top of page

వేసవిలో రాలిన ఓ చల్లటి చినుకు

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #వేసవిలోరాలినఓచల్లటిచినుకు, #VesaviloRalinaOChallatiChinuku, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Vesavilo Ralina O Challati Chinuku - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 06/09/2025

వేసవిలో రాలిన ఓ చల్లటి చినుకు - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

పంజాగుట్టలో ఉన్న బ్లూడైమండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్సుపోర్ట్ కంపెనీలో ఆ రోజు జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ. అందులో ఆశ్చర్యం గొలిపే విషయం- కంపెనీ మేనేజ్మెంట్ పెద్దమనసు పెట్టి మొదటిసారి నిరుద్యోగులకు వెలుసుబాటు చూపించింది; అభ్యర్ధులకు తప్పనిసరిగా పూర్వానుభవం ఉండాలన్న నిబంధనను తొలగించి.. 


ఈ సడలింపుని ఉపయోగించు కుని నరసింహులు కూడా అప్లయ్ చేసాడు- సగం మనసుతో— సగం నమ్మకంతో— గ్రాడ్వేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాంధించిన ఈ మూడేళ్ల లోపున అప్పుడప్పుడు కొలువుల వసారా వరకు వెళ్ళగలిగాడో లేదో గాని- మనుగడ పోరాటంలో మరచెంబంతటి అనుభవం మాత్రం బాగానే సంపాదించాడు; ముఖ్యంగా ఇంటర్య్యూ వ్యవహారాలలో.. 


అతడి అనుభవం ఎంతగా పెరిగిందంటే— ప్రకటించబోయే రిజల్ట్ గురించి ముందే ఊహించి చెప్పేయ గలడు వచ్చేదీ రానిదీనూ- అందుకే- “నలుగురితో నారాయణా గుంపులో గోవిందా!” అన్న చందాన తను కూడా దరఖాస్తు సమర్పించుకుని ఇంటర్వ్యూకి పిలుపందుకుని ట్రావిలింగ్ బ్యాగులో అన్నీ సర్దుకుని- మరచిపోకుండా మరగబెట్టిన మంచినీళ్ల బాటిల్ కూడా భద్రంగా లోపల పెట్టుకుని రోడ్డుపైకి వచ్చా డు. 

అతడలా ఎల్లప్పుడూ మంచినీళ్ల బాటిల్ బ్యాగులో పెట్టుకుని రావడానికి కారణం ఉంది. బైట నీళ్లు తాగితే పడిసెం పట్టుకోవచ్చు. ఇంకేదో పట్టుకోవచ్చు.


అందులో.. బరువేలేని జేబు తనది. కావున ఆకలికి ఆదుకుంటుంది. మరొక ముఖ్యమైన కారణం- తల్లి మంచినీళ్ల బాటిల్ లేకుండా గడప దాటకంటుంది; ఆమె విధించే ఆంక్ష ఎండా కాలంలో మరీను. అడిగినా అడక్కపోయినా ట్రావిలింగ్ బ్యాగులో తానుగా వచ్చి పెట్టేసి వెళ్తుంది. ఎంతైనా తల్లి ప్రాణం కదూ! బిడ్డ కష్టం చూస్తూ ఊరుకుంటుందా!

నరసింహులు పంజాగుట్ట స్క్వేర్ర్ దాటి ముందుకు సాగినప్పుడు అతడికి ఎదురొచ్చారు; పరిచయం ఉన్న నలుగురు ఫాస్ట్ ట్రేక్ రన్నర్సులు- రాఘవ- విమల్- తనకు కాలేజీ రోజుల్నించి తెలిసిన ఫ్రెండ్సు. చలపతి, సింగార భూపతి- మధ్యలో పరిచయం ఐనవారు.


వాళ్ల పరిచయం ఎక్కడ యెప్పుడు కలిగిందో అతడికి చప్పున గుర్తుకి రాదు. ఇప్పుడు ఒకరికొకరు ఎదురైన వెంటనే- “హాయ్!హాయ్!” అని పలకరించుకున్నారు. 


“దిస్ టైమ్ ఎనీ చాన్స్- కనీసం ట్రైనీగానైనా?”నడుస్తూనే అడిగాడు నరసింహులు. 


నలుగురూ పెదవులు బిగించి నవ్వే కళ్ళతో చూసారు గాని— నోటమ్మట మాత్రం ఎటువంటి పలుకూ పెగల్లేదు. నరసింహులుకి వాళ్ళ దేహభాష లోని మతలబు అప్పటికప్పుడు అర్థమయి పోయింది. వాళ్ళ వాళ్ల గాడ్ ఫాదర్స్ తరపున బ్యాకప్ వర్కు ముందస్తుగా వర్కౌట్ ఐపోయిందన్న మాటే.. అప్పటి కప్పుడు తేలిపోవడం ఇష్టం లేక— అప్పాయింటుమెంట్ ఆర్డర్లు చేతికందేంత వరకూ పెదవుల బిగింపున ఆ దేవరహస్యాన్ని గుట్టుగా దాచడానికి ప్రయత్నిస్తున్నారన్న మాట. 


వడ్డించేవాడు తమవాడైతే బంతిన ఎక్కడ కూర్చుంటేనేమి? న్యాయంగా చెప్పాలంటే ఇటు వంటి వ్యవహారంలో వాళ్ళకు తను పోటీగా నిలవలేడు. సైకిల్ మెకానిక్ షాపుని రోడ్డు ఓరన పెట్టుకున్న రామబ్రహ్మం కొడుకైన తను వాళ్ళకు పోటీగా ఎలా నిలవగలడు? తను చేసేదల్లా ఒకటే.. కేవలం ఇంటర్వ్యూ చేసే వాళ్ల ఉదారత పైన మాత్రమే ఆధారపడి రావడం.. ఇంటర్య్వూ హాజరయే నిరుద్యోగులకు అంత త్వరగా అంత సజావు గా ఉద్యోగం లభించడమన్నది యిప్పటి కార్పొరేట్ వ్యవస్థలో సుసాధ్యమయే పనికాదు కదా!


అకాడమిక్ ప్లస్ టెక్నికల్ స్థాయి సామర్థ్యం తగినంత ఉండాలి. అవి అతడికి ఉన్నాయా— ఇక హార్ట్ ఆఫ్ ది మేటర్ యేమిటంటే-తనకు యెదురొచ్చిన వాళ్ళలో పెక్కుమంది ఉద్యోగాలు దొరక్కకాదు ఇప్పటి యింటర్వ్యూకి రావడం. ఉద్యోగాలు మార్చుకోవడం కోసం- బెటర్ మైదానాల కోసం. 


కాస్తంత దూరం వాళ్ళతో బాటు నడచి వచ్చి చప్పున ఆగిపోయాడు నరసింహులు- “జస్ట్ క్యారీ ఆన్! ఇంకా టైముందిగా! కొద్ది సేపట్లో చేరుకుంటాలే!” అంటూ గుంపునుండి విడిపోయాడతను. వాళ్ళు కనబర్చిన ముభావానికి నరసింహులు కించిత్ హార్డ్ ఫీలింగుకి లోనయాడని గ్రహించారు వాళ్లు. కాని.. దేవరహస్యం దేవరహస్యమేగా!అది అందరివద్దా చెప్పకూడని అంశమేగా! 


వాళ్లలా కొద్ది దూరం నడచి— రోడ్డు మలుపు తిరుగుతూ అసంకల్పితంగా, వెనక్కి తిరిగి చూసారు. నరిసింహులు తనకు తాను ఆనందపడిపోతూ రెండు కుక్కలను చేరదీసి బంక్ వద్ద రస్కులు కొని తినిపిస్తున్నాడు. అవి అమితానందంతో తోకలు ఆడిస్తూ నాలుకలు చాచి తింటున్నాయి. నలుగురూ ఒకరినొకరు చూసుకుని ఫెళ్ళున నవ్వుకున్నారు; ‘అవన్నీ తేలని కేసులు- వాటి దారిన అవి అలానే రోడ్డు ప్రక్కన చతికిలబడి పోతాయి మరి!’ 


రేసులో కడపటి దశ వరకూ దమ్ముపోకుండా చేరుకోవాలంటే-వెనుకా ముందూ ఎంతటి సత్తా ఉండాలి మరి! మరెంతటి పుష్ ఉండాలి మరి..  


ఎట్టకేలకు లాస్ట్ బెంచ్ స్టూడెంటులా నరసింహులు ఇంటర్వ్యూ హాలు చేరి, క్యూ చివరన కూర్చున్నాడు. అతడు వచ్చిన అలికిడి విని, మిత్రులందరూ ఓపారి వెనక్కితిరగి చూసి— తమతో చేరిపొమ్మని సైగ చేసారు. అతడు అడ్డంగా తలాడించి కూర్చున్న చోటే ఉండిపోయాడు. ఎలాగూ చివరి ఫలితం ఎలాగుండబోతుందో తనకి తెలిసిన అంశమేగా! అలాంటప్పుడు అంత త్వరగా ఇంటి వేపు మరలిపోవడానికి వేగిరపాటెందుకూ! అమ్మను మరొక సారి దిగులు పడిపోయేలా చేయడానికా! నాన్నను ముఖం మాడ్చుకునేలా చేయడానికా!


పనిలో పనిగా ఆట ఆరంభ సమయంలో ప్రత్యర్థి టీము గోల్ పోస్టు వరకూ వెళ్లి చూసొచ్చే ఫుట్ బాల్ ఆటగాడిలా అతడు ఒకసారి హాలంతా పరకాయించి చూసాడు. తనలా ఇద్దరు ముగ్గురు తప్ప, చాలా మంది ముఖాలలో ముసిముసి నవ్వులే; హిమ పర్వత శిఖరమెక్కి పతాకం అందుకున్నంత సంతోషాలే..


ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు చాలా మంది వెళ్లిపోయారు; ఇంటికి రాబోయే అప్పాయింట్మెంటు ఆర్డర్ కోసం కమ్మని కలలు కంటూ.. 


తన వంతు పిలుపందుకున్న నరసింహులు ఓసారి మంచినీళ్ల బాటిల్ తీసి గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకుని గదిలోకి వెళ్ళి- “గుడ్ మార్నింగ్..” అంటూ ఆగిపోయాడతను. ఒకరు కాదు— ఇద్దరు స్త్రీలు ఎక్సు గ్యూటివ్ బల్లముందు బిజినెస్ సూటులో కూర్చున్నారు ఠీవిగా.. మంచిపనయింది— టెన్షెన్ లో పడి- ‘సార్!’- అనలేదు. 


అంచేత తనను సబాళించుకుంటూ- తెలుగులో నమస్కా రం చెప్పాడు. అతడి వేపు ఓపారి తేరి చూసి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. చూపులతో మంతనాలాడారు. ఇందులో అంతగా సీరియస్ ఐపోవడానికేముంది?


నరసింహులు ‘సార్!‘ అనబోయి తడబడి నిలదొక్కుకున్నాడు. అంతేగా! అంతలో బిజనెస్ సూటులో ఉన్న ఆ ఇద్దరు యవ్వన స్త్రీలూ లేచి అతడి వద్దకు వచ్చారు. ఇద్దరూ ముక్త కంఠంతో అడిగారు- “మీరు మాకు గర్తు. మమ్మల్నింకా గుర్తు పెట్ట లేదూ!” అని..

 అతడు తెల్లబోతూ చూసి తల అడ్డంగా ఆడించాడు తెలియదన్నట్టు. 


“యువార్ గ్రేట్!” ఇద్దరు స్త్రీలూ మళ్ళీ ముక్త కంఠంతో అన్నారు. లేచిన వేళా విశేషం బాగాలేనట్లుంది. వీళ్ళేదో తనను ఆట పట్టించడానికి పూనుకున్నట్టున్నారు. ఇద్దరూ పెద్దహోదాలో ఉన్నవారే- ఒకరు మిస్ అన్న పూర్ణ- డిప్యుటీ ఎమ్డీ. మరొకరేమో— మిస్ కమల వాణి- డిప్యుటీ జనరల్ మేనేజర్. అంత యెత్తున యెదిగి నిల్చున్న వీళ్ళతో తనకెలా పరిచయం ఉంటుంది, తమాషా కాకపోతే! ఆటలు పట్టించడం కాకపోతే..

 

ఈసారి ఇంతులిద్దరూ మరింత దగ్గరగా వచ్చారు. ”ఇంకా గుర్తుపట్టలేదా? ఉమ ధియేటర్ వద్ద.. ” అని అన్నపూర్ణాదేవి ఆగిపోయింది. 


“ఔను, మీరు నన్ను ఉమా ధియేటర్ వద్ద చూసుంటారు. మా ఇంటికి దగ్గర కాబట్టి, పొద్దు పోనప్పుడల్లా అక్కడికి అలా వచ్చిపోతుంటాను”


ఈ జవాబు విని అన్నపూర్ణ మేడమ్ విసుగ్గా ముఖం పెట్టి చూసింది. “అబ్ప! ఏమిటండీ ఈవయసులో ఇంత మతి మరుపా! మా కోసం ఆరోజు ఎంత గొప్ప త్యాగం చేసారని!”

అయోమయంలో పడిపోతూ— ఎలా- ఎప్పుడన్నట్టు కళ్ళు మిటకరించి చూసాడు నరసింహులు. 


మళ్లీ అన్నపూర్ణాదేవే కొనసాగించింది, అతడి కుడి చేతిని చనువుగా అందిపుచ్చు కుని సోఫాలో కూర్చోబెడుతూ.. “ఆరోజు చాలా మంచి సినిమా వచ్చింది. మొదటి షో.. మేం మొత్తం నలుగురం. నిజానికి మేం ఆన్ లైన్ లో ముగ్గురం ముందే బుక్ చేసుకున్నాం. కాని— మా పిన్ని కూతురు కూకటి పల్లి నుండి అనుకోకుండా మాతో చేరింది. దాని కోసం ప్రయత్నిస్తే అప్పటికే ఆన్ లైన్ అకౌంటు క్లోజయిపోయింది. 


మొత్తానికి మావద్ద మూడు టిక్కట్లే ఉన్నాయి. నగరం నలుమూల నుంచీ వచ్చిన హీరో అభిమాన సంఘాల వాళ్లు దొంతర దొంతర్లుగా వచ్చి టిక్కెట్లు ముందస్తుగా బుక్ చేసి తీసుకు పోయారు. ఎంత ప్రయత్నించినా మరొక టిక్కెట్టు దొరకనే లేదు. ఇటు వేపేమో హీరో అభిమానుల గోల పెచ్చరిల్లి పోతూంది. అటు వేపేమో తొక్కిస లాట-


అప్పుడు మేమందరమూ తెగ ఇబ్బంది పడిపోయామనుకో. మా పిన్ని కూతుర్ని మాత్రం పువ్వునుండి పూరేకను విడదీసి తెంపినట్టు వేరు చేసి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పలేం కదా! అలాగ్గాని చేస్తే మిగతా ముగ్గురమూ ఎలా సినిమా ఎంజాయ్ చేయగలమో చెప్పండి!

అప్పుడు మీరు మావద్దకు ఆపద్బాంధవుడిలా వచ్చి- ‘చాలా టెన్ష్ గా కనిపిస్తున్నారు. ఏమైనా పోగొట్టు కున్నారా మేడమ్?’ అని అడిగారు. 


మేం విషయం చెప్పాం. మీరు మరు నిమిషమే మీవద్ద నున్నటిక్కెట్టు తీసిచ్చారు. ఎంతకావాలని అడిగాం. టిక్కెట్టు ఖరీదు అందులో ఉంది- అంటూ టిక్కెట్టు డబ్బులు మాత్రమే తీసుకుని తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. ఇప్పటికైనాగుర్తుకి వచ్చిందా మిస్టర్ నరసింహులూ!” 


“లీలగా గుర్తుకొస్తూంది మేడమ్! కాని దానిని త్యాగమనరండీ! మన తెలుగు నుడికారంలో దానిని సర్దుబాటంటారండీ! మా ఇల్లు ధియేటర్ కి దగ్గరే కదండీ- వారం రోజులు గడచిన తరవాత చూసాను ఆ కొత్త సినిమా.. ”


ఇద్దరు లేడీ ఆఫీసర్లూ మరొకమారు ముఖాలు చూసుకున్నారు. ఈ రోజుల్లో యింతటి నిరాబండరమైన వ్యక్తులు ఉంటారా! డిప్యూటీ ఎమ్డీ ముఖాన చిన్నపాటి నవ్వుని తెచ్చుకుంటూ.. అక్కడికి వచ్చి నిల్చున్న పర్సనల్ అసిస్టెంటుకి సైగ చేసింది. అవన్నీ తనకు సంబంధం లేని విషయం అన్నట్టు.. అతడు సీట్లోనుండి లేస్తూ అన్నాడు- “మరి మీరు ఇంటర్వ్యూ ఆరంభిస్తారండీ- కొంచెం టెన్షన్ గా ఉంటేనూ.. ! నాకొక అవకాశం ఇచ్చారంటే— నేను తప్పకుండా కష్టించి పని నేర్చుకుంటానండీ! మీ చేత ఔరా అనిపించుకుంటానండీ!”


“ముందు కూర్చోండి“ అంటూ ఇద్దరూ అతణ్ణి లేవనీయలేదు. నరసింహులు కళ్లు పెద్దవి చేసుకుని చూడసాగాడు. కేవలం ఒక సినిమా టిక్కెట్టు కోసమా ఇంత ఆర్భాటం! తన పట్ల ఇంతటి మన్ననా! నమ్మలేక పోతున్నాడతను. 


మరి కొద్ది సేపట్లో లేడీ అటెండర్ ప్లేటులో సమూసాలు పెట్టుకుని టీ-పోట్ తో వచ్చింది. అన్నపూర్ణాదేవి వాటిని అందుకు ని ఆమెను వెళ్ళమని సైగ చేసి- “తీసుకోండి, అవి రెండూ విజిటేరియన్ సమోసాలు. యివి రెండూ నాన్ విజ్” అని ఆఫర్ చేసింది. 


ఘుమఘుమలాడుతూన్న సమోసాల వాసన తాకేటప్పటికి అతడిలోని ఆకలి రేకెత్తినట్లనిపించింది. అతడు నాలుగూ తినేసి మంచి నీళ్లు తాగి అన్నపూర్ణాదేవి అందిచ్చిన టీ కప్పుని అందుకున్నాడు. అప్పుడు కమలవాణి అడిగింది “ఇలా అడుగుతు న్నానని మరోలా అనుకోకండి. ఈ కాలంలో మీకీపేరు ఎవరు పెట్టారండీ!”


అది తన తాతగారి పేరని బదులిచ్చాడతను. పిమ్మట త్వరగా టీ తాగడం పూర్తి చేసి, ఖాళీ కప్పు టీపాయ్ పైన పెట్టాడు. అప్పుడు మరొక ప్రశ్న..  “నేను మరొకటి అడిగేదా?” కమలవాణి మరొకసారి అందుకుంది. 


“ఎంతమాట! మీరిద్దరూ నన్ను ఇంటర్వ్యూ చేసే బాస్లు. ఎన్నయినా అడగవచ్చు. నేను చెప్పే తీరాలి. ముందు నేను తెచ్చిన ఒరిజనల్స్ చూస్తే.. ”


“ఆ ప్రసక్తి తరవాత. ముందు దీనికి బదులివ్వండి. మీకు కుక్కలంటే ఇష్టమండీ!” 


అతడికీసారి పెద్దపాటి జెర్క్ ఇచ్చినట్లయింది. ఇంటర్వ్యూకి సంబంధమే లేని ప్రశ్న! అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాడతడు- ఆ యిద్దరు స్త్రీల మధ్య. 

ఇది ఇంటర్వ్యూ యేనా! అతడికి ఉన్నపళాన తనకిష్టమైన కీర్తన మనసు మెదిలింది-

“ఏ తీరుగ నను దయ చూచెదవో..” 


తనను తను కుదట పర్చుకుంటూ అడిగాడు నరసింహులు- “ఇది మీరెందుకు అడుగుతున్నారో మరి..” నసిగాడతను. 


“మరేం లేదండీ— నేను కారులో వస్తున్నప్పుడు మీరు రెండు కుక్కలకు ప్రేమతో రస్కుల్ని ముక్కలు చేసి తినిపిస్తున్నారు. అది చూసి.. ”


“ఔనండి. కాని అవి మామూలు కుక్కలు కావండి”


“మామూలు కుక్కలు కావా! హంటింగ్ జర్మన్ డాగ్సా?” 


“అబ్బే! వాటికంతటి సీను లేదులెండి. ఆడకుక్కలండి. అందుకని.. ”


అర్థం కానట్టు- ఇద్దరూ అతడి వేపు చూపులెత్తి చూసారు. 

“రెండు ఆడ కుక్కలూ కడుపుతో ఉన్నవండీ. అందుకని రస్కులు తినిపించాలనిపించి.. “

ఇద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. 


అప్పుడు తలుపు తోసుకుని వస్తూన్న వ్యక్తిని చూసి ఇద్దరూలేచి నిల్చున్నారు. నరసింహులు కూడా చటుక్కున లేచాడు మర్యాదపూర్వకంగా..


వచ్చీ రావడం తోనే అన్నాడతను- “అక్కాచెల్లెళ్లిద్దరూ బహు పసందుగా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. క్యాండిడేట్సుకి మీరిచ్చిన గ్రేడింగ్సు చూసాను సిస్టమ్ లో. ఇదిగో! నేను సెలెక్టు చేసిన లిస్ట్!”


ఆ మాటతో అక్కాచెల్లెళ్లిద్దరూ తెల్లబోయి చూసారు. అంత త్వరలో సెలెక్షన్ పూర్తయిందా!

“అదేమిటి నాన్నగారూ ఇలా చేసారు? మాకొక మాట కూడా చెప్పకుండా సెలెక్ట్ చేసేసారా!” ఇద్దరూ ఒకేసారి అడిగారు. 


“ఇదేమి ప్రశ్నమ్మా కంపెనీ వ్యవహారాలు కొత్తగా చూస్తున్నట్టూ! లిస్టు లో ఉన్నవాళ్లందరూ మోతుబరి వ్యక్తులనుండి వచ్చిన రికమెండేషన్ కేసులమ్మా! రేపు మనకు వాళ్లతో ఎన్నోపనులుంటాయి. సరైన సమయాన చిన్నపాటి మెలిక తిప్పారంటే చాలు — మన కొంపమునిగినంత పనవుతుంది. ఇది తెలిసీ ఇలా అడుగుతారేమిటీ? ఇంతకూ నేను ఓకే చేసిన లిస్టుతో మీకు వచ్చిన ప్రాబ్లెమ్?”


అప్పుడు అన్నపూర్ణాదేవి తండ్రి వద్దకు వచ్చి బదులిచ్చింది. ”ఇతను నాకు క్లోజ్ ఫ్రెండ్. అంటే.. నా కాలేజీ క్లాస్ మేట్ అన్నయ్య. అది నన్ను పదే పదే బ్రతిమిలాడి చెప్పింది వాళ్ళన్నయ్యను ఎలాగో ఒకలా గట్టెక్కింమని..  నేను మాటిచ్చేసాను కూడాను. ఇప్పుడు నేనేమి చేసేది? నా ముఖం మళ్లీ ఎలా చూపించేది?” 


ఆ మాటతో ఆయన నరసింహులు వేపు తిరిగి చూసా డాయన. వెంటనే చేతులెత్తి నమస్కరించాడు నరసింహులు. 


”ఓకే! ఓకే! అర్ధమైంది. ఈ కేసుగురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను ఏదో ఒకలా సర్దుబాటు చేసుందును. వాళ్లందరికీ ఇప్పటికే ఫోనులో చెప్పేసాను అప్పాయింటు మెంట్ ఆర్డర్లు పోస్టులో వచ్చేస్తున్నాయని. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందేమీ లేదు. తదుపరి సంవత్సరంలో ఎలాగూ కొన్ని వెకన్సీలు ఫిలప్ చేయాల్సి ఉంటుందిగా! అప్పుడు చూద్దాం. సరేనా?” 


అన్నపూర్ణ ఊరుకోలేదు. “ఈ ఒక్క విషయంలో సర్దుబాటుకి అవకాశమే లేదు నాన్నగారూ! ఈరోజే ఈయనకు అప్పాయింట్మెంటు ఆర్డర్ ఇవ్వాలి. నా పర్సనల్ వింగుకి నమ్మకమైన స్టాప్ కావాలి కదా! నేనితనికి ఆ పోస్టు ఇస్తాను- రికార్డ్ కీపర్ గా.. నన్నాపకండి నాన్నగారూ!”


“అదెలా వీలువుతుందమ్మా! ఆ పోస్టుకి రమామణి అనే అమ్మాయికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసాం కదమ్మా- ఆమె ఎవరనుకున్నావు? డిప్యుటీ సెక్రటరీగారి పెద్ద కూతురు. కాదంటే రేపు మన వ్యవహారాలు ఎలా బెడిసి కొడ్తాయో ఆలోచించి చూడమ్మా!”


ఈసారి కమలవాణి కలుగచేసుకుంది. “ఇంత చిన్నదానికి అంత పెద్ద రచ్చెందుకు  నాన్నగారూ! ఈ సమస్యను నేను తీరుస్తాను. నాకు విడిచి పెట్టేయండి”


ఆ మాటవిని ఇద్దరూ- ‘ఎలా?’- అన్నట్టు చూసారు. 


“సింపుల్ నాన్నగారూ! మరో మూడు నెల్లలోపున నా వద్దనున్న మార్కెటింగ్ వింగుని పెంపొందించబోతున్నాం కదా! అందులో నరసింహులుగారిని ట్రైనీగా వేసుకుంటే సరి. మూడునెల్ల తరవాత ఆయన పని తీరు చూసి రెగ్యులర్ పోస్టింగ్ ఇద్దాం. సరేనా?” 


అన్నపూర్ణాదేవికి చెల్లి పరిష్కార మార్గం ఇసుమంత కూడా నచ్చనట్లుంది ఆమె సూటిగా ముఖం పెట్టి అంది- “ఇప్పుడు పోస్టింగ్ నేను చెప్పినట్లే జరగాలి నాన్నగారూ! రమామణిగారిని మార్కెటింగ్ వింగులోనో— లేదా కమలవాణి పర్సనల్ వింగులోనో చేరమను. నరసింహులుగారు మాత్రం నా చేంబర్ లోనే పనిచేస్తూ నాకు అన్ని కాన్ఫిడెన్సు మేటర్సు లోనూ అసిస్ట్ చేస్తాడు. నాతోనే ఉంటాడు” అంటూ చక చకా వెళ్లి తన స్టెనోని పిలిచి నరసింహులు పోస్టింగ్ కోసం అక్కడికక్కడు ఆర్డర్ డిక్టేట్ చేయసాగింది. 


ఆమెలో వేగం మాత్రమే కాదు— ఉద్వేగం కూడా ఉండటం గమనించిన కంపెనీ ఎమ్డీ- ఇద్దరమ్మాయిల తండ్రీ ఐన వాసుదేవరావుగారు నిండుగా నవ్వారు. తండ్రితో బాటు కమలవాణి కూడా గలగల నవ్వుతూ కొంటెగా అక్కయ్య వేపు చూడసా గింది- ‘నాకిప్పుడంతా అర్థమయిందిలే!’ అన్నట్టు. 


ఆమె అవేమీ లక్ష్యపెట్టకుండా- ‘గురి తప్పని బాణమే నా లక్ష్యం!’ అన్నట్టు ఆర్డ ర్ టిక్టేట్ చేయడం పూర్తిచేసి- టైప్డ్ పేపరు అందుకుని దానిపైన అప్పటికప్పుడు సంతకం చేసి, తండ్రి వద్ద ఎండార్సుమెంటు కూడా తీసుకుని నరసింహులుకి అందచేసింది. 


ఆ తరవాతామె నిదానంగా తేటగా నరసింహులు కేసి చూసి నవ్వింది. ఆ నవ్వులో ఎన్ని పువ్వులో! ఆమె కనుగవలో ఎన్ని మృదుభావాలో! జీవితంలో మొదటి సారి అతడు ప్రసన్నంగా నవ్వగలి గాడు.


పెద్దపాటి అనుభవమో— పవరూ విగరూ ఉన్న పెద్దవాళ్ళ సిఫార్సో లేని తనకు ఉద్యోగం ఇవ్వడానికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళ మధ్య ఇంతటి పోటీనా! అంటే— తనకు సహితం కనిపించనిదేదో తనలో నిక్షిప్తమై ఉందనేగా అర్థం! అదంతా తన తల్లి నుండి తనకు వచ్చిన గుణాంశమేగా! 


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree





Comments


bottom of page