాడికి తగినట్లే వాడి కొడుకు. ఇక కాశ్యప్ ఈ కాలేజీలో చదువు కొనసాగదు. ఒకవైపు భీమారావు, మరోవైపు దుర్గారావు రాహుకేతువుల్లా కాశ్యప్‍కు హాని కలిగించగలరు. అతని చదువు సవ్యంగా సాగదు. కనుక మీకు నాదొక సలహా!.. "
"ఏమిటి సార్ అది!.. "
"మీరిరువురూ గుంటూరు వెళ్ళండి. అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ మా అన్నయ్య వున్నాడు. నేను అతనితో మాట్లాడి మీకు సీట్లు దొరికేలా చేస్తాను. అక్కడ మీరు ప్రశాంతంగా, ఏ సమస్యలు లేకుండా చదువుకొనవచ్చు. మీరు సరే అంటే నేను మా అన్నయ్యతో మాట్లాడుతాను" అనునయంగా చెప్పాడు మురళీమోహన్ గారు.
"సార్!.. నేను మా నిర్ణయాన్ని మీకు రేపు ఉదయాన్నే తెలియజేస్తాము. మీ ఆలోచనా విధానానికి, మీరు మాకు చేయాలని తీసుకొన్న సహృదయానికి ధన్యవాదాలు సార్!" సోఫా నుంచి లేచి చేతులు జోడించాడు విజయ్.
కాశ్యప్ కూడా లేచి తెలుగు పండిట్ గారికి నమస్కరించాడు.
"వెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం కూడా వంట చేశాను బాబూ!" ప్రీతిగా చెప్పింది శ్యామల.
విజయ్, కాశ్యప్‍లు తమ పోర్షన్‍కు వచ్చి స్నానం చేసి డ్రస్ మార్చుకొని గంగ ఇంటి వెళ్ళారు. అందరూ కలిసి భోజనం చేశారు.
భోజనానంతరం.. మురళీమోహన్ గారు..
"విజయ్!.. మనం ఇప్పుడు వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలిసి జరిగిన విషయాన్ని చెప్పి వద్దాం పద" అన్నారు.
"సార్!.. నేనూ రానా!.. "
"ఆహా!.. నీవు వద్దు కాశ్యప్ విజయ్ నేనూ వెళ్ళి వస్తాము. "
మురళీమోహన్, విజయ్ ప్రిన్సిపాల్ మహమ్మద్ సార్ ఇంటికి స్కూటర్‍పై వెళ్ళారు.
సమయం రాత్రి పదిగంటలు..
ఆ సమయంలో వారిరువురూ తన ఇంటికి వచ్చినందుకు మహమ్మద్ సార్ ఆశ్చర్యపోయారు.
"సార్!.. ఏమిటి విషయం. ఈ సమయంలో వచ్చారు.. కూర్చోండి. " ప్రిన్సిపాల్ మురళీమోహన్‍లు కూర్చున్నారు.
నిలబడి వున్న విజయ్‍ను చూచి ప్రిన్సిపాల్ గారు..
"విజయ్ కూర్చోమ్మా!.. "
"ఫరవాలేదు సార్!.. "
"ఆ మురళీమోహన్ గారూ!.. విషయం ఏమిటి?"
తెలుగు పండిట్ గారు ఆ సాయంత్రం జరిగిన దుస్సంఘటనను గురించి ప్రిన్సిపాల్ గారికి వివరించారు. చివరగా..
"సార్! కాశ్యప్, విజయ్‍లు ఎలాంటి పిల్లలో మీకు బాగా తెలుసు. ఆ దుర్గారావు మన కాలేజీ స్టూడెంటేగా. వాడు కాలేజీలో వున్న రోజుల్లో సృష్టించిన గొడవలు, సమస్యలు మీకు తెలియనివి కావు. ఐదేళ్ళూ చదివి కూడా బి. ఎ పాస్ కాలేకపోయాడు. ఇక, వారి తండ్రి భీమారావుగారు, వారి చరిత్ర కూడా మీకు బాగా తెలుసు.
పాపం.. ఈ విజయ్ కాశ్యప్‍లు పేద పిల్లలు. వున్నతమైన ఆశయాలు, కలవారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తరువాత దుర్గారావు వీళ్ళని ప్రశాంతంగా చదువు కోనివ్వడండి. గిల్లి గొడవలు పెట్టుకొంటాడు. వాడి ఆ రాక్షస చర్యలకు ఆ తండ్రిగారి సపోర్టు. కనుక కాశ్యప్, విజయ్‍లకు రేపు టి. సి ఇప్పించండి సార్. వారిని గుంటూరుకు మా అన్నయ్య ప్రిన్సిపాల్ శాంత కుమార్ వద్దకు పంపుతాను. ఆ కాలేజీలో చేరి వారు ప్రశాంతంగా చదువుకోగలరు. మీరు వారికి ఈ సాయం చేయాలి సార్!" ప్రాధేయపూర్వకంగా కోరాడు మురళీమోహన్ గారు.
"సార్!.. మరో మాట భీమారావు గారు మిమ్మల్ని పిలిపించి విచారించవచ్చు. మీరు టి. సి ఇచ్చి వీరిని పంపేసి, వారడిగితే డిస్మిస్ చేశానని చెప్పవచ్చు. మీకు ఏ సమస్యా వుండదు కదా సార్!.. "
కొన్నిక్షణాలు ఆలోచించి ప్రిన్సిపాల్ మహమ్మద్ సార్..
"ఎస్.. మురళీమోహన్ గారు మీరు చెప్పిందంతా నిజం. నేనువిజయ్, కాశ్యప్‍లకు రేపు టి. సి ఇప్పిస్తాను" తన నిర్ణయాన్ని తెలియజేశాడు మహమ్మద్ గారు.
ఇరువురూ ప్రిన్సిపాల్ గారికి నమస్కరించి ఇంటికి బయలుదేరారు. మురళీమోహన్ స్కూటర్ నడుపుతున్నాడు.
విజయ్ మస్తిష్కంలో ఒక భావన.
"సార్!.. "
"ఏమిటి విజయ్!.. "
"నేను ఇక్కడే చదువుతాను. కాశ్యప్, గంగలకు టి. సి లు తీసుకొని వారిని మీ అన్నయ్య గారి వద్దకు పంపండి. నేను ఇక్కడ వుండడం వారిరువురికీ, మీకూ మంచిది. నా అభిప్రాయాన్ని మీరు అర్థం చేసుకోండి సార్!.. "
మురళీ మోహన్ ఆలోచనలతో కొన్ని క్షణాలు మౌనంగా బండిని నడిపాడు. ఇల్లు సమీపించింది.
స్కూటర్‍ను ఆపాడు.
"విజయ్!.. "
"సార్!.. "
"నీ ఆలోచన అమోఘమయ్యా! చిన్నవాడవైనా ఎన్ని విధాలుగా ఆలోచించావయ్యా!.. "
"సార్!.. "
"చెప్పు.. "
"కాశ్యప్.. గంగలకు ఒకరి పట్ల ఒకరికి ఎంతో అభిమానం సార్!.. "
’ఓ.. ఈ అబ్బాయి ఎంత గొప్పగా ఆలోచించి తన నిర్ణయాన్ని నాతో నిర్భయంగా చెప్పాడు. కాశ్యప్ వెళ్ళిపోయినంత మాత్రాన గంగకు ఇక్కడ రక్షణ ఎలా అవుతుంది?.. అవమానపడ్డ ఆ రాక్షసుడు దుర్గారావు బాగై బయటకు వచ్చాక పగ ప్రతీకారంతో నా బిడ్డను వేధిస్తాడు కదా!.. గంగ, కాశ్యప్‍తో గుంటూరు వెళ్ళి ఆ కాలేజీలో చేరిందంటే ఆమెకు రక్షణగా కాశ్యప్ ఉంటాడు. ఆమె చదువు సవ్యంగా సాగుతుంది’ అనుకొన్నాడు మురళీమోహన్ గారు.
"వెరీగుడ్ విజయ్!.. నీ ఆలోచనలతో నేను ఏకీభవిస్తున్నాను" ఆనందంగా నవ్వుతూ చెప్పాడు మురళీమోహన్.
స్కూటర్ ఇంట్లో ప్రవేశించింది.
విజయ్ "థాంక్యూ సార్.. గుడ్ నైట్" చెప్పి తన పోర్షన్‍లోకి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి మురళీమోహన్ అర్థాంగి శ్యామలకు గంగను గుంటూరు పంపించే విషయం చెప్పాడు. తోటే కాశ్యప్ వెళుతున్నందున ఆ తల్లి ఎంతగానో సంతోషించింది.
మరుదినం మురళీమోహన్ గారు తన నిర్ణయాన్ని అంటే గంగను గుంటూరు పంపుతాననే విషయాన్ని ప్రిన్సిపాల్ గారికి చెప్పాడు. కాశ్యప్, గంగల టి. సి లను రెడీ చేయవలసిందిగా ప్రిన్సిపాల్ గారు రైటర్‍కి చెప్పారు. అరగంటలో టి. సిలు ప్రిన్సిపాల్ గారి టేబుల్ మీదికి చేర్చాడు రైటర్.
మురళీమోహన్ గారు రెండురోజులు శలవు పెట్టి.. గంగా, కాశ్యప్‍లతో గుంటూరుకి వెళ్ళి అన్ని విషయాలు తన సోదరుడు శాంత కుమార్‍కు వివరించి, ఇరువురినీ కాలేజీలో చేర్చాడు.
గంగ వాళ్ల పెదనాన్న గారి ఇంట్లో, కాశ్యప్ హాస్టల్లో చేరారు. రోజులు ప్రశాంతంగా సాగిపోతున్నాయి.
విజయ్.. తన ట్యూషన్స్ ను కొనసాగిస్తున్నాడు. సింధూ ట్యూషన్‍కు వస్తూ వుంది.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments