నలుపు తెలుపు - సారీ.. రంగుల్లేవ్
- Dr. Bokka Srinivasa Rao
- Sep 7
- 9 min read
Updated: Sep 8
#BokkaSrinivasa Rao, #బొక్కాశ్రీనివాసరావు, #నలుపుతెలుపు, #NalupuTelupu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #సందేశాత్మకకథ

'Nalupu Telupu' Sorry.. Rangullev - New Telugu Story Written By - Dr. Bokka Srinivasa Rao Published In manatelugukathalu.com On 07/09/2025
'నలుపు తెలుపు' - సారీ.. రంగుల్లేవ్ - తెలుగు కథ
రచన: Dr. బొక్కా శ్రీనివాసరావు
బోసు, వాసులిద్దరూ అన్నదమ్ములు. వీరికి తల్లిదండ్రులు లేరు. మేనమామ కోటేశ్వరం నైతిక సాయంతోనే చదువుకున్నారు. అంతే కాకుండా మేనమామ ఆర్థిక సాయం చేయడంతో బోసు బ్యూటీ పార్లర్ నడుపుచుంటాడు. తమ్ముడు వాసు పార్లర్‌లో సాయపడుతుంటాడు.
బోసుకి కంటిచూపు సమస్య తీవ్రంగా వుంది. కళ్ళజోడు లేకపోతే.. రెండు, మూడు అడుగుల దూరంలో వున్నవి చాలా బ్లర్‌గా కన్పిస్తాయి. మనుషుల్ని గుర్తు పట్టలేడు కూడా. ఈ రకమైన కంటి సమస్య తనకి జెనిటిక్ వారసత్వం వల్ల వచ్చింది.
మేనమామ కూతురు తిలోత్తమ. తనకి బావంటే చాలా యిష్టం. ఆమె నల్లని రంగులో కొంచెం అనాకారిగా వుంటుంది. అందుకే ఆమె అనాకారి రూపాన్ని గేలి చేస్తూ.. మరదల్ని వెక్కిరిస్తుంటాడు. మంచి మనసు గల తిలోత్తమ అవేమీ పట్టించుకోదు. తిలోత్తమ తనకున్న ఆలోచనలతో.. స్వయంగా ఒక అనాథాశ్రమాన్ని నడుపుతూంటుంది.
బ్యూటీ పార్లర్, ఇంటిలోని పక్క పోర్షన్‌లోనే నడుస్తూంటుంది. అందుకే బ్యూటీ పార్లర్ తెరిచే సమయంలో.. తిలోత్తమని ఆ ఏరియాలో కనపడకూడదని సీరియస్‌గా చెప్తాడు.
‘ఏం ఎందుకు తిరగకూడదు.. ?’ అని తిలోత్తమ అడుగుతుంది.
‘ఎందుకంటే.. నిన్ను నా కస్టమర్లు ఎవరైనా చూసారనుకో. ఆమె ఎవరని అడిగితే.. నా మరదలు అని చెప్పలేను’ అని అంటాడు.
‘అదే ఎందుకు చెప్పలేవు.. ?’ అని అడుగుతుంది.
‘ఈ పార్లర్ ఓనర్.. తన మరదల్నే అందంగా చేయలేక పోయాడు. ఇంక మనల్ని ఏం చేస్తాడు అని వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు నా బిజినెస్ పడిపోతుంది. నేను రోడ్డున పడతాను. పోనీ పార్లర్‌ని వేరేచోట పెట్టాలి అంటే అద్దెలు భరించాలి. మావయ్య ఈ గదిని ఇచ్చినందువల్ల.. అద్దె బాధ లేకుండా పోయింది. కాబట్టి అర్థం చేసుకో’ అని అనునయిస్తూ చెప్తాడు.
అలా చెప్పగానే అర్థం చేసుకున్న తిలోత్తమ.. పార్లర్ పరిసరాల్లో కనపడకుండా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ తప్పనిసరి అయితే.. ముఖానికి స్కార్ప్ తగిలించుకుని.. కస్టమర్లుకి కనపడకుండా.. ముఖ్యంగా తను పడుతున్న బాధని అసలు కనపడకుండా.. మేనేజ్ చేస్తుంటుంది.
ఎప్పటికైనా తన బావ తనని పెళ్ళి చేసుకుంటాడన్న ఆశతోనే బ్రతుకుతుంటుంది. కానీ తిలోత్తమతో పెళ్లి విషయంలో వేరే ఆలోచనల్లో వుంటాడు. తిలోత్తమలాంటి అనాకారితో పెళ్ళి అంటే చిరాకు పడుతూ.. ఆమెతో పెళ్ళి ఆలోచన లేకుండా బ్యూటీ పార్లర్ డెవలప్‌మెంట్‌లోనే మునిగిపోయి.. చివరికి పెళ్ళి ఆలోచన కూడా లేకుండా అయిపోతాడు. అంత:సౌందర్యాన్ని పట్టించుకోకుండా బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత యిస్తుంటాడు.
తిలోత్తమ, బోసుల పెళ్ళి విషయంలో.. తమ్ముడు వాసు, మేనమామ కోటేశ్వరంలిద్దరూ ఒక పార్టీ. మంచి మనసున్న తిలోత్తమని, బోసుకే చేయాలన్న పంతంలో ఉంటారు. దానికి చాలా పథకాలు వేస్తారు. అవన్నీ ఫెయిల్ అవుతాయి.
తిలోత్తమ నాన్నని, మరిదిని వారిస్తుంది.
‘బావకి ఇష్టం లేనపుడు ఎందుకంత బలవంతంగా పెళ్ళి చేస్తారు’ అని తిలోత్తమ వాళ్ళకి క్లాస్ పీకుతుంది.
దానికి వాసు.. ‘లేదు వదినా.. ! ఈ రోజు మేమిలా బ్రతికున్నామంటే.. దానికి కారణం మావయ్య, నీ ఆసరా. మీవల్లే మేము ఇవాళ ఈ బ్యూటీ పార్లర్ నడుపుకో గలుగుతున్నాం. కాబట్టి ఎలాగైనా నువ్వే మా వదిన. నేనిది ఫిక్స్’ అని ఖరాఖండిగా చెబుతాడు.
‘సరే. మీ ఖర్మ. బావ అయితే ఒప్పుకోడు. మీ ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసనే’ అని కొట్టిపారేస్తుంది తిలోత్తమ.
చివరికి కోటేశ్వరం, వాసులు ఒక పథకం వేస్తారు. దానికి తిలోత్తమ సహకారం కావాలని అడుగుతారు. తిలోత్తమ ఒప్పుకోదు. వాసు బ్రతిమిలాడితే..
‘నీ మంచి మనసు కోసం ఒప్పుకుంటున్నా’ అని తిలోత్తమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ‘సరే. ప్లాన్ ఏంటి.. ?’ అని అడుగుతుంది.
ప్లాన్ మొత్తాన్ని ఇద్దరూ తిలోత్తమకి వివరిస్తారు.
‘మర్నాడే ఈ ప్లాన్ అమలు చేస్తున్నాం’ అంటాడు వాసు.
‘సరే’ అని అంటుంది తిలోత్తమ.
పథకం అమలు చేసే రోజు రానే వచ్చింది. వాసు, కోటేశ్వరంలిద్దరూ బోసుని కలుస్తారు.
‘బోసూ.. ! ఇలా ఎంతకాలం పెళ్ళి చేసుకోకుండా వుంటావ్.. ?’ అని మావయ్య అడుగుతాడు.
‘ఏమో నాకు ఆ ఆలోచన లేదు’ అని ముభావంగా చెబుతాడు బోసు.
‘మా అమ్మాయి తిలోత్తమ నీకు ఇష్టం లేదు. కాబట్టి బలవంతంగా నేను నీకు కట్టబెట్టనులే. కానీ నా ఫ్రెండ్ బలవంతపెడుతున్నాడు. వాళ్ల అమ్మాయిని నీకిద్దామని అడుగుతున్నాడు.’ అని మావయ్య అంటాడు.
‘మావయ్యా.. ! ఇప్పటికే మీ సాయంతో బ్రతుకుతూ కూడా.. నీ కూతురైన మరదల్ని పెళ్ళి చేసుకోవడం లేదన్న గిల్టీ ఫీలింగ్‌లో వున్నాను. అలాంటిది.. ఇంటిలో వున్న మీ కూతురిని కాదని.. వేరే అమ్మాయిని తీసుకొచ్చి.. ఆమెను పెళ్ళి చేసుకో అని అడిగితే ఒప్పుకున్నానే అనుకో.. నేను ఇంకా గిల్టీ ఫీలవుతాను. కాబట్టి ఈ ప్రయత్నం మానుకో’ అని చెబుతాడు.
దానికి వాసు స్పందించి.. ‘అన్నయ్యా.. ! మేము తిలోత్తమకి ఈ పెళ్ళిచూపుల గురించి ముందే చెప్పేసాం’ అని అంటాడు.
‘దానికి తిలోత్తమ ఏవంది.. ?’ అని అడుగుతాడు బోసు.
‘బావకి ఇష్టం అయితే.. మధ్యలో నేనెవర్ని.. ? అని వదిన అంది అన్నయ్యా.. !’ అని అంటాడు.
‘తనని బాధ చేసుకోవడం లేదన్న ఫ్రస్ట్రేషన్‌లో అలా అని వుంటుంది. తనకి నన్ను చేసుకోవాలన్నది కదా తిలోత్తమ కోరిక’ అని బోసు అంటాడు.
కోటేశ్వరం అందుకుంటూ.. ‘నీ కోసం ఎదురు చూసీ.. చూసీ.. విసిగిపోయిందట. నాన్నా.. ! బావతో నా పెళ్లి విషయం మర్చిపో. బావకి ఎవర్ని నచ్చితే.. వాళ్ళనే చేసుకోమను’ అని తిలోత్తమ నాతో చెప్పిందిరా బోసూ’ అని అంటాడు.
‘అలా అయితే సరే. తనకి నేను ఇంక అవసరం లేదని తనే నిర్ణయించుకున్నపుడు.. నేనెందుకు పెళ్ళి చేసుకోకుండా వుంటాను. చేసుకుంటాను. పెళ్ళి చూపుల ఏర్పాట్లు చేయండి మావయ్యా.. !’ అని బోసు తన నిర్ణయాన్ని తెలియజేస్తాడు.
అలా అన్న వెంటనే వాసు ‘యాహూ.. ’ అని ఎగిరి గంతేస్తాడు.
బోసు వాడ్ని ఆపి.. ‘రేయ్ నేను పెళ్ళి చేసుకుంటున్నది తిలోత్తమని కాదురా. అంత ఆనందపడుతున్నావ్. దేనికిరా.. ?’ అని అడుగుతాడు.
‘నీకు పెళ్ళి అయిపోతే.. నాకు లైన్ క్లియర్ అయిపోతుందిగా. అందుకే ఈ సంతోషం.. !’ అని తన కంగారుని సర్దుకుని.. ఏదో మొక్కుబడి సమాధానం ఇచ్చేస్తాడు.
అప్పుడు కోటేశ్వరం.. ‘అయితే బోసూ.. ! మధ్యాహ్నమే పెళ్ళి చూపులకి వెళ్దాం’ అని అంటాడు.
‘సరే మావయ్యా.. !’ అంటాడు.
***
బోసు పెళ్ళికూతురి ఇంటిలోని హాలులో ఒక కుర్చీలో కూర్చుని పెళ్ళికూతురి రాక కోసం చూస్తున్నాడు. కోటేశ్వరం బోసు పక్కనే కూర్చున్నాడు. వాసు మరో కుర్చీలో కూర్చుని వున్నాడు. పెళ్ళి కూతురు రావడానికి ఇంకా సమయం ఉంది.
అప్పుడు వాసు, అన్నయ్య దగ్గరికి వెళ్ళి.. అన్నయ్య కళ్ళజోడు తీసేస్తాడు. వెంటనే వాడ్ని ఆపుతూ.. ‘ఒరేయ్ ఇది లేకపోతే.. అమ్మాయి నాకు సరిగ్గా కనిపించదురా. ’ అని మెల్లగా అంటాడు.
‘అసలే ముదిరిన బెండకాయవి. మరీ ఇంత పోడాబుడ్డి అద్దాలేసుకుని కూర్చుంటే.. నిన్ను చూసీ చూడంగానే ఆ వచ్చే అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేస్తుంది. నీకిష్టమేనా.. ?’ అని భయపెడతాడు.
దానికి తోడుగా కోటేశ్వరం.. ‘నిజమే బోసూ.. ! ఇప్పుడు ఈ అమ్మాయి రిజెక్ట్ చేసిందనుకో.. మా అమ్మాయి తిలోత్తమ నిన్ను వెక్కిరిస్తుంది. ఇలా అన్ని పెళ్ళిచూపుల్లోనూ ఫెయిల్ అయ్యావనుకో.. నీకు మా అమ్మాయే గతి అవుతుంది. మరి తిలోత్తమని చేసుకోవడం నీకిష్టమేనా.. ?’ అని భయపెడతాడు.
‘అమ్మో.. అంత ఖర్మ నాకు పట్టాలని అనుకోవడం లేదు’ అని బోసు అంటాడు.
‘అలా అయితే.. ఈ కళ్ళజోడు మా దగ్గరే వుండనియ్. మేం అమ్మాయిని మేం చూసి.. ఎలా వుందో నీకు చెపుతాం. ’ అని కోటేశ్వరం అంటాడు.
‘ఈ ఐడియా బాగుంది. అలానే కానీయండి. ’ అని తన కళ్ళజోడుని వాసుకి ఇస్తాడు.
అంతలో పెళ్ళికూతురిని తీసుకుని.. ఆమె తండ్రి వెంకటేశం వస్తాడు. తనని ఒక కుర్చీలో కూర్చోపెడతాడు. ఆమె ముఖం మీద ఫేసియల్ వుంది. కళ్ళకి కీరా ముక్కలు ఉన్నాయి. బ్లర్‌గా కనిపిస్తున్నవాటిని బోసు చూస్తూ.. తమ్ముడితో మెల్లగా..
‘రేయ్ వాసూ.. ! ఆ అమ్మాయి ఫేసూ తెల్లగా కనపడుతోంది. పైగా కళ్ళకి కీరా ముక్కల్లా కన్పిస్తున్నాయి. నాకర్థం కావడం లేదురా. ’ అని అంటాడు.
‘అన్నయ్యా.. ! కళ్ళజోడు లేకపోయినా.. నీకు బానే కన్పిస్తుందే. నిజంగానే ఆ అమ్మాయి ఫేసియల్ చేసుకుని, కీరా ముక్కలు పెట్టుకుంది. ’ అని చెప్తాడు.
దానికి బోసు ఒక్కసారిగా ఎగిరి గంతేసి.. ‘వావ్.. అందం పట్ల ఆమెకు అంత పట్టుదల వుండబట్టే కదా.. పెళ్ళిచూపులైనా సరే.. ఫేషియల్‌తో వచ్చింది అంటే.. ఆమె సాహసానికి నేను మురిసిపోతున్నాను. కాబట్టి ఆ అమ్మాయి నాకు నచ్చేసింది. ఇంక మిగిలినవి మాట్లాడేసుకుందాం’ అని తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు.
మావయ్య కోటేశ్వరం లేచి వచ్చి.. ‘ఒరేయ్.. తొందర పడకురా. ఇంకోసారి ఆలోచించు. నిదానంగానే నిర్ణయం తీసుకో. ’ అని చెప్పబోతే.. బోసు అడ్డం పడిపోయి.. ‘లేదు. నిర్ణయించేసుకున్నా. ఆమె నచ్చింది అని ఆమెకు చెప్పేయండి. ఇంక మనం వెళ్ళిపోదాం’ అని అంటాడు.
అప్పటిదాకా మౌనంగా వున్న ఆ అమ్మాయి.. ‘అలా ఎలా వెళ్ళిపోతారు.. ? నా నిర్ణయంతో పని లేదా.. ?’ అని అంటుంది.
వాసు ఆమె దగ్గరికి వెళ్ళి.. ‘వదినా.. ! ఇంక మిమ్మల్నే నేను వదినగా నిర్ణయించేసుకున్నాను. మా అన్నయ్యకి కూడా నచ్చేసారు. ఇంక మీరే కరుణించి ఒప్పుకోవాలి. ఇంకోసారి ఆలోచించండి’ అని అంటాడు.
‘అయితే సరే. ఒప్పుకుంటాను. అయితే నాదో కండిషన్. ’ అని అంటుంది ఆ అమ్మాయి.
బోసు వెంటనే ‘చెప్పండి. ఏవిటా కండిషన్.. ? నేను రడీ’ అని చెప్పి లేచి నిలబడతాడు.
‘అయితే మీరిలా రండి ఓసారి’ అంటుంది. ‘సరే వస్తున్నా’ అని వెళతాడు.
‘నేను మీకు కొంత కోడ్ లాంగ్వేజ్ చెప్తాను. ’ అని అంటుంది.
‘కోడ్ లాంగ్వేజా.. ? పెళ్ళి చూపుల్లో అది అవసరమా.. ?’ అంటాడు.
వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియక కోటేశ్వరం, వాసులు తొంగి తొంగి విందామని ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఏమీ వినపడవు.
ఆ అమ్మాయి.. బోసుకి.. క్లారిటీ ఇస్తూ.. ‘అవును. రేపు పెళ్ళి అయ్యేలోగా.. వేరేవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసం చెయ్యకుండా నన్ను గుర్తు పట్టడానికి వీలుగా.. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు జవాబులు చెప్తారు. దాన్ని బట్టి నన్ను గుర్తు పడతారు. ఎందుకంటే మీరు నన్ను ఇప్పుడు పూర్తిగా చూడలేదు కదా.. ! ఏమంటారు.. ?’ అని అంటుంది.
‘ఇదేదో భలే సరదాగుంది. ఇంక ఆ ప్రశ్న, జవాబులు చెప్పండి. ’ అని అంటాడు.
‘లేదంటే ఫేషియల్ క్లీన్ చేస్కుని వస్తాను. నా ముఖం ఇపుడే చూసెయ్యండి. బాగోలేదంటే పెళ్ళి కాన్సిల్. ’ అని లేచి వెళ్ళిపోబోతోంటే.. బోసు ఆపేస్తాడు.
‘లేదండి. కూర్చోండి. మీరు నచ్చారు. ఫ్రాంక్‌నెస్ వున్న మీ మనసూ నచ్చింది.. మనసులో మాట చెప్పాలంటే మీరు మా తిలోత్తమ లాగే నల్లగా వున్నా సరే మిమ్మల్నే పెళ్ళి చేస్కుంటాను. ’ అని అంటాడు.
‘అలాంటపుడు మీ మరదల్నే చేస్కోవచ్చు గదా.. ?’ అని అనగానే.. బోసు.. ‘పరిస్థితి చేయి దాటిపోయిందండి. తనని ఎపుడూ చీదరించుకునేవాడిని. ఎంత ఫీలయి వుంటుందో. పెళ్ళి చేసుకోనని ముఖం మీదే చెప్పేసాను. అందుకని అదే మాట మీద నిలబడ్తాను. ఇపుడు మిమ్మల్ని చేస్కుంటాను అన్నాను. కాబట్టి ఇపుడు ఈ మాట మీదే నిలబెడ్తాను. ’ అని నిజాయితీగా చెప్తాడు.
‘మంచిది. మీరు అలా నిలబడే వుండండి. ఇంక ప్రశ్నలు, జవాబులు రాసుకోండి. ’ అని ఆమె అతడికి చెవిలో ఏదో చెప్తుంది. బోసు వాటిని రాసుకుంటాడు. మళ్ళీ తిరిగి రాగానే.. మావయ్య, తమ్ముడు ఒక్కసారిగా బోసుని వివరాలు అడుగుతాడు.
‘నో.. నో.. నో.. సీక్రెట్. అది చెప్పకూడని రహస్యం. నాకు, ఆ అమ్మాయికి మధ్యలో మాత్రమే వుంటుంది. ఇంక పదండి. నేను ఇంటికి వెళ్ళి ప్రశ్నలు ప్రిపేరవ్వాలి. మీరు మీ పనులు ముగించుకుని తొందరగా ఇంటికి వచ్చేయండి. ’ అని మావయ్యని, తమ్ముడిని తొందరపెడ్తాడు.
వెంటనే వాళ్ళిద్దరూ.. ‘ప్రశ్నలా.. ఏవిటవి.. ?’
‘అవును. ఆ ప్రశ్నలివిగో. 1. డాష్ బొగ్గు. 2. కోడిగుడ్డు నుండి కోడి డాష్, 3. కొత్తకుండ నీరు డాష్ నీరు. ’ అని మూడు ప్రశ్నలు చెప్పాక నాల్గవది పాడుతూ.. ‘4. డాష్ న డాష్ అయి బ్రతుకున బ్రతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ.. ’ అని చెప్పి.. వాటిని బట్టీ పడుతూ వుంటాడు. వాళ్ళిద్దరూ అయోమయంగా చూస్తూ.. బోసుతో ఇంటి కి బయలుదేర్తారు.
***
ఇదిలా వుండగా కొద్దిరోజులకి.. బోసు బ్యూటీ పార్లర్‌కి వెళ్లే హడావిడిలో కాలు జారి పడిపోతాడు. ఇంట్లో ఎవరూ లేరు. మూలుగుతూ.. లేవడానికి ప్రయత్నిస్తుంటే.. అదే సమయానికి వచ్చిన తిలోత్తమ.. బావని లేపుతూ.. ‘ఏమైంది బావా.. ? ఏమైనా దెబ్బలు తగిలాయా.. ?’ అని అడుగుతుంది.
బోసు కొంచెం మూలుగుతూనే.. ‘కాలు మడమ దగ్గర పట్టేసింది. నడవలేకపోతున్నాను’ అని అనగానే.. తిలోత్తమ, బోసు చేతిని భుజం మీద వేసుకుని.. మెల్ల మెల్లగా నడిపించుకుని తీసుకొచ్చి.. సోఫాలో కూర్చోబెడ్తుంది.
వెంటనే వంటగదిలోకి వెళ్ళి.. వేడినీళ్ళు, గుడ్డ తెచ్చి కాపడం పెట్టి.. బోసుకి సపర్యలు చేస్తుంది. బోసు గిల్టీగా ఫీలవుతాడు. కాలు కొంచెం సరి అయినట్లుగా ఫీలవుతాడు. తిలోత్తమకి థాంక్స్ చెప్పబోతోంటే.. ‘ఏంటి బావా ఇది. ఈ పరిస్థితిలో ఎవరున్నా ఇలానే చేస్తాను. దానికి థాంక్స్ ఎందుకు.. ?’ అని తేలికగా తీసుకుని లోపలికి పోతుంది. బోసు ఆమె వంక ఆప్యాయపూర్వకంగా చూస్తూ వుండిపోతాడు.
***
చివరికి పెళ్ళి రోజు వచ్చింది. బోసు, ఆ అమ్మాయి ఇచ్చిన ప్రశ్నలు మననం చేసుకుంటూ వుంటాడు.
అదే సమయానికి మండపానికి.. కీరా ముక్కలతో వున్న అమ్మాయిని తీసుకు వస్తారు. బోసు ఆనందపడిపోయి.. ‘అవునవును. ఈ అమ్మాయినే నేను చూసింది. ’ అని ఎగిరి గంతేయబోయి.. ‘రేయ్ వాసూ.. ! మావయ్యా.. ! మీరు కీరాముక్కలతో నన్ను మోసం చేస్తున్నారేమో. వుండండి. చిన్న పరీక్షతో తేలిపోతుంది. ’ అని అనగానే.. వాసు రియాక్ట్ అయ్యి.. ‘పరీక్ష ఏంటి అన్నయ్యా.. ?’ సందేహంగా అడుగుతాడు.
‘ఎస్. కోడ్ లాంగ్వేజీ టెస్ట్. ’ అని బోసు అంటాడు.
‘పెళ్ళికి అది అవసరమా.. ?’ అని మావయ్య అనగానే.. ‘ఆ.. నేనూ అదే అడిగాను. కానీ మీలాటోళ్ళు మోసం చెయ్యకుండా నా కీరా ముక్కల రాణి చిన్న కోడ్ లాంగ్వేజ్ చెప్పింది. ఆ కోడ్ బయట పెడతాను. అందులో పాసయితేనే ఈమె నా కీరా. నేను ఆమె రాకీ. అందరూ రడీ.. ?’ అని అడుగుతాడు.
అందరూ ముఖాలు చూసుకుంటారు. కొంచెం సేపు నిశ్శబ్దం. తర్వాత ఓ. కే అంటారు.
‘ఓ. కే. ఇంక మీరు ప్రశ్నలు అడగడం మొదలు పెట్టమనండి. ’ అని బోసు, పెళ్ళికూతురితో అంటాడు. ఒక పేపర్‌ని వాసుకి ఇచ్చి.. ’రేయ్ వాసూ.. ! పెళ్ళికూతురు అడిగే ప్రశ్నల్ని.. ఇందులోని జవాబులతో చెక్ చెయ్’ అంటాడు.
‘అలాగే’ అంటాడు వాసు.
పెళ్ళి కూతురు ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. మొదటి ప్రశ్నగా.. ‘డాష్ బొగ్గు. దీనిలోని డాష్‌ని విశేషణంతో పూరించండి’ అని అడుగుతుంది.
బోసు సమాధానం ఇస్తూ.. ‘నల్లని. అంటే నల్లని బొగ్గు. తర్వాత.. ’ అడగండి అంటాడు.
‘కోడిగుడ్డు నుండి కోడి డాష్. దీనిలోని డాష్‌ని నామవాచకంతో పూరించండి. ’ అని అడుగుతుంది.
‘పిల్ల. అంటే కోడిగుడ్డు నుండి కోడి పిల్ల. తర్వాత.. ’ అని హుషారుగా అంటాడు.
‘కొత్తకుండ నీరు డాష్ నీరు. దీనిలోని డాష్‌ని విశేషణంతో పూరించండి’ అని అంటుంది.
‘చల్లని. అంటే కొత్తకుండ నీరు చల్లని నీరు. తర్వాత.. ’ అని అడుగుతాడు.
‘డాష్ న డాష్ అయి బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ.. దీనిలోని డాష్‌ని నామవాచకంతో పూరించండి’ అని అడుగుతుంది.
‘మనసు. అంటే.. మనసున మనసయి బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ.. ఏరా వాసూ.. ! అన్ని ప్రశ్నలూ, సమాధానాలూ సరిపోయాయి కదూ.’
వాసు అవునని తలాడిస్తాడు.
‘సో.. ఈ అమ్మాయే నా పెళ్ళికూతురు. ఇంక పెళ్ళికి ఏ అభ్యంతరమూ లేదు. కానీయండి’ అని బోసు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. పెళ్ళి తంతు మొదలౌతుంది.
కోటేశ్వరం, వాసులు.. బోసుకి తెలియకుండా షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంటూ.. ఫేసియల్ వేసి, కీరా ముక్కల ముసుగులో, మోడ్రన్ డ్రెస్ వేయించి తిలోత్తమని చూపించి పెళ్ళి చూపుల్లో బోసుని మోసం చేసామని కంగ్రాట్స్ చెప్పుకుంటారు. అంతే కాకుండా.. పెళ్ళిలో కూడా అదే గెటప్‌లో చేయించేసి.. అన్నయ్యని బురిడీ కొట్టిస్తున్నామని తమ్ముడు వాసు, మేనల్లుడ్ని బురిడీ కొట్టిస్తున్నామని మేనమామ అనుకుంటారు.
బోసు, తిలోత్తమ దగ్గరికి వెళ్ళి.. ‘తిలోత్తమా.. ! ఇంక ఆ కీరా ముక్కలతో పని లేదు తీసెయ్’ అని అనగానే.. వాసు, మావయ్యలతో పాటు తిలోత్తమా కూడా షాకవుతుంది.
వాళ్ళు షాక్‌నుంచి తేరుకోగానే.. ‘ఏరా వాసూ.. ! ఏం మావయ్యా.. ! నన్ను మోసం చేసానని సంబర పడిపోతున్నారా.. ? ఏం తిలోత్తమా.. ! నువ్వు కూడా ఆనందపడిపోతున్నావ్ కదూ.’
వెంటనే తిలోత్తమ, బోసు కాళ్ళ మీద పడిపోయి.. ‘లేదు బావా.. ! నేనెంత చెబుతున్నా.. వీళ్ళు విన్పించుకోలేదు. చివరికి నిన్ను పెళ్ళి చేసుకోవాలన్న ఆరాటంలో ఒప్పేసుకున్నాను. నన్ను క్షమించు బావా’ అని అడుగుతుంది.
బోసు ఆమెను లేపుతూ.. ‘ఛ.. ఛ.. నేనే నీకు సారీ చెప్పాలి. నీ మంచితనాన్ని గుర్తించలేక.. బాహ్య సౌందర్యం వెంబడి పడ్డాను. కానీ అంత:సౌందర్యం మిన్న అని నువ్వు నాకు తెలియజేసావ్. ’ అని తన హృదయానికి హత్తుకుని.. ‘మన తిలోత్తమ తన మనసు ఎలాంటిదో ఈ ప్రశ్నలు, జవాబులతో చాలా బాగా చెప్పిందిరా.. !’ అని తిలోత్తమని పొగుడుతాడు.
‘అదెలా.. ?’ అని వాళ్ళడుగుతారు.
‘ఇదిగో ఇలా. ఆ నాలుగు జవాబులేంటి చదవండి. వాసు, కోటేశ్వరంలు చదువుతుంటారు.
‘నల్లని.. ’ అని వాసు..
‘పిల్ల.. ’ అని కోటేశ్వరం..
‘చల్లని.. ’ అని వాసు..
‘మనసు.. ’ అని కోటేశ్వరం చదువుతారు.
‘అన్నీ కలిపి చదవండి. ’ అని బోసు అంటాడు.
‘నల్లని పిల్ల చల్లని మనసు. ’ అని వాసు చదువుతాడు.
‘వ్వాట్ ఏ గ్రేట్ కొటేషన్.. !!’ అని కోటేశ్వరం అంటాడు.
బోసు చివరిగా మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నుండి రంగు రంగుల మేకప్‌కి మాత్రమే ప్రాధాన్యమిచ్చే పార్లర్‌ని మూసేస్తున్నాను. నేటి నుండి నలుపు, తెలుపు మాత్రమే.. సారీ.. రంగుల్లేవ్.
ఇకనుండి మనందరం తిలోత్తమతో పాటే అనాథాశ్రమానికి మన ప్రేమని అందిద్దాం. అందం అనేది రెండు రకాలు. ఒకటి శారీరక అందం అయితే రెండవది మానసిక అందం.
రౌడీలైనా, క్రూరులైనా, దుష్టులైనా చాలా అందంగా కన్పించొచ్చు. కానీ వారి మనసుల్లో ఎంతో కర్కశం దాగి ఉంటుంది. అలాగే ప్రేమ, జాలి, దయ వంటి మంచి గుణాలున్నవాళ్ళు అందంగా ఉండకపోవచ్చు. కానీ వారి వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. అలాంటి చల్లని మనసున్న నల్లని పిల్లకే ఈ క్షణం నుండి నా జీవితం అంకితం. ’ అని మోకాళ్ల మీద నిలబడి తిలోత్తమ చెయ్యి పట్టుకుంటాడు..
తిలోత్తమ సిగ్గు మొగ్గయిపోతుంది. అందరూ చప్పట్లు కొడుతుంటారు. మెరుపులు మెరిపించే బాహ్య సౌందర్యం కన్నా ప్రశాంతంగా ఉండే అంత:సౌందర్యం మిన్న అని తెలియజెప్పే ప్రయత్నమే ఈ ‘నలుపు తెలుపు' సారీ.. రంగుల్లేవ్’’ కథ ఇతివృత్తం.
భవదీయుడు..
డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు.
******
డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు
తల్లి పేరు: శ్రీమతి బొక్కా సత్యనారాయణమ్మ
తండ్రి పేరు: శ్రీ బొక్కా శ్రీరామమూర్తి
భార్య: బొక్కా వెంకట మంగాదేవి.
సంతానం: 1. సత్యశ్రీ రాజ్ చంద్ర2. ఉషశ్రీ దేవ్ సూర్య3. హిమశ్రీ దేవి
స్వస్థలం: భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా.
జనన తేదీ: 31`05`1965
చరవాణి సంఖ్య: 90307 34124
ఇ`మెయిల్: సతీపంతీaశీ786ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ
బిరుదులు: సర్వ కళాభిజ్ఞ,
దైవజ్ఞ రత్న, జ్యోతిష రత్న,
హాస్యభాషి, తిక్కన సాహిత్య పురస్కార గ్రహీత,
విద్యార్హతలు: పి.హెచ్.డి.(ఉస్మానియా)., ళిపి.హెచ్.డి.( నాగార్జున)., రి
ఎం.ఎస్.సి.(సైకాలజీ)., ఎం.సి.ఏ., ఎం.సి.జె., ఎం.ఏ.(జ్యోతిషం)., ఎం.ఏ.(తెలుగు)., బి.ఎడ్., నెట్., ఎం.ఫిల్(పార్ట్`1)., బి.కామ్.(కాస్టింగ్)., బి.ఏ.(లెక్కలు).,
పి.జి.డి.జి.Êసి., పి.జి.డి.సి.ఏ., పి.జి.డి.సి.జె., పి.జి.డి.ఏ.,
పి.జి.డి.టి.ఏ., డి.ఎఫ్.ఏ., పి.జి.డి.ఎల్.Ê టి.ఎల్.టి.,
(మొత్తం 18 డిగ్రీ / డిప్లోమోలు)
వృత్తి: విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
ప్రవృత్తి: కవి, రచయిత, రంగస్థల నట దర్శకులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు
సభ్యులు, తెలంగాణ సైకాలజిస్ట్ ్స అసోసియేషన్, హైదరాబాద్
గౌరవ సలహాదారు, ప్రనూష విద్యా మాసపత్రిక, హైదరాబాద్
వ్యవస్థాపక అధ్యక్షులు, మీ కోళ్ళ సత్యం మెమోరియల్స్, జంగారెడ్డిగూడెం
రచనలు
శతకం: 1. కల్లయుగ శతకం
ఏకపాత్రలు: 1. పిచ్చెక్కిన నటుడు2. కీర్తించబడని అమ్మ
నాటికలు: 1. పంపకాలు2. పచ్చ చందురుడు 3. తమ్ముడి ఉత్తరం4., కర్మ`సాల 5. నడత 6. నిశాని
7. నలుపు ` తెలుపు8. రేచీకటి మొగుడు ` కలర్ బై ్టండ్‌నెస్ పెళ్ళాం
9. అకారం ఏకమ్`మకార ద్వయమ్
10. తాడి చెట్టెందుకెక్కావురా..!
11. ఇంకై ్వరీ12. ప్రేమ మూగది కూడా...
13. ఐ లవ్ యూ14. అతి సర్వత్రా వర్జ్యయేత్
15 నో టియర్స్ ప్లీజ్..!16. కొత్త బానిసలు
17. కర్మ`సాల
బాలల/యువ నాటికలు: 1. పచ్చ చందురుడు2. అశ్వమపి గార్దభం భవేత్
3. కకక్ కక్ కాన్సెప్ట్
నాటకాలు: 1. సప్త వర్ష ప్రణాళిక2. జాగా3. ఫోమో
పద్య నాటకాలు: 1. అష్టమ వసువు2. చతుష్పాదుడు3. 2`2`5
కేవల పద్య రచన: 1. యుద్ధం (గద్య రచన: శ్రీ ఆకురాతి భాస్కర చన్ద్ర)
2. సీత కథ మిగిలే ఉంది. (గద్య రచన: శ్రీ ఆకురాతి భాస్కర చన్ద్ర)
Comments